Latest

పరువు నష్టం కేసులో సన్ టీవీ పై నటి సుకన్య గెలుపు !
1996లో అడవి దొంగ వీరప్పన్ ఇంటర్వ్యూలో తనపై అసత్య వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు నటి సుకన్య వేసిన పరువు నష్టం కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వాస్తవాలు సరిచూడకుండా, ఆ భాగాలను ఎడిట్ చేయకుండా ప్రసారం చేసినందుకు సుకన్యకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని సన్ టీవీ నెట్‌వర్క్‌ను కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె 30 ఏళ్ల న్యాయపోరాటం ముగిసింది.

చంద్రుడిపై ప్రయోగాలకు రేపు మరో టీమ్ రెడీ !
చంద్రుడిపై శాశ్వత నివాసమే లక్ష్యంగా నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆర్టెమిస్-3' మిషన్ కీలక దశకు చేరింది. ఈ చారిత్రాత్మక ప్రయోగంలో పాల్గొనే నలుగురు ఆస్ట్రోనాట్ల పేర్లను రేపు రాత్రి 8:30 గంటలకు (IST) నాసా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది.. 'ఆర్టెమిస్-2' విజయవంతం కావడంతో నాసా ముందుకు ప్రొసీడ్ అవుతోంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో సాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా తొలిసారి ఒక మహిళను, శ్వేతజాతీయేతరుడిని చంద్రుడి దక్షిణ ధ్రువంపై దించనున్నారు. ఈ మిషన్ భవిష్యత్తులో మార్స్ యాత్రకు పునాది లాంటిదే.

ఏపీలో పలు జిల్లాల్లొ నేడు, రేపు వర్షాలు !
కర్ణాటక నుంచి కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఏపీలో ఇవాళ, రేపు వర్షాలు పడతాయి. ఏపీలోని పలు జిల్లాల్లొ రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ తెలిపింది. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు కూడా అలెర్ట్ గా ఉండాలని సూచించింది.

అక్కడ ఆయాలే డాక్టర్స్.. ఎందుకంటే..?
TG: డాక్టర్ల కొరతతో HYD నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా వైద్యులు లేకపోవడంతో ఆయాలే రోగులకు సెలైన్లు పెడుతున్నారు. మందులు వేస్తున్నారు. నిరక్షరాస్యులైన ఆయాలు రోజువారీ అనుభవంతో తోచిన వైద్యసేవలు అందిస్తున్నారని, ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని రోగులు టెన్షన్ పడుతున్నారు. ఫీవర్ హాస్పిటల్‌లో మొత్తం 52మంది నర్సింగ్ సిబ్బంది ఉండగా 2024లో 22మంది స్టాఫ్‌నర్సులు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ఇప్పటివరకు ఒక్కరు కూడా భర్తీ కాలేదు. దీంతో అన్నీపనులు ఆయాలే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నా దారి నాదేనంటున్న శ్రేయస్ అయ్యర్
టీమిండియా T20 కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేసిన శ్రేయస్ అయ్యర్ గట్టి స్టేట్‌మెంట్ ఇచ్చాడు! సూర్యకుమార్ ఫామ్ దెబ్బతినడంతో లక్ తిరిగిన అయ్యర్, తాను ఎవరి "షాడో"లోనూ ఉండనని క్లియర్ చేశాడు. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో పనిచేయబోతున్నా, కెప్టెన్సీ కోసం తన పర్సనాలిటీ మార్చుకోనని హింట్ ఇచ్చాడు. IPL సక్సెస్‌తో వచ్చిన ఈ ఛాలెంజ్‌ను తన ఓన్ స్టైల్‌లోనే హ్యాండిల్ చేస్తానంటూ BCCIకి సిగ్నల్స్ ఇచ్చేసాడు!

యాంకర్ ని స్టుపిడ్ అంటూ ట్రంప్ వీరంగం !
యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తన అసహనాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు.కాలిఫోర్నియా ఎలక్షన్ రిగ్గింగ్ వివాదంపై NBC 'మీట్ ది ప్రెస్' యాంకర్ క్రిస్టెన్ వెల్కర్.. ట్రంప్‌ను గట్టిఆధారాలు అడిగింది. అంతే, సీన్ హీటెక్కింది! "నేను జస్ట్ చూస్తే చాలు" అంటూ ట్రంప్ కవర్ చేశారు. యాంకర్ వదలకుండా నిలదీయడంతో, "నువ్వు క్రుకెడ్ లేదా స్టుపిడ్" అని ఫైర్ అయి, "ఐవ్ హాడ్ ఎనఫ్.. థాంక్యూ డార్లింగ్" అంటూ మైక్ కిందపడేసి ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేసేశారు!

'మమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి'
TG: గాలివాన బీభత్సానికి రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకటరావుపల్లి విలేజ్‌లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. గ్రామంలో తోట శాంతమ్మ, పూదరి అంజయ్య ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెలిశాల లక్ష్మీపతి పెంకుటిల్లు పూర్తిగా కూలిపోయింది. సాదక్ నిషా ఇల్లు గాలివానకు దెబ్బతింది. పలువురు ఇళ్లు కూడా వర్ష బీభత్సానికి పూర్తిగా ధ్వంసం కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకున్నారు.
60 కేజీల ట్రక్ టైర్లు ఎత్తేస్తూ.. కుటుంబానికి ఆమే హీరో
ఈ సమాజంలో ఆడపని, మగపని అని తేడాలుంటాయా ? కచ్చితంగా ఉంటాయనే కొందరు అంటారు. అలాంటి అపోహల్ని బద్దలు కొట్టింది ఒడిశాకు చెందిన మహిళ సుని హెంబ్రమ్. కొన్నాళ్ల క్రితం ఆమె భర్త ప్రమాదానికి గురై గాయపడ్డారు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ ఆమె మోయాల్సి వచ్చింది. చదువు రాకపోయినా ఆమె గుండె ధైర్యంతో ఒంటరిగా టైర్లు రిపేర్ షాప్ రన్ చేస్తోంది. ఏకంగా 40–60 కిలోల బరువైన ట్రక్కు టైర్లను అవలీలగా లేపుతూ భారీ మిషన్లను ఆపరేట్ చేస్తోంది. తన శ్రమతో పిల్లలను చదివిస్తోంది. ఇలాంటి ఉక్కు మహిళల్ని కదా అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.

నేనే బాస్‌ని.. ఇరాన్ డీల్ ను ఇజ్రాయెల్ ఒప్పుకోవాల్సిందే : ట్రంప్
ఇరాన్‌తో కుదుర్చుకోబోయే కొత్త ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో తాము చేసే డీల్‌ను అంగీకరించడం మినహా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు వేరే మార్గం లేదని అన్నారు. ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ విషయంలో నిర్ణయాలు తీసుకునేది (Call the shots) నేనే అంటూ తన పవర్ ఏంటో తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలో శాంతి భద్రతల కోసం అమెరికా తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన హెచ్చరించారు.

పశ్చిమాసియా రణరంగం.. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు
పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వద్దని వారిస్తున్నా వినకుండా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ యుద్ధానికి సై అన్నారు. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి చేసినందుకు ఇరాన్ ఆ దేశంపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేస్తే, ఇప్పుడు ఇజ్రాయెల్ టెహ్రాన్, తబ్రిజ్, ఇస్ఫహాన్ పై దాడులకి దిగింది. దీంతో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది.

ఇన్నాళ్లయినా వీడని మార్లిన్ మన్రో డెత్ మిస్టరీ !
హాలీవుడ్ సంచలనం, ‘యూత్ ఐకాన్’ మార్లిన్ మన్రో జీవితం ,ఆమె మరణం వెనుక ఉన్న రహస్యాలపై అంతర్జాతీయ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. హిస్టరీలోనే అత్యంత ప్రభావవంతమైన నటీమణుల్లో ఒకరైన మన్రో.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె చనిపోయి దశాబ్దాలు గడుస్తున్నా, అది ఆత్మహత్యా హత్యా అనే గందరగోళం ఇప్పటికీ వీడలేదు. ఆమె వ్యక్తిగత జీవితం, రాజకీయ సంబంధాలే ఈ మిస్టరీకి కారణమనే వాదనలున్నాయి..

రేవంత్ నార్త్ ,సౌత్ కామెంట్ పై కేంద్ర మంత్రి ఫైర్
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోం దంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తీవ్రంగా స్పందించారు. దేశాన్ని విభజించవద్దని ఆయన అన్నారు. దేశం లోని అత్యున్నత పదవుల్లో అన్ని ప్రాంతాలకూ ప్రాతినిధ్యం ఉందని గుర్తు చేస్తూ.. రాష్ట్రపతి తూర్పు భారత్ (ఒడిశా), ప్రధాని పశ్చిమ భారత్ (గుజరాత్) నుండి ఉన్నారని రిజుజు స్పష్టం చేశారు.

డేటింగ్ యాప్ లు ఉన్నా జెన్ జీ ని వేధిస్తున్న లోన్లీ నెస్ !
డేటింగ్ యాప్‌ల వాడకం విపరీతంగా పెరిగినప్పటికీ, యువతలో ఒంటరితనం వేధిస్తోందని ‘ది ఎకనామిక్ టైమ్స్’ కథనం పేర్కొంది. ఆన్‌లైన్‌లో వేలాది ప్రొఫైల్స్ అందు బాటు లో ఉండటం వల్ల ఒకరితో స్థిరమైన బంధాన్ని ఏర్పరచుకునే సామర్థ్యం దెబ్బ తింటోందని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ‘జెన్ జీ (Gen Z)’ యువత పార్ట్ నర్ ని ఎంచుకునే విషయంలో మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుంటూ, చివరికి తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఈ రిపోర్ట్ తెలిపింది.

వంద రోజులు దాటినా ఆగని ఇరాన్, యూఎస్ వార్ !
ఇరాన్, అమెరికా మధ్య మొదలైన చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాల్టితో వంద రోజులు గడచిపోయినా నేటికీ ఇంకా ఈ క్రైసిస్ కంటిన్యూ అవుతోంది. ఇరాన్ తమ నేత సుప్రీం లీడర్ ఆలీ ఖమైనీ ని కూడా ఈ యుద్ధం లో పోగొట్టుకుంది. ఇరాన్, లెబనాన్, ఇతర గల్ఫ్ దేశాల్లో ఇప్పటివరకు 7వేల మందికి పైగా మరణించారు. పశ్చిమాసియాలో ఆయిల్, గ్యాస్ ప్రొడక్షన్, సప్లైకి ఆటంకాలతో ఇండియా సహా ప్రపంచ దేశాలు చమురు కొరతతో అల్లాడుతున్నాయి. అయినా ఇప్పట్లో యుద్ధానికి తెరపడే పరిస్థితులు కనిపించడం లేదు.

జోజిలా టన్నెల్ తుది బ్రేక్ త్రూకు అంతా రెడీ
జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను నిత్యం అనుసంధానించే ప్రతిష్ఠాత్మక 'జోజిలా టన్నెల్' ప్రాజెక్ట్ తుది బ్రేక్ త్రూకు సిద్ధమైంది. జూన్ 9న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. మేఘా ఇంజనీరింగ్ నిర్మిస్తున్న ఈ 13.153 కిలోమీటర్ల టన్నెల్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న పొడవైన సింగిల్-ట్యూబ్ ద్విముఖ రహదారి సొరంగంగా చారిత్రాత్మక మైలురాయిని సృష్టించబోతోంది.

స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ మా అణుబాంబు - ఇరాన్
అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అలీ నిక్జాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హార్ముజ్ జలసంధి’ ఇరాన్ పాలిట అణు బాంబు లాంటిదని అన్నారు. ప్రపంచ ముడి చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ జలసంధిపై తమకున్న వ్యూహాత్మక పట్టును అమెరికా, దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన ఆర్థిక అస్త్రంగా (డిటెరెన్స్) ఉపయోగిస్తామని ఇరాన్ ఈ ప్రకటన తో హెచ్చరించింది.
తిరుమల రెండో కనుమదారిలో ఎలుగు బంటి హల్చల్
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమదారిలో ఎలుగు బంటి హల్చల్ చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి కిలోమీటరు దూరంలో ఉండే వినాయక ఆలయం వద్ద సంచరించింది. తినుబండారాల కోసం చెత్తకుండీల వద్ద తిరుగుతున్న ఎలుగ బంటిని చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ, విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఎలుగు బంటిని అటవీ ప్రాంతంలోకి మళ్లించారు.

మధ్యప్రదేశ్ లో ఘోరం... రోగికి అంబులెన్స్ ఇవ్వని ఆస్పత్రి
మధ్యప్రదేశ్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి (MY) లో మానవత్వం మంటగలిసింది. ఇండోర్ లో వెన్నెముక సమస్యతో బాధపడుతున్న 12 ఏళ్ల ఆదర్శ్‌ను కిలోమీటర్ దూరంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి షిఫ్ట్ చేయడానికి స్టాఫ్ అంబులెన్స్ ను కానీ, సిబ్బందిని కానీ ఇవ్వలేదు. దీంతో ఎండలోనే స్ట్రెచర్ పై ఉన్న బాలుడిని తండ్రి లాగుతూ తీసుకెళ్లగా, తల్లి చున్నీని నీళ్లలో ముంచి కొడుకు బాడీని తడుపుతూ తీసుకెళ్లారు.. తీరా వెళ్లాక అవసరం లేదంటూ మళ్ళీ వెనక్కి పంపడంతో తల్లిదండ్రులు నరకం చూశారు.

అమెరికాలో దారుణం.. ఫేక్ పిజ్జా ఆర్డర్ తో తెలంగాణ యువకుడి దారుణ హత్య
తెలంగాణకు చెందిన 28 ఏళ్ల అన్షుల్ కుంచా అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే, అడిషనల్ ఇన్ కమ్ కోసం వీకెండ్స్‌లో పిజ్జా డెలివరీ చేసేవాడు. ఫిలడెల్ఫియాలో అర్ధరాత్రి వచ్చిన పిజ్జా ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి వెళితే కొందరు అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ అడ్రస్ ఖాళీ ఇంటిదని పోలీసులు గుర్తించారు. సీసీటీవీలో ఇద్దరు అనుమానితులు అతడిని వెంబడించినట్లు కనిపించింది. డబ్బు, వస్తువులు ఏవీ దోచుకోకపోవడంతో ముందే పన్నిన ఉచ్చేనని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

గూగుల్ మ్యాప్స్ ట్రాప్ టౌన్స్ గురించి మీకు తెలుసా ?
మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్‌లో చూపిస్తున్న ఒక ఊరికి వెళ్లి, అక్కడ అసలు ఏమీ లేకపోవడం గమనించారా? వీటిని ట్రాప్ టౌన్స్ లేదంటే ఘోస్ట్ సిటీస్ అంటారు. నిజానికి ఇవి మ్యాప్స్ తయారు చేసే కంపెనీలు కావాలనే సృష్టించే నకిలీ నగరాలు. వేరే కంపెనీలు తమ మ్యాప్ డేటాను కాపీ కొట్టకుండా పట్టుకోవడానికి ఈ ట్రిక్ ఉపయోగిస్తారు. ఒకవేళ వేరే మ్యాప్‌లో కూడా ఈ నకిలీ నగరం కనిపిస్తే వారు డేటా దొంగిలించారని కోర్టులో ఈజీగా నిరూపించవచ్చు. అయితే ఆ కంపెనీలు ఇలా చేస్తున్నాయని ఓపెన్ గా చెప్పవు. కేవలం ఒక కాపీరైట్ రక్షణ కోసం లేని ఊర్లను సృష్టించడం నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ క్రియేటివిటీ కదా!

సినీ ఇండస్ట్రీకి బిచ్చగాడు నటుడు గుడ్ బై !
బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విజయ్ ఆంటోనీ త్వరలో మూవీస్ గుడ్ బై కొట్టనున్నారు. ఈ నెల19న ఆయన కొత్త సినిమా నూరుసామి..తెలుగులో వంద దేవుళ్లు విడుదల కానుంది. ఈ మూవీ ప్రొమోషన్లలో ఆయన మాట్లాడుతూ మరో రెండు మూడేళ్లలో చెన్నై విడిచిపెట్టి గ్రామంలో సెటిల్ అవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. పొల్లాచ్చి లాంటి ప్రాంతంలో భూమి కొనుక్కొని ఉంటే స్వచ్ఛమైన వాతావరణంలో ఉండవచ్చునని చెప్పారు. మూడేళ్ల క్రితం ఆయన కుమార్తె ఆత్మహత్య తర్వాత విజయ్ ఆంటోని సినిమాలు బాగా తగ్గించాడు.