Latest

సాగునీటి ప్రాజెక్టులకు లైన్ క్లియర్
TG : కామారెడ్డి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, రైతుల పరిహారం చెల్లింపులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.2,800 కోట్లు విడుదల చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. అధికారులు నేరుగా పొలాల వద్దకు వెళ్ళి రైతులతో మాట్లాడి, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ చెప్పారు. పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేసి రైతులకు నీళ్ళు అందించలని అన్నారు.

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
TG : పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. మేకల వినయ్ (18) అనే కుర్రాడు ఈత కొడదామని చెరువులోకి వెళ్లి నీళ్లలో కొట్టుకుపోయాడు. సమాచారం తెలియగానే ఊరి జనం చెరువు దగ్గరికి వెళ్లి ఎంత వెతికినా వినయ్ ఆచూకీ దొరకలేదు. దాంతో వెంటనే రెస్క్యూ టీమ్‌కి తెలియజేయడంతో చెరువులో వెతుకుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నలుగురు సీఎంలతో స్క్రీన్ షేర్ చేసుకున్న జానకి
ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి నలుగురు సీఎంలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సీనియర్ నటిగా షావుకారు జానకి నిలిచారు. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలలో 400 పైగా సినిమాలలో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోని ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. ప్రముఖ నటి కృష్ణకుమారి ఆమె చెల్లెలే. అక్కాచెల్లెళ్లు హీరోయిన్లు అయ్యే ట్రెండ్‌ను వాళ్లే స్టార్ట్ చేశారు.
ఆరు ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు
TG: జగిత్యాల జిల్లాలో రూ.11.80 కోట్ల అంచనా వ్యయంతో ఆరు ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జగిత్యాల, మెట్‌పల్లి ఆర్డీవో కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించనున్నారు. ధరూర్ క్యాంప్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందుతాయని మంత్రి పొంగులేటి తెలిపారు.

సీనియర్ నటి షావుకారు జానకి.. ఇకలేరు
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. ఈరోజు మధ్యాహ్నం 1.59 గం.కు చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో మరణించినట్లు నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో ఆమె ఎన్నో పాత్రలు పోషించారు. 1955లో వచ్చిన ‘షావుకారు’ చిత్రంతో ఆమెకు 'షావుకారు' జానకి అనే పేరు వచ్చింది. చెన్నైలోని తేనాంపేటలో సాయంత్రం 5 గంటల నుంచి ఆమె భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.

వీధి దీపాలు వేయండి.. ప్రజల ప్రాణాలు కాపాడండి!
AP : ఆదోని మండలం కపటి గ్రామంలో వీధి దీపాలు లేక ప్రజలు చీకట్లో ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్లే ఈ సమస్యలని బీజేపీ మండల అధ్యక్షుడు ఉషారాజు మండిపడ్డారు. వర్షాకాలం కావడంతో చీకట్లో విషపురుగులు, పాముల భయం ఎక్కువైంది. రాత్రి పూట చిన్న పిల్లలు, పెద్దవాళ్లు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పాడైన వీధి దీపాలను బాగు చేయించాలి. కొత్త దీపాలు ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థులకు సేఫ్ ఎడ్యుకేషన్ కావాలి: ట్రస్మా
TG: విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పాఠశాలల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ట్రస్మా కామారెడ్డి జిల్లా ప్రతినిధులు పోలీసులను కోరారు. కామారెడ్డి జిల్లాలో ట్రస్మా ప్రతినిధులు సీఐ నరహరిని కలిసి విద్యార్థుల సంక్షేమం, భద్రతకు సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందించారు. పాఠశాలలకు సమీపంలో విద్యార్థులు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెంచాలని కోరారు. విద్యార్థుల్లో సమస్యాత్మక ప్రవర్తన కనిపిస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించి సరైన మార్గంలో నడిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం: TSUTF
నల్గొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TSUTF) సంగారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన అత్యంత బాధాకరమైనది, ఆందోళనకరమైనదని పేర్కొంది. ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని లోపాలను సరిదిద్దుతూ, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తారని, వారి పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం గౌరవభావంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపింది. విద్యాసంస్థల్లో భద్రతను పెంపొందించడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

రూ.2.70 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
TG: సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రుద్రారం, పాశం మైలారం, చిట్కుల్ ప్రాంతాల్లో సుమారు రూ.2.70 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఆయా వార్డుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, ప్రజలకు రాకపోకలు, పారిశుధ్య సమస్యలు లేకుండా చూడటమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయితే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
దిలావర్పూర్ టోల్ ప్లాజా వద్ద కూరగాయల వాహనం బోల్తా
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి NH61 పై కూరగాయల వాహనం బోల్తా పడింది. మహారాష్ట్ర బిలోలి నుండి నిర్మల్ వైపు వస్తున్న ఈ వాహనం మార్గమధ్యలో బోల్తా పడటంతో కూరగాయలు రోడ్డుపై పడ్డాయి. డ్రైవర్‌తోపాటు మరొకరికి గాయాలు కాగా స్థానికులు 108లో ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఆగిర్యాల శేఖర్(26) మృతిచెందాడు. బైక్‌పై షాద్‌నగర్ నుంచి గ్రామానికి వెళుతుండగా ఎల్ఎన్‌టి పరిశ్రమ వద్ద ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ శేఖర్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు అతని మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

మాసాయిపేట్‌లో బోనాల వైభవం
TG: మెదక్ జిల్లా మాసాయిపేట్ మండల కేంద్రంలో ఆదిశంభవంతులు(మాదిగ) వైభవంగా నల్ల పోచమ్మకు బోనాలు సమర్పించారు. మాసాయిపేట గ్రామ పెద్దలు మాట్లాడుతూ తరతరాల నుండి వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్నామని, కులమత భేదాలు లేకుండా అందరూ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు సర్పంచ్ కృష్ణారెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

రూ.30 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై
కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

MCF జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలి
TG: మాల కోఆర్డినేషన్ ఫోరం (MCF) జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 23న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో నిర్వహించనున్న సమావేశానికి సంబంధించి శుక్రవారం నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలో మాల సంఘం నాయకులతో కలిసి ఎంసీఎఫ్ జేఏసీ నాయకులు బత్తుల రంజిత్, కొంతం మురళీధర్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని మాల సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

'మేం Chinese కాదు.. Indians'.. చిన్నారి టింకిల్ మాటలు వైరల్
అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిన్నారి టింకిల్ గోంగో మాటలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. “మేం చైనీయులం కాదు.. భారతీయులం. మమ్మల్ని ఇండియన్స్ అని పిలవండి” అంటూ ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటానగర్‌కు చెందిన టింకిల్ పోలీసు ఉద్యోగి కూతురు. ఆర్మీ యూనిఫాంలో ‘జనగణమన’ పాడిన ఆమె పాత వీడియో కూడా వైరల్‌గా మారింది. చైనీస్ అని పిలిస్తే తనకు కోపం వస్తుందని, తమను భారతీయులుగా పిలవాలని ఆమె కోరింది. దీంతో చిన్నారి వీడియోపై నేషనల్ మీడియా ఫోకస్ చేసింది.

ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపు
TG: ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు ఆటో కార్మిక సంఘం నాయకులు తెలిపారు. బంద్‌ను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వ్యాల్ల హరీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బంద్‌కు మద్దతుగా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.

ఆదివాసులుగా గుర్తించాలి.. మా భూములు మాకు ఇవ్వాలి
AP: తమను ఏజెన్సీ ఆదివాసులుగా గుర్తించి, తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు రక్షణ కల్పించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల గిరిజనులు డిమాండ్ చేశారు. రొంపిల్లి పంచాయతీ పరిధిలోని చిన్నకోనెల, బూరిగ, సిమ్మిడివలస, రాయపాడు, బొంగుజ తదితర గ్రామాలతో పాటు పలు కొండశిఖర ప్రాంతాల్లో వేలాది మంది ఆదివాసులు జీవిస్తున్నారని తెలిపారు. తమ భూముల్లో సాగు చేస్తున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఇతరుల పేర్లు నమోదయ్యాయని ఆరోపించారు.

యాదగిరిగుట్టలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
TG: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి రుసుము లేకుండా దేవస్థానం తరఫున పూజా సామగ్రి, అవసరమైన పాత్రలను సమకూర్చారు. ఈ వ్రతాల్లో సుమారు 200 మంది మహిళా భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది.

భూమి మన్ను కాదు.. రైతన్నకు గుండెకాయ: మంత్రి పొంగులేటి! 🌾
TG : ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం బేతుపల్లిలో జరుగుతున్న భూ సర్వేను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అక్రమాలకు చోటు లేకుండా ప్రతి అంగుళం కొలవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 'భూమి అంటే కేవలం మన్ను కాదు.. అది రైతన్నకు గుండెకాయ' అని మంత్రి అన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే బేతుపల్లితో పాటు రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయ రోవర్ టెక్నాలజీతో ఈ భూ సర్వే చేపడుతున్నామని తెలిపారు.
CJP నేతలపై దాడి.. కాళ్ళు, చేతులు విరగ్గొట్టారు!
రాజస్థాన్‌లో CJP నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆశుతోష్ రాంక మరియు వాలంటీర్లపై దాడి జరిగింది. గేదెల కొట్టంలో నడుస్తున్న స్కూల్‌ను బాగుచేయడానికి వెళ్లగా, విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఆదేశాలతోనే BJP గుండాలు ఈ అటాక్‌కు పాల్పడ్డారని <a href="https://www.theclearcutnews.com/n/8ASbtUa">ఆశుతోష్</a> ఆరోపించారు. ఈ ఇన్సిడెంట్‌లో వాలంటీర్ల చేతులు విరిగిపోయాయని, మహిళల ఫోన్లు పగలగొట్టారని, వెహికల్స్‌ను ధ్వంసం చేశారని తెలిపారు. స్పాట్‌లో ఉన్న పోలీసులు స్పందించలేదని మండిపడ్డారు. నిందితులను 48 గంటల్లో అరెస్ట్ చేయకపోతే ప్రొటెస్ట్ తీవ్రతరం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

కలెక్టరేట్‌ను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దాలి
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లోని విస్తృతంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను సంబంధిత శాఖలు చేపట్టాలని ఆదేశించారు. ఊటకుంటను పరిశీలించిన కలెక్టర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. డబ్ల్యూడీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో మొక్క నాటి, క్రమం తప్పకుండా నీరు అందించి సంరక్షించాలని అధికారులను ఆదేశించారు.