Latest
నా కొడుకు టెర్రరిస్ట్ కాదు: హీరో యశ్ తల్లి
కన్నడ హీరో యశ్ తల్లి పుష్ప అరుణ్‌కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. “నా కొడుకు టెర్రరిస్ట్ కాదు. అతను కర్ణాటకలోనే పుట్టి పెరిగాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, సొంతంగా ఈ స్థాయికి చేరుకున్నాడు. అతని ఎదుగుదలకు మీరెందుకు భయపడుతున్నారు?” అని అన్నారు. “KGFకి ముందే అతను అనేక హిట్ సినిమాలు ఇచ్చాడు. కన్నడలో సక్సెస్‌ఫుల్ స్టార్. ఎవరూ ఇవ్వని అవకాశాలు తన కష్టంతో సాధించుకున్నాడు” అని చెప్పారు. ‘KGFకి ముందు యశ్ ఎవరో తెలుసా’ అని గతంలో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్‌కు ఆమె పరోక్షంగా ఆన్సర్ చేశారని చర్చ సాగుతోంది.

మనకు కలలెందుకు వస్తాయో తెలుసా?
మనం నిద్రపోతున్నప్పుడు కలలొస్తాయి. నిద్ర లేచాక చాలావరకు మర్చిపోతాం. ఆ కలలెందుకు వస్తాయో తెలుసా? రోజంతా మనం చేసిన పనులు, విన్న విషయాలు, అనుభవాలను మెదడు రాత్రి సమయంలో విడదీసి ముఖ్యమైన వాటిని దాచుకుంటుంది. అవే మనకు కలలుగా వస్తాయి. మనలోని ఆందోళనలు, భయాలు, సంతోషాలను మెదడు కలల రూపంలో ప్రాసెస్ చేస్తుంది. నిద్రలో కంటి కదలికలు జరిగే Rapid Eye Movement దశలో మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఈ టైంలోనే కలలు ఎక్కువగా వస్తాయి. నిద్రలో మెదడు న్యూరాన్లు రియాక్ట్ అవ్వడం వల్ల కూడా చిత్రమైన కలలు వస్తుంటాయి.

అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రసాద్ పథకంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తెలంగాణలోని సుమారు 15 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలంపూర్‌లో ఏర్పాటు చేసిన మల్టీమీడియా సౌండ్, లైట్ షోతో టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి అన్నారు.

అలంపూర్‌లో రూ.4.60 కోట్లతో లైట్ షో
అలంపూర్‌లో రూ.4.60 కోట్లతో ఏర్పాటు చేసిన మల్టీమీడియా సౌండ్, లైట్ షోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన అలంపూర్ ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని వెలుగు, ధ్వని సమ్మేళనంతో ప్రదర్శించేలా ఈ షోను రూపొందించారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ, ఎమ్మెల్యే విజయుడు, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఒగ్గు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది.
న్యూయార్క్‌లో భారత్ జాతీయ జెండాకు అవమానం
న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ దగ్గర RSS చీఫ్ మోహన్ భగవత్ ‘Universal Oneness Celebration’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆ టైంలో బయట ప్రో-ఖలిస్తానీ మూలాల నుంచి వచ్చిన నిరసనకారులు భారత జాతీయ జెండాను చింపేసి, కాలికి కట్టుకుని ఫోటోలు తీసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిరసనకారులు “Modi is the face of Hindu terror” పేరుతో బ్యానర్లు పట్టుకొని, భగవత్ కటౌట్‌పై చెప్పుల దండ వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

అంకాలమ్మ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే
అచ్చంపేట పట్టణంలోని అంకాలమ్మ దేవాలయం వద నిర్వహించిన ముత్తరాశి బోనాల పండుగ ఉత్సవాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు, ముత్తరాశి సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజాం రహదారిపై పశువుల బెడద తీరదా?
రాజాం పట్టణ ప్రధాన రహదారిపై పశువుల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. రోడ్డు మధ్యలో పశువులు గుంపులుగా సంచరించడం, రోడ్డుపైనే పడుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ రోడ్డు, డోలపేట సెంటర్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పశువులు అడ్డంగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. పశువుల యజమానులు తమ పశువులను రోడ్లపై వదిలేసి పట్టించుకోకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు.
ఐదుగురు దొంగల ఆట కట్టించిన మహిళ
మహారాష్ట్ర వాషిమ్ జిల్లాలో ఒక మహిళ ఐదుగురు దొంగల ఆట కట్టించింది. స్కార్పియోలో వచ్చిన ఐదుగురు ముసుగు దొంగలు గోపాల్ జ్యువెలర్స్‌లో చోరీకి ట్రై చేశారు. షాప్ లాక్ తీసి లాకర్ కట్ చేస్తుండగా మహిళ వారిని గమనించి అడ్డుపడింది. దొంగలపై రాళ్లతో విరుచుకుపడింది. దీంతో దొంగలు పరారయ్యారు. ఈ సీన్ సీసీటీవీలో రికార్డయ్యింది. పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.
కడప పట్టణంలో మోస్తారు వర్షం
వర్షాలు లేక ఇటు రైతులు అటు సామాన్య ప్రజలు సాగు, తాగునీరు సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ టైంలో కడప పట్టణంలో సాయంత్రం ఓ మోస్తారు నుండి భారీ స్థాయిలో వర్షం కురిసింది. దీంతో కడప పట్టణ ప్రజలకు, రైతులకు భారీ ఉపశమనం కలిగినట్టయ్యింది.

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిష్కారానికి చొరవ
AP: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చొరవ చూపారు. యూజీసీ పే స్కేళ్లు, కమిటీ సిఫార్సు చేసిన వేతన పెంపును అమలు చేయాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్, ఏఎన్‌యూ వైస్‌చాన్స్‌లర్‌తో ఫోన్‌లో చర్చించారు. వేతన పెంపు సిఫార్సులను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఆమోదించి అమలు చేయాలని కోరారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్హులైన ప్రొఫెసర్ల సేవలను క్రమబద్ధీకరించాలని అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు.

అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై వెలగని స్ట్రీట్ లైట్లు
పల్నాడు జిల్లా దాచేపల్లి అద్దంకి-నార్కెట్‌పల్లి దారిలో సాయంత్రం సమయంలో స్ట్రీట్ లైట్లు వెలగక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అధికారులు వెంటనే లైట్లు వెలిగే విధంగా చూడాలని కోరుతున్నారు.

కల్వకుర్తిలో 2కే రన్
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నాగర్‌కర్నూల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో 2కె రన్ సే నో టూ డ్రగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలనే సందేశంతో ఈ 2కే రన్ నిర్వహించారు. హైదరాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమైన 2కే రన్ ఎంపీడీవో కార్యాలయం దాకా కొనసాగింది. తిరిగి హైదరాబాద్ చౌరస్తాకు చేరుకోవడంతో రన్ విజయవంతంగా ముగిసింది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విజేతలకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు.

కర్ణాటకలో యూత్ కాంగ్రెస్ భారీ నిరసన
బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ ఆఫీసు బయట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పబ్లిక్ ర్యాలీ తర్వాత శ్రీ రామ్ సేనా ధర్మార్థ సేవా న్యాస్ అక్కడ శుద్ధీకరణ హవన్ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ నిరసన తెలిపింది. బీజేపీ దళితులపై వివక్ష చూపుతోందని నేతలు ఆరోపించారు. మైసూరులోనూ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు.

దామెరలో తొలిసారిగా రైతు మార్కెట్
గ్రామీణ రైతులకు తమ పంటకు స్థానికంగానే మంచి మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో మొట్టమొదటిసారిగా రైతు మార్కెట్(కూరగాయల మార్కెట్) ఏర్పాటు చేశారు. ఇది గ్రామ రైతులకు ఎంతో ఉపయోగకరమైన ముందడుగుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. వారం సంతగా మాత్రమే కాకుండా, దామెర గ్రామంలో కూరగాయలు పండించే రైతులు నేరుగా విక్రయించుకునే వేదికగా ఏర్పాటు చేసినట్టు సర్పంచ్ పద్మ, ఉపసర్పంచ్ మద్దే కుమార్ తెలిపారు.

ప్రిన్సిపాల్ అవమానించిందని..దళిత అమ్మాయి ఆత్మహత్య
ప్రిన్సిపాల్ అవమానించిందని తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా ఉసిలంపట్టికి చెందిన దళిత అమ్మాయి(16) ఆత్మహత్య చేసుకుంది. నర్సింగ్ చదవాలనుకున్న ఆ అమ్మాయి అడ్మిషన్ కోసం ప్రభుత్వ మోడల్ సెకండరీ స్కూల్‌కి తన తల్లితో కలిసి వచ్చింది. ఇంటర్వ్యూ టైంలో తన తల్లి చేతులు ముడుచుకుని నిలబడి ఉండటం చూసి, చేతులు సరిచేసుకోమని అమ్మాయి తల్లికి సైగ చేసింది. ప్రిన్సిపల్ కోపం తెచ్చుకుని, ఆ అమ్మాయిపై కుల వివక్ష కామెంట్స్ చేసింది. మనస్తాపం చెందిన అమ్మాయి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. ప్రిన్సిపల్‌పై కేసు రిజిస్టర్ చేశారు.

చైత్యభూమిని దర్శించిన రచయిత కొలకలూరి ఇనాక్
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు, రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ ముంబైలోని బాబాసాహెబ్ అంబేడ్కర్ సమాధి ‘చైత్యభూమి’ని, ఆయన పుస్తక గృహమైన ‘రాజగృహ’లను సందర్శించారు. నగరంలోని అంబేడ్కరైట్ సంఘాల సభ్యులు ఆయనతో భేటీ అయ్యారు. వీరిలో ప్రముఖులు దేవానంద్, లింగం, తిరుపతి, భీంరత్న మాలజీ, కె.రంగారాజు, నరేష్, మూలనివాసి మాలజీలు ఉన్నారు.

యాప్‌లోనూ కనిపించని యూరియా.. రైతుల ఆందోళన
నర్సంపేట డివిజన్‌లో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రోజులుగా యూరియా కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నా సరిపడా నిల్వలు అందుబాటులో లేవని అంటున్నారు. మరోవైపు యాప్‌లో యూరియా బస్తాలను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినా నర్సంపేట, ఖానాపురం ప్రాంతాల్లో యూరియా అందుబాటులో ఉన్నట్లు కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. గతేడాది ఎదుర్కొన్న యూరియా కొరత పరిస్థితి ఈ ఏడాది కూడా ఎదురుకావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘మిష్మీ కొండలు’ - అనువాద నవల
మన దేశంలో సూర్యుడు మొదట ఉదయించే అరుణాచల్ ప్రదేశ్‌లో మిష్మీ కొండలున్నాయి. ఆ ప్రాంతానికి చెందిన రచయిత్రి మమాంగ్ డాయ్ ‘The Black Hill’ అనే పేరుతో ఇంగ్లీష్‌లో నవల రాశారు. దాన్ని మూర్తి కె.వి.వి.ఎస్ ‘మిష్మీ కొండలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ నవల చదువుతుంటే టిబెట్‌కు, హిమాలయాలకు దగ్గరగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని మిష్మీ కొండల సౌందర్యం కళ్ల ముందు కదులుతుంది. 1826లో తెగల మధ్య పోరాటాలు, బ్రిటిష్ వారి రాక, వారితో జరుగుతున్న సంఘర్షణల నేపథ్యంలో ఈ నవల ఉంటుంది. నవల ధర రూ.230. కొనే <a href="https://www.telugubooks.in/products/mishmi-kondalu?srsltid=AfmBOoqwChgwaLg0aTqLUPVuUd4RCjYactzre0WHLuk9U6D1c7j8AOAJ">లింక్</a> ఇది.

గవర్నమెంట్ స్కూల్లో రాజకీయ నాయకుల పుట్టినరోజా?
AP: పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు, వైఎస్ఆర్‌సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించినట్టు సమాచారం. కొంతమంది టీచర్ల సహకారంతోనే ఈ వేడుకలు జరిగాయని, వాళ్ల మీద ఎంఈవో చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. రూల్స్‌కి వ్యతిరేకంగా గవర్నమెంట్ స్కూల్లో రాజకీయ నాయకుడి పుట్టినరోజు జరపడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్కూళ్లను రాజకీయ నేతల ప్రచార వేదికలుగా మార్చడం ఏమిటని జనం మండిపడుతున్నారు.

నిత్యావసరాల ధరలు తగ్గించాలి
నిత్యావసరాల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గోకవరం మండలం రంప యర్రంపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ కూలి పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. రైతులకు సకాలంలో నీరు అందక పంటలు దెబ్బతింటున్నాయని అన్నారు. ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

మోదీ నా జీవితాన్ని నరకం చేశారు: రుచికాసింగ్
‘మోదీజీ.. నా జీవితాన్ని నరకం చేశారు’ అంటూ రుచిక సింగ్ లేటెస్ట్‌గా వీడియో రిలీజ్ చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ సీజేపీ నిరసనలో మోదీ మీద కామెంట్స్ చేసి, ఆపై సారీ చెప్పిన ఆమె ఆ తర్వాత తను పడుతున్న కష్టాల గురించి ఈ వీడియోలో మాట్లాడారు. 15 ఏళ్ల పిల్లను ప్రతిచోటా ఇలా టార్చర్ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. తను భయంతో బతుకుతున్నానని, తన పర్సనల్ లైఫ్ చాలా ఎఫెక్ట్ అయిందని వివరించారు. ముఖం దాచుకొని బతకాల్సి వస్తోందని అన్నారు. అయినా తను వెనక్కి తగ్గనని వివరించారు.