Local

వ్యాన్‌లో ప్రత్యేక అరలు.. అక్రమ మద్యం రవాణా గుట్టురట్టు
Local· 27 Aug 2026

వ్యాన్‌లో ప్రత్యేక అరలు.. అక్రమ మద్యం రవాణా గుట్టురట్టు

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అక్రమంగా తరలిస్తున్న రూ.6.38 లక్షల విలువైన 70 బాక్సుల ఐబీ మద్యాన్ని ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాద్రానగర్‌ హవేలీ నుంచి మద్యం తరలిస్తున్న వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు మహారాష్ట్ర భివాండీకి చెందిన ప్రధాన సరఫరాదారు ప్రవీణ్‌ సిరిగిరితో పాటు డ్రైవర్‌ ప్రదీప్‌ జైస్వాల్‌, అజయ్‌ భగవాన్‌ను అరెస్ట్‌ చేశారు. ఖాళీ వ్యాన్‌లో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి మద్యం రవాణా చేస్తుండగా ఎక్సైజ్‌ సీఐ రాథోడ్‌ బృందం తెల్లవారుజామున రూట్‌వాచ్‌ నిర్వహించి పట్టుకుంది.

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. ఎంవీఐ హెచ్చరిక
Local· 27 Aug 2026

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. ఎంవీఐ హెచ్చరిక

AP: గుంటూరు జిల్లా మంగళగిరి పరిసరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ హెచ్చరించారు. 60 కిలోమీటర్ల వేగ పరిమితిని దాటితే స్పీడ్‌ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానాలు విధిస్తామని తెలిపారు. ప్రతి వాహనానికి నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరిగా ఉండాలని స్పష్టంచేశారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ జంప్‌ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలు విధించడంతోపాటు అవసరమైతే వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

ఏకరూప దుస్తుల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కార్యక్రమం
Local· 27 Aug 2026

ఏకరూప దుస్తుల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కార్యక్రమం

TG: విద్యార్థినుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో పాటు సేవాభావాన్ని పెంపొందించేందుకు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఓ చంద్రకళ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌ఓ చంద్రకళ మాట్లాడుతూ.. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ద్వారా విద్యార్థినుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు.

వరంగల్‌ నుంచి తొర్రూర్‌కు బస్సు సౌకర్యం కల్పించాలి
Local· 27 Aug 2026

వరంగల్‌ నుంచి తొర్రూర్‌కు బస్సు సౌకర్యం కల్పించాలి

TG: రాత్రి 8గంటలు దాటితే వరంగల్‌ నుంచి తొర్రూర్‌, వర్ధన్నపేట ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, ఇతర పనుల కోసం వరంగల్‌కు వచ్చే ప్రజలు రాత్రివేళ స్వగ్రామాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రవాణాపై ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాత్రి 9గంటల తర్వాత వరంగల్‌ నుంచి తొర్రూర్‌కు ఒక బస్సును నడపాలని కోరారు.