Latest

హర్ముజ్ దగ్గర మళ్లీ ఫైరింగ్.. కమర్షియల్ వెస్సల్స్ పై ఇరాన్ టార్గెట్
హర్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ వాణిజ్య నౌకలపై ఫైరింగ్ కు పాల్పడుతోంది. మూడు కమర్షియల్ వెస్సల్స్ పై ఫైరింగ్ చేసి రెండింటిని ఇరాన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీజ్ ఫైర్ పొడిగించినా, ఇరాన్ తన దూకుడును కొనసాగిస్తోంది.. బ్రిటీష్ సైన్యం (UKMTO) ప్రకారం, ఈ నౌకలపై వరుస దాడులు జరిగాయి. ఇరాన్ చర్యలతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల సరఫరాపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది.

డైట్ కోక్స్ కి వార్ ఎఫెక్ట్..క్యాన్స్ లేక ఆర్డర్లు నిలిపివేత
అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా డైట్ కోక్ (Diet Coke) అమ్మకాలు పడిపోయాయి. ప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో 9% వాటా కలిగిన గల్ఫ్ ప్రాంతం నుండి సరఫరా నిలిచిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో అల్యూమినియం క్యాన్ల కొరత ఏర్పడింది. భారతదేశంలో డైట్ కోక్ కేవలం క్యాన్లలోనే లభిస్తుంది కాబట్టి, స్టాక్ లేక పంపిణీదారులు ఆర్డర్లను నిలిపివేస్తున్నారు.

మమత తీరుపై సుప్రీం ఆక్షేపణ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (ED) సోదాలు నిర్వహిస్తున్న సమయంలో స్వయంగా జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేయడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. I-PAC కార్యాలయంలో దర్యాప్తుకు ఆటంకం కలిగించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది కేవలం రాష్ట్ర-కేంద్రాల మధ్య వివాదం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఒక ముఖ్యమంత్రి దర్యాప్తులో నేరుగా పాల్గొనడం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది.
సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన గుజరాత్ స్టార్ బౌలర్!
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ కగిసో రబాడ వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ 2026 ఆడుతున్న అతను, ఒక హోటల్ దగ్గర స్మోకింగ్ చేస్తూ కెమెరాకు దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. గతంలో రబాడపై డోపింగ్ ఆరోపణలు ఉండటంతో, అతను వాడింది కేవలం సిగరెట్టేనా లేక ఏదైనా నిషేధిత పదార్థమా అని BCCI అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం రబాడ 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.
నోయిడాలో పెళ్లి ఇంట్లో ఘరానా దొంగ చోరీ !
వినోదం సినిమాలో బ్రహ్మానందం కామెడీ గుర్తుందా? సేమ్ టు సేమ్ అదే తరహాలో ఢిల్లీలో ఓ దొంగ డాబుగా సూటు, బూటు వేసుకుని ఓ పెళ్లికి వచ్చేశాడు. అక్కడ ఎవరూ తెలిసిన వారు లేరు. పిలవని పెళ్లికి అలా వచ్చాడన్న మాట. అందరూ ఎవరి పనిలో వారు ఉండగా అటూ ఇటూ చూసి ఈ దొంగ రూ. 5 లక్షల బ్యాగ్ నొక్కేశాడు. ఢిల్లీ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఎంత లాఘవంగా చోరీ చేశాడో మీరూ చూడండి..

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల పనులు వచ్చే నెలలో !
రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
🔴 రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం 🟡 కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇంట్లోనే గంజాయి సాగు.. హైదరాబాద్ టెక్కీ నిర్వాకం
హైదరాబాద్‌లోని నాచారంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన పని ఇప్పుడు కలకలం రేపుతోంది. గంజాయికి బానిసైన శశిధర్ అనే టెక్కీ, తన జీతమంతా దానికే ఖర్చు చేసేవాడు. ఖర్చు తడిసి మోపెడవుతుండటంతో, బయట కొనడం మానేసి ఏకంగా తన ఇంట్లోనే గంజాయి మొక్కల సాగు (Cannabis Cultivation) మొదలుపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా గదిలో ప్రత్యేక లైటింగ్, వాతావరణాన్ని ఏర్పాటు చేసి మరీ పెంచుతున్నాడు. పోలీసులు నాచారంలోని అతడి నివాసంపై దాడి చేయడంతో ఈ 'హోమ్ మేడ్' గంజాయి సాగు బట్టబయలైంది. మేడిపల్లిలో కూడా కొందరు టెక్కీలు ఇదే పని చేస్తూ ఉండడంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్ హార్ట్ సర్జరీకి అమెరికా వెళ్లినప్పుడు సీఎంగా గద్దెనెక్కారు. కేవలం నెల రోజులు మాత్రమే ఆయన ఆ పదవిలో ఉన్నారు. జనసేన నేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన కుమారుడే.

ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు అవకాశం
ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ ప్రభుత్వం అద్దె బస్సుల్ని నడిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో కండక్టర్లు లేకుండా వాటిని తిప్పుతోంది. మరోవైపు తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లను నియమించడానికి సిద్ధమవుతోంది. పదో తరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు ఎవరైనా ఆర్టీసీ డిపోల్లో సంప్రదిస్తే టెంపరరీ డ్రైవర్లగా నియమిస్తున్నారు.

కర్ణాటకలో ఘోరం.. అమెరికన్ మహిళా టూరిస్టుపై అత్యాచారం !
విదేశాల్లో భారత్ ప్రతిష్టని దిగజార్చే మరో అత్యాచార ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. కూర్గ్‌కు విహారయాత్రకు వచ్చిన ఒక అమెరికన్ మహిళపై హోమ్ స్టే యజమాని వృజేష్ కుమార్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఎవరికీ ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు మూడు రోజుల పాటు వైఫై (WiFi) కనెక్షన్‌ను కట్ చేసి బాధితురాలిని బంధించాడు. అతి కష్టమ్మీద తప్పించుకున్న ఆ టూరిస్ట్ ఫిర్యాదు మేరకు పోలీసులు వృజేష్ కుమార్, అతని అసిస్టెంట్ ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

గంటల్లోనే సీన్ రివర్స్.. హర్మూజ్ లో నౌకపై ఇరాన్ కాల్పులు
అమెరికా కాల్పుల విరమణ ప్రకటించి ప్రపంచం ఊపిరి పీల్చుకునే లోపే ఇరాన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో ప్రయాణిస్తున్న ఒక నౌకపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఆ నౌకను ధ్వంసం చేశాయి. హార్మూజ్ పై తాము పట్టు కోల్పోలేదన్న సంకేతాలు ఇవ్వడానికే ఇరాన్ ఈ పని చేసింది. దీంతో శాంతి చర్చలు మొదలవ్వకముందే మళ్ళీ ఉద్రిక్తతలు పీక్స్‌కు చేరాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న టెన్షన్ ప్రపంచ దేశాల్లో నెలకొంది.

TB వ్యాధిని గుర్తించే AI ..!
క్షయ (TB) వ్యాధిగ్రస్తుల్ని ముందస్తుగా గుర్తించడానికి ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. సాల్సిట్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన శ్వాస అనే ఏఐ సాఫ్ట్ వేర్ స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే సులభంగా TB పేషెంట్లను గుర్తించవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ ఉన్న ఫోన్ ను దగ్గరగా పెట్టుకొని దగ్గితే ఆ వ్యక్తిలో టీబీ లక్షణాలున్నాయో లేదో అది చెప్పేస్తుంది. ఏపీలో ఆంధ్రా మెడికల్ కళాశాలలో క్లినికల్ ట్రయల్స్ ఉన్న శ్వాస అందుబాటులోకి వస్తే టీబీని కట్టడి చేయవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. మన దేశంలో సకాలంలో గుర్తించకపోవడం వల్ల ప్రపంచంలో టీబీ కేసుల్లో 28శాతం నమోదవుతున్నాయి.

కాళేశ్వరం అంశంలో కేసీఆర్ కు బిగ్ రిలీఫ్
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ వచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆ కమిటీ ఎలాంటి నిబంధనలు పాటించకుండా నివేదిక రూపొందించిందని కోర్టు చెప్పింది. ఈ రిపోర్ట్ చెల్లదని, సీబీఐ కూడా ఈ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై 2025 జులైలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది.
మంత్రినే నిలదీసిన మహిళ.. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా
ట్రాఫిక్ రూల్స్ అంటే కేవలం సామాన్యులకేనా? నాయకులకు వర్తించవా? ముంబై వర్లీలో ట్రాఫిక్ జామ్ వల్ల విసిగిపోయిన ఒక మహిళ అడిగిన సూటి ప్రశ్న ఇది! తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తుండగా, బీజేపీ నిర్వహించిన 'మహిళా జన్ ఆక్రోష్' ర్యాలీ వల్ల గంటన్నర పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఆమెలో అసలైన ఆక్రోశం కట్టలు తెంచుకుంది. నేరుగా మంత్రి గిరీష్ మహాజన్ దగ్గరికే వెళ్లి, "ముందు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి" అంటూ ఆమె నిలదీసిన తీరు చూసి అక్కడి వారంతా షాక్ అయ్యారు. ఈ ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయి వీడియోని వైరల్ చేస్తున్నారు.

ఎక్కడి బస్సులు అక్కడే.. ప్రయాణికుల ఇక్కట్లు
తెలంగాణలో బస్సులు డిపోల్లో నిలిచిపోయాయి. బస్సుల్లేక బస్టాండులు బోసిగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి సమ్మెకు దిగారు. డిపోల దగ్గరే ధర్నా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 32 హామీలను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్. దశలవారీగా వారి డిమాండ్లు తీరుస్తామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది.

తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయ ద్వారం
చార్ ధామ్ యాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు ఉదయం 8 గంటలకు తెరుచుకున్నాయి. శీతాకాలంలో ఆరు నెలల పాటు మూసుకునే ఈ ఆలయాన్ని మళ్లీ అక్షయ తృతీయ తర్వాత రెండు మూడు రోజులకి తీస్తారు. ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకి అంటే యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదారానాథ్ సందర్శనకి రికార్డు స్థాయిలో 14.5 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కేదారాథ్ లో మహా శివుడి దర్శనం కోసమే ఏకంగా 4.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

టాలీవుడ్ నిర్మాత చిట్టిబాబు ఇక లేరు
టాలీవుడ్ నిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు (70) కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి కుమారుడే చిట్టిబాబు. పలు చిత్రాలు నిర్మించడమే కాకుండా కేరక్టర్ ఆర్టిస్ట్, కామెడీ రోల్స్ లో నటించారు కూడా. రీసెంట్ గా జాంబిరెడ్డి మూవీలో నటించారు. యూ ట్యూబ్ ఛానెల్స్ లో ఎనలిస్ట్ గా చిట్టిబాబు అందరికీ బాగా తెలిసిన వ్యక్తి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణను మరోసారి పొడిగిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ వైపు నుంచి ప్రతిపాదనలు అంది చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకు ఈ విరామం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇరాన్ పోర్టుల దిగ్భంధనం కొనసాగుతుందని చెప్పారు. ఏ క్షణాన అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తుందన్న భయంతో వణికిపోతున్న ప్రపంచ దేశాలకు ఈ ప్రకటన కాస్త రిలీఫే.

ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. మే 1 నుంచి 31 లోగా బదిలీల ప్రక్రియ పూర్తి కావాలని జీవో నెంబర్ 38 జారీ చేసింది. ఒకే చోట నాలుగేళ్లుగా వర్క్ చేస్తున్న వాళ్లని బదిలీ చేయనున్నారు. ఎవరైనా బదిలీ కోరుకుంటే కంటిన్యూస్ గా మూడేళ్లు ఒకే చోట పని చేసి ఉండాలి. ఉద్యోగులు బదిలీల ఉత్తర్వులు అందుకున్న తర్వాత మూడు రోజుల్లోగా కొత్త చోట జాయిన్ కావాల్సి ఉంటుంది. జనగణన వర్క్ లో ఉన్న ఉద్యోగులకు మాత్రం బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది.

బాయ్ ఫ్రెండ్ ను తగుల బెట్టేసిన ప్రియురాలు.!!
బెంగళూరులో ఒక ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ (27) అనే యువతి తన ప్రియుడు కిరణ్ తనను దూరం పెడుతున్నాడనే అనుమానంతో అతడిని హత్య చేసింది. "వెస్ట్రన్ స్టైల్ ప్రపోజల్" పేరుతో కిరణ్ కాళ్లు, చేతులు కట్టేసి, ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. తీవ్రంగా గాయపడిన కిరణ్ మృతి చెందాడు. పోలీసులు దీనిని పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.