Latest
చిన్నారి కోసం 6KM నడిచిన వార్డెన్
AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థిని భువనేశ్వరి ఫీవర్‌తో బాధపడుతోంది. బాలిక పరిస్థితి విషమంగా మారింది. ఆమెను తక్షణమే హాస్పిటల్‌కు తరలించాల్సి ఉండగా, ఆ గ్రామానికి కనీస రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్, బైక్ కూడా వెళ్లలేని పరిస్థితి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హాస్టల్ వార్డెన్ హేమ బాలికను తన భుజాలపై కూర్చొబెట్టుకుని కొండలు, గుట్టలు దాటి 6KM మేర భుజాలపై మోసుకుంటూ కాలినడకన ప్రధాన రహదారికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్యసేవలు అందేలా చూశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన AP గవర్నమెంట్!
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఎంప్లాయిస్ రిటైర్మెంట్ ఏజ్ 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ జీవో కూడా రిలీజ్ చేసింది. ఈ కొత్త రూల్ జనవరి 1, 2022 నుండి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికే 60 ఏళ్లకు రిటైర్ అయిన ఎలిజిబుల్ ఎంప్లాయ్స్‌ను మళ్ళీ డ్యూటీలోకి తీసుకునే ఛాన్స్ ఇచ్చింది.

RSP భార్య పోస్టింగ్ చేంజ్!
ప్రభుత్వాన్ని RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తుండటంతో ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం పెద్ద ప్లాన్ వేసింది. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఉన్న RSP భార్య లక్ష్మీబాయిని. కో-ఆపరేషన్ డిపార్ట్‌మెంట్‌లోని లూప్ లైన్ పోస్టింగ్‌కు షిఫ్ట్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పటికే రిటైర్డ్ అడిషనల్ DGP అయిన RSP కి సెక్యూరిటీ, వెహికల్ ఫెసిలిటీస్ తీసేసిన ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఇలా ఆయన భార్యపై బదిలీ వేటు వేసింది.
జర్నలిస్ట్ KVR అరెస్ట్ అప్డేట్!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన జర్నలిస్ట్ KVR అరెస్ట్ కేసులో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ని వెంటనే బొబ్బిలి సబ్ జైలుకు షిఫ్ట్ చేశారు. కాగా, కేవీ రెడ్డిని ఇంకో కేసులో అరెస్ట్ చేసేందుకు వందల కిలోమీటర్ల దూరం నుండి బొబ్బిలి వచ్చిన తుళ్లూరు పోలీసులకు గట్టి షాక్ తగిలింది. అసలు ఆయనకు బెయిల్ వస్తుందో రాదో, నెక్స్ట్ ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్‌తో తుళ్లూరు పోలీసులు నిరాశగా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది.
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్.. కన్నీరు మున్నీరవుతున్న తల్లి!
కళ్లముందే ఆడుకుంటూ కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లభించి 26 రోజులు గడిచినా ఇంకా ఎలాంటి జాడ లేదు. బిడ్డ దూరమైన బాధ ఒక తల్లికే తెలుస్తుంది. నా బిడ్డను ఎవరైనా తీసుకెళ్లి ఉంటే దయచేసి తిరిగి ఇచ్చేయండి, మీపై ఎలాంటి కేసులు పెట్టం అంటూ ఆ తల్లి కన్నీటితో వేడుకుంటోంది. కాగా, పాప జాడ తెలిపిన వారికి పోలీసులు రూ.1 లక్ష బహుమతి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మిస్సింగ్ పోస్టర్లు కలచివేస్తున్నాయి.
ప్రశ్న రావణ్ అరెస్ట్.. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి!
ప్రశ్న రావణ్ అరెస్ట్ పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రావణ్‌కు వెంటనే కఠిన శిక్ష పడాలంటూ జనసైనికులు పోలీస్ వాహనాన్ని అడ్డుకుని కోడిగుడ్లతో దాడికి దిగారు. అయితే, సరిగ్గా నిన్ననే డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం గురించి క్లియర్‌గా మాట్లాడారు. ఈ నేపథ్యంలో, విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన జనసైనికులపై కూడా చట్టప్రకారం కేసులు పెడతారా? అసలు ఈ దాడులు ఏ చట్టం, ఏ స్వేచ్ఛ కిందకు వస్తాయంటూ ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

లోహగఢ్ కోట మర్డర్ మిస్టరీ.. పోలీసులకే షాక్!
లోనావాలా లోహగఢ్ కోటపై నుండి కేతన్ అగర్వాల్‌ను ఎవరు నెట్టేశారనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్‌కు పాలీగ్రాఫ్ (అబద్ధాలు కనిపెట్టే) టెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఎలాంటి పక్కా సాక్ష్యాలు దొరకకపోతే, సియా అండ్ ఆమె బాయ్‌ఫ్రెండ్ జైలు నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో ఆసక్తి నెలకొంది.

హైవేపై యాక్షన్ సీన్.. దుండగులపై పోలీసుల ఫైరింగ్
AP: నంద్యాల జిల్లా డోన్ హైవేపై గురువారం తెల్లవారుజామున పోలీసులు కాల్పుల ఘటన కలకలం రేపింది. పందుల లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా, దుండగులు ఎదురు దాడిచేశారు. వాహనాన్ని ఆపకుండా ఓవర్ స్పీడ్‌తో వెళ్లిపోయారు. పోలీసులు ఆ వాహనాన్ని వెంబడిస్తూనే హైవే పెట్రోలింగ్ పోలీసులకు సమాచారమిచ్చారు. వాహనాన్ని అడ్డుకునేందుకు పెట్రోలింగ్ పోలీసులు యత్నించగా, రాళ్లు, సీసాలు విసిరి దాడిచేశారు. దీంతో దొంగలపై కాల్పులు జరిపారు. దుండగులు పోలీసులకు చిక్కకుండా పరార్ అయ్యారు.

మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా మూడో విడత నిధులను విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల భూమి ఉన్న 6.39 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.1,330 కోట్లను డిపాజిట్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల ఆర్థిక సహాయం నేరుగా బ్యాంక్ అకౌంట్లలోనే జమ అయింది.

షాకింగ్ యాక్సిడెంట్.. మిరాకిల్ ఎస్కేప్
TG: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట శివారులో ఒక కారు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. అనంతరం పొలంలో బోల్తా పడింది. ప్రమాద ధాటికి కరెంట్ పోల్ పూర్తిగా విరిగిపోవడమే కాకుండా, విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగి నేరుగా కారుపై పడ్డాయి. ఆ టైమ్‌లో కారులో ఉన్న వ్యక్తి కారు అద్దాలను పగులగొట్టుకుని సకాలంలో బయటకు దూకేశాడు. విద్యుత్ తీగలు కారుపై పడినప్పటికీ, సదరు వ్యక్తి కేవలం స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.

నిజాలను దాచేందుకే ఫుటేజ్ డిలీట్: జగన్
AP: ఇటీవల సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత యువకుడు క్రాంతికుమార్ కుటుంబసభ్యులను YSRCP అధినేత జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. YSRCP తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జగన్ మీడియాతో మాట్లాడుతూ..ట్యాక్సీ నడుపుకుంటూ జీవిస్తున్న క్రాంతికుమార్‌పై ఎలాంటి కేసులు లేవని స్పష్టంచేశారు. పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్లే తాను చనిపోతున్నట్లు క్రాంతికుమార్ తన మరణ వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నాడని గుర్తుచేశారు. నిజాలను దాచేందుకే కృష్ణలంక PSలో CCTV ఫుటేజీని రాత్రికిరాత్రే డిలీట్ చేశారని ఆరోపించారు.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో బాలికపై అఘాయిత్యం!
ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ఓ 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా పొక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష, రూ.19 వేల జరిమానా విధించింది. 2020 కోవిడ్ టైంలో ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫోన్ వాడుతున్న బాలికకు సిద్దిపేట జిల్లాకు చెందిన వెంకటస్వామి(29) పరిచయమయ్యాడు. ఆపై బెదిరింపులకు గురిచేసి కిడ్నాప్ చేశాడు. బాధితురాలికి ప్రభుత్వం రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు పేరెంట్స్ అలర్ట్‌గా ఉండాలి.

జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్చుక్ భార్య!
ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్ష జంతర్ మంతర్ వద్ద 5వ రోజుకు చేరింది. ఈ రోజు ఉదయం ఆయన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం బ్లడ్ ప్రెజర్ 115/69, పల్స్ రేట్ 72 కాగా, బ్లడ్ షుగర్ లెవెల్స్ 60 mg/dL కి పడిపోయాయి. ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయన పోరాటం ఆపడం లేదు. ఈ క్రమంలోనే ఆయన భార్య దీక్షా స్థలానికి వచ్చి తన సపోర్ట్ అందించారు. 'లైఫ్ పార్ట్‌నర్ తోడుంటే ఎంతటి కష్టమైన పోరాటమైనా ఈజీనే' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముట్టడి.. ఉద్రిక్తత
TG: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని లక్డీకపూల్‌లో విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్‌ను SFI నాయకులు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చి ఆఫీస్ వద్ద బైఠాయించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రాష్ట్రంలో 27,000 పాఠశాలలను 4000 పాఠశాలలకు కుదించాలనే ఆలోచనను మానుకోవాలని డిమాండ్ చేశారు.

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే!
బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. గత రెండ్రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ గురువారం ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. ఇన్వెస్టర్స్ నుంచి డిమాండ్ పెరగడంతో హైదరాబాద్, విజయవాడలో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,770 పెరిగి రూ.1,44,550 కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం రూ.3,450 పెరిగి రూ.1,32,500 గా ఉంది. ఇక సిల్వర్ రేట్ కూడా కేజీకి రూ.5 వేలు పెరిగి రూ.2.5 లక్షలకి చేరింది. షాపింగ్‌కు వెళ్లేముందు రేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి.
రక్తం చిందేలా కొట్టటం అన్యాయం: కవిత
TG: TRS చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేసి మేడ్చల్ జిల్లా బొల్లారం PSకు తరలించారు. అక్కడ కవిత మాట్లాడుతూ.. ఉప్పల్‌లో మహిళలు, తెలంగాణ ఉద్యమకారులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీఛార్జ్ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మాత్రమే అడిగాం తప్ప వేరే డిమాండ్లు ఏమీ అడగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ్టి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అడిగితే ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసి రక్తం చిందేలా కొట్టటం అన్యాయమన్నారు.

TRS చీఫ్ కవిత అరెస్ట్
TG: ఉప్పల్ నియోజకవర్గంలోని భూపోరాట ప్రాంతానికి చేరుకున్న తెలంగాణ రక్షణ సేన(TRS) చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె బోడుప్పల్‌లో బొడ్రాయి ప్రతిష్టించి పూజలు చేసి ఆ ప్రాంతానికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా నామకరణం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు, TRS నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. కల్వకుంట్ల కవితను, టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

హరీష్ రావును అడ్డుకున్న పోలీసులు.. టెన్షన్ టెన్షన్
TG: గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు హరీష్ రావు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్దకు రావాలని మంత్రి అడ్లూరి చేసిన చాలెంజ్‌ను ఆయన స్వీకరించారు. తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్కుకు బయల్దేరగా.. అక్కడే హరీష్ రావు, RS ప్రవీణ్ కుమార్‌ల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. BRS కార్యకర్తలకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పోలీసుల పహారాల ఉన్నమా? అని వారు ప్రశ్నించారు. హరీష్ రావు, RS ప్రవీణ్‌కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళలు అరెస్ట్
TG:శంషాబాద్ విమానాశ్రయంలో భారీ వీసా మోసం ఘటన కలకలం రేపింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన APలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఉపాధి కోసం తాము విదేశాలకు వెళ్లేందుకు ఒక ట్రావెల్ ఏజెంట్‌ను ఆశ్రయించామని, అతను అసలు వీసాలు అని చెప్పి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలు ఇచ్చాడని మహిళలు వాపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మహిళలను మోసం చేసిన ముఠా, ఏజెంట్ ఎవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

పెళ్లి తర్వాత బయటపడిన అసలు నిజం
AP: పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన యువతిని, ఇనిమెళ్ల విలేజ్‌కు చెందిన మల్లవరపు శాంతివర్ధన్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పటికే మరో మహిళతో సంబంధం ఉన్న విషయాన్ని దాచిపెట్టి మ్యారేజ్ చేసుకున్నాడని ఆరోపణలు రావడంతో పెళ్లికూతురు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెళ్లికూతురు కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున ఈపూరు PS ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు పెళ్లికొడుకును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.

సీటు కోసం RTC బస్సులో రచ్చ .. చివరికి PSకు!
TG: రాష్ట్రంలో ఫ్రీబస్ స్కీమ్‌తో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ వైపు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న RTC బస్సులో సీట్ విషయమై ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. నర్సాపూర్ వద్ద బస్సు ఎక్కిన మానసిక వికలాంగుడు వినోద్ సీటు కోసం మరో మహిళతో గొడవకు దిగాడు. మహిళపై దాడిచేసి, ఆమె బ్యాగ్‌ను చింపివేయడంతో బస్సులో టెన్షన్ వాతావరణం నెలకొంది. డ్రైవర్ బస్సును నేరుగా నర్సాపూర్ PSకు తీసుకెళ్లారు. పోలీసులు ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.