Latest

తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
TG: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండలం తిరుమలగిరి గ్రామంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో TPCC ఉపాధ్యక్షుడు, DCC అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. గిరిజన యువతీ యువకులతో కలిసి ఉత్సవాల్లో సందడి చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు భరోసా
TG: స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా దొరకుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో 62 వేల కొత్త రేషన్ కార్డుల ద్వారా సుమారు 2 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 1.06 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

పచ్చదనం పరిరక్షణకు విరాళం
AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో మొక్కలను కాపాడేందుకు తమ వంతు సహాయాన్ని అందించేందుకు విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ఓల్డ్ ఐరెన్ డీలర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. మొక్కలకు రక్షణగా ట్రీ గార్డ్స్ కోసం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ను కలిశారు. రూ.50 వేల చెక్కును టీడీపీ నాయకులు, ఇబ్రహీంపట్నం మండలం క్లస్టర్ ఇంచార్జి గరికపాటి శివకు చెక్‌ను అందజేశారు. గ్రామస్తుల తరఫున దాతలకు గరికిపాటి శివ కృతజ్ఞతలు చెప్పారు.

గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
AP: నెల్లూరు జిల్లా ఉదయగిరి వ్యవసాయ కళాశాలలో గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. కళాశాల అసోసియేట్ డిన్ టి.గోపికృష్ణ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఉత్తరకోస్తా కళింగ సీమలో ఉద్దానం ప్రాంతాన సోంపేట తాలూకాలో 1909 ఆగస్టు 16వ తేదీన గౌతు లచ్చన్న జన్మించారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమం, రైతు పోరాటాలు జమీందారీ వ్యతిరేక ఉద్యమాలలో కీలక పాత్ర వహించారని అన్నారు. 2006 ఏప్రిల్ 19న కన్నుమూశారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్ డాక్టర్ ఎం.కిషన్ తేజ్ పాల్గొన్నారు.

తైవాన్ తన డిఫెన్స్ బడ్జెట్‌ను ఎందుకు పెంచుతోంది?
చైనా నుంచి పెరుగుతున్న సైనిక ఒత్తిడి నేపథ్యంలో తైవాన్ తన రక్షణను మరింత బలోపేతం చేసుకుంటోంది. 2027లో రక్షణ బడ్జెట్‌ను దాదాపు 16% పెంచి, తొలిసారి 1 ట్రిలియన్ తైవాన్ డాలర్లను దాటించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఖర్చు ఆధునిక ఆయుధాలు, సామర్థ్యాల పెంపుతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సంసిద్ధతపైనా ఉంటుంది. అమెరికా కూడా తైవాన్ తన రక్షణ కోసం మరింత ఖర్చు చేయాలని కోరుతోంది. ఇటీవల నిర్వహించిన సైనిక విన్యాసాల్లో దాడి, సముద్ర దిగ్బంధనం, ఇంటర్నెట్ అంతరాయం వంటి పరిస్థితులను కూడా పరీక్షించారు.
చందుపట్ల గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు
TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలో ముత్యాలమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం సందర్భంగా తెలంగాణ పల్లెల్లో బోనాల సందడి మొదలైంది. డప్పుల చప్పుళ్లు, డీజే మోతలు, పోతురాజుల నృత్యాల మధ్య మహిళలు నైవేద్యంతో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా గుట్టపై ఉన్న ముత్యాలమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

దర్శకుడు రాజా సేన్ కన్నుమూత!
నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ బెంగాలీ సినిమా డైరెక్టర్ (దాము, ఆత్మీయ స్వజన్, దేశ్, దేవీపక్ష లాంటి సినిమాలు చేసిన) రాజా సేన్ (71) గారు కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అయితే గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఎక్కువ కావడంతో కోల్‌కతాలోని ఓ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ ఉండగానే ఇవాళ మరణించారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ప్రొటోకాల్‌ను విస్మరించిన గ్రామపంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు
AP: తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం జివి పురం గ్రామపంచాయతీ పరిధిలో దళిత ఎంపీటీసీ పత్తూరు ఈశ్వరమ్మ, బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ సర్పంచి కాణిపాకం సుబ్బలక్ష్ముమ్మ ఉండగా, ప్రోటోకాల్ ప్రకారం దళిత ప్రజా ప్రతినిధులను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ విస్మరించారని గ్రామస్థులు మండిపడుతున్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అవమానించిన జీవి పురం గ్రామపంచాయతీ కార్యదర్శి గిరిపై అఖిలభారత అంబేద్కర్ సేన జాతీయ ఎస్సీ కమిషన్ వారికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

నీటి కోసం రోడ్డు దాటుతుండగా విషాదం
TG: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన భీమదేవరపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఇందిరానగర్ బస్టాండ్ సమీపంలోని సిద్దిపేట–హనుమకొండ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన మహ్మద్ సలీం బాషా (65) బిందెలు, బకెట్లు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పని నిమిత్తం అక్కడికి వచ్చిన ఆయన నీరు తెచ్చుకునేందుకు రోడ్డు దాటుతుండగా, కూలీలతో దామెర వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.

సెప్టెంబర్‌లో DYFI 16వ రాష్ట్ర మహాసభలు
AP: సెప్టెంబర్ 1, 2, 3వ తేదీలలో నెల్లూరులో DYFI 16వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా Dr.జెట్టి శేషరెడ్డి భవన్‌లో DYFI లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో CPM జిల్లా కార్యదర్శి మూలం రమేష్, DYFI జిల్లా కార్యదర్శి MV రమణ, జిల్లా అధ్యక్షుడు BP నరసింహ, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు చొప్ప రవీంద్ర పాల్గొన్నారు.

దళితుల భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
AP: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పిచ్చుకలపాలెంలో 1999లో ప్రభుత్వం 73 మంది దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రజాసంఘాల నాయకులు ఆదివారం పరిశీలించారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు సెంట్ల చొప్పున సమానంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల ఇళ్ల స్థలాలు, స్మశాన వాటిక, పోరంబోకు భూముల ఆక్రమణలను తక్షణమే తొలగించాలని తహసీల్దార్‌ను కోరారు. పిడియం రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణ, వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోటనాయక్, పాల్గొన్నారు.

విశాఖకు గుడ్‌బై.. రేపటి నుంచి Flights అక్కడి నుంచే!
AP: విశాఖపట్నం విమాన ప్రయాణాలలో కీలక మార్పు జరిగింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో షెడ్యూల్డ్ కమర్షియల్ ఎయిర్‌లైన్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. రేపటి నుంచి విశాఖకు రాకపోకలు సాగించే అన్ని షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్ సర్వీసులు భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌కు ఉన్న VTZ కోడ్‌ను భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు బదిలీ చేయనున్నారు. దీంతో విశాఖ ప్రాంతంలో ఏవియేషన్ ఆపరేషన్స్‌లో ఇది కీలకమైన మార్పుగా నిలవనుంది.

పథకాల అమలుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. నిరసన
TG: కల్యాణలక్ష్మి, రైతు బీమా పథకాల అమలుపై సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కల్యాణలక్ష్మి, రైతు బీమా పథకాల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విజయవాడ నుంచి కాశీకి నేరుగా ఫ్లైట్
AP: విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి వారణాసికి నేరుగా వెళ్లేందుకు విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఇండిగో సంస్థ ఈ సర్వీసును ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు వర్చువల్‌గా సర్వీసును ప్రారంభించారు. వారణాసి–విజయవాడ మధ్య విమానాలు మంగళవారం, గురువారం, శనివారం నడవనున్నాయి. ఇప్పటివరకు ఇతర నగరాల్లో విమానాలు మారాల్సిన ప్రయాణికులకు ఇప్పుడు నేరుగా కాశీ చేరుకునే అవకాశం దక్కింది.

'డాన్ 3' కోసం రణ్‌వీర్..తండ్రి
'డాన్ 3' సినిమా నుంచి హీరో రణ్‌వీర్ సింగ్ లాస్ట్ మినిట్‌లో తప్పుకోవడంతో, నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్ధ్వానిలు ఫిలిం మేకర్స్ అసోసియేషన్‌లో (IMPPA) కంప్లైంట్ చేశారు. మొదట మా లాయర్లు చూసుకుంటారు అని చెప్పినా, రీసెంట్‌గా రణ్‌వీర్ తండ్రి నిర్మాతల మండలిని కలిసి చర్చలకి ఓకే చెప్పారు. రెండు వైపుల వాదనలు విని త్వరలోనే ఈ సమస్యపై నిర్మాతల మండలి ఓ నిర్ణయం తీసుకోనుంది.

కాలువలోకి కారు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం
AP: కాలువలోకి కారు దూసుకెళ్లిన <a href="https://www.theclearcutnews.com/n/SqTyj4c">ప్రమాదం</a>లో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల మలుపు వద్ద తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఓగిడి గ్రామానికి చెందిన నలుగురు బీటెక్ విద్యార్థులు కోనసీమ జిల్లా మోరి వైపు కారులో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పోతుల లక్ష్మీభాను, రాజారాం, నాగిరెడ్డి దుస్వంత, సాయిసూర్య నీటిలో గల్లంతయ్యారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కాలువలో గాలింపు చేపట్టారు.

అక్కడ అర్ధరాత్రి అయినా.. మందుబాబులకు టెన్షనే
TG: అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో ఖమ్మం జిల్లా ఏన్కూర్ SI సంధ్య తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించిన ఆమె రాత్రి వేళల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యంతాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ప్రమాదాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. సహజంగా పురుష SIలు రాత్రి సమయాల్లో చెకింగ్ చేయడంలో అంతగా ఆసక్తి కనబరచకపోయినా, మహిళా పోలీసు అధికారిగా అర్ధరాత్రి విధులు నిర్వర్తిస్తున్న SI సంధ్య సేవలను స్థానికులు, ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.

సైకిల్ తొక్కుతూ వరదలో కొట్టుకుపోయిన యువతి
అమెరికాలోని అరిజోనా రాష్ట్రం టక్సన్‌లో వరద ఓ 20 ఏళ్ల యువతిని చావు అంచుల వరకు తీసుకెళ్లింది. ఆగస్ట్ 13న ఫ్యామిలీతో కలిసి సైకిల్‌పై వరద నీటితో నిండిన బ్రిడ్జ్ దాటుతుండగా ఆమె నీటిలో చిక్కుకుంది. వేగంగా ప్రవహించిన నీరు ఆమెను డ్రైనేజీ టన్నెల్‌లోకి లాక్కెళ్లి 100 అడుగుల దూరంలో బయటకు విసిరేసింది. ఆ యువతికి కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే CPR అందించడంతో మెలకువ వచ్చింది. తరువాత హాస్పిటల్‌కు తీసుకెళ్లగా పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

రణ్‌వీర్ సింగ్ ‘ప్రళయ్’ షూటింగ్ ప్రారంభం!
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రళయ్’ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘స్కామ్ 1992’ సిరీస్ ఫేమ్ జై మెహతా దర్శకత్వం వహిస్తుండగా, సౌత్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అనన్య బిర్లా స్టూడియోస్ సినిమాను నిర్మిస్తోంది. హై టెక్నాలజీతో వస్తున్న ఈ యాక్షన్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
జెండా ఎగరేసి.. సినిమా పాటలకు చిందులు
AP: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో APFDC సిబ్బంది చేసిన డ్యాన్సులు వివాదానికి దారితీశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం దేశభక్తి గీతాలకు బదులుగా సినిమా, జానపద పాటలకు సిబ్బంది డ్యాన్సులు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. జాతీయ పర్వదిన వేడుకల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సముచితమేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశ పవిత్రతను విస్మరించారంటూ APFDC సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్పేస్ టెక్నాలజీ ఇప్పుడు దేశాల మధ్య కొత్త పవర్‌గా మారుతోందా?
మనకు స్పేస్ అంటే రాకెట్లు, చంద్రుడు, మార్స్ గుర్తొస్తాయి. కానీ అసలు గేమ్ అంతకంటే పెద్దది. మన ఫోన్‌లో నావిగేషన్ నుంచి వాతావరణ సమాచారం, ఇంటర్నెట్, సరిహద్దుల నిఘా వరకు ఎన్నో విషయాలు ఉపగ్రహాలపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే అమెరికా, చైనా, భారత్ వంటి దేశాలు స్పేస్‌లో తమ టెక్నాలజీని వేగంగా పెంచుతున్నాయి. ముఖ్యంగా యుద్ధం లేదా సంక్షోభ సమయంలో ఉపగ్రహాల నుంచి వచ్చే సమాచారం చాలా కీలకం. అంటే స్పేస్ ఇక కేవలం సైన్స్ కాదు… దేశాల భద్రత, డబ్బు, ప్రపంచ రాజకీయాల్లో కొత్త పవర్ గేమ్‌గా మారుతోంది.