Latest

కొత్త పంచాయతీ భవనానికి శంకుస్థాపన
TG: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జన్కపూర్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్పుల మల్లేష్, సర్పంచ్ బోరిగామ వెంకటేష్ శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు నర్సింగరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సుప్రీంకోర్టు వేదికగా CJP బిగ్ స్టెప్
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు, FIRల ఉపసంహరణ, పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణల నేపథ్యంలో, CJP ప్రతినిధి <a href="https://x.com/SauravDassss/status/2089400426831773742?s=20">సౌరవ్ దాస్</a> కీలక ప్రకటన చేశారు. పోలీసుల దౌర్జన్యంపై సుప్రీంకోర్టులో జరిగే విచారణను పరిశీలించిన అనంతరం, సుప్రీంకోర్టు ఆవరణలో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీజేపీ చేపట్టిన నిరసనలు, వాటికి సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణ అంశం, పోలీసుల వ్యవహారశైలిపై తమ వైఖరిని వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

73 లక్షల ఓట్లు తొలగింపు.. కారణాలు ఇవే
TG: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు.. సవరణకు ముందు రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, తాజా ముసాయిదాలో ఆ సంఖ్య 2,64,87,213కు తగ్గింది. ఆచూకీలేని, శాశ్వతంగా వలసవెళ్లిన, మరణించిన, ఇతర ప్రాంతాల్లో ఓటు కలిగిన వారిగా గుర్తించిన 73,39,235 మంది పేర్లను తొలగించారు. మరో 92,87,577 మంది ఓటర్ల వివరాలపై వ్యత్యాసాలు, మ్యాపింగ్ సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి నోటీసులు జారీచేసి సంజాయిషీ కోరనున్నట్లు తెలిపారు.

కస్తూర్బా గాంధీ స్కూల్‌లో కలెక్టర్ సడన్ చెకింగ్
TG: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం వంటగదిని సందర్శించి కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, పప్పులు, బియ్యం తదితర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. వాటి గడువు తేదీలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, నాణ్యమైన ఆహారం అందుతున్నదా అని ఆరా తీశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీపై బిగ్ అప్డేట్
TG: సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి చేస్తున్న జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పారిశ్రామికవాడకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. నీటి సరఫరా పనులకు టెండర్లు పూర్తయ్యాయని, విద్యుత్ పనులు కూడా గడువులోగా పూర్తవుతాయని తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ సేవలు: రేవంత్ రెడ్డి
TG: విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని CM రేవంత్‌రెడ్డి అన్నారు. HYDలోని సనత్‌నగర్‌లో మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్య, వైద్యంపై చేసే వ్యయాన్ని పెట్టుబడిగా భావిస్తున్నామని చెప్పారు. పేదలకు ఉచిత వైద్యం అందించడంతో పాటు ఆరోగ్యశ్రీ కింద రూ.2,700 కోట్లు చెల్లించామని తెలిపారు. 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, ఎల్‌బీనగర్, అల్వాల్, వరంగల్ ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు.

ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి: CM
AP: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని CM చంద్రబాబు నాయుడు తెలిపారు. అసెంబ్లీలో ఎల్‌నినోపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర లోటు కనిపిస్తోందన్నారు. జూన్-డిసెంబర్ మధ్య 867 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 557 మి.మీ. మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని చెప్పారు. శ్రీశైలానికి 753 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 214 టీఎంసీలు మాత్రమే వచ్చాయని వివరించారు.

దేశం ఖర్చులో 43% Gen Z చేతుల్లో.. ఇంత పవర్ ఉందా? 😳
Gen Z అంటే రీల్స్, మీమ్స్ మాత్రమే అనుకుంటున్నారా..? వాళ్లు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్న స్పెండింగ్ ఏకంగా $860B (₹72 లక్షల కోట్లు)!👀 ఇండియాలో దాదాపు 37.7 కోట్ల Gen Z ఉన్నారని <a href="https://www.bcg.com/publications/2024/india-the-2-trillion-opportunity-how-gen-z-is-shaping-the-new-india?linkId=629656651&utm_source=chatgpt.com">BCG </a>రిపోర్ట్ చెబుతోంది. వీళ్లు దేశంలోని కన్జ్యూమర్ స్పెండింగ్‌లో దాదాపు 43% అంటే $860 బిలియన్ విలువైన కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నారట. ఇందులో $200 బిలియన్ డైరెక్ట్‌గా వాళ్లు ఖర్చు చేస్తుండగా, మరో $660 బిలియన్ ఫ్యామిలీ కొనుగోళ్లపై వాళ్ల ఇన్‌ఫ్లుయెన్స్‌తో జరుగుతోంది. 2035 నాటికి ఈ స్పెండింగ్ పవర్ $2 ట్రిలియన్‌కు చేరొచ్చని అంచనా.

కొన్ని Memories జీవితాంతం ఎందుకు గుర్తుంటాయి? 🧠
మన జీవితంలో ఎన్నో క్షణాలు వస్తాయి.. కానీ కొన్ని మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచినా మనసులో అలాగే ఉండిపోతాయి. చిన్నప్పుడు ఫ్రెండ్స్తో గడిపిన రోజులు, ఫ్యామిలీతో ఉన్న ఓ క్షణం, మొదటి విజయం, ఊహించని సంతోషం.. ఇలా మనకు గట్టిగా అనిపించిన మొమెంట్స్ను మెదడు బలంగా గుర్తుపెట్టుకుంటుంది. ముఖ్యంగా సంతోషం, బాధ, భయం లాంటి భావోద్వేగాలు ఉన్నప్పుడు మెదడులోని "అమిగ్డాలా" జ్ఞాపకాలను మరింత బలంగా నిలిచేలా చేస్తుంది. అందుకే కొన్ని మెమరీస్ను ఎంత మర్చిపోవాలనుకున్నా అవి మళ్లీ గుర్తొస్తుంటాయి.

ఈరోజు బ్యాంక్.. మరి అప్పట్లో ఏం ఉండేది?
ఒక్కసారి ఊహించండి… బ్యాంక్, ఏటీఎం, డిజిటల్ చెల్లింపులు ఏవీ లేని కాలం. మరి ప్రజలు తమ సంపదను ఎలా కాపాడుకునేవారు? చాలామంది నాణేలను ఇళ్లలోని రహస్య ప్రదేశాల్లో, నేలలో పాతిపెట్టి లేదా గోడల్లో దాచేవారు. సంపన్నులు మాత్రం బంగారం, వెండి లేదా విలువైన వస్తువులను నమ్మకమైన వ్యాపారులు, బంగారు పనివాళ్ల దగ్గర భద్రపరిచేవారు. ఆశ్చర్యమేంటంటే… ఇప్పటికీ పురావస్తు శాస్త్రవేత్తలకు నేలలో దాచిన వేల ఏళ్ల నాటి నాణేల గుప్తనిధులు దొరుకుతుంటాయి. బ్యాంకులు రాకముందు, నిజానికి మనిషి తన సంపదకు తానే బ్యాంక్.

స్టూడెంట్స్ విజయం..Jharkhand ప్రభుత్వం కీలక నిర్ణయం
Jharkhand ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. JSSC, CGL పరీక్షలను రద్దు చేసింది. TDPL నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేసి, 2014 నుంచి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించింది. కొన్ని రోజులుగా స్టూడెంట్స్ చేస్తున్న నిరసనలకు స్పందించిన సీఎం హేమంత్ సోరెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్టూడెంట్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

అదర్శ గంగదేవిపల్లి ఎందరికో నేర్పుతోంది!
TG: గ్రామాభివృద్ధిలో అదర్శంగా నిలిచిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి సందర్శకులు పెరుగుతున్నారు. నందిపేట్ మండల సర్పంచ్‌లు, ఫోరం ప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించారు. అధ్యక్షుడు లింగం అధ్వర్యంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు గంగదేవిపల్లిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తెలుసుకున్నారు. ఈ గ్రామం 100 శాతం అక్షరాస్యత సాధించడంతోపాటు, సంపూర్ణ మద్యపాన నిషేధం, పరిశుభ్ర నిర్వహణ, స్వయం సమృద్ధిలో ముందుంది.<br>ప్రజల భాగస్వామ్యంతో ఈ విజయాలను ఎలా సాధించారో సర్పంచ్‌లు తెలుసుకున్నారు.

పులివెందులలో పెరట్లో గంజాయి సాగు
AP: కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రబెల్లి గ్రామంలో ఇంటి పెరట్లోనే గంజాయి సాగు చేస్తున్న చింత శేఖర్, చింత రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 గంజాయి మొక్కలు, సుమారు 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. న్యాయమూర్తి వాళ్లకు రిమాండ్ విధించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో SIR డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల
నాగర్‌కర్నూల్ జిల్లాలో SIRలో భాగంగా నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ విడుదల చేశారు. జిల్లాలో 910 పోలింగ్ కేంద్రాల పరిధిలో 6,18,592 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. డ్రాఫ్ట్ జాబితాపై ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు.

మహిళా క్రికెటర్ శ్రీచరణికి Govt. Job: నారా లోకేష్
AP: భారత మహిళల క్రికెట్ జట్టులో అద్భుతమైన బౌలర్‌గా ఉన్న తెలుగు తేజం శ్రీచరణికి త్వరలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఆమె డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఏపీ అసెంబ్లీ వర్షా కాల సమావేశాల్లో మెగా డీఎస్సీ, స్పోర్ట్స్ కోటాపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

దళితుల భూములపై ఆక్రమణల చర్యలు అవసరం
AP: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పిచికలపాలెం గ్రామంలో దళితులకు కేటాయించిన భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని దళితులు, ప్రజాసంఘాలు పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 246/సి పరిధిలో 73 మంది దళితులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థల పట్టాలు మంజూరైనా, పొజిషన్ చూపించలేదని ఆరోపించారు. ఈ భూమిపై ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని ప్లాట్లను లబ్ధిదారులకు అప్పగించాలని కోరారు.

Voter Listలో మీ పేరుందా..ఇలా తెలుసుకోండి!
తెలంగాణలో ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా 2.64 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. మరో 57.46 లక్షల మంది ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో వారి వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి. మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో ఈ <a href="https://voters.eci.gov.in/download-eroll?stateCode=S29">లింక్</a>పై క్లిక్ చేసి తెలుసుకోండి. ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోతే.. సెప్టెంబర్ 16 వరకు ఫారం-6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.

‘శక్తి’ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలి
TG: పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోకు బీఆర్‌ఎస్ నందిపేట మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ మద్దతు ప్రకటించారు. విద్యార్థులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. మూడు సంవత్సరాలపాటు ప్రత్యేక సాంకేతిక విద్యను చదివే పాలిటెక్నిక్ విద్యార్థులను ఐటీఐ విద్యార్థులతో సమానంగా చూసేలా ప్రభుత్వం తీసుకొస్తున్న నిబంధనలు సరికావని అన్నారు. ‘శక్తి’ పథకం రద్దు చేయాలన్నారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వినతి
AP: కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRS కార్యక్రమంలో SFI విద్యార్థి సంఘం నేతలు జిల్లాలోని విద్యార్థుల సమస్యలను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌కు దృష్టికి తీసుకెళ్లారు. శంఖవరంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను తిరిగి ప్రారంభించాలని అన్నారు. కాకినాడ పి.ఆర్ డిగ్రీ కాలేజ్‌లో బి.బి.ఏ కోర్సును ఈ ఏడాది నుంచి నిలిపివేశారన్నారు. బీబీఏ కోర్సును తిరిగి ప్రారంభించాలన్నారు. విద్యార్థి సంఘాలను హాస్టల్స్‌లోకి వెళ్లకుండా నిషేధిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకమైన జీవోను రద్దు చెయ్యాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

Fertilizers Appలో యూరియా లేక రైతుల ఇబ్బందులు
Fertilizers Appలో యూరియా అందుబాటులోకి రాగానే రెప్పపాటులో అయిపోతోంది. సమయానికి యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులను వేడుకుంటున్నారు. రైతులకు ఉపయోగపడని ఈ Online యూరియా అమ్మకాలు ఎవరి కోసం అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సులభంగా, సమయానికి యూరియా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు.

AIతో చేసిన పుస్తక అనువాదాన్ని గుర్తించడం ఎలా?
ఆన్‌లైన్‌లో విదేశీ పుస్తకం కొనబోతున్నారా? 📚 అయితే కాస్త చెక్ చేయండి! AIతో చేసిన తక్కువ క్వాలిటీ అనువాదాలు, ప్రొఫెషనల్ అనువాదకుల పేరుతో అమ్ముడవుతున్నాయనే హెచ్చరికలు ఉన్నాయి. మరి ఇది నిజమైన అనువాదమో కాదో ఎలా తెలుసుకోవాలి? అనువాదకుడి వివరాలు, అతని గురించి ఆన్‌లైన్‌లో సమాచారం, ప్రచురణకర్త వివరాలు ఓసారి చూడండి. పుస్తకం శాంపిల్ చదివి భాష సహజంగా ఉందో లేదో కూడా చెక్ చేయండి. ఒకే వ్యక్తి చాలా భాషల్లో వరుసగా పుస్తకాలు ఇస్తుంటే.. కాస్త డౌట్ పడాల్సిందే! 👀