సముద్రం నీరు ఉప్పగా ఎందుకు ఉంటుంది?

సముద్రం నీరు ఉప్పగా ఉండటం వెనుక పెద్ద రహస్యం ఏమీ లేదు.. కోట్ల ఏళ్లుగా జరుగుతున్న ఒక సహజ ప్రక్రియే దీనికి కారణం. వర్షం భూమిపై పడినప్పుడు రాళ్లలోని చిన్న చిన్న ఖనిజాలను కరిగిస్తుంది. నదులు వాటిని సముద్రంలోకి తీసుకెళ్తాయి. సముద్రపు నీరు ఆవిరై మేఘాలుగా మారినా.. అందులోని ఉప్పు, ఖనిజాలు మాత్రం అక్కడే మిగిలిపోతాయి. ఇలా ఏళ్ల తరబడి అవి సముద్రంలో చేరుతూనే ఉంటాయి. అంతేకాదు, సముద్రపు అడుగున జరిగే అగ్నిపర్వత చర్యలు, రసాయన మార్పులు కూడా కొంత ఉప్పును కలుపుతాయి. అందుకే సముద్రం నీరు మనకు ఉప్పగా రుచి ఇస్తుంది.



