Latest

ఈ20 వివాదం..నలుగురు ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు
ఈ20 ఇంధన విధానంపై తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో నలుగురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును ఆధారాలు లేకుండా వీడియోల్లో ఉపయోగించారని పోలీసులు తెలిపారు. యూట్యూబర్ మనీష్ కశ్యప్‌తోపాటు మరో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ వీడియోలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆరోపించారు. నాగ్‌పూర్ సైబర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
AP: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కొంతకాలంగా భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఈనెల 10న ఆయన భుజానికి ఆపరేషన్ జరిగింది. నాలుగు రోజులు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే ఇప్పట్లో పవన్ కల్యాణ్ ఇంటి నుంచి బయటికి వచ్చే అవకాశం ఉండదు. ఇంకా కొద్ది రోజుల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్స్ చెప్పారు.

‘అమ్మ’ పిలుపు కోసం: సమంత
"అమ్మ అనిపించుకోవాలని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. ఫైనల్‌గా ఆ టైమ్ వచ్చింది. ఈ జర్నీలో నా బెస్ట్ ఇవ్వడానికి రెడీ" అని హీరోయిన్ సమంత తన ఆనందాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సమంత మాతృత్వం గురించి మాట్లాడుతూ ఈ కొత్త లైఫ్ ఫేజ్‌లో ప్రతి మూమెంట్‌ను ఆస్వాదిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆమె తన హెల్త్ కోసం సినిమాలకు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చారు.

AIని నమ్మితే ఇంజినీర్ల నైపుణ్యాలకు దెబ్బ
AIని నమ్మితే ఇంజినీర్ల నైపుణ్యాలకు దెబ్బ తప్పదని నాస్కామ్ సీనియర్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సంగీత గుప్తా అభిప్రాయపడ్డారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇంజినీరింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో విద్యాసంస్థలు విఫలమైతే ఇంజీనీర్లు AIని రూపొందించేవారిగా కాకుండా, దానిపై ఆధారపడి ఉద్యోగాలు చేసే ప్రమాదం ఉందని వివరించారు. ఇప్పటికే 90 శాతం మందికి పైగా AIని వాడుతున్నారని, వారి నైపుణ్యాలు దెబ్బతినకుండా పరిశ్రమ ఆన్ బోర్డింగ్ మెంటార్షిప్లను మెరుగుపరచాలని అన్నారు.

హైదరాబాద్‌లో నెలరోజులపాటు పండగ సందడి
TG: హైదరాబాద్‌లో నెలరోజులపాటు పండగ సందడి నిండిపోనుంది. బోనాలు, శివశక్తుల పూనకాలు, పోతురాజుల వేషధారణ, ఇంటికొచ్చిన చుట్టాలతో ఈ నెలంతా మెరవబోతుంది. దాదాపు 3,500 గుడుల్లో ఉత్సవాలు చేసేందుకు ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది. ఉత్సవాలు ఘనంగా జరిగేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
హాస్టల్‌లో ఉండలేక బయటకు వచ్చిన విద్యార్థులు
మంచిర్యాల జిల్లా చెన్నూరు మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో వసతుల సమస్యలతో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు హాస్టల్ విడిచి బయటకు వచ్చారు. మంగళవారం రాత్రి 17మంది స్టూడెంట్స్ ఎమ్మెల్యే సతీమణి సురేఖను కలిసి సమస్యలను వివరించారు. సమస్యలను విన్న సురేఖ, వారిని జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీధర్‌కు అప్పగించి, సురక్షితంగా చెన్నూరుకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. గురుకులంలో వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాల, గురుకులాల్లో వసతులు లేకపోవడం, ఫుడ్‌పాయిజన్ ఘటనలతో స్టూడెంట్స్ భయాందోళనకు గురవుతున్నారు.

చాక్లెట్ల ఆశచూపి బాలికపై అత్యాచారం
TG: హైదరాబాద్‌లోని KPHB పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలిక ఇంటి ముందు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెహాన్ అనే వ్యక్తి పండ్లు అమ్ముకుంటూ ఉండేవాడు. మే నెలలో బాలికతో పరిచయం పెంచుకున్న రెహాన్ తన ఇంట్లో చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్నాయని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో ఆమె విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచింది. రెహాన్ మరోసారి ఆమెను వేధించడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ట్యాలీపై ప్రత్యేక వర్క్‌షాప్ ప్రారంభం
TG: ఆధునిక వ్యాపార రంగంలో అకౌంటింగ్ విధానాలు వేగంగా మారుతున్నాయని, విద్యార్థులు సంప్రదాయ పరిజ్ఞానంతోపాటు ట్యాలీ వంటి నూతన అకౌంటింగ్ సాంకేతికతలను తప్పనిసరిగా నేర్చుకోవాలని VC ఉమేష్‌కుమార్ సూచించారు. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కోసం నిర్వహించిన అకాడమిక్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ యూజింగ్ ట్యాలీ ERP9 – ఏ స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్ అనే 3రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది.

గోదాంలో చెలరేగిన మంటలు.. క్షణాల్లోనే దగ్ధం
TG: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందనవనం శ్రీరమణ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెట్రోబార్ ఎదురుగా ఉన్న ప్లాస్టిక్, పాత సామాన్ల గోదాంలో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చి పక్కనే ఉన్న ఇంటికి వ్యాపించాయి. గోదాం పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంటికి మంటలు వ్యాపించడంతో ఫర్నిచర్, టీవీ, ఇతర వస్తువులు, వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. మూడంతస్తుల భవనం పాక్షికంగా దెబ్బతింది.
ముద్రగడ కుమార్తెను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
AP: కాపు ఉద్యమనేత, ప్రముఖ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభరెడ్డి భౌతికకాయం కాకినాడ జిల్లాలోని స్వగ్రామం కిర్లంపూడికి చేరుకోవడంతో ఆయన అభిమానులు, అనుచరులు భారీగా తరలివచ్చారు. చివరిచూపు చూసేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతి శీలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిర్లంపూడి రావడానికి వీల్లేదని కుటుంబసభ్యులు సూచించడంతో ప్రత్తిపాడు వద్దే క్రాంతి కార్లను నిలిపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. ఎట్టకేలకు క్రాంతి కిర్లంపూడికి చేరుకోగా, ఆమెను ముద్రగడ అభిమానులు, అనుచరులు మళ్లీ అడ్డుకున్నారు.

9మంది విద్యార్థులకు 8మంది టీచర్లు
TG: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్కుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో HMతో పాటు 8 మంది ఉపాధ్యాయులుండగా ఒకరు డిప్యుటేషన్‌పై వెళ్లారు. దీంతో HMతో కలిపి ఏడుగురు ఉపాధ్యాయులు, తొమ్మిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 6వ తరగతిలో ఇద్దరు, 7వ తరగతిలో ఒకరు, ఎనిమిదిలో ఇద్దరు, తొమ్మిదిలో ఒకరు, పదిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ బోర్డుతో పాటు అన్నీ మౌలికవసతులున్నా విద్యార్థుల్లేరు. రెండేళ్లుగా విద్యార్థులు సరిపడా లేకున్నా ఉపాధ్యాయులు మాత్రం కొలువు తీయడంపై విమర్శలు వస్తున్నాయి.

రీసర్వేలో అవకతవకలు జరిగాయని రైతులు నిరసన
AP: ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వేలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామ రైతులు ఆందోళన చేశారు. మంగళవారం రాత్రి ఈపూరు రహదారిపై బైక్‌లను అడ్డంగా నిలిపి బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో మొత్తం 885 మంది రైతులకు రావాల్సిన అన్నదాత సుఖీభవ నిధులు నిలిచిపోయాయని, కేవలం 65మందికే నగదు జమ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రీసర్వే సమయంలో పొలాల కొలతల్లో జరిగిన తప్పుల కారణంగానే తమ పేర్లు నమోదు కాక అన్నదాత సుఖీభవను కోల్పోయామని రైతులు ఆరోపించారు.

CWC షాకింగ్ రిపోర్ట్.. ప్రమాద స్థాయిలో నీటినిల్వలు
TG: తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలోని ప్రధాన జలాశయాలు అడుగంటడంతో ఆందోళన మొదలైంది. వర్షాలు కురవకపోవడం, వరద ప్రవాహం లేకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటినిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. కేంద్ర జలసంఘం విడుదల చేసిన తాజా వారపు బులెటిన్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన జలాశయాల్లో నీటినిల్వ తగ్గిందని, గతేడాదితో పోలిస్తే ఏకంగా 33శాతం మేర నీటి తగ్గుదల నమోదైందని పేర్కొంది.

తల్లికి వందనం తొలి విడతకు గ్రీన్ సిగ్నల్
AP: స్కూల్‌కు వెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులకు ‘తల్లికి వందనం’ పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 24న మెగా పేరెంట్, టీచర్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలి విడతలో రూ.10,049 కోట్లకు అనుమతులు ఇవ్వనున్నారు. దీంతో సుమారు 66.9లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఒక్కో విద్యార్థికి రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాలో జమచేయనున్నారు. అడ్మిషన్లకు ఇంకా సమయం ఉన్నందున కొత్తగా చేరేవారికి రెండో విడతలో నిధులు విడుదల చేయనున్నారు. ఈ నెల 24న రంపచోడవరంలో మెగా పేరేంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.

కరెంట్ ఛార్జీలు పెంచం
AP: కూటమి ప్రభుత్వం మూడో ఏడాదిలోకి అడుగు పెట్టినప్పటికీ విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని CM చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రులు, వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలు, వాస్తవాలు తెలియాలంటే ఉన్నతస్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు. వినూత్న ఆలోచనలతో ప్రజలకు సుపరిపాలనను అందించాలని సూచించారు. పట్టిసీమ నీటితో గోదావరి నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

HMDA చీఫ్ ఇంజినీర్ అరెస్ట్
TG: HMDA చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ACB అధికారులు గుర్తించారు. ఆయన ఇల్లు, ఆఫీసు, మిత్రులు, బంధువులు, బినామీల ఇళ్లల్లో మొత్తం 10 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రవీందర్ అక్రమార్జన మార్కెట్ విలువ మొత్తం సుమారు రూ.100 కోట్లకు పైగా ఉంటుందన్నారు. పోలీసులు రవీందర్‌ను అరెస్ట్ చేశారు. ఐదు ఇళ్ల స్థలాలు కొండకల్, కిష్టాపూర్, పసుమాములలో, నార్సింగ్, నానక్‌రాం గూడలోని ఖరీదైన ప్రాజెక్టుల్లో రూ.2 కోట్ల విలువైన నాలుగు ఫ్లాట్లు ఉన్నాయని ACB అధికారులు గుర్తించారు.

ఎన్నికల వరకే రాజకీయాలు
TG: రాజకీయాలను కేవలం ఎన్నికల సమయానికి మాత్రమే పరిమితం చేయాలని, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదని CM రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. CM ఢిల్లీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, నితిన్ గడ్కరీలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వరంగల్, ఆదిలాబాద్ విమనాశ్రయాల నిర్మాణ పనులు ప్రారంభం, మెట్రో, RRR తదితర అంశాలపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.

హర్మూజ్ జలసంధి దగ్గర క్షిపణి దాడి భయం
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించడం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఒకవేళ క్షిపణి వచ్చి తమ సూపర్‌ట్యాంకర్ కార్గోను ఢీకొడితే ఏమవుతుందనేదే ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న ఒక భారతీయ నావికుల అతిపెద్ద భయం. కోట్లాది లీటర్ల ముడి చమురు ఉన్న ట్యాంకర్లపై దాడి జరిగితే భారీ పేలుడు సంభవించి, ప్రాణనష్టం జరగడమే కాకుండా సముద్ర పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని నావికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చైనాలో బావి టైఫూన్ విలయతాండవం
చైనాలో బావి టైఫూన్ విలయ తాండవం చేస్తోంది. ఊళ్లకు ఊళ్లే ఈ విలయానికి నీట మునిగి అల్లాడుతున్నాయి. నీటి ఉథృతికి కార్లు బొమ్మ కార్లలా కొట్టుకుపోతూ కనిపిస్తున్నాయి. భారీ వర్షాలకు ఇళ్లు కూలి అనేక మంది నానా ఇబ్బందులు పడుతున్నారు. లియావోనింగ్ ప్రావిన్స్ లో రెండు లక్షల 60 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఈ టైఫూన్ ప్రభావం ఇంకా కొనసాగుతుందని చైనా వాతావరణ శాఖ చెబుతోంది.

ఏపీలో మరో భారీ గుప్త నిధి గుర్తింపు ?
ఏపీలోని రాయలసీమలో మరో భారీ ఖనిజ నిధి బయట పడింది. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం ఒంటెల్లులో రక్షణ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఉపయోగపడే 24 రకాల అత్యంత విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ నిర్ధారించింది. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ వనరులను వెలికితీసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా మైనింగ్ అన్వేషణ లైసెన్స్ దక్కించుకుంది.

'ది ఒడిస్సీ' మూవీలో ట్రూ 70mm అనుభూతికి ఇండియా దూరం !
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రాబోయే చిత్రం 'ది ఒడిస్సీ' (The Odyssey) ని తన మార్క్ 'ట్రూ 70 mm' ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు. అయితే, మన దేశంలోని ఐమాక్స్ థియేటర్లలో ఈ సాంకేతికతను పూర్తిగా ప్రదర్శించే స్క్రీన్లు లేకపోవడంతో, ఇండియన్ మూవీ లవర్స్ ఆ అసలైన విజువల్స్ అనుభూతిని కోల్పోను న్నారు. ఇక్కడి థియేటర్లలో కేవలం సినిమాలోని కొంత భాగాన్ని (స్లైస్) మాత్రమే చూసే ఛాన్స్ ఉంది.