Latest

TRS చీఫ్ కవిత అరెస్ట్
TG: ఉప్పల్ నియోజకవర్గంలోని భూపోరాట ప్రాంతానికి చేరుకున్న తెలంగాణ రక్షణ సేన(TRS) చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె బోడుప్పల్‌లో బొడ్రాయి ప్రతిష్టించి పూజలు చేసి ఆ ప్రాంతానికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా నామకరణం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు, TRS నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. కల్వకుంట్ల కవితను, టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

హరీష్ రావును అడ్డుకున్న పోలీసులు.. టెన్షన్ టెన్షన్
TG: గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు హరీష్ రావు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్దకు రావాలని మంత్రి అడ్లూరి చేసిన చాలెంజ్‌ను ఆయన స్వీకరించారు. తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్కుకు బయల్దేరగా.. అక్కడే హరీష్ రావు, RS ప్రవీణ్ కుమార్‌ల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. BRS కార్యకర్తలకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పోలీసుల పహారాల ఉన్నమా? అని వారు ప్రశ్నించారు. హరీష్ రావు, RS ప్రవీణ్‌కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళలు అరెస్ట్
TG:శంషాబాద్ విమానాశ్రయంలో భారీ వీసా మోసం ఘటన కలకలం రేపింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన APలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఉపాధి కోసం తాము విదేశాలకు వెళ్లేందుకు ఒక ట్రావెల్ ఏజెంట్‌ను ఆశ్రయించామని, అతను అసలు వీసాలు అని చెప్పి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలు ఇచ్చాడని మహిళలు వాపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మహిళలను మోసం చేసిన ముఠా, ఏజెంట్ ఎవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

పెళ్లి తర్వాత బయటపడిన అసలు నిజం
AP: పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన యువతిని, ఇనిమెళ్ల విలేజ్‌కు చెందిన మల్లవరపు శాంతివర్ధన్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పటికే మరో మహిళతో సంబంధం ఉన్న విషయాన్ని దాచిపెట్టి మ్యారేజ్ చేసుకున్నాడని ఆరోపణలు రావడంతో పెళ్లికూతురు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెళ్లికూతురు కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున ఈపూరు PS ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు పెళ్లికొడుకును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.

సీటు కోసం RTC బస్సులో రచ్చ .. చివరికి PSకు!
TG: రాష్ట్రంలో ఫ్రీబస్ స్కీమ్‌తో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ వైపు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న RTC బస్సులో సీట్ విషయమై ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. నర్సాపూర్ వద్ద బస్సు ఎక్కిన మానసిక వికలాంగుడు వినోద్ సీటు కోసం మరో మహిళతో గొడవకు దిగాడు. మహిళపై దాడిచేసి, ఆమె బ్యాగ్‌ను చింపివేయడంతో బస్సులో టెన్షన్ వాతావరణం నెలకొంది. డ్రైవర్ బస్సును నేరుగా నర్సాపూర్ PSకు తీసుకెళ్లారు. పోలీసులు ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.

బెయిల్ వెంటనే మరో కేసు.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్
AP: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఓ కేసులో బెయిల్‌పై విడుదలైన వెంటనే, ఆయనను మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, జూన్ 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కల్యాణ్, రాధా మనోహర్‌దాస్‌లపై రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు బొజ్జా కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.

కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామికి షోకాజ్ నోటీస్
TPCC ప్రధాన కార్యదర్శి, AICC OBC కన్వీనర్ కత్తి వెంకటస్వామికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఓ TV డిబేట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై, CM రెవంత్ రెడ్డి నాయకత్వంపై వెంకట స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం తమకే లేదని వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కత్తి వెంకటస్వామికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

కవిత భూపోరాటం.. రాష్ట్రవ్యాప్తంగా నాయకుల అరెస్ట్
TG: TRS చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారులతో కలిసి ఇవాళ భూపోరాటానికి పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. భూపోరాటానికి వెళ్తారనే సమాచారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో TRS నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కవిత భూపోరాటం చేయనున్నారు. మరికాసేపట్లో భూపోరాటం చేసే ప్రాంతానికి ఆమె చేరుకోనున్నారు.
కలెక్టర్ షాకింగ్ కామెంట్స్.. ఉద్యోగులు ఆగ్రహం
AP: సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ కింది స్థాయిలో ఉద్యోగులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయా నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విధులకు సంబంధించి జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. SIR ప్రక్రియ విధుల్లో ఎవరైనా సరిగా పనిచేయకపోతే.. లాగిపెట్టి కొట్టండి అంటూ అధికారుల ముందే కలెక్టర్ అనడం సంచలనంగా మారింది. కలెక్టర్ వ్యాఖ్యలపై జిల్లాలోని ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

DMHO వేధిస్తున్నారని కలెక్టరేట్ వద్ద నిరసన
TG: హన్మకొండ DMHO తమను మానసికంగా వేధిస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులతో డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. DMHOపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో పాటు వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. DMHOపై శాఖాపరంగా సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.

కేంద్రం కొత్త స్కీమ్... AP నుంచే శ్రీకారం
AP: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన VBG రాంజీ పథకం తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో గురువారం ప్రారంభం కానుంది. ముక్కవారిపల్లెలో రూ.4.55 లక్షలతో ప్రతిపాదించిన మూడు పనులను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, CM చంద్రబాబు, DCM పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రప్రభుత్వం అప్పట్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రారంభించింది. వీబీ జీరాం జీని ఇప్పుడు తిరుపతి జిల్లాలో ప్రారంభిస్తుంది.

రిజిస్ట్రేషన్ సేవలకు తాత్కాలిక బ్రేక్
TG: టెక్నికల్ ఇష్యూస్‌తో తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. సర్వర్లు పనిచేయలేదు. స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు మొత్తం ఆగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు ఇవాళ కూడా అందుబాటులో ఉండవు. సర్వర్ల అప్‌గ్రెడేషన్, కొత్త సాంకేతికత పనులు కొనసాగుతున్నాయి. ఈ విషయమై తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కార్డ్ (CARD) విభాగం DIG సుభాషిణి స్పందిస్తూ డేటా మైగ్రేషన్ ప్రక్రియ కారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. గురువారం సాయంత్రం పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు.

AP మహిళలు కష్టపడి పనిచేస్తారు
AP: తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనపాలెంలో హీరో మోటోకార్ప్ సంస్థ రూ.750 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 'గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0' కు CM చంద్రబాబు శంకుస్థాపన చేశారు. హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పవన్ ముంజాల్‌తో కలిసి ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. '2018లో హీరో మోటార్స్ సంస్థ వేరే రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలనుకున్నప్పుడు, వారితో చర్చించి ఇక్కడే రూ.1,600 కోట్లతో ప్లాంట్ ఏర్పాటుచేసేలా ఒప్పించామన్నారు. AP మహిళలు కష్టపడి పనిచేస్తారు, త్వరగా నైపుణ్యాలు నేర్చుకుంటారు. హీరో ప్లాంట్లో 40% మంది మహిళలే పనిచేస్తుండటం గర్వకారణం అని అన్నారు.

ఉస్మానియా డాక్టర్ల అద్భుతం.. దేశంలోనే తొలిసారి
TG: సాధారణంగా ఒక రోగి శరీరంలోని ఒక అవయవాన్ని మార్చి చికిత్సలు చేస్తుంటారు. కానీ, ఒకేసారి ఐదు అవయవాలు విజయవంతంగా మార్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి డాక్టర్స్ రికార్డ్ సృష్టించారు. అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒకే రోగికి ఓకేసారి ఐదు అవయవ మార్పిడిలు చేయడం దేశంలో ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు. జాతీయ అవయవాలు, కణజాల మార్పిడి సంస్థ (NOTTO) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉస్మానియా వైద్య బృందాన్ని అభినందించింది.
పారిస్ థియేటర్లను ఊపు ఊపేసిన ఈగ
దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి 14 ఏళ్ల క్రితం తీసిన ఈగ మూవీకి పారిస్ లో బ్రహ్మరథం పడుతున్నారు ఫ్రెంచ్ ఆడియన్స్.. విలన్ సుదీప్‌కు ఈగ వార్నింగ్ ఇచ్చే ఐకానిక్ సీన్ (నేను మళ్లీ వస్తా - "I will be back") స్క్రీన్‌పై రాగానే పారిస్ థియేటర్‌లోని ఫ్రెంచ్ ప్రేక్షకులు చప్పట్లు, ఈలలతో థియేటర్‌ను హోరెత్తిం చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. పారిస్ లోని ప్రముఖ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో రాజమౌళికి శాశ్వత స్థానం ఇస్తూ ప్రత్యేక గౌరవం కల్పించారు. 14 ఏళ్ల క్రితం వచ్చిన 'ఈగ' సినిమాకు కూడా పారిస్ లో ఇంతటి అద్భుతమైన స్పందన రావడం తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

సీమలో సిరుల పంట - మరో చోట పసిడి ...
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం నిక్షేపాలు ఒక్కొక్కటిగా బయటుకొస్తున్నాయి. ఇటీవల కర్నూలుజిల్లా జొన్నగిరిలో బంగారం గనులు ప్రారంభంకాగా.. చిత్తూరు జిల్లా కుప్పంలోనూ బంగారు గనులున్నాయని గుర్తించారు. తాజాగా సత్యసాయి జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నాయని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి జిల్లాలోని ఎన్పీకుంట మండలం జౌకల ప్రాంతంలో ఖనిజాన్వేషణ ప్రక్రియను వేగవంతం చేసింది. గతంలోనే ఇక్కడ భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ ప్రాంతంలో బంగారం ఎంతమేరకు ఉందో స్పష్టత కోసం రీసెర్చ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే పెళ్లి జరిగినట్లు కాదు: గుజరాత్ హైకోర్
హిందూ వివాహ చట్టం ప్రకారం కేవలం వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మాత్రమే పెళ్లికి నిదర్శనం కాదని గుజరాత్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. శాస్త్రోక్తంగా సప్తపది (ఏడు అడుగులు), మంగళసూత్ర ధారణ వంటి సాంప్రదాయ ఆచారాలు జరిగితేనే ఆ వివాహం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. కేవలం సర్టిఫికేట్ ఆధారంగా భార్యాభర్తలుగా చట్టబద్ధమైన హక్కులను క్లెయిమ్ చేయలేరని కోర్టు తేల్చిచెప్పింది.

'ఆల్ఫా' మూవీ రెమ్యూనరేషన్లో అందరినీ మించిపోయిన అలియా
బాలీవుడ్ ప్రతిష్టాత్మక యాక్షన్ చిత్రం 'ఆల్ఫా' నటీనటుల పారితోషికాలు ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఏకంగా ₹25 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఆమెతో కలిసి నటించిన కో-స్టార్ శర్వరీ వాగ్‌కు కేవలం ₹3 కోట్లు మాత్రమే దక్కాయి. దీంతో శర్వరీ కంటే ఆలియా దాదాపు 8 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నట్లయింది.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు!
పశ్చిమాసియా సంక్షోభం సర్దుమణగడంతో చమురు సంస్థలు వాణిజ్య వినియోగదారులకు భారీ ఉపశమనం అందించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 183.50 వరకు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో దీని ధర రూ. 2,930కి చేరింది. హైదరాబాద్‌లో రూ. 176 తగ్గి రూ. 3,191గా నమోదైంది. ఈ తగ్గింపు హోటళ్లు, రెస్టారెంట్లకు పెద్ద ఊరట కానుంది. అయితే, 14.2 కేజీల గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డులో మెగాస్టార్ భార్యకు చోటు!
యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డులో మెగాస్టార్ భార్యకు చోటు! తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సరికొత్తగా 18 మందితో కూడిన పాలక మండలిని ప్రకటించింది. ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ ఎం.సత్యనారాయణను ఈ బోర్డుకు చైర్మన్‌గా నియమించింది. ఈ బోర్డులో మంత్రి జి. వినోద్ వెంకటస్వామితో పాటు మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖకు కూడా సభ్యురాలిగా చోటు దక్కింది. ఈ బోర్డు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనుంది.

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ కు అస్వస్థత
ఇటీవల 'తౌబా తౌబా', 'ఝూమే జో పఠాన్' వంటి సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసిన ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ గుండెల్లో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. బిజీ పని ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురైన ఆయనను వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం పరీక్షల నివేదికలు సాధారణంగా రావడంతో, ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.