Latest

కరోనా కలకలం.. సీలేరు పర్యాటకుల ప్రవేశం నిలిపివేత
APలో కరోనా కేసులు పెరుగుతుండటంతో విశాఖపట్నం జిల్లా సీలేరు ప్రాంతంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. సీలేరు పవర్ కాంప్లెక్స్ పరిధిలోకి పర్యాటకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాలు, రిజర్వాయర్లకు బయటి వ్యక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. విద్యుత్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం వంటి కోవిడ్ నిబంధనలు తప్పనిసరి చేశారు. ప్రజలు కూడా మాస్క్‌లు ధరించి జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచించారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: పొన్నం
TG: నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఇతర ముఖ్య నేతల అరెస్ట్‌కు నిరసనగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన మహాధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్ అప్రజాస్వామికం అని, ఢిల్లీలో హింసపై విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. నీట్ పేపర్ లీక్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.

ఏపీలో మళ్లీ కరోనా టెన్షన్..!
AP: ఏపీలో Omicron RF.5 వేరియంట్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 7 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కి చేరింది. ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, వారంతా ఇప్పటికే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వైరస్ 10 జిల్లాలకు విస్తరించింది. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ సూచించింది.

CJP ధర్నాలో నిరసనకారుల ఇబ్బందులకు ఇదిగో సాక్ష్యం
దిల్లీ నగరంలోని జంతర్‌మంతర్ వద్ద మొన్న జరిగిన ‘చలో సంసద్’ ర్యాలీ మీద పోలీసులు జరిగిన లాఠీచార్జ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మద్దతుదారులను ముందుకు సాగనీయకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. వారిపై తమ ప్రతాపం చూపించారు. లాఠీలు, టియర్ గ్యాస్‌తో విరుచుకుపడ్డారు. జనాన్ని చెల్లాచెదురు చేశారు. ఆ క్రమంలో ఎంతోమంది చెప్పులు వదిలేసి పరిగెత్తారు. ఆ దాష్టీకానికి సాక్ష్యంగా నిలుస్తోంది ఈ చిత్రం.
ఆర్టీసీ బస్సునే దొంగలించిన దుండగుడు
TG: జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్ నుంచి ఓ దుండగుడు ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. బస్సును వేగంగా నడుపుతూ ఇతర వాహనాలను ఢీకొట్టడంతో పోలీసులు సినిమా రేంజ్ లో బస్సును ఛేజ్ చేశారు. చివరకు జిల్లా సరిహద్దు వద్ద అడ్డుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తల్లికి వందనం నిధులు రూ.10,120.78 కోట్లు విడుదల : నారా లోకేష్
AP: 'ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకుగానూ, 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేస్తున్నాం, ఈనెల 24 వరకు నిధుల విడుదుల కొనసాగుతుంది' అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పిల్లల చదువులే రాష్ట్రానికి నిజమైన ఆస్తి అని, ఏ ఒక్క చిన్నారీ విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివినా ఈ సాయం అందించేలా 'తల్లికి వందనం' పథకాన్ని రూపొందించామంటూ మంత్రి లోకేష్ 'X' లో తెలిపారు.

నేషనల్ హైవేపై కాంగ్రెస్ నాయకులు బైఠాయింపు
TG: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గేట్ వద్దనున్న హైవేపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నీట్, పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి
'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని చాటిచెప్పిన విప్లవ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య జయంతి నేడు. ప్రజల స్వేచ్ఛను అణచివేసే నిజాం పాలనకు వ్యతిరేకంగా తన 'కవితల'తో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ఉద్యమసారథి మన దాశరథి. జైలు గోడలపైన బొగ్గుతో పద్యాలు రాసి, అన్యాయాలకు ఎదురు నిలిచిన వ్యక్తి. విప్లవ సాహిత్యమే కాకుండా తెలుగు సినిమాలకి కూడా ఎన్నో మరపురాని మధురమైన పాటలను అందించారు.
రెడ్కో డీఈ ఇంట్లో ACB రైడ్స్
TG: హైదరాబాద్‌లో తెలంగాణ REDCO (రెన్యువల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) DE ముత్యం వెంకటరమణ నివాసాలపై ACB అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణల రావడంతో మాదాపూర్‌లోని ఆయన ఇంటితో పాటు మరో 15 ప్రాంతాల్లో ఏసీబీ DSP మాజిదాఖాన్ ఆధ్వర్యంలో ఎనిమిది బృందాలు ఏకకాలంలో తనిఖీలు కొనసాగిస్తున్నాయి. స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు భారీగా నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

ఆకాశంలో GOLD RATES..తులం ఎంతో తెలుసా?
గోల్డ్ రేట్స్ మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,46,510కు చేరగా, ఒక్కరోజే రూ.2,290 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,34,300గా ఉంది. గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షలకు చేరి, ఒక్కరోజే రూ.5,000 పెరిగింది

ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం: చంద్రబాబు
AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్‌గా మారే భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌తోపాటు పాసింజర్ టెర్మినల్, ఏవియేషన్ యూనివర్సిటీ, ఎడ్యుసిటీలను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభిస్తారని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు

సిడ్నీ హీరోగా హైదరాబాద్ వాసి
సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో హైదరాబాద్‌కు చెందిన రెహ్మత్ పాషా దాదాపు 20 మంది ప్రాణాలను కాపాడారు. గాయపడినవారిని ఆంబులెన్సుల వద్దకు చేర్చిన ఆయన తెగువను మెచ్చి ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా కల్పించింది. ఈ ధైర్యసాహసాలకు గుర్తుగా ఆయన టోపీని సిడ్నీ మ్యూజియంలో ఉంచనున్నారు. త్వరలోనే ఆయన కుటుంబం కూడా ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్‌లకు కూడా హైదరాబాద్‌తో సంబంధాలున్నాయి.

తెలుగు గజల్ రచనకు ఆద్యుడు దాశరథి
తెలుగు సాహిత్యంలో గజల్ రచనకు ఆద్యుడిగా నిలిచివారు దాశరథి కృష్ణమాచార్యులు. ‘వలపునై నీ హృదయసీమల నిలువవలెనని ఉన్నది..పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది’’ అంటూ 1965లో తొలిసారి తెలుగు గజల్ రాశారాయన. 14 ఏప్రిల్ 1965లో ఆంధ్రప్రభ వారపత్రికలో ‘ఉగాది గజల్’ అన్న శీర్షికతో అచ్చయింది. 'గజల్' అంటే “ఇంతులతో మంతనాలు" అన్నారు దాశరథి. తెలుగులో గజల్‌కు దాశరథి ‘మంజరి’ అని పేరు పెట్టారు.

కుటుంబాన్ని బంధించి 66 తులాల బంగారం చోరీ
TG: కరీంనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ దోపిడీ ఘటన కలకలం రేపింది. భగత్ నగర్‌కు చెందిన వృద్ధుడు అజ్మత్ అలీ ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులను బంధించి, తుపాకులు, కత్తులతో బెదిరించి 66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు, 10 తులాల వెండిని దోచుకెళ్లారు. అరుపులు వినపడకుండా TV సౌండ్ పెట్టి బాధితులను తీవ్రంగా కొట్టి గదిలో బంధించారు. మొబైల్ ఫోన్లు తీసుకెళ్లిన దుండగులు కింద పార్కింగ్‌లో ఉన్న రెండు బైకులను కూడా దొంగిలించి వేములవాడ బైపాస్ వైపు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

అప్పులు తీర్చలేక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
TG: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మేకల శివకుమార్(21) మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని దేవేందర్ నగర్‌లో ఉంటూ మైసమ్మగూడలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడి ఫ్రెండ్స్‌తో పాటు ఇతరుల వద్ద అప్పులు చేశాడు. వారు తిరిగి అడగడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. తల్లిదండ్రులను డబ్బు అడిగితే తిడతారనే భయంతో గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేట్‌బషీరాబాద్ SI రాజు తెలిపారు.
మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలి
దిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి ప్రధాని మోదీ నైతిక బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ఆయన మాట్లాడారు. విద్యార్థులపై జరిగిన దాడి, వారి ఆందోళనలను అణిచివేయడం వల్ల యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. పోటీపరీక్షల వ్యవస్థను నాశనం చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు తగ్గిస్తున్నారని ఫైరయ్యారు. హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులను కొట్టిన ఢిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.

పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారని విద్యార్థిని సూసైడ్
TG: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో బీటెక్ విద్యార్థిని శ్రేయ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇబ్రహీంబాగ్‌లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న యువతి, లెక్చరర్స్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. గతంలో పరీక్ష హాల్‌లో సెల్‌ఫోన్ తీసుకెళ్లిన ఘటనతో పాటు, పరీక్షల సమయంలో తనపై పలు అనుమానాలతో కావాలనే నన్ను టార్గెట్ చేశారని పేర్కొంది. తండ్రి సతీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నేషనల్ హైవేపై రాస్తారోకో.. జగ్గారెడ్డి అరెస్ట్
TG: ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీయగా, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు నిరసనగా తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అర్ధరాత్రి కార్యకర్తలు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. జగ్గారెడ్డిని అరెస్ట్ చేసి సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించే క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసు వాహనాలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

కరోనా కలకలం.. ఆరోగ్యశాఖ హైఅలర్ట్
APలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒకే రోజు గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో ఒకటి చొప్పున మొత్తం 7 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది. ప్రస్తుతం 10 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 9 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ముగ్గురు కోలుకోగా, ఇప్పటివరకు నలుగురు మరణించారు. కేసుల పెరుగుదలతో ఆరోగ్యశాఖ అప్రమత్తమై, 17 బోధనాస్పత్రుల్లో 255 ప్రత్యేక కొవిడ్ పడకలు సిద్ధం చేసింది. మాస్కులు, PPE కిట్లు, శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచింది.

ఫోర్జరీ ఆరోపణలపై తమ్మినేనికి చుక్కెదురు
AP: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ.4 కోట్ల విలువైన ఆస్తిని కుమారుడి పేరుపై రాయించుకున్నారనే కేసులో అరెస్టు నుంచి రక్షణ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని పేర్కొంటూ, అరెస్టు భయం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

వరి, చెరకు సాగుపై అలర్ట్
TG: ఎల్‌నినో ప్రభావం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. జూన్‌లో ప్రారంభమైన ఈ ప్రభావం డిసెంబరు వరకు తీవ్రంగా ఉండి, వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఖరీఫ్ తర్వాత యాసంగి సాగు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు పడిపోవడం, చెరువులు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం వల్ల నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి, చెరకు వంటి పంటలు వేయొద్దని రైతులకు సూచించారు. ఆగస్టులో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నా, సెప్టెంబరులో ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.