AP

సమ్మెతో భారీగా నిలిచిన క్రయవిక్రయాలు
AP· 21 Jul 2026

సమ్మెతో భారీగా నిలిచిన క్రయవిక్రయాలు

AP: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో ఆస్తుల క్రయవిక్రయాలు నిలిచిపోయి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోయాయి. సాధారణంగా రోజుకు సుమారు 10 వేల రిజిస్ట్రేషన్లు జరిగి ప్రభుత్వానికి రూ.50-60 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే సోమవారం కేవలం 500 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగి, ఆదాయం రూ.4 కోట్లకు కూడా చేరలేదు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగిస్తే ఆస్తుల డేటా దుర్వినియోగం, భూముల కబ్జాలు, మోసాలు పెరిగే ప్రమాదం ఉందని డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బైక్‌పై వెంబడించి డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి
AP· 20 Jul 2026

బైక్‌పై వెంబడించి డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి

AP: బస్సు ఆపలేదని యువకుడు RTC సిబ్బందిపై దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు కోసం బస్టాప్‌లో ఎదురుచూస్తుండగా డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహానికి గురైన ఓ యువకుడు బైక్‌తో వెంబడించాడు. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద బస్సును అడ్డగించి డ్రైవర్ సురేశ్, కండక్టర్ లీలా ప్రసాద్‌పై దాడి చేశాడు. సీట్లు ఖాళీ లేకపోవడంతోనే ఆపలేదని తోటి ప్రయాణికులు నచ్చజెప్పినా యువకుడు వినలేదు. ఘటనతో కరకట్ట రూట్‌లో గంటసేపు ట్రాఫిక్ జామ్‌అయింది. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రియుడి ఫ్రెండ్స్  ప్రెజర్‌తో యువతి ఆత్మహత్య
AP· 20 Jul 2026

ప్రియుడి ఫ్రెండ్స్ ప్రెజర్‌తో యువతి ఆత్మహత్య

AP: కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన రజిని, రాజేంద్ర నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల రజినికి కుటుంబసభ్యులు పెళ్లి నిశ్చయించారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని స్నేహితులు రజినిపై పెళ్లి రద్దు చేసి రాజేంద్రను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. ఇంటి వారిని బాధపెట్టలేక, ప్రియుడిని వదులుకోలేక రజిని తీవ్ర మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకుంది. సూసైడ్ నోట్‌లో “చనిపోవాలని లేదు.. ఏం చేయాలో తెలియడం లేదు” అని రాసింది. యువతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

వర్షాల కోసం గాడిదలకు పెళ్లి
AP· 19 Jul 2026

వర్షాల కోసం గాడిదలకు పెళ్లి

AP: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో గ్రామస్థులు వినూత్న ఆచారాన్ని నిర్వహించారు. వర్షాలు కురవాలని రెండు గాడిదలను వధూవరులుగా అలంకరించి, డప్పుచప్పుళ్లతో ఊరేగింపు చేశారు. అనంతరం వేద మంత్రాల సాక్షిగా గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. మంగళసూత్రం కట్టి, తలంబ్రాలు పోసి, హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఇలానే గాడిదలకు పెళ్లి చేయడంతో మంచి వర్షాలు కురిశాయని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి
AP· 19 Jul 2026

తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి

AP: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అనంతపురం జిల్లా పామిడి మండలంలో పంటల పరిస్థితిని డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. పొగరూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో పత్తి, కంది, సజ్జ పంటలను పరిశీలించి రైతులతో వారు మాట్లాడారు. పంటల ఎదుగుదల, వర్షాభావ ప్రభావంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమాలో నమోదు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినా బీమా ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం
AP· 19 Jul 2026

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం

AP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. విశాఖ నుంచి భోగాపురానికి అనుసంధానంగా నిర్మిస్తున్న 7 మాస్టర్ ప్లాన్ రహదారుల్లో 4 పూర్తయ్యాయి. విమాన ప్రయాణికుల కోసం RTC 20 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేయగా, తొలి విడతలో 3 బస్సులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. గురుద్వారా, వుడా పార్క్, ఆటోనగర్, వెంకోజీపాలెంలో ప్యాసింజర్ లాంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గాల్లో పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.