Latest

అమెరికాలో తెలుగు యువకుడు మృతి
AP: విజయవాడకు చెందిన గడ్డం మణిచంద్ర తేజ (28) అమెరికాలో మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన చంద్రతేజ 2022లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో కోర్సు పూర్తయిన అనంతరం బోస్టన్‌లోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మసాచుసెట్స్ రాష్ట్రంలోని ఆరెంజ్ నగరంలో స్కైడైవింగ్ కోసం వెళ్లారు. గాల్లో ఎగిరిన తర్వాత పారాచూట్ కిందకు దిగే సమయంలో గాలి తీవ్రంగా వీయడంతో 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించేలోగా చనిపోయాడు.

429 ఎకరాల ప్రభుత్వ భూమి మాయం
TG: ధరణి పోర్టల్‌లో సాఫ్ట్‌వేర్ లొసుగులను ఆసరాగా చేసుకుని యాజమాన్య హక్కులు మార్చినట్లు ఫోరెన్సిక్ అధికారులు గుర్తించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో 429ఎకరాల ఇనాం భూములను మాయం చేశారు. ఈ భూములపై పలువురు తమకు హక్కులు ఉన్నాయని రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకోవడం, కోర్టులో కేసులు వేశారు. అదే అదనుగా కొందరు మెదక్ జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, RDOలు, తహీసీల్దార్‌లతో కుమ్మక్కై ఈ భూములను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిట్ ఏర్పాటుచేయాలని ఆదేశించింది.

విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా
AP: ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తిరుపతిలోని APSPDCL కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించారు. రెగ్యులరైజేషన్, పాత పెన్షన్ విధానం అమలు, PRC ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారికి రూ.48 వేల వేతనాన్ని ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం చెల్లించాలని కోరారు.

ముందుచూపు లేకపోతే నష్టమే
AP: రాష్ట్రంలో వాగులు, వంకలు, నీటి ఊటలు అడుగంటిపోయాయని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని CM చంద్రబాబు అన్నారు. NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద ఆయన జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయని ముందుచూపు లేకుండా పంటలు వేస్తే మొదటికే మోసం వస్తుందన్నారు. రైతులు ఈ ఏడాది ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.

తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానం
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట గ్రామ పరిధిలోని బేగరికంచలో నిర్మిస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపడమే ప్రధాన లక్ష్యంగా దేశ GDPలో రాష్ట్రం వాటాను 10 శాతానికి పెంచే దిశగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అందుకే తెలంగాణ రైజింగ్ పాలసీని రూపొందించామన్నారు. పారదర్శక పాలన ఉండి మౌలికవసతులు కల్పిస్తే పారిశ్రామికంగా తెలంగాణ అన్‌స్టాపబుల్‌గా నిలుస్తుందన్నారు.
తండ్రి అంత్యక్రియలను టీవీలో చూస్తూ ముద్రగడ కుమార్తె కన్నీటి పర్యంతం !
దివంగత కాపు నేత ముద్రగడ పద్మనాభం కడసారి చూపుకు ఆయన కుమార్తె క్రాంతిని అనుమతించకపోవడంతో ఆమె ఇంట్లోనే టీవీ చూస్తూ ఎమోషనల్ అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కన్నతండ్రి చివరి చూపుకు అనుమతించక పోవడం దారుణమని కొందరు విమర్శిస్తుంటే ముద్రగడ చివరి కోరిక అదేనని తన కుమార్తెను అనుమతించవద్దని స్పష్టంగా చెప్పారని అందుకే రానివ్వలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. మరోవైపు క్రాంతి ఇంట్లోనే టీవీలో తండ్రి అంత్యక్రియలు చూస్తూ గుండెల విసేలా రోదించడం పలువురిని కదిలించింది.
బెంగాల్ లో గిగ్ వర్కర్ పైత్యానికి పోలీస్ రియాక్షన్
తాను వేధిస్తున్నది సాక్షాత్తు ఒక కానిస్టేబుల్ ని అన్న సంగతి తెలీక బెంగాల్ లో ఓ గిగ్ వర్కర్ ఓ లేడీని ఏడ్పించి అడ్డంగా బుక్కైయ్యాడు.. ఖార్దా జిల్లాలో వీధిలో కనిపించిన ఓ లేడీని ఓ గిగ్ వర్కర్ అసభ్యకర సైగలతో వేధించాడు. ఆమె సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీస్ అని తెలిసే సరికి షాకయ్యాడు. కాలర్ పట్టుకుని ఆ లేడీ కానిస్టేబుల్ ఆ వర్కర్ ను ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. లేడి కానిస్టేబుల్ టైమ్ లీ యాక్షన్ పై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ వీడియో వైరల్ గా మారింది.

సోనం వాంగ్ చుక్ ను కాపాడండి - ఢిల్లీ హై కోర్టులో పిటిషన్
ఢిల్లీ హైకోర్టులో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలు కాపాడాలని ఒక పిటిషన్ దాఖలైంది. నీట్ (NEET) పరీక్ష అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ ఆయన 18 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గారని, మరో రెండు రోజుల్లో ఆయన ప్రాణాలకే ప్రమాదమని పిటిషనర్ పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి 'ఫోర్స్ ఫీడింగ్' (బలవంతంగా ద్రవాహారం ఇవ్వడం) చేయాలని కోరారు. దీనిపై రేపు విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.

పోలీసుల నిర్లక్ష్యానికి యువకుడు బలి !
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో పోలీసుల నిర్లక్ష్యానికి ఒక 22 ఏళ్ల కార్ మెకానిక్ బలైపోయాడు. ఆటో డ్రైవర్‌తో కేవలం 20 రూపాయల విషయంలో వచ్చిన గొడవ కారణంగా, బాధితుడు రాజ్‌కుమార్ అక్కడే ఉన్న పింక్ పోలీస్ బూత్ తలుపులు బాదాడు. ఆ సమయంలో అద్దాలు పగిలి అతని చేతికి తీవ్ర గాయమైంది. భయపడిన మహిళా పోలీసులు లోపలే తలుపులు వేసుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో 40 నిమిషాల పాటు రోడ్డుపై సాయం కోసం అరిచినా ఎవరూ పట్టించుకోకపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

అమెరికా మాల్ లో ఇండియన్ పై కత్తితో దాడి !
అమెరికాలోని ఉటా రాష్ట్రంలో వ్యాలీ ఫెయిర్ మాల్ లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మాల్ లో పనిచేస్తున్న సొహైల్ అనే వ్యక్తిని పీటర్ మైఖేల్ లార్సన్ అనే వ్యక్తి నువ్వు ముస్లింవా అని అడిగి మరీ 15 సార్లు కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి వెనుక విద్వేషపూరిత కోణం (హేట్ క్రైమ్) ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న ఇటువంటి దాడులు స్థానిక ప్రవాస సమాజంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.

హసీనా వస్తే ఉరిశిక్ష పై పునరాలోచిస్తాం-బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలను బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వాగతించింది. మానవతా వ్యతిరేక నేరాల కింద గత ఏడాది ఆమెకు అక్కడ మరణశిక్ష పడింది. ఆమె తిరిగి వస్తే చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని బంగ్లాదేశ్ ప్రధాని సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్ తెలిపారు. అయితే, ఈ విచారణ అత్యంత పారదర్శకంగా సాగుతుందని, ఒకవేళ ఆమె నిర్దోషిగా తేలితే కోర్టు తన పాత తీర్పును సవరించడం లేదా కొట్టివేయడం కూడా సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు.

డిగ్రీలు కాదు.. స్కిల్ కావాలి అంటున్న ఫ్యాక్టరీలు!
భారత్‌లో ఫ్యాక్టరీలు వేగంగా పెరుగుతున్నా, స్కిల్డ్ యువత కొరత పెద్ద సవాల్‌గా మారింది. వచ్చే ఐదేళ్లలో 1–1.2 కోట్ల కొత్త కార్మికులు అవసరమని అంచనా. ప్రస్తుతం 1.85 కోట్ల మంది మాత్రమే పెద్ద ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. తక్కువ వేతనాలు, స్కిల్ గ్యాప్, మహిళల తక్కువ భాగస్వామ్యం, గ్రామీణ ఉపాధి మార్పులు తయారీ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. యువతకు స్కిల్ ట్రైనింగ్ పెరిగితేనే 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యాలు వేగం అందుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

₹80 వేల స్కాలర్‌షిప్‌కు బ్రేక్..? విద్యార్థుల్లో టెన్షన్!
కేంద్ర విజ్ఞాన & సాంకేతిక శాఖ (DST) ఇచ్చే ఏడాదికి ₹80 వేల INSPIRE-SHE స్కాలర్‌షిప్‌పై సందేహాలు రేగుతున్నాయి.. 2025 నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. RTIలకు కూడా స్పష్టమైన సమాధానం రాక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ప్రతి ఏడాది సుమారు 12 వేల మంది ఈ స్కాలర్‌షిప్ పొందుతారు. బడ్జెట్ కోతలు, పథకాల విలీనంతో ఆలస్యం జరిగిందనే చర్చ నడుస్తోంది. ల్యాప్‌టాప్‌లు, చదువు ఖర్చులు వాయిదా పడుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంత్యోదయ రేషన్‌కు కత్తెర..? దక్షిణాది రాష్ట్రాల ఆందోళన!
కేంద్రం అంత్యోదయ అన్న యోజన (AAY)లో రేషన్ పంపిణీ విధానం మార్చాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం కుటుంబానికి 35 కేజీలు ఇస్తుండగా, ఇకపై వ్యక్తికి 7 కేజీలు (గరిష్ఠంగా 35 కేజీలు) ఇవ్వాలనేది ప్లాన్. దీంతో చిన్న కుటుంబాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సగటున 15.89 కేజీలు, తెలంగాణకు 15.61 కేజీలు, తమిళనాడుకు 13.56 కేజీలు, కేరళకు 11.69 కేజీలు తగ్గే అవకాశం ఉంది. బిహార్‌కు మాత్రం నష్టం ఉండదు. దీంతో దక్షిణ రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఫిఫా రేస్ నుంచి అర్జెంటీనాని బ్యాన్ చేయాలని డిమాండ్ !
2026 ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా జట్టుకు, ముఖ్యంగా కెప్టెన్ లియోనెల్ మెస్సీకి అనుకూలంగా రిఫరీలు పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ఒక ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభమైంది. argentinaout.com అనే వెబ్‌సైట్‌లో ఇప్పటికే కోటి మందికి పైగా సంతకాలు చేసి, అర్జెంటీనాను టోర్నీ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈజిప్ట్‌తో జరిగిన రౌండ్-16 మ్యాచ్‌లో వివాదాస్పద ‘VAR’ నిర్ణయాల వల్ల ఈ వివాదం మరింత పెద్దదైంది. అయితే, నేటి సాంకేతికత యుగంలో రిఫరీ పక్షపాతం చూపడం అస్సలు సాధ్యం కాదని అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోని ఈ ఆరోపణలను ఖండించారు.

కూదన్ కుళ్లం అణు రియాక్టర్ నుంచి కీలకఫైళ్లు మాయం !
తమిళనాడులో ఉన్న దేశంలోని బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాంట్రాక్టర్ సర్వర్ల నుండి సుమారు 19,000 పైగా సున్నితమైన ఫైళ్లు, ఇంజనీరింగ్ బ్లూప్రింట్లు డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయి. అయితే, ప్రధాన రియాక్టర్ వ్యవస్థలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, కేవలం నిర్మాణంలో ఉన్న యూనిట్లకు సంబంధించిన కొన్ని పత్రాలు మాత్రమే లీక్ అయ్యాయని అణు నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. కానీ ఈ ఇష్యూ అణు నిపుణుల వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రమాదం ఏదీ లేదని అధికారులు చెబుతున్నా న్యూక్లియర్ పవర్ శాఖ వర్గాల్లో ఈ వార్త సెన్సేషనల్ గా మారింది.

మీ పర్సనల్ డేటాపై కన్నేసిన AI కంపెనీలు!
ఇకపై AI టూల్స్ గూగుల్, మెటా వంటి టెక్ జెయింట్స్ మీ సెర్చ్ హిస్టరీ మాత్రమే కాదు.. మీ చాట్స్, ఫొటోస్, వాయిస్ రికార్డింగ్స్‌ను కూడా ట్రాక్ చేయనున్నాయి. తమ AI మోడల్స్ ట్రైనింగ్ కోసం ఈ డేటాను వాడుకోనున్నట్లు ప్రకటించాయి. గూగుల్ జూలై 2026 నుండి కొత్త సెర్చ్ హిస్టరీ సెట్టింగ్స్ తెచ్చింది. ఒకవేళ మీ డేటా AI ట్రైనింగ్‌కు వెళ్లకూడదనుకుంటే, సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'Opt-out' (ఆఫ్) చేసుకోవచ్చు. అయితే మెటా, చాట్‌జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ప్రైవసీ కంట్రోల్స్ వేర్వేరుగా ఉన్నాయి. యూజర్స్ అలర్ట్‌గా ఉండాలని ఎక్స్పర్ట్ చెప్తున్నారు.

అంతర్థానమవుతున్న ఆడబిడ్డలు!
తెలంగాణలో ఆడపిల్లల జననాల రేటు (Birth Ratio) ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 2024 రిపోర్ట్ ప్రకారం.. ఇక్కడ ప్రతి 1,000 మంది అబ్బాయిలకు కేవలం 910 మంది అమ్మాయిలే పుడుతున్నారు. ఇది నేషనల్ యావరేజ్ (933) కంటే చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ ఉన్నా.. దేశంలో అత్యల్ప బర్త్ రేషియో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. కాగా, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఈ రేషియో 929గా రికార్డ్ అయింది.

20కే బట్టతల.. పెళ్లి కష్టమేనా?
ఇప్పుడు చాలా మంది అబ్బాయిలకు 20–25 ఏళ్లకే జుట్టు బాగా ఊడిపోతోంది. దాంతో చిన్న వయసులోనే బట్టతల కనిపిస్తోంది. ఇది లుక్‌కే కాదు... పెళ్లి సంబంధాల మీద కూడా ప్రభావం చూపుతోందని అంటున్నారు. జుట్టు తగ్గిందని కొందరిని తిరస్కరిస్తుండటంతో, చాలామంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, హెయిర్ ప్యాచ్‌ల వైపు వెళ్తున్నారు. కానీ నిపుణులు మాత్రం... జుట్టు విషయం దాచిపెట్టకుండా ముందే చెప్పడం మంచిదని, అదే నమ్మకమైన బంధానికి బాట వేస్తుందని సజెస్ట్ చేస్తున్నారు.

హీరోయిన్ సమంత సీమంతం సెలబ్రేషన్స్!
హీరోయిన్ సమంత త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఆమె ఇంట్లో 'సీమంతం' వేడుక ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో సాంప్రదాయబద్ధంగా ఈ ఫంక్షన్‌ను సెలబ్రేట్ చేశారు. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమంత కొత్త జర్నీ స్టార్ట్ అవుతుండడంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెప్తున్నారు.

CM రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ లేఖ!
చిల్డ్రన్ సేఫ్టీ, జస్టిస్ కోసం AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, తెలంగాణ CM రేవంత్ రెడ్డికి ఒక లెటర్ రాశారు. తెలంగాణలో POCSO యాక్ట్‌ను మరింత స్ట్రాంగ్‌గా అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా పోక్సో కేసుల ఇన్వెస్టిగేషన్‌ను 60 నుండి 90 రోజుల్లోనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు 24 గంటల్లో మెడికల్ టెస్ట్‌లు చేయాలని, నిందితుల బెయిల్‌ను గట్టిగా వ్యతిరేకించాలని సూచించారు. ప్రతి జిల్లాలో 'Special Monitoring Cell' ఏర్పాటు చేసి, నిర్లక్ష్యం వహించే అధికారులపై యాక్షన్ తీసుకోవాలని ఈ లెటర్ లో రేవంత్‌ను పవన్ కల్యాణ్ కోరారు.