Latest

22ఏ భూముల రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం: రేవంత్
TG: 22ఏ భూముల విషయంలో CM రేవంత్ రెడ్డి కీలక భరోసా ఇచ్చారు. ప్రైవేట్ భూముల యజమానులు రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. 22ఏ నిషేధిత భూముల రెజిస్ట్రేషన్లపై హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తి నిషేధిత జాబితాలో ఉంటే అధికారులు రెండురోజుల్లో పరిశీలించాలన్నారు. 22ఏ జాబితాలను కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి, తప్పులు లేకుండా తుది జాబితా రూపొందించాలని ఆదేశించారు.

BCల రాజకీయ భవిష్యత్తుపై బిగ్ డెసిషన్: CM
AP: BCలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే కీలక నిర్ణయాన్ని CM చంద్రబాబు శాసనసభ వేదికగా ప్రకటించారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర జనాభాలో 50.14 శాతం ఉన్న బీసీలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యమని CM తెలిపారు. మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజాపరిషత్‌లను 28కి పెంచే నిర్ణయాన్ని వెల్లడించారు.

మీకు ఏది ఇష్టమో మీ ఫోన్‌కి ఎలా తెలుస్తుంది?
ఫోన్ ఓపెన్ చేసి “రెండు నిమిషాలు” స్క్రోల్ చేద్దాం అనుకుంటారు. కానీ చూస్తుండగానే అరగంట దాటిపోతుంది. ఇదంతా కేవలం మన ఇష్టం వల్లే కాదు. మనం ఏ వీడియో దగ్గర ఆగుతున్నాం, ఏది లైక్ చేస్తున్నాం, ఏది స్కిప్ చేస్తున్నాం, ఎంతసేపు చూస్తున్నాం… ఇవన్నీ యాప్‌ల ఆల్గోరిథమ్ గమనిస్తుంటుంది. ఆ డేటాతో మనకు తర్వాత ఏ కంటెంట్ నచ్చొచ్చో అంచనా వేసి అదే ముందుకు తెస్తుంది. అందుకే ఒక చిన్న స్క్రోల్ పెద్ద సమయంగా మారుతుంది. మనకు కంటెంట్ ఎంచుకుంటున్నామనిపిస్తుంది… కానీ మన కోసం కూడా కంటెంట్ ఎంచుకోబడుతోంది.

తల్లిదండ్రులు గొడవపడితే.. పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
తల్లిదండ్రులు గొడవపడితే.. “పిల్లలే కదా, వాళ్లకేం అర్థం అవుతుంది?” అని అనుకుంటాం. కానీ వాళ్లకు చాలా విషయాలు అర్థమవుతాయి.😕 ఇంట్లో తరచూ అరుపులు, తిట్టుకోవడం, గొడవలు జరిగితే వాళ్లలో భయం, టెన్షన్ పెరగొచ్చు. కొందరైతే “నా వల్లే ఇలా జరుగుతుందా?” అని కూడా ఫీల్ అవుతారు. దాని ప్రభావం నిద్ర, చదువు, ప్రవర్తనపైనా పడొచ్చు. ప్రతి డిసగ్రీమెంట్ సమస్య కాదు.. కానీ తరచూ, తీవ్రంగా ఉంటే మాత్రం పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అందుకే వాళ్ల ముందు గొడవపడకుండా.. సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం.❤️

బ్లడ్ క్యాన్సర్‌తో విద్యాకుసుమం..కదిలిన విద్యార్థిలోకం
AP: చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, పేదరికంతో పోరాడుతూ ఇంటర్ ఫస్టియర్‌లో 446 మార్కులు సాధించాడు. ఇప్పుడు ఆ విద్యార్థి జీవితం బ్లడ్ క్యాన్సర్‌తో ఊగిసలాడుతోంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బుడార్సింగి పంచాయితీ నరసింగపురం గ్రామానికి చెందిన సారక శివకుమార్ ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికోసం తోటి విద్యార్థులు గ్రామాలు తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. విద్యార్థి వైద్య ఖర్చుల నిమిత్తం సహాయార్థం ఫోన్‌పే నెంబర్ 8074560021 కు సంప్రదించాలన్నారు.

ఆకలితో ఉన్నవారికి అండగా.. పోలీసుల కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
AP: విశాఖ నగరంలో ఆకలితో ఉన్నవారికి వైజాగ్ సిటీ పోలీసులు అండగా నిలుస్తున్నారు. ‘మిషన్ జ్యోతిర్గమయ’లో భాగంగా పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో ఐదు కమ్యూనిటీ ఫ్రిజ్‌లను ప్రారంభించారు. వీటి ద్వారా నిరాశ్రయులు, ఆకలితో ఉన్నవారు, అవసరమైన వారికి ప్రతిరోజూ ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. మిగిలిన ఆహారం వృథా కాకుండా అవసరమైన వారికి చేరేలా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ఈ సేవ కొనసాగుతోంది.

విద్యుత్ ఉద్యోగులు JAC ఆధ్యర్యంలో మహాధర్నా పోస్టర్స్ విడుదల
TG: తెలంగాణ పవర్ ఎంప్లాయ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్యర్యంలో చలో విద్యుత్ సౌదా మహా ధర్నా పోస్టర్‌ని నాగర్ కర్నూల్ సర్కిల్ ఆవరణలో విద్యుత్ ఉద్యోగులు JAC ఆధ్యర్యంలో విడుదల చేసారు. ఉద్యోగులు ఆర్టిజన్లు, పెన్సన్‌కు సంబంధిన PRC-2026 వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి టర్నల్ పవర్ ప్లాంట్‌ని ప్రెవేట్‌పరం చెయ్యవద్దని అన్నారు, ఆర్టిజన్ల APSEB రూల్స్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. 1999 నుండి 2004 బ్యాచ్ ఉద్యోగులకు EPF to GPF అమలు చేయాలని కోరారు.

చంద్రశేఖరన్ తర్వాత ఎవరు? టాటాలో కొత్త టెన్షన్!
TATA గ్రూప్‌లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది.. చంద్రశేఖరన్ తర్వాత ఎవరు? ఫిబ్రవరి 2027లో తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ కొనసాగనని ఎన్. చంద్రశేఖరన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు, ఆయన వారసుడిని ఎంపిక చేసేందుకు TATA ట్రస్ట్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతలో ఈరోజు జరగాల్సిన టాటా సన్స్ వార్షిక సమావేశం కూడా అవసరమైన సభ్యులు లేక వాయిదా పడింది. దీంతో కొత్త బాస్ ఎవరు అన్నదానితో పాటు.. TATA లోపల అసలు ఏం జరుగుతోందన్న ఆసక్తి మరింత పెరిగింది.

జీవో నెంబర్ 97 తక్షణమే రద్దు చేయాలి
TG: G.O 97ను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను Young India Skills University పరిధిలోకి తీసుకెళ్లే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కన్వీనర్ బి.మల్లేష్ అన్నారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ధర్నా నిర్వహించారు. శక్తి పథకం వెనక్కి తీసుకోవాలని, SBTET బోర్డును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ ల్యాబ్స్ భవనాలు నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలన్నారు. పాలిటెక్నిక్ అధ్యాపకులు సిబ్బంది సర్వీస్ నిబంధనకు రక్షణ కల్పించాలన్నారు.

ప్రారంభం కానున్న పోలీస్ ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియ
TG: తెలంగాణలో 7437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు 19 ఆగస్టు ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు <a href="https://www.tgprb.in/">వెబ్‌సైట్</a> ద్వారా సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పార్ట్-1 దరఖాస్తుకు ముందుగా ఫోన్లో ఆధార్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు.
నారాయణగూడ సర్వే భవన్ వద్ద ఉద్రిక్తత
TG: హైదరాబాద్‌లోని నారాయణగూడ సర్వే భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ రెవెన్యూ లైసెన్స్‌డ్ సర్వేయర్లు కార్యాలయాన్ని ముట్టడించారు. సర్వేయర్లు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఎం చేతుల మీదుగా లైసెన్స్ పత్రాలు అందించి ఏడాది గడుస్తున్నా, ఇప్పటివరకు తమను విధుల్లోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లోకి చేర్చుకుని, నెలకు ₹30,000 జీతంతో ఉద్యోగ భద్రత కల్పించాలని సర్వేయర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు

అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు
TG: ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు షట్లర్ గాయత్రి గోపీచంద్, షూటర్ ధనుష్ శ్రీకాంత్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్జున అవార్డులకు ఎంపికైన వాళ్లు రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ క్రీడా పురస్కారాలు–2025 అందుకున్న విజేతలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

మెరుగైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం
మారుమూల, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. వాంకిడి మండలం ఇందాని గ్రామంలో గ్రాన్యుల్స్ ఇండియా ఫార్మా కంపెనీ రూ.25 లక్షల సీఎస్‌ఆర్ (CSR) నిధులతో నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్రానికి ఆమె భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేయడమే ధ్యేయంగా ఈ నిర్మాణం చేపడుతున్నామని, ఇది అందుబాటులోకి వస్తే ఇందాని గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రాథమిక వైద్యం సులభంగా అందుతుందన్నారు.

బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ నిరసన
TG: బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు, DCC అధ్యక్షుడు బీర్ల అయిలయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, విద్యార్థులు, యువత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలను కొనసాగిస్తుందని తెలిపారు.

G.O.97 శక్తి పథకం రద్దు చెయ్యాలి
TG: పాలిటెక్నిక్ విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్‌ను ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పడానికి నిరసన చేపడితే, స్పీకర్ పర్యటన ఉందనే కారణంతో అనుమతి నిరాకరించడం ఎందుకు అని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును వినాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని అన్నారు. కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించడం ద్వారా సమస్య పరిష్కారం కాదని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఐటీఐ వారితో సమానం చేసే G.O. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థిని చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
AP: పల్నాడు జిల్లా మాచవరం మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరి ఇంజనీరింగ్ చదువుకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆర్థిక సహాయం అందించారు. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి రూ.3,65,500 ఉన్న ఫీజు, బకాయిలను రూ.2.50 లక్షలకు తగ్గించారు. ఇందులో రూ.1.25 లక్షలను ఇప్పటికే చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని వచ్చే ఏడాది చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. కుటుంబ ఖర్చుల కోసం రూ.50 వేలు, విద్యా ఫీజు కోసం రూ.2.50 లక్షలు కలిపి మొత్తం రూ.3 లక్షలను ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి అందించారు.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అక్టోబర్ నెలా ఖరులోగా స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ముందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది. గతంలో ఇచ్చి న హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించగా, పట్టణ ప్రాంతాల్లో 33.1 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని నిర్ణయించింది.

సెప్టెంబర్ 16 వరకు ఓటర్ల మార్పుకు అవకాశం
తెలంగాణలో SIR–2026లో భాగంగా సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు కోసం ఫారం–6, పేరు తొలగింపు లేదా అభ్యంతరాల కోసం ఫారం–7, చిరునామా మార్పు, వివరాల సవరణ కోసం ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.

వైద్య కళాశాలలో 39 పోస్టుల రిక్రూట్‌మెంట్
TG: జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 38 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో, ఒక ట్యూటర్ పోస్టును గౌరవ వేతనం పద్ధతిలో రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అధికారులు కోరుతున్నారు. ఆగస్టు 25వ తేదీ ఉదయం 11 గంటలకు గద్వాల ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. వివరాల కోసం జోగులాంబ గద్వాల జిల్లా అధికారిక <a href="https://gadwal.telangana.gov.in/">వెబ్‌సైట్ </a>పరిశీలించవచ్చు.

భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
TG: జగిత్యాల జిల్లా కొడిమ్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి పెండింగ్ అంశాలు, సాదా బైనామా, మీసేవ ఫైళ్లను పరిశీలించి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. మీసేవ సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు పూర్తి చేసి ప్రజలకు అందించాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం
TG: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతామని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. AICC కార్యదర్శి సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించారు. సచిన్ సావంత్ పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.