Latest

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వాంగ్‌చుక్ భార్య
India· 19 Jul 2026

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వాంగ్‌చుక్ భార్య

ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, ఆయన భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వాంగ్‌చుక్‌ను అక్రమంగా నిర్బంధించారని, వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె పిటిషన్‌లో కోరారు. వ్యక్తిగత వైద్యులు, న్యాయవాదులను కలిసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 21 రోజుల నిరాహార దీక్ష అనంతరం పోలీసులు ఆయనను శనివారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారని, చికిత్స విషయంలో పారదర్శకత లేదని ఆమె ఆరోపించారు.

బెట్టింగ్ కోసం చోరీ.. నిందితుడు అరెస్ట్
Crime· 19 Jul 2026

బెట్టింగ్ కోసం చోరీ.. నిందితుడు అరెస్ట్

TG: హైదరాబాద్‌లోని సరస్వతినగర్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవాలయంలో జరిగిన చోరీ కేసును సరూర్‌నగర్ పోలీసులు ఛేదించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువకుడు బూర్ల అనిల్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, హుండీ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీ నష్టాలు రావడంతో అప్పుల పాలైన నిందితుడు డబ్బు కోసం ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో దేవాలయంలోకి ప్రవేశించి చోరీ చేసిన అతడిని CCTV దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

రెండు గ్రామాల మధ్య వివాదం.. ఉద్రిక్తత
AP· 19 Jul 2026

రెండు గ్రామాల మధ్య వివాదం.. ఉద్రిక్తత

AP: పల్నాడు జిల్లాలో బయ్యవరం, మునగోడు గ్రామస్థుల మధ్య కృష్ణానది జలాల ఊరేగింపు ఉద్రిక్తతకు దారితీసింది. సాంప్రదాయం ప్రకారం గ్రామదేవత పూజ కోసం కొందరు కృష్ణానదికి వెళ్లారు. వాళ్లను గ్రామ సెంటిమెంట్‌ దెబ్బతింటుందని మునగోడు గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. పల్నాడు పోలీసులు భారీ బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చించారు. పోలీసులు వేగంగా స్పందించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి వచ్చింది.

చెరువులో విగ్రహం కోసం గాలింపు ముమ్మరం
Crime· 19 Jul 2026

చెరువులో విగ్రహం కోసం గాలింపు ముమ్మరం

TG: హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఫీర్జాదిగూడలోని సమీపంలోని ఓ ఆలయంలోకి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని చెరువులోకి దూకినట్లు గుర్తించారు. తేజస్విని మృతదేహం లభించగా, కేసులో విగ్రహం కీలక ఆధారంగా మారే అవకాశం ఉండటంతో DRF సిబ్బంది బోట్ల సహాయంతో విగ్రహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె నెలకు దాదాపు రూ. లక్ష అద్దె చెల్లిస్తున్న ఫ్లాట్, ఆర్థిక లావాదేవీలు, డెత్ డిక్లరేషన్, CCTV ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

రేవంత్, KTRల మధ్య చీకటి ఒప్పందం
Politics· 19 Jul 2026

రేవంత్, KTRల మధ్య చీకటి ఒప్పందం

TG: BJP MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్, BRS పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. HYD నాంపల్లిలోని BJP స్టేట్ ఆఫీస్‌లో మాట్లాడిన ఆయన, CM రేవంత్ రెడ్డి, KTR మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు యువతను మోసం చేశాయని, బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల BRS పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, కాంగ్రెస్ రెండున్నరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

బహదూర్‌గూడలో అర్ధరాత్రి హైటెన్షన్
TG· 19 Jul 2026

బహదూర్‌గూడలో అర్ధరాత్రి హైటెన్షన్

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం జరుగుతున్న భూసేకరణపై అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. దీక్ష చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించి, తెల్లవారుజామున విడుదల చేశారు. దీక్షా శిబిరాన్ని తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. 650ఎకరాల భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు గతకొన్ని రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. సరైన పరిహారం, పునరావాసంపై స్పష్టత లేకుండానే భూములు తీసుకోవడం సరికాదని ఆరోపించారు. రైతులకు మద్దతుగా వచ్చిన రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులనూ పోలీసులు అడ్డుకున్నారు.

నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో టోకరా
Crime· 19 Jul 2026

నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో టోకరా

TG: హైదరాబాద్‌లోని నాగోల్ బండ్లగూడకు చెందిన వెంకట్ రెడ్డి విదేశీ ఉద్యోగం పేరుతో సైబర్ మోసగాళ్ల బారినపడి రూ.4.64 లక్షలు కోల్పోయాడు. ఉద్యోగం కోసం Naukri.comలో రెజ్యూమ్ అప్‌లోడ్ చేయగా, దినేష్ మిట్టల్ అనే వ్యక్తి తనను నైకరీ గల్ఫ్ సర్వీస్ ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు. ఖతర్ యూనివర్సిటీలో అధ్యాపకుని ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రిక్రూట్మెంట్ ప్రక్రియ పేరుతో పలుదఫాలుగా డబ్బులు వసూలు చేశాడు. అనంతరం నకిలీ నియామక ఉత్తర్వులు, ఖతర్ యూనివర్సిటీ పేరుతో నకిలీ ఈమెయిల్ పంపించాడు. మోసాన్ని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం
Politics· 19 Jul 2026

కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం

TG: వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ అడుప మహేష్‌పై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయన ముఖం, మెడ, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను స్థానిక MGM ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. MLA కేఆర్ నాగరాజు ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించి, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

ప్రియాంక చోప్రా బర్త్‌డే.. రాజమౌళి బిగ్ సర్‌ప్రైజ్
Cinema· 19 Jul 2026

ప్రియాంక చోప్రా బర్త్‌డే.. రాజమౌళి బిగ్ సర్‌ప్రైజ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బర్త్‌డే సందర్భంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రం నుంచి ఆమె కొత్త లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రియాంక మందాకిని అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. “ఆమె నవ్వితే హుందాతనం.. నవ్వకపోతే అగ్ని కణం” అనే క్యాప్షన్‌తో రాజమౌళి ఈ ఫోటోలను Xలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, ప్రియాంక కొత్త రూపం వాటిని మరింత పెంచింది.

శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తాం
India· 19 Jul 2026

శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తాం

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని రేపు నిర్వహించనున్న ‘చలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. ఈ మార్చ్‌ను ఐదు ప్రధాన అంశాలతో శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భారత త్రివర్ణ పతాకమే ఉంటుందని, ఏ రాజకీయ పార్టీ లేదా సంస్థ జెండాలు ఉండవని స్పష్టంచేశారు. పాల్గొనేవారు భారత రాజ్యాంగం లేదా మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్ ఫోటోలను తీసుకురావాలని సూచించారు. సానుకూల నినాదాలే చేయాలని, హింసకు పాల్పడకూడదని వాంగ్‌చుక్ తెలిపారు.

మహిళ మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
TG· 19 Jul 2026

మహిళ మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

TG: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నీలాద్రి హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మంజుల(23) మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండానే ఇంజెక్షన్ ఇచ్చారని, దానికి రియాక్షన్ రావడంతో మరో ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యమే మంజుల మృతికి కారణమని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి
AP· 19 Jul 2026

తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి

AP: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అనంతపురం జిల్లా పామిడి మండలంలో పంటల పరిస్థితిని డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. పొగరూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో పత్తి, కంది, సజ్జ పంటలను పరిశీలించి రైతులతో వారు మాట్లాడారు. పంటల ఎదుగుదల, వర్షాభావ ప్రభావంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమాలో నమోదు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినా బీమా ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ అటెండెన్స్‌లో ఆదిలాబాద్ టాప్
Education· 19 Jul 2026

అంగన్‌వాడీ అటెండెన్స్‌లో ఆదిలాబాద్ టాప్

TG: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల అటెండెన్స్‌ జిల్లాల వారీగా అనుహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లా 93.47 శాతం హాజరుతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కొమురంభీం, ఖమ్మం, ములుగు జిల్లాలు కూడా 80 శాతానికి పైగా హాజరుతో మెరుగైన ఫలితాలు నమోదు చేశాయి. మరోవైపు కరీంనగర్ జిల్లా కేవలం 52.69 శాతం హాజరుతో చివరి స్థానంలో నిలిచింది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కూడా తక్కువ అటెండెన్స్ నమోదు అయింది. అభివృద్ధి చెందిన జిల్లాల్లో హాజరు తగ్గడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

శుభకార్యానికి వెళ్తుండగా ఘోర విషాదం
AP· 19 Jul 2026

శుభకార్యానికి వెళ్తుండగా ఘోర విషాదం

AP: విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం-అనకాపల్లి నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుండం సమీపంలో కారు అదుపుతప్పి ముందువెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిరుద్యోగులు వారి ట్రాప్‌లో పడొద్దు
Jobs· 19 Jul 2026

నిరుద్యోగులు వారి ట్రాప్‌లో పడొద్దు

TG: నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు BRSకు లేదని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ ఫైరయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. BRS హయాంలో 16 పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఏనాడు పరామర్శించలేదు, పట్టించుకోలేదన్నారు. స్వార్థం కోసం, నిరుద్యోగులపై బీఆర్ఎస్ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని, నిరుద్యోగులు వారి ట్రాప్‌లో పడొద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 70వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 30వేల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.

జీరో అడ్మిషన్లు.. విచారణలో షాకింగ్ ట్విస్ట్
Education· 19 Jul 2026

జీరో అడ్మిషన్లు.. విచారణలో షాకింగ్ ట్విస్ట్

TG: విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూర్యాపేట జిల్లా తుంగుతర్తి మండలం బండరామారం ZP హైస్కూల్ HMతో పాటు నలుగురు ఉపాధ్యాయులను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సస్పెండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క కొత్త అడ్మిషన్ కూడా లేకపోవడంతో కలెక్టర్, DEO విచారణ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకు పంపించేలా ఉపాధ్యాయులే ప్రోత్సహించినట్లు, పాఠశాల ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరించినట్లు గుర్తించారు. రికార్డుల నిర్వహణలో లోపాలు, అధికారుల ఆదేశాల ఉల్లంఘన కూడా బయటపడింది. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీపడబోమని, బాధ్యులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తాం
Jobs· 19 Jul 2026

ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తాం

తెలంగాణలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగులకు నియామక పత్రాలు అందిస్తామని CM రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న ‘అందెశ్రీ స్మృతివనం’కు భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. BRS ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే దాదాపు 70వేల ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలు అందించిందన్నారు. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తున్నామని, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నామని తెలిపారు.

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం
AP· 19 Jul 2026

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం

AP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. విశాఖ నుంచి భోగాపురానికి అనుసంధానంగా నిర్మిస్తున్న 7 మాస్టర్ ప్లాన్ రహదారుల్లో 4 పూర్తయ్యాయి. విమాన ప్రయాణికుల కోసం RTC 20 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేయగా, తొలి విడతలో 3 బస్సులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. గురుద్వారా, వుడా పార్క్, ఆటోనగర్, వెంకోజీపాలెంలో ప్యాసింజర్ లాంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గాల్లో పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

నదుల అనుసంధానంతో కరువుకు చెక్
AP· 19 Jul 2026

నదుల అనుసంధానంతో కరువుకు చెక్

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 48 శాతం వర్షాభావం నమోదైనా సాగునీటి సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 450 TMCల నీటిని కృష్ణా డెల్టాకు తరలించి రూ.50 వేల కోట్ల విలువైన పంటలను కాపాడామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని వెల్లడించారు. నదుల అనుసంధానంతో కరువు సమస్యను అధిగమిస్తామన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెనింగ్ ఆగస్ట్ 1న
News· 18 Jul 2026

భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెనింగ్ ఆగస్ట్ 1న

భొగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది.ఆగస్టు ఒకటిన ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఎయిర్ పోర్టు ఓపెన్ కాబోతోంది. భోగాపురం ఎయిర్ పోర్టుపై సీఎం చంద్రబాబు జరిపిన సమీక్షలో ఈ విషయం చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారమని, ఎయిర్ పోర్టులు, టూరిజం ప్రాజెక్టులు, పోర్టులు, హైవేలు, ఇండస్ట్రీలతో ఉత్తరాంధ్ర అన్ స్టాపబుల్ గా దూసుకు పోవాలని సీఎం అన్నారు.

ఏపీలో ఒమిక్రాన్  RF.5వేరియంట్ - మంత్రి
News· 18 Jul 2026

ఏపీలో ఒమిక్రాన్ RF.5వేరియంట్ - మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తించారు. ఇది కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఒక ఉపవంశం, ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ ఉపవంశాల్లో RF.5 కూడా ఒకటి. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 4 నమూనాలను వైద్య ఆరోగ్యశాఖ పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపింది. వాటి ఫలితాలు ఇప్పుడు అందాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సెల్ ఫోన్ ద్వారా మాట్లాడారు.