Latest

నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో టోకరా
TG: హైదరాబాద్‌లోని నాగోల్ బండ్లగూడకు చెందిన వెంకట్ రెడ్డి విదేశీ ఉద్యోగం పేరుతో సైబర్ మోసగాళ్ల బారినపడి రూ.4.64 లక్షలు కోల్పోయాడు. ఉద్యోగం కోసం Naukri.comలో రెజ్యూమ్ అప్‌లోడ్ చేయగా, దినేష్ మిట్టల్ అనే వ్యక్తి తనను నైకరీ గల్ఫ్ సర్వీస్ ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు. ఖతర్ యూనివర్సిటీలో అధ్యాపకుని ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రిక్రూట్మెంట్ ప్రక్రియ పేరుతో పలుదఫాలుగా డబ్బులు వసూలు చేశాడు. అనంతరం నకిలీ నియామక ఉత్తర్వులు, ఖతర్ యూనివర్సిటీ పేరుతో నకిలీ ఈమెయిల్ పంపించాడు. మోసాన్ని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం
TG: వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ అడుప మహేష్‌పై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయన ముఖం, మెడ, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను స్థానిక MGM ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. MLA కేఆర్ నాగరాజు ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించి, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

ప్రియాంక చోప్రా బర్త్‌డే.. రాజమౌళి బిగ్ సర్‌ప్రైజ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బర్త్‌డే సందర్భంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రం నుంచి ఆమె కొత్త లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రియాంక మందాకిని అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. “ఆమె నవ్వితే హుందాతనం.. నవ్వకపోతే అగ్ని కణం” అనే క్యాప్షన్‌తో రాజమౌళి ఈ ఫోటోలను Xలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, ప్రియాంక కొత్త రూపం వాటిని మరింత పెంచింది.

శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తాం
నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని రేపు నిర్వహించనున్న ‘చలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. ఈ మార్చ్‌ను ఐదు ప్రధాన అంశాలతో శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భారత త్రివర్ణ పతాకమే ఉంటుందని, ఏ రాజకీయ పార్టీ లేదా సంస్థ జెండాలు ఉండవని స్పష్టంచేశారు. పాల్గొనేవారు భారత రాజ్యాంగం లేదా మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్ ఫోటోలను తీసుకురావాలని సూచించారు. సానుకూల నినాదాలే చేయాలని, హింసకు పాల్పడకూడదని వాంగ్‌చుక్ తెలిపారు.

మహిళ మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
TG: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నీలాద్రి హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మంజుల(23) మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండానే ఇంజెక్షన్ ఇచ్చారని, దానికి రియాక్షన్ రావడంతో మరో ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యమే మంజుల మృతికి కారణమని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి
AP: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అనంతపురం జిల్లా పామిడి మండలంలో పంటల పరిస్థితిని డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. పొగరూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో పత్తి, కంది, సజ్జ పంటలను పరిశీలించి రైతులతో వారు మాట్లాడారు. పంటల ఎదుగుదల, వర్షాభావ ప్రభావంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమాలో నమోదు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినా బీమా ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ అటెండెన్స్‌లో ఆదిలాబాద్ టాప్
TG: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల అటెండెన్స్ జిల్లాల వారీగా అనుహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లా 93.47 శాతం హాజరుతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కొమురంభీం, ఖమ్మం, ములుగు జిల్లాలు కూడా 80 శాతానికి పైగా హాజరుతో మెరుగైన ఫలితాలు నమోదు చేశాయి. మరోవైపు కరీంనగర్ జిల్లా కేవలం 52.69 శాతం హాజరుతో చివరి స్థానంలో నిలిచింది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కూడా తక్కువ అటెండెన్స్ నమోదు అయింది. అభివృద్ధి చెందిన జిల్లాల్లో హాజరు తగ్గడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

శుభకార్యానికి వెళ్తుండగా ఘోర విషాదం
AP: విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం-అనకాపల్లి నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుండం సమీపంలో కారు అదుపుతప్పి ముందువెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిరుద్యోగులు వారి ట్రాప్‌లో పడొద్దు
TG: నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు BRSకు లేదని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ ఫైరయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. BRS హయాంలో 16 పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఏనాడు పరామర్శించలేదు, పట్టించుకోలేదన్నారు. స్వార్థం కోసం, నిరుద్యోగులపై బీఆర్ఎస్ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని, నిరుద్యోగులు వారి ట్రాప్‌లో పడొద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 70వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 30వేల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.

జీరో అడ్మిషన్లు.. విచారణలో షాకింగ్ ట్విస్ట్
TG: విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూర్యాపేట జిల్లా తుంగుతర్తి మండలం బండరామారం ZP హైస్కూల్ HMతో పాటు నలుగురు ఉపాధ్యాయులను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సస్పెండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క కొత్త అడ్మిషన్ కూడా లేకపోవడంతో కలెక్టర్, DEO విచారణ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకు పంపించేలా ఉపాధ్యాయులే ప్రోత్సహించినట్లు, పాఠశాల ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరించినట్లు గుర్తించారు. రికార్డుల నిర్వహణలో లోపాలు, అధికారుల ఆదేశాల ఉల్లంఘన కూడా బయటపడింది. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీపడబోమని, బాధ్యులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తాం
తెలంగాణలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగులకు నియామక పత్రాలు అందిస్తామని CM రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న ‘అందెశ్రీ స్మృతివనం’కు భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. BRS ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే దాదాపు 70వేల ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలు అందించిందన్నారు. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తున్నామని, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నామని తెలిపారు.

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం
AP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. విశాఖ నుంచి భోగాపురానికి అనుసంధానంగా నిర్మిస్తున్న 7 మాస్టర్ ప్లాన్ రహదారుల్లో 4 పూర్తయ్యాయి. విమాన ప్రయాణికుల కోసం RTC 20 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేయగా, తొలి విడతలో 3 బస్సులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. గురుద్వారా, వుడా పార్క్, ఆటోనగర్, వెంకోజీపాలెంలో ప్యాసింజర్ లాంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గాల్లో పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

నదుల అనుసంధానంతో కరువుకు చెక్
AP: రాష్ట్రంలో ఈ ఏడాది 48 శాతం వర్షాభావం నమోదైనా సాగునీటి సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 450 TMCల నీటిని కృష్ణా డెల్టాకు తరలించి రూ.50 వేల కోట్ల విలువైన పంటలను కాపాడామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని వెల్లడించారు. నదుల అనుసంధానంతో కరువు సమస్యను అధిగమిస్తామన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెనింగ్ ఆగస్ట్ 1న
భొగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది.ఆగస్టు ఒకటిన ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఎయిర్ పోర్టు ఓపెన్ కాబోతోంది. భోగాపురం ఎయిర్ పోర్టుపై సీఎం చంద్రబాబు జరిపిన సమీక్షలో ఈ విషయం చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారమని, ఎయిర్ పోర్టులు, టూరిజం ప్రాజెక్టులు, పోర్టులు, హైవేలు, ఇండస్ట్రీలతో ఉత్తరాంధ్ర అన్ స్టాపబుల్ గా దూసుకు పోవాలని సీఎం అన్నారు.

ఏపీలో ఒమిక్రాన్ RF.5వేరియంట్ - మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తించారు. ఇది కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఒక ఉపవంశం, ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ ఉపవంశాల్లో RF.5 కూడా ఒకటి. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 4 నమూనాలను వైద్య ఆరోగ్యశాఖ పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపింది. వాటి ఫలితాలు ఇప్పుడు అందాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సెల్ ఫోన్ ద్వారా మాట్లాడారు.

పదేళ్లుగా 152 ఎగ్జామ్ పేపర్స్ లీక్- రాహుల్ గాంధీ
దేశంలో గత పదేళ్లలో ఏకంగా 152 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. డెహ్రాడూన్‌లో విద్యార్థులతో మాట్లాడిన ఆయన, ఈ లీకేజీల వల్ల కోట్లాది మంది యువత భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను కొందరు గుత్తాధిపత్యం చేస్తున్నారని విమర్శించారు. పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా పటిష్టమైన చట్టం తేవాలని, విద్యార్థుల కష్టానికి తగిన న్యాయం జరగాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

గౌరవంగా తప్పుకోండి- ధర్మేంద్రకు ప్రముఖుల లేఖ
నీట్-యూజీ సహా పలు జాతీయ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 'గౌరవప్రదంగా రాజీనామా చేయాలి' అని కోరుతూ దేశవ్యాప్తంగా వందలాది మంది ప్రముఖ విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. పరీక్షల లీకేజీలు, అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విద్యార్థుల్లో నమ్మకం పునరుద్ధరించడానికి, ఈ పరీక్షల సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు.

సోనం వాంగ్ చుక్ కు ఇరోమ్ షర్మిల మద్దతు !
సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మణిపూర్ హక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిల మద్దతు ప్రకటించారు. మార్పు కోసం చేసే ఈ పోరాట బాధ్యత కేవలం వాంగ్‌చుక్ ఒక్కరిదే కాదని, ప్రతి పౌరుడూ ఇందులో భాగస్వామి కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఏ ఒక్క నిరసనకారుడూ అమరవీరుడు కాకూడదన్న షర్మిల, ప్రజలంతా భారీగా తరలివచ్చి ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వం దిగివస్తుందని స్పష్టం చేశారు.

తనను దీక్షా స్థలికి పంపాలంటూ సోనమ్ పట్టు !
విద్యా మంత్రి రాజీనామా కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ ఆస్పత్రిలో కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయన చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఈ రోజుతో 21వ రోజుకు చేరింది. ఆరోగ్యం క్షీణించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ ఉదయం సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించగా తనను తిరిగి జంతర్ మంతర్ పంపాలని ఆయన మొండిపట్టు పట్టారు. నీట్-యూజీ అక్రమాలపై కేంద్ర మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ జూన్ 28 నుండి ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. మద్దతుదారులు జూలై 20న పార్లమెంట్ మార్చ్‌ను యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించారు.

పుష్ప 2 సుకుమార్ కు నేషనల్ అవార్డ్ !
జాతీయ చలన చిత్ర అవార్డుల 72వ వేడుకలో తెలుగు సినిమాకు అవార్డుల పంట పండింది. స్టార్ హీరో అల్లూ అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ డైరక్టర్ సుకుమార్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ (ఒరిజినల్) అవార్డు దక్కింది.అలాగే పుష్ప 2 మూవీ కాస్ట్యూమ్ డిజైనర్లుగా శీతల్ శర్మ, దీపాలీ సూర్ లకు జాతీయ పురస్కారం లభించింది.

ఇరాన్ ప్రభుత్వానికి అతివాద శక్తుల వార్నింగ్ !
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత అక్కడ అధికారం కోసం యుద్ధం మొదలైంది. US తో శాంతి చర్చలు జరుపుతున్న అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశీ మంత్రిలను అక్కడి తీవ్రవాద శక్తులు టార్గెట్ చేస్తున్నారు. ఖమేనీ అంత్యక్రియల్లో దేశ నాయకులను "ద్రోహులు" అని నిందిస్తూ రాళ్లు రువ్వారు. కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు రాకపోవడంతో, అధ్మ్యక్షుడు అతని బృందం రాజకీయ కుట్రకు ప్లాన్ చేస్తున్నారని హార్డ్‌లైనర్స్ ఆరోపిస్తున్నారు. "ప్రెసిడెంట్ గారూ, మా కండిషన్స్ వినకపోతే మా బ్లేడ్ మీ మెడపై ఉంటుంది" అంటూ కొందరు బహిరంగంగానే బెదిరింపులు చేస్తుండటంతో ఇరాన్ లో పొలిటికల్ హీట్ పెరిగింది.