Latest
కల్వకుర్తిలో వైఎస్సార్ వర్ధంతి.. ఘన నివాళులు
TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. పేదలు, రైతులు, సామాన్య ప్రజల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.

గుత్తిలో వైఎస్సార్‌కు ఘన నివాళులు
AP: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గుత్తి పట్టణం, గుత్తి ఆర్‌ఎస్‌లోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని రైతులు, పేదలు, విద్య, వైద్యం, పింఛన్లు, సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్సార్ ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు.

ధర్మ విజేత పత్రిక ఆవిష్కరణ..!
హైదరాబాద్‌లో ధర్మ విజేత పత్రిక ఆవిష్కరణ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక సారధి జీవి వెన్నెల గద్దర్ హాజరై, పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పత్రిక ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని, అందరి ఆకాంక్షలను నెరవేర్చాలని ఆమె అన్నారు. "ఇది ప్రజల గొంతు కావాలి" అంటూ పత్రిక యాజమాన్యానికి సూచించారు.

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. కొత్తగూడెంలో నిరసన
TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అంబేద్కర్ సెంటర్‌లో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ నిరసన నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ప్రజాధనాన్ని జీతంగా పొందుతున్నారని విమర్శించారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకైనా కేసీఆర్ తప్పకుండా హాజరుకావాలని డిమాండ్ చేశారు.
ఆస్పత్రిలో సౌకర్యాల కొరత.. రోగుల అవస్థలు
TG: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సౌకర్యాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ అధ్యక్షుడు అనుముల తుకారం ఆరోపించారు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నా, కూర్చోవడానికి సరిపడా కుర్చీలు కూడా లేవని అన్నారు. పేషెంట్ల చిట్టీలు రాసే విషయంలో పరిచయాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే గారూ.. మాకో బడి కావాలి..!
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన సంచార జాతుల పిల్లలు ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకోవాలని, చదువుకోవాలంటే బడి కావాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ’’బడులు అందుబాటులో లేకపోవడంతో చాలామంది పిల్లలు చదువు మానేశారు. కొంతమంది మాత్రమే దూర ప్రాంతాలకు వెళ్లి చదువుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాల’’ని వారు కోరారు. MLA స్పందించి, ఆ ప్రాంతంలో ఉన్స స్థలంలో పాఠశాల భవనం నిర్మిస్తానని, పిల్లలకు చదువు అందుబాటులోకి తెస్తానని చెప్పారు.

YSR సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: CM రేవంత్
TG: మాజీ సీఎం YS రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే లీడర్ అని CM రేవంత్ రెడ్డి అన్నారు. YSR వర్ధంతి సందర్భంగా దిల్లీలో ఆయన చిత్రపటానికి (ఫోటో) పూలమాల వేసి నివాళులర్పించారు. సాగునీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్డు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి అభివృద్ధి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్‌తో YSR తనదైన మార్క్ క్రియేట్ చేశారని సీఎం ప్రశంసించారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, కొందరు MPలు పాల్గొన్నారు.

దాచేపల్లిలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం
AP: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పేదలు, రైతులు, సామాన్య ప్రజల కోసం ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను నాయకులు గుర్తుచేశారు.
పరకాల అంబేద్కర్ సెంటర్‌లో ట్రాఫిక్ కష్టాలు
TG: హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఈ జంక్షన్ మీదుగానే వెళ్లడంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. సరైన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. పాఠశాల విద్యార్థులు, వృద్ధులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ సమయాల్లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జడ్చర్లలో ఘోర ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
TG: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని నాగసాల గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నాగసాల నుంచి జడ్చర్లకు బైక్‌పై వస్తున్న ఇద్దరు కూలీలను కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బస్సు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు.

అల్లాపూర్‌లో డ్రైనేజీ సమస్య.. వెంటనే పరిష్కరించాలి
TG: నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలం అల్లాపూర్ గ్రామంలో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని DYFI జిల్లా కమిటీ సభ్యుడు అంతటి మహేశ్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎస్సీ, దళిత వాడల్లో మురుగునీరు రోజుల తరబడి నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ఇప్పటికే పలుమార్లు సర్పంచ్, గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందన్నారు.
రాజాంలో పవన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
AP: విజయనగరం జిల్లా రాజాంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. తృప్తి రిసార్ట్‌లో గండి చిరంజీవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, LED స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్ సందేశాన్ని వీక్షించారు. అనంతరం రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. విద్యార్థుల మధ్య కూడా కేక్ కటింగ్ నిర్వహించి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సేవా కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఏబీవీపీ ధర్నా
TG: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు బుధవారం ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏబీవీపీ నాయకులు కోరారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సీనియర్ జర్నలిస్టు సురేందర్‌రెడ్డికి ఘన నివాళి
TG: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన సీనియర్ జర్నలిస్టు తాళ్లపల్లి సురేందర్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో నర్సంపేట ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నివాళులర్పించారు. నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద సురేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జర్నలిజం రంగానికి ఆయన అందించిన సేవలను జర్నలిస్టులు స్మరించుకున్నారు. వృత్తిపట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తుచేసుకున్నారు.

భర్త మరణించాక అత్తను చూడటం కోడలి పని కాదు: హైకోర్టు
భర్త మరణం తర్వాత అత్తను చూసుకోవాల్సిన బాధ్యత కోడలికి లేదని కర్ణాటక హైకోర్టు చెప్పింది. కుటుంబ ఆస్తిని గిఫ్ట్ డీడ్ ద్వారా పొందినా, ఆ పత్రంలో స్పష్టంగా అత్తను పోషించాలని షరతు లేకపోతే, కోడలు అలా చేయాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి సురజ్ గోవిందరాజ్ తీర్పు ఇచ్చారు. హాసన్ జిల్లాకు చెందిన శీలా, ఆమె అత్త నంజమ్మ కేసులో ఈ తీర్పు వచ్చింది. “గిఫ్ట్ డీడ్‌లో స్పష్టమైన షరతు లేకపోతే, ట్రైబ్యునల్ తర్వాతి పరిస్థితుల ఆధారంగా కొత్త బాధ్యతలు సృష్టించలేము” అని జడ్జి తెలిపారు.

‘మర్చిపోలేని గుణపాఠం చెబుతాం’.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
నిన్న అమెరికా చేసిన దాడులకు ఇరాన్ రిటర్న్ ఎటాక్‌కు దిగింది. ఇరాక్, జోర్డాన్‌పై ఇరాన్ ఆర్మీ ఫోర్స్ IRGC ఎటాక్స్ చేసినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. కువైట్, బహ్రెయిన్‌లోనూ బ్లాస్ట్స్ జరిగినట్లు పేర్కొంది. సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడితో ఓ పెళ్లింట ట్రాజెడీగా మారింది. ఓ చిన్నారి సహా నలుగురు చనిపోగా, 50 మంది గాయపడ్డారు. USకు మర్చిపోలేని గుణపాఠం చెబుతామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. హోర్ముజ్‌లో కమర్షియల్ షిప్స్‌పై ఇరాన్ ఎటాక్‌కు ట్రై చేయడంతోనే తాము ఎటాక్ చేసినట్లు అమెరికా తెలిపింది.
పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ పెండి శ్రీలక్ష్మి రామానంద్ హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆమె సూచించారు. పద్మశాలి సంఘ సభ్యుల మధ్య ఐక్యతను బలోపేతం చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

గురజాలలో ఎల్‌ఐసీ వారోత్సవాలు
AP: పల్నాడు జిల్లా గురజాలలో ఎల్‌ఐసీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి గురజాల నగర పంచాయతీ కమిషనర్ వై.వి.ఎల్. శివన్నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో ఎల్‌ఐసీ అందిస్తున్న ఆర్థిక సహకారం, పాలసీదారులకు సిబ్బంది, ఏజెంట్లు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అనంతరం కమిషనర్‌ను ఎల్‌ఐసీ సిబ్బంది శాలువాతో సత్కరించారు.

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ధర్నా
TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో హామీల అమలుపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఖానాపూర్ ఇన్‌చార్జ్ బుక్య జాన్షన్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జాన్షన్ నాయక్ మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు.

శ్రీకృష్ణదేవరాయగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ గ్లింప్స్!
టాలీవుడ్‌లో మరో భారీ పాన్ ఇండియా పీరియాడిక్ అడ్వెంచర్ మూవీ ‘దేవరాయ’ రెడీ అవుతోంది. 500 ఏళ్ల క్రితం దక్షిణాదిని ఏలిన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల స్టోరీతో ఈ సినిమా వస్తోంది. టైటిల్ రోల్‌లో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కనిపించనున్నాడు. సుదీప్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన <a href="https://www.youtube.com/watch?v=R4Xej28XR5M&list=RDR4Xej28XR5M&start_radio=1">గ్లింప్స్</a> సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ 2027 డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుంది.

ప్లాస్టిక్ తో కోట్లు సంపాదిస్తున్నారు!
భారత్‌లో రీసైక్లింగ్ బిజినెస్ రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. ముంబైలో జరిగిన రీసైక్లింగ్ షోలో ఎక్స్‌పర్ట్స్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో క్వాలిటీ, మోడ్రన్ టెక్నాలజీయే ఈ రంగానికి కీలకం కానున్నాయని చెప్పారు. గవర్నమెంట్ రూల్స్, మెటీరియల్ రికవరీ పెరుగుతుండటంతో కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్యాకేజింగ్, కార్ల తయారీ వల్ల ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కు డిమాండ్ పెరిగింది. అలాగే మెటల్ స్క్రాప్, ఈ-వేస్ట్, బ్యాటరీ రీసైక్లింగ్ రంగాలు పక్కా ప్లానింగ్‌తో ఆర్గనైజ్డ్ సెక్టార్‌గా మారుతున్నాయని తెలిపారు.