Latest
సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌పై అభిజిత్ దీప్కే ఎమోషనల్!
ఢిల్లీ: సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బెడ్‌షీట్స్ కప్పి బలవంతంగా తీసుకెళ్లడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అభిజిత్ దీప్కే ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. "ఆయన ఏమైనా క్రిమినలా? అంత హెల్త్ కేర్ ఉంటే గౌరవంగా తీసుకెళ్లాలి కానీ, ఇలా బెడ్‌షీట్లలో దాచి తరలించడం ఏంటి?" అని ఎమోషనల్ అయ్యారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ నిరసనలను పోలీసులు ఆపాలని చూస్తే, దేశంలోని ప్రతి స్టేట్, ప్రతి డిస్ట్రిక్ట్‌లో ప్రజలు ఒక జంతర్ మంతర్‌ను క్రియేట్ చేసి ప్రొటెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు.

మాజీ భార్య ఇంటి వద్ద కానిస్టేబుల్ హల్‌చల్
TG: మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ PSకు చెందిన కానిస్టేబుల్ కార్తీక్‌పై మాజీ భార్య ప్రవీణ తీవ్ర ఆరోపణలు చేశారు. విడాకుల అనంతరం ఆస్తి పత్రాల కోసం తనను వేధిస్తున్నాడని, ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తూ మద్యం మత్తులో కత్తులతో ఇంటికి వచ్చాడని ఆరోపించారు. అతడితో పాటు వచ్చిన ఇద్దరు మహిళలు కూడా తనపై దాడి చేశారని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా తనపై నిఘా పెట్టిస్తున్నాడని, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్‌ను వెంటనే అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాలని బాధితురాలు అధికారులను కోరారు.

స్టీలు ప్లేటులో పర్యావరణ పాఠం
TG: పాఠాలు చెప్పడమే కాదు..ఆచరించి చూపించి విద్యార్థులకు నేర్పుతాం అంటున్నారు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు. జిల్లా స్థాయి శిక్షణలో టీచర్లు తమ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన అందించేందుకు లంచ్ టైంలో ఇంటి నుండి తెచ్చుకున్న స్టీల్ ప్లేట్లలో తిన్నారు. ఇళ్ల నుంచే స్టీల్ ప్లేట్స్, గ్లాసులు, బాటిళ్లు తెచ్చుకోవాలని పిల్లలకు చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విడిచిపెట్టి, పర్యావరణరహితమైన వస్తువులనే వాడాలని తెలిపారు.

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన రఘురామకృష్ణ రాజు
AP: కుడిభుజానికి ఆపరేషన్ చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు పరామర్శించారు. వారితోపాటు శాసనసభ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ కూడా పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు.

స్కైరూట్ ఏరోస్పేస్..ఇది చాలా ప్రత్యేకం
2018లో ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా స్థాపించిన సంస్థే ఈ స్కైరూట్ ఏరోస్పేస్. ప్రపంచంలోని మినీ-సాటిలైట్ మార్కెట్ కోసం వాణిజ్యపరంగా ప్రయోగ వాహనాలను డెవలప్ చేయడానికి దీన్ని మొదలుపెట్టారు. మొదట్లో ఈ సంస్థ ప్రయోగ వాహనాల టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. ప్రయోగ ఖర్చు, ఉత్పత్తి సమయం తగ్గించే లక్ష్యంతో పనిచేసింది. ప్రస్తుతం నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1 సాటిలైట్ ఈ సంస్థ తయారు చేసిందే.

బడిలో మిగిలింది టీచరమ్మే
TG: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కడాపగండి తండా ప్రాథమిక పాఠశాలలో టీచరే విద్యార్థిగా మారింది. గతేడాది ఆ పాఠశాల మూతపడినా నేతల ఒత్తిడితో ఈ ఏడాది తెరుచుకుంది. మొదట్లో 13 మంది విద్యార్థులు వచ్చేవారు. రానురానూ ఆ సంఖ్య పూర్తిగా తగ్గిపోయి ఒక విద్యార్థి మాత్రం వస్తున్నాడు. శుక్రవారం ఒక్క విద్యార్థి ఇంటికి వెళ్లిపోవడంతో టీచర్ ఒక్కరే కూర్చున్నారు.
బీఆర్ఎస్ నేత R.S.ప్రవీణ్ కుమార్ అరెస్ట్
TG: హైదరాబాద్ నగరం సరూర్‌నగర్‌లో యువసంగ్రామ సదస్సు ఉందని చెప్తున్నా వినకుండా, పైనుండి ఆదేశాలు ఉన్నాయని పోలీసులు ఉదయాన్నే తనను అరెస్టు చేసినట్టు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. మల్కాజిగిరి పోలీసులు, హైకోర్టు సభకు అనుమతి ఇచ్చినా ఇలా అరెస్ట్ చేసి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా సభకు వెళ్తానని, లేదా అమరణ దీక్ష చేస్తానని తన X అకౌంట్లో చెప్పారు.

నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1
AP: దేశంలోనే మొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లింది. స్కైరూట్ స్టార్టప్ తయారు చేసిన ఈ రాకెట్‌ను శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం ఇవాళ మధ్యాహ్నం 12.04 గంటలకు ప్రయోగించింది. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం రెండు దశలు సక్సెస్ అయ్యాయి. దీంతో దేశ ఆస్ట్రానమీ రంగంలో ఓ కొత్త అధ్యాయం మొదలైందని శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్కైరూట్ స్టార్టప్ 2018లో భారత్ మొదలుపెట్టిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ సంస్థ. ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది.

రూ.20 కోసం తల నరికేశాడు
TG: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్ దగ్గర నిన్న దారుణం జరిగింది. పర్సనంబాల గ్రామానికి చెందిన సోమయ్య(65) అనే వృద్దుడిని తుంగెడ గ్రామానికి చెందిన నగేష్ దారుణంగా హత్య చేశాడు. రైల్వే స్టేషన్ దగ్గర నగేష్, సోమయ్య దగ్గరకొచ్చి టీ కోసం రూ.20 అడిగాడు. డబ్బులు లేవని సోమయ్య చెప్పి ముందుకు వెళ్లిపోయాడు. నగేష్ అతణ్ని వెంబడించి గొడ్డలితో తల నరికి పారిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఆసిఫాబాద్ హాస్పిటల్‌కు తరలించారు. నగేష్ కోసం పోలీసులు వెతుకున్నారు.
స్లీపర్ బస్సులో మంటలు..అందరూ సేఫ్
తమిళనాడు రాష్ట్రం పెరంబలూరు జిల్లాలోని చెన్నై-తిరుచ్చి హైవేపై మంగళమేడు దగ్గర్లో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి మదురై వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు వాహనాన్ని పూర్తిగా చుట్టుముట్టక ముందే డ్రైవర్ బస్సులోని 23 మందిని కిందకు దింపాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి దర్యాప్తు చేస్తున్నారు.

సోనమ్ వాంగ్‌చుక్‌కు అనసూయ సపోర్ట్
నటి అనసూయ భరద్వాజ్ ‘చలో సంసద్’ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ చేసిన సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. ప్రజలు శాంతియుతంగా తమ సమస్యలు చెపుతున్నప్పుడు పాలకులు స్పందించాలని, ప్రశ్నలను స్వాగతించినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఒక తల్లిగా పిల్లలకు మెరిట్, నిజాయితీ, జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థ అవసరమని, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష ఆ దిశగా ఆలోచింపజేస్తోందని తెలిపారు. జూలై 20 నుంచి జరిగే ‘చలో సంసద్’ కార్యక్రమానికి ఇప్పటికే ప్రకాశ్ రాజ్, అభయ్ డియోల్, అనురాగ్ కశ్యప్, తదితరులు మద్దతు ప్రకటించారు.

కొండపి వద్ద బస్సు ప్రమాదం
AP: ప్రకాశం జిల్లా కొండపి దగ్గర ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. కొండపి నుండి మద్దులూరు మీదుగా ఒంగోలు వెళ్తుండగా ద్వారకా సీఫుడ్స్ వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఆ టైమ్‌లో బస్సులో 60 మంది పాసింజర్స్ ఉండగా వాళ్లలో 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారిలో కొందరికి స్వల్పగాయాలు కాగా, కొండపి గవెర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. మలుపు వద్ద ఎక్కువ ముళ్లపొదలు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనం కనిపించలేదని స్థానికులు అంటున్నారు.

బహదూర్‌గూడలో హైటెన్షన్
TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చేపట్టనున్న భూసేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. భూములను అప్పగించేందుకు రైతులు నిరాకరిస్తూ గత ఆరు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. స్పష్టమైన పరిహారం, పునరావాస హామీలు ప్రకటించిన తర్వాతే భూములు ఇస్తామని రైతులు స్పష్టం చేశారు. హైడ్రా బృందాలు భూసేకరణ ప్రాంతానికి చేరుకోగా, భారీగా పోలీసులు, అధికారులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు బుల్లెట్ ట్రైన్
TG: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బుల్లెట్ ట్రైన్ మార్గానికి తెలంగాణ ప్రభుత్వం అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి కేంద్ర ప్రభుత్వానికిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లాలంటే గంటల కొద్దీ సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వేలాదిమంది భక్తులు తరచూ వెళ్తుంటారు. ఈ ఉద్దేశంతో అలైన్‌మెంట్ మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. శంషాబాద్, భారత్ ఫ్యూచర్‌సిటీ, ఆమనగల్లు, మన్ననూరు, శ్రీశైలం, సోమశిల మీదుగా బెంగళూరుకు దారిని ప్రతిపాదించారు.

ఆస్పత్రిలో MLA సర్‌ప్రైజ్ విజిట్
AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె MLA షాజహాన్ బాషా శుక్రవారం రాత్రి బైక్‌పై ఒంటరిగా వచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎమర్జెన్సీ వార్డును సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విషం సేవించి చికిత్స పొందుతున్న ఓ మహిళను పరామర్శించి, ఆమెను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని డాకర్లకు సూచించారు.

క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్ పేరుతో భారీ మోసం
TG: హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ఎం. మధుకర్ గౌడ్ క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్ పేరుతో సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి రూ.8.52 లక్షలు కోల్పోయారు. RBL బ్యాంక్ అధికారినని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి, కొత్త క్రెడిట్ కార్డు ఇస్తామని నమ్మించి కార్డు నంబర్, CVV వివరాలు తీసుకున్నాడు. అనంతరం వరుసగా OTPలు రావడంతో మూడు క్రెడిట్ కార్డుల నుంచి మొత్తం రూ.8,52,644 డెబిట్ అయ్యింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విజయవాడలో డయేరియా కలకలం
AP: విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గిరిపురంలో డయేరియా కలకలం రేపుతోంది. రెండు వీధులకు చెందిన సుమారు 20 మంది డయేరియా బారిన పడగా, పలువురు చికిత్స పొందుతున్నారు. కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతుండటమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గురువారం రాత్రి ఒకేసారి ఐదుగురు డయేరియా బాధితులను గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండేళ్ల చిన్నారికి తీవ్ర విరోచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని, హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించాలని కోరారు.
ఒక్క ఫిర్యాదుతో హాస్టల్‌కు వెళ్లిన CM విజయ్
తమిళనాడు CM విజయ్ తనదైన స్టైల్‌లో పాలనను చూపిస్తున్నారు. హాస్టల్‌లో భోజనం నాణ్యత సరిగ్గా లేదంటూ ఓ విద్యార్థి సీఎంకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన విజయ్ వెంటనే హాస్టల్ విద్యార్థులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వార్డెన్, వాచ్‌మెన్ల ప్రవర్తన బాగాలేదని, CCTV కెమెరాలు పనిచేయడం లేదని, నీటి సమస్యలు ఉన్నాయని వారు తెలిపారు. విద్యార్థులు చెప్పిన ప్రతి సమస్యను విన్న ఆయన, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
జంతర్ మంతర్ వద్ద అభిజీత్ దీప్కే నిరసన
ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లారని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఈ సందర్భంగా వందలాది మంది యువతతో ఆయన శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీట్, తదితర ఉద్యోగ, ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలు, పేపర్ లీకేజీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న పార్లమెంట్‌ను ముట్టడించనున్నట్లు తెలిపారు. పేపర్ లీక్‌లపై తమ పోరాటం ఆగదన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ బస్సు డ్రైవర్లు
TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ KLR కాలేజ్ బస్సు డ్రైవర్ భాస్కర్, కొత్తగూడెం SRDG జూనియర్ కాలేజ్ బస్ డ్రైవర్ అజయ్ కుమార్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు స్కూల్ బస్సులు, భారీ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తాగి వాహనాలు నడుపుతున్న డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ SI ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేందమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడంలో ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వైద్య పరీక్షల కోసం ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. నీట్, ఇతర పరీక్షల ప్రశ్నపత్రాల లీక్, అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వాంగ్‌చుగ్ జూన్ 28న నిరవధిక దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే.