Latest

CM రేవంత్ రెడ్డి కంటిపరీక్ష చేయించుకోవాలి
TG: హైడ్రాను అడ్డం పెట్టుకుని హైదరాబాద్‌లోని నిరుపేదల ఇళ్లను రేవంత్ సర్కార్ బుల్డోజర్ల కింద నలిపేస్తోందని తెలంగాణ రక్షణ సేన(TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆమె రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన విద్యాసంస్థలను కాపాడటానికి ఏకంగా కోర్టులను కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఒవైసీ విద్యాసంస్థల నిర్మాణాలు చెరువులను కబ్జా చేసి కట్టారనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నా రేవంత్ రెడ్డికి మాత్రం కన్పించడం లేదన్నారు. దీన్ని బట్టి చూస్తే తక్షణమే ఆయన కంటిపరీక్ష చేయించుకోవాలని ఎద్దేవా చేశారు.

జైలు భోజనం వద్దన్న ఖైదీ.. నా వంట నేనే చేసుకుంటా!
జైలు ఫుడ్ తినలేకపోతున్నానంటూ తిహాడ్ జైల్లోని అమెరికన్ ఖైదీ మాథ్యూ ఆరన్ వాన్‌డైక్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైలు ఆహారంలో మసాలా, కారం ఎక్కువ కావడంతో 50 రోజులుగా పస్తులు ఉంటున్నానని, 14 కేజీల బరువు తగ్గానని ఆరోపించాడు. సొంతంగా వంట చేసుకునేందుకు అనుమతివ్వాలని, తనకిష్టమైన సరుకులు, ఇండక్షన్ కుక్కర్ సమకూర్చాలని కోరాడు. టెర్రర్ ఆరోపణలతో మార్చిలో అరెస్టయిన మాథ్యూ పిటిషన్‌పై స్పందించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జులై 21కి వాయిదా పడింది.

అఖిల్‌కు సమంత ఆల్ ది బెస్ట్.. 'లెనిన్' బ్లాక్‌బస్టర్ టాక్!
మూడేళ్ల గ్యాప్ తర్వాత హీరో అఖిల్ 'లెనిన్' సినిమాతో థియేటర్లలోకి వచ్చారు. మురళీకిశోర్ అబ్బూరు డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సమంత 'లెనిన్' ట్రైలర్‌ను షేర్ చేస్తూ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇప్పటికే సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ వినిపిస్తోందని పోస్ట్ పెట్టారు. మరోవైపు, సమంత లేటెస్ట్ హిట్ 'మా ఇంటి బంగారం' మూవీపై అఖిల్ స్పందిస్తూ.. ఆమె పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్ అద్భుతంగా చేశారంటూ ప్రశంసించారు.

వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు!
భారత్‌లో బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా పెరిగాయి. అయితే మునుపటి రికార్డులతో పోలిస్తే రేట్లు ఇంకా తక్కువగానే ఉన్నాయని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.1,44,820కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.350 వరకు పెరిగి ప్రస్తుతం రూ.1,32,750కు చేరుకుంది.

నటుడు ధర్మ మహేష్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
TG: హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో గురువారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. కొంతమంది యువకులు కారులో అతివేగంగా ఫిల్మ్‌నగర్ రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. ఓవర్ స్పీడ్‌తో వచ్చిన కారు మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనున్న డివైడర్‌ను దాటి నేరుగా నటుడు ధర్మ మహేష్ ఇంటి కాంపౌండ్ గోడను, గేటును ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లింది. భారీ శబ్దం రావడంతో నటుడు ధర్మ కుటుంబసభ్యులు, స్థానికులు బయటకు పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనపై నటుడు ధర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

దుల్కర్-పూజా మూవీకి క్లాసిక్ టైటిల్
దుల్కర్ సల్మాన్ మరియు పూజా హెగ్డే జంటగా నటిస్తున్న కొత్త సినిమాకు క్లాసిక్ టైటిల్ ఖరారు చేశారు. ఈ ప్రేమకథ చిత్రానికి శ్రీకారం చుట్టిన క్రేజీ స్టార్స్ సంతోషం వ్యక్తం చేశారు. టైటిల్ వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
ప్రశ్నిస్తే కేసులా?.. CPM రాష్ట్ర కార్యదర్శి ఫైర్
AP: ప్రశ్న రావణ్‌పై పెట్టిన UAPA, దేశద్రోహం కేసులను వెంటనే ఎత్తి వేయాలని CPM రాష్ట్ర కార్యదర్శి V.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులపై విమర్శలను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప, క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని ఆయన ఫైరయ్యారు. ప్రశ్నిస్తే ఉగ్రవాదులుగా ముద్రించడం అప్రజాస్వామికమని, రావణ్‌పై పెట్టిన ఈ అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. APలో సోషల్ మీడియా పోస్టులకే 1,500కిపైగా కేసులు నమోదు చేసి, 1,300 మందికి పైగా అరెస్టు చేశారని ఆరోపించారు.

ప్రశ్న రావణ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలి
AP: ప్రముఖ యూట్యూబర్, ప్రశ్న రావణ్ నిర్వహిస్తున్న 'ప్రశ్న' యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు పోలీసులు లేఖ రాశారు. రావణ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాదాస్పద కంటెంట్ ప్రసారం చేస్తూ ప్రతినెల సుమారు రూ.1.50 లక్షల ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు ఆరోపించారు. వివాదాస్పద వీడియోలను తొలగించాలని, ఛానల్‌ను నిలిపివేయాలని పోలీసులు మెటా సంస్థను కోరారు. స్పందించిన మెటా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తామని, అయితే మొత్తం ఛానల్‌ను పూర్తిగా నిలిపివేయడం తమ పరిధిలో లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.

స్కూళ్ల బంద్.. విద్యార్థి నేతల అరెస్ట్
TG: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బంద్ కొనసాగుతుంది. విద్యావ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కారించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను తగ్గించే ఆలోచనను వెనక్కి తీసుకోవాలని, విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ బంద్ నిర్వహిస్తున్నారు. పలు జిల్లాలోని విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్‌లో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆటో డ్రైవర్ దారుణం.. మహిళపై అత్యాచారం
TG: ఆటో ఎక్కిన మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఉప్పల్‌లోని భరత్‌నగర్ వద్ద ప్యాసింజర్ ఆటో ఎక్కిన మహిళ ఘట్‌కేసర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డ్రైవర్‌ను కోరింది. ఆమెను ORR సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి కూల్ డ్రింక్‌లో మత్తుపదార్థం కలిపి తాగించాడు. స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడి ఫోన్, నగదు లాక్కుని పరార్ అయ్యాడు. మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత PSలో ఫిర్యాదు చేసింది. సాంకేతిక ఆధారాలు, CCTV ఫుటేజ్ పరిశీలించి 24గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు.

RTC బస్సు ఎత్తుకెళ్లిన మందుబాబు
TG: మద్యం మత్తులో ఓ వ్యక్తి RTC బస్సును ఉడాయించిన సంఘటన జనగాంలో చోటు చేసుకుంది. పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన జిట్టబోయిన వెంకన్న ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబకలహాల కారణంగా ఇంట్లో నుంచి జనగాంకు వచ్చాడు. రాత్రి 11గంటలకు ట్రిప్ ముగించుకొని వచ్చిన RTC బస్సును డ్రైవర్ జనగాం బస్టాండ్ ఆవరణలోని పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. మద్యంమత్తులో ఉన్న వెంకన్న తెల్లవారుజామున బస్సులోని టూల్‌బాక్స్‌పై తాళం కనిపించడంతో బస్సును స్టార్ట్ చేశాడు. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్‌గేట్ వద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. టోల్‌గేట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

చోరీ చేసి ఇంటికి నిప్పంటించారు
AP: ఇంట్లో చోరీ చేసిన దుండగులు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ఇంటికి నిప్పంటించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో రైల్వే మహిళా ఉద్యోగి ఉమాదేవి భర్త మరణించడం, పిల్లలు చదువుల కోసం వేరే ఊరిలో ఉండటంతో ఒంటరిగా ఉంటోంది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 25తులాల బంగారు నగలు, 50తులాల వెండి, రూ.20వేల నగదును ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పుపెట్టారు. మంటలు చెలరేగి పెద్దఎత్తున వ్యాపించాయి. ఇంట్లోని దుస్తులు, బీరువాలోని డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, ఫ్రిడ్జ్, రెండు టీవీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

ప్రభుత్వ స్కూల్‌లో రోబో పాఠాలు
TG: రంగారెడ్డి జిల్లా జన్వాడ ZPHS పాఠశాలను దత్తత తీసుకుని దానిని ఒక మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దేందుకు HYDలోని ప్రముఖ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందుకు వచ్చింది. తెలంగాణ విద్యాశాఖతో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 750మంది విద్యార్థులు ఉన్న జన్వాడ ZPHSను మోడల్ స్కూల్‌గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. మౌలికవసతులతోపాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఇండస్ స్కూల్ ముగ్గురు ఉపాధ్యాయులను నియమించింది. అంతేకాకుండా, త్వరలోనే మూడు హ్యూమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టనున్నారు.

కొండకోనలు దాటినా కాపాడలేకపోయారు
AP: పోలవరం జిల్లా కూనవరం మండలం కారుమానుకొండకు చెందిన సమ్మక్క ప్రియ(18) పాముకాటుకి గురైంది. కుటుంబసభ్యులు ఆమెను డోలీ ద్వారా కూటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు, ఆ తర్వాత చింతూరుకు తరలించారు. అనంతరం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించినట్లు యువతి తండ్రి లక్ష్మణ్‌రెడ్డి తెలిపారు. అక్కడ అడ్మిట్ కూడా చేసుకోకుండా వెనక్కి పంపేశారని ఆయన వాపోయారు. అనంతరం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్తే డాక్టర్స్ పట్టించుకోలేదన్నారు. అర్ధరాత్రి గిలగిలా కొట్టుకుంటూ తన కుమార్తె చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ? ముహూర్తం జులై 18?
సీనియర్ ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? అవుననే కథనాలు జోరందుకున్నాయి. తమిళనాడులో సీఎం విజయ్ తరహాలోనే ముందు సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రారంభించి ఏడాది పాటు అభిమాన సంఘాలను వ్యవస్థీకృతం చేసుకుని ఆపై జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారంటూ జమీన్ రైతు అనే పత్రిక ఒక సెన్సేషనల్ న్యూస్ ప్రచురించింది. జులై 18న దీనికి శుభ ముహూర్తంగా నిర్ణయించారని ఆ ప్రతిక రాసింది. బీజేపి అగ్రనేతలు జూనియర్ ను వెనుకనుంచి ప్రోత్సహిస్తున్నా రనేది ఆ ప్రతిక కథనం.

బాక్స్ ఆఫీస్ రూల్స్ బ్రేక్ చేస్తున్న హీరోయిన్లు
ఒకప్పుడు ఓపెనింగ్ కలెక్షన్స్ హీరోలపైనే ఆధారపడేవి. ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతోందని సమంత చెప్పింది. అరుంధతి (78 కోట్లు) తో దారి చూపిన అనుష్క తర్వాత రుద్రమ దేవి (₹82 కోట్లు), భాగమతి (₹67 కోట్లు), మహానటి ( రూ.86 కోట్లు) ఓ బేబీ (₹45 కోట్లు)లాంటి మహిళా ప్రధాన చిత్రాలు సత్తా చాటాయి. నిర్మాతలు నీలిమ గుణ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బలమైన కథలుంటే హీరోయిన్ సినిమాలకూ ప్రేక్షకులు భారీగా ఆదరిస్తారని అన్నారు.

మెగా టూరిజం హబ్‌గా పోలవరం
AP: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, ECRF డ్యామ్ (Earth cum Rock Fill Dam) సుందరీకరణ డిజైన్లు తుది రూపానికి వచ్చాయి. జపాన్‌కు చెందిన నిప్పాన్ కోయి ఆర్కిటెక్చర్ సంస్థ ఈ డిజైన్లను రూపొందించింది. ఈ డిజైన్లపై సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని 10,000 ఎకరాల్లో టూరిజం హబ్ కోసం ఇటీవల లైడార్ సర్వే కూడా చేశారు. పోలవరం నుంచి పాపికొండలు మీదుగా భద్రాచలం వరకూ టూరిజం హబ్‌గా మార్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోదావరి విశిష్టత చాటేలా మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం, పార్క్‌ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అమెరికాలో తెలుగు మహిళ హత్య .. షాకింగ్ ట్విస్ట్
AP: అమెరికాలో గత 8నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయవాడకు చెందిన రజిత సబ్బినేని కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజితను ఆమె భర్త అవినాశ్ నార్నే హత్య చేసినట్లు అమెరికా పోలీసులు గుర్తించారు. పెళ్లైన 4నెలలకే ఆమెను దారుణంగా చంపినట్టు విచారణలో నిర్ధారణ అయింది. ఆమెకు శ్వాస ఆడకుండా అతడు గొంతు నులిమినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మరో మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు తెలిపారు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఆయన ప్రయత్నించినట్లు తెలిపారు. నిందితుడు అవినాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

భూములకు పూర్తి భద్రత.. రాజముద్రతో పాస్‌బుక్స్
AP: భవిష్యత్‌లో ప్రజల ఆస్తులను ఎవరూ ఆక్రమించకుండా, ప్రజల ఆస్తిపై ప్రజలకే సర్వహక్కులు ఉండేలా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి - మీ హక్కు’ గ్రామసభలో ఆయన మాట్లాడారు. రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. గత పాలకులు భూమి పత్రాలపైనా, సర్వే రాళ్లపైనా తమ ఫొటోలు ముద్రించుకున్నారని ఫైరయ్యారు. ఆ ఫొటోల పిచ్చిని తొలగించేలా కట్టుదిట్టమైన రాజముద్రతో పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నట్లు CM స్పష్టం చేశారు.

ఓటర్లకు అలర్ట్.. ఇంకో 5 రోజులు మాత్రమే
TG: ఓటరు జాబితాలో తప్పులను సరిచేయడం, డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్ SIR ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఓటర్లు వారి వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను వెనక్కి ఇవ్వడానికి కేవలం 5రోజులే సమయముంది. తెలంగాణలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గానూ గురువారం సాయంత్రానికల్లా 4,15,41,753 (99.79%) మందికి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. చాలామంది ఓటర్లకు ఇప్పటికీ ఎన్యూమరేషన్ పత్రాలే అందలేదు. కొన్నిచోట్ల BLOలకు కాల్ చేసినా స్పందించట్లేదనే ఆరోపణలున్నాయి.
కార్పొరేటర్ చేతిలో చెంపదెబ్బ తిన్న లేడీ డాక్టర్ రాజీనామా !
థానేలోని ఒక మున్సిపల్ ఆస్పత్రిలో శివసేన కార్పొరేటర్ చేతిలో చెంపదెబ్బ తిన్న ఒక మహిళా డాక్టర్ తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు ఆమెతో పాటు ఉన్న తోటి డాక్టర్ అక్కడి వాతావరణానికి భయపడి ఉద్యోగం వదిలేశారు.ఈ ఘటన జరిగినప్పుడు ఆ కార్పొరేటర్ డాక్టర్‌ను దూషించడమే కాకుండా దాడికి పాల్పడ్డారు. దీనిపై ఆసుపత్రి సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో తమకు రక్షణ కరువైందని, విపరీతమైన భయాందోళనలు నెలకొన్నాయని వివరిస్తూ మహిళా డాక్టర్ తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ ఘటన స్థానికంగా వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.