Latest

టైగర్ ష్రాఫ్ కాల్పులపై అభిజీత్ దీప్కే
CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ముంబైలో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనపై ప్రతిస్పందించారు. “విద్యార్థులు, అక్టీవిస్ట్స్ లను అణచివేయడం బదులు పోలీసులు నిజమైన నేరస్థులపై దృష్టి పెట్టాలని విమర్శించారు. ప్రభుత్వం, పోలీసుల బాధ్యతలు తప్పినప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని అభిజీత్ దీప్కే అన్నారు. అక్టోబర్ 18న జుహూలోని పుష్పా పార్క్ సమీపంలో టైగర్ ష్రాఫ్ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్ గాయపడ్డారు.

‘చెప్పాం.. చేస్తున్నాం' పోస్టర్ ఆవిష్కరణ
అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు సోమవారం పార్టీ ముఖ్య నేతలతో కలిసి 'చెప్పాం.. చేస్తున్నాం' పోస్టర్‌ను ఆవిష్కరించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీ శక్తి పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు.
హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకెళ్లాలి: TRKS
కుమ్మరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, హక్కుల సాధన కోసం ప్రతి గ్రామం, మండలంలో సంఘాన్ని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం (TRKS) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం కోరారు. మహబూబాబాద్ పట్టణంలో జిల్లా అధ్యక్షుడు అల్వాల శ్రీనివాస్ అధ్యక్షతన 18 మండలాల కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25న మహబూబాబాద్ పట్టణంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో దసరా
కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో దసరా సందర్భంగా ఆయుధ, జమ్మి, వాహన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజల్లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్వయంగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనరేట్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ప్రోగ్రామ్‌లో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్ఐలు జానీమియా, శ్రీధర్ రెడ్డి, కిరణ్ కుమార్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

స్టాక్‌మార్కెట్ డౌన్: నిర్మలా సీతారామన్ అలర్ట్
భారత స్టాక్‌మార్కెట్లు 12% పడిపోవడానికి విదేశీ ఇన్వెస్టర్లు సుమారు 33 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తైవాన్, దక్షిణ కొరియా AI కంపెనీలకు తరలించడమే కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నిధుల ఉపసంహరణ ఆందోళనకరమే అయినా, దేశీయ ఇన్వెస్టర్ల SIP పెట్టుబడులు, బలమైన లిక్విడిటీ వల్ల మార్కెట్ స్థిరంగా ఉందన్నారు. గ్లోబల్ AI బబుల్ పేలినా మనకు పెద్దగా నష్టం ఉండదని, కానీ విదేశీ ఉపసంహరణలు ఇలాగే కొనసాగితే 2027లో మాత్రం సవాళ్లు తప్పవని ఆమె అలర్ట్ చేశారు.
గూండాలకు బెయిల్.. యువకులకు జైలా: ప్రకాశ్ రాజ్
"తిరంగాతో శాంతియుతంగా నిరసన తెలిపిన CJP లీడర్స్ సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను 5 రోజులుగా కస్టడీలో ఉంచడమేంటి?" అని ఫైర్ అయ్యారు నటుడు ప్రకాశ్ రాజ్. గూండాలకు బెయిల్ ఇచ్చి, శాంతియుతంగా నిరసనలు చేసిన వారిని మాత్రం నిర్బంధించడమేంటని ఆయన ప్రశ్నించారు. బెయిల్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ.. దాన్నే శిక్షలా ఉపయోగిస్తున్నారని విమర్శించిన ఆయన... ప్రొటెస్టర్లపై జరిగిన ప్రతి లాఠీ దెబ్బనూ ప్రజలు గుర్తుంచుకుంటారనీ.. వారిని వెంటనే రిలీడ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.

రహదారి నిర్మాణానికి కోటి నిధులు మంజూరు
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రేగళ్ల గ్రామం నుంచి కొత్తూరు గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణం కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు ₹.1 కోటి నిధులు మంజూరు చేయించారు. ఈ రహదారి నిర్మాణంతో రెండు గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ప్రయాణ ఇబ్బందులు తగ్గనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సూరత్‌లో కార్మికులు v/s యజమానులు
గుజరాత్‌లోని సూరత్ టెక్స్టైల్ కార్మికులు పని గంటలు తగ్గించాలని, వారానికి ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. ప్రస్తుతం రోజుకు 12 గంటలు పనిచేస్తున్న తమకు 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరుతున్నారు. అయితే ఖర్చులు పెరుగుతున్నాయని, పని గంటలు తగ్గిస్తే నష్టాలు వస్తాయని యజమానులు చెబుతున్నారు. ఈ ఆందోళనలతో కార్మికులు, యజమానుల మధ్య వివాదం పెరిగింది. పోలీసులు పలువురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.

బతుకమ్మ పండుగ ప్రపంచానికే ఆదర్శం : MLA
సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలో కౌన్సిలర్ పొన్న దశరథ్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై రంగురంగుల పూల బతుకమ్మలతో సందడి చేశారు. ఈవెంట్‌కి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గెస్ట్‌గా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రపంచానికే ఆదర్శమని ఆయన అన్నారు. ప్రోగ్రామ్ ఏర్పాట్లు చేసిన కౌన్సిలర్‌ను అభినందించారు.

సౌరవ్, అశుతోష్ కస్టడీపై బిగ్ అప్డేట్
జంతర్ మంతర్ ప్రొటెస్ట్ కేసులో అరెస్టయిన సౌరవ్, అశుతోష్‌ల కస్టడీ ఈరోజుతో ముగియడంతో మధ్యాహ్నం 2 గంటలకు కొత్త SEM ముందు హాజరుపరచనున్నారు. వీరికి బెయిల్ ఇవ్వకుండా అధికారులు ఉద్దేశపూర్వకంగా లేట్ చేస్తున్నారని CJP లీగల్ హెడ్ రత్న సింగ్ ఆరోపించారు. విచారణ సమయానికి ఫోన్లు స్విచాఫ్ చేయడం, బెదిరింపు మెసేజ్‌లు, టైర్ పంక్చర్ల పేరుతో డ్రామాలు చేయకుండా, 'పై అధికారుల ఆర్డర్స్' అంటూ టైం వేస్ట్ చేయకుండా ప్రొసీడింగ్స్ జరగాలని ఆశిస్తున్నట్లు ఆమె 'X'లో పోస్ట్ చేశారు.

మిజోరం సీఎంకు స్వాగతం పలికిన లోకేష్
గుంటూరు జిల్లా ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి సోమవారం మిజోరం సీఎం లాల్ దుహోమా చేరుకున్నారు. రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లాల్ దుహోమాను శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. అనంతరం మంత్రి లోకేష్ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా పలకరించుకున్నారు.
వ్యవసాయ బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుళ్లకోట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైరి వెంకటమ్మ (80) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకటమ్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చీకట్లోనే బతుకమ్మ సంబరాలు
సంగారెడ్డి జిల్లా మానూరు మండలం కమలాపూర్ గ్రామంలో బతుకమ్మ వేడుకలకు కనీస లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంపై మహిళలు ఫైరయ్యారు. గ్రామంలోని చెరువు కట్టవద్ద వేడుకలు నిర్వహించగా, వెలుతురు లేక మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీకట్లోనే బతుకమ్మలు ఆడుతూ, పాడుతూ చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ప్రతి ఏడాది ప్రజలు పాల్గొనే పండుగకు కనీస స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయకపోవడంపై అధికారులు, గ్రామ పంచాయతీ తీరును ప్రశ్నించారు.

మహిళపై దాడి చేసి బంగారం చోరీ
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో మహిళపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి బంగారు ఆభరణాలు దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గౌరమ్మ ఇంట్లోకి వెళ్తుండగా దుండగుడు ఆమెపై దాడి చేసి మెడలోని పుస్తెలతాడు, బంగారు గొట్టాలు తదితర ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. దొంగిలించిన ఆభరణాలు సుమారు మూడు తులాల వరకు ఉంటాయని పేర్కొంది.

28న ‘తండా నిద్ర’ కార్యక్రమం
భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 28న నిర్వహించనున్న ‘తండా నిద్ర’ కార్యక్రమ కరపత్రాలను సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు బానోత్ హుస్సేన్ నాయక్ ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షులు మాలోత్ శివ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గిరిజన తండాల్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం, హక్కులు, సంక్షేమం, అభివృద్ధిపై అవగాహన కల్పించడం, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సేవాలాల్ సేన నాయకులు తెలిపారు.
గంగానమ్మ జాతర వార్షికోత్సవాలు
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో శ్రీ గంగానమ్మ జాతర 14వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాలను రంగిశెట్టి ఫౌండేషన్, బయోఫర్ ఫార్మా సంస్థ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు సహకారంతో నిర్వహించారు. పుష్పాలు, పొంగళ్లు, చీరలు, గాజులతో మహిళలు సంప్రదాయ మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం 15 వేల మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు.

MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
AP: రాష్ట్రంలో MPTC, ZPTC ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 659 ZPTC, 9,829 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది.

టైగర్ ష్రాఫ్ కారుపై ఫైరింగ్.. ముగ్గురు అరెస్ట్
బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపిన ఘటనలో పోలీసులు రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్లో ముగ్గురు అనుమానితులను ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి విలే పార్లేలోని పుష్ప నర్సీ పార్క్ దగ్గర టైగర్ కారుపై ఐదు రౌండ్ల కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే, ఈ ఘటనలో ఆయన డ్రైవర్ ఫిర్దోష్, మరో వ్యక్తి ఉమేష్ చవాన్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ ఈ ఘటనపై ఎంక్వయిరీ చేస్తున్నారు.

బషీరాబాద్ ప్రజావాణికి అధికారుల డుమ్మా
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం నామమాత్రంగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఒక్క వెటర్నరీ వైద్యుడు మినహా ఇతర శాఖల అధికారులు హాజరుకాలేదు. దీంతో ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలకు నిరాశ ఎదురైంది. సమస్యలు పరిష్కరించాల్సిన కార్యక్రమానికి అధికారులు గైర్హాజరు కావడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల వేళ ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణం, మండల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సూచించారు. ఎన్నికల నేపథ్యంలో డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
నిర్మల్‌లోని నాయిడివాడలో శ్రీ గుట్ట వీరన్న అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, ధర్మరక్షణకు ప్రతీక అని కొనియాడారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తి, పాలనా దక్షత నేటి యూత్‌కి ఆదర్శమని అన్నారు. శివాజీ ఆశయాలను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని సంస్కృతిని కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.