Latest

Monsoon Special: బొంత కాకరకాయ
వర్షాకాలం రాగానే మార్కెట్‌లో బొంత కాకరకాయల (బోడ కాకర) గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. సాధారణ కాకరకాయలా చేదుగా ఉండకపోవడం, అడవుల్లో సహజంగా పండే ఈ కూరగాయలో విటమిన్-సి, ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కాయలు ఇమ్యూనిటీని పెంచి, షుగర్, బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి. అడవుల్లో సహజంగా పండే ఈ కూరగాయకు ఈ సీజన్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కిలో ధర రూ.300 వరకు ఉంది. కొంచెం ధర ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిదని అందరూ ఇష్టంగా కొంటున్నారు.

ఒకే సెంటర్లో టెట్ పరీక్ష రాసిన తండ్రీకూతుళ్లు
AP: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం తోటఊరు గ్రామానికి చెందిన తోట ఈశ్వరరావు, ఆయన కుమార్తె తోట శోభ విద్యారంగంలో అరుదైన ఉదాహరణగా నిలిచారు. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తూ ఇటీవల నిర్వహించిన టెట్‌కు అటెండ్ అయ్యారు. ఇద్దరూ ఒకే కేంద్రంలో పరీక్ష రాశారు. తన తండ్రితో కలిసి టెట్ రాయడం మరపురాని అనుభవంగా నిలిచిందని తోట శోభ ఆనందం వ్యక్తం చేశారు.
‘చెల్లికి న్యాయం చేయలేనోడు.. ఆడబిడ్డలకు ఏం చేస్తాడు?’
TG: వరంగల్ జిల్లా పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సభలో సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి సీతక్కను తను సొంత చెల్లెలా చూసుకుంటానని, కానీ మరొకరు మాత్రం ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని బయటకు నెట్టేశారని ఆరోపించారు. కొడుకు దుర్మార్గం చేస్తుంటే మందలించాల్సిన తండ్రి ఫాంహౌజ్‌లో పడుకున్నాడని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారని చర్చ సాగుతోంది.

'ద్రవిడ - వివక్షపై దక్షిణ స్వరం' పుస్తకం
మలుపు బుక్స్, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక కలిసి తీసుకొచ్చిన పుస్తకం 'ద్రవిడ - వివక్షపై దక్షిణ స్వరం'. రచయితలు కల్లూరి భాస్కరం, సౌదా అరుణ, డా.జిలుకర శ్రీనివాస్, రాహుల్, కె.శ్రీనివాస్, కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే, సి.మృణాళిని రాసిన పదకొండు ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి. ద్రావిడ జాతులపై వివక్ష, ద్రవిడ భాష, సంస్కృతి, సాహిత్యం ద్వారా అస్మిత నిర్మాణం లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకానికి ఎడిటర్స్‌గా కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే ఉన్నారు. పుస్తకం ధర రూ.150. పుస్తకం కొనేందుకు <a href="https://www.telugubooks.in/products/dravida-vivakshapai-dakshina-swaram?srsltid=AfmBOoqOJwWA4xUicb-zqftKrUpqFkRMq-DrY2VrCkDrfuIxhL5bboDB">లింక్</a>.

విద్యార్థులకు కుంగ్ ఫూ స్పైరింగ్ క్యాంప్ పోటీలు
TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని జీఎం పటేల్ మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన న్యూ మాక్స్ కుంగ్ ఫూ స్పైరింగ్ క్యాంపు పోటీలలో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చించోడ్ వర్సెస్ కొందుర్గ్ టీమ్ మధ్య ఉత్కంఠగా సాగిన పోటీల్లో చించోడ్ టీం చెందిన నక్షత్ర ‘మ్యాచ్ ఆఫ్ ది బెస్ట్’గా నిలిచింది. ఆమెను కోచ్ రమేష్, చీఫ్ మాస్టర్లు అభినందించారు. ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ రాము మాస్టర్ హాజరయ్యారు. కార్యక్రమంలో రమేష్, రాము, బాల్ రాజ్, ప్రభు, కర్ణ, నహిద్, సురేష్ రాఘవేందర్ పాల్గొన్నారు.

ఘనంగా కామ్రేడ్ సీతక్కకు నివాళులు
AP: శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలాసలో కామ్రేడ్ బాలకృష్ణ అధ్యక్షతన కామ్రేడ్ సీతక్క సంతాప సభ నిర్వహించారు. గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమంలో సీతక్క పోషించిన పాత్రను స్మరించుకున్నారు. ప్రజా ఉద్యమాల పట్ల ఆమె చూపిన అంకితభావం, ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సీతక్కకు ఘన నివాళులర్పించారు.

పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యం
TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని అయోధ్యపుర్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం వేడుకగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ కొందుర్గ్ మండల అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సులోచన కృష్ణ రెడ్డి, సర్పంచ్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినుల భద్రతపై దృష్టి సారించాలి: DSP
AP: విద్యార్థునుల భద్రతపై దృష్టి సారించాలని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని సూచించారు. మందస మండలం పట్టులోగాం గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలను సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్ఐ కె.కృష్ణ ప్రసాద్‌లతో కలిసి తనిఖీ చేశారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌శాఖ తరపున ఆశ్రమ పాఠశాలలో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో పర్యటించి చట్టాలపై అవగాహన కల్పించారు.

నార్త్ అమెరికా ఖండంలో ఎత్తైన శ్రీరాముడి విగ్రహం
నార్త్ అమెరికా ఖండంలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం కెనడాలోని మిస్సిసాగాలోని హిందూ హెరిటేజ్ సెంటర్‌లో ఇటీవల ఆవిష్కరించారు. ఏడుడుగల పీఠంపై నిలబడి ఉన్న శ్రీరాముడి విగ్రహం ఎత్తు 51 అడుగులు. ఛత్రం జోడించిన తర్వాత మొత్తం ఎత్తు 70 అడుగులకు పైగా అవుతుందని అధికారులు తెలిపారు. ఈ విగ్రహాన్ని భారతదేశంలోని మనేసర్‌లోని మాటు రామ్ ఆర్ట్ సెంటర్‌లో శిల్పి నరేశ్ కుమార్ కుమావత్ రూపొందించారు.

Gen Z ఇష్టపడుతున్న 'Snail Mail'
ఈ రోజుల్లో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో సెకన్లలో మెసేజ్‌లు పంపే Gen Z యూత్.. ఇప్పుడు మళ్లీ పాతకాలపు చేతిరాత ఉత్తరాలను ఇష్టపడుతున్నారు. ఫోన్ స్క్రీన్ల నుంచి డిజిటల్ డిటాక్స్ అవ్వడానికి, మనస్ఫూర్తిగా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఈ 'స్నెయిల్ మెయిల్' పద్ధతిని ఫాలో అవుతున్నారు. పేపర్లను అందంగా డెకరేట్ చేసి, వింటేజ్ స్టాంపులతో ఫ్రెండ్స్‌కి పంపుతూ ఆ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎంత టెక్నాలజీ వచ్చినా చేతితో రాసే లేఖల్లో ఉండే ఆత్మీయతే వేరని నిరూపిస్తున్నారు.

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
TG: శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు, కారు ఎదురుగా ఢీకొన్న ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వనపర్తి జిల్లా గోపాల్ పేట గ్రామానికి చెందిన పార్వతమ్మ కుటుంబ సభ్యులతో కారులో శ్రీశైలం వెళ్ళి తిరిగి వస్తున్నారు. దోమలపెంట ఫారెస్ట్ రేంజ్ రాసమొల్లబావి టర్నింగ్‌లో శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారులో ఉన్న పార్వతమ్మ కాలికి తీవ్రంగా గాయమైంది. వైద్యం కోసం అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.

సర్దార్ గౌతు లచ్చన్న 117 వ జయంతి వేడుకలు
AP: విజయవాడ రూరల్ సెంట్రల్ నియోజకవర్గంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష , APSRTC ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంగి గురుమూర్తి , రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని, మైలవరం నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అంకెం సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

28 ఏళ్లకే అనన్య రాజ్ కన్నుమూత
బాలీవుడ్ నటి అనన్య రాజ్ 28 ఏళ్ల చిన్న వయసులోనే కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, జూలై 15న నిద్రలోనే తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె హిందీలో '7 అవర్స్ టు గో', 'ది ఫైనల్ ఎగ్జిట్', 'ఘోస్ట్' లాంటి సినిమాల్లో నటించారు. తెలుగులోనూ 'తగ్గేదే లే' అనే సినిమాలో నటించారు.

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం
TG: ఖమ్మం జిల్లా వేంసూర మండలం కుంచపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థులను గ్రామానికి చెందిన ఇజ్జగాని మధు అభినందించారు. ఒక్కో విద్యార్థికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.30 వేలను అందించారు. విద్యార్థులు మరింత ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు.

మంత్రి తుమ్మలపై మాజీ మంత్రి పువ్వాడ ఫైర్
TG: ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. గతంలో తనపై కాశీం రజ్వీ అంటూ తప్పుడు ప్రచారం చేసినవారు, ప్రస్తుతం తుమ్మలతోపాటు ఆయన కుమారుడి పక్కన ఉంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఖమ్మంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు.

నందివాడ మండలంలో తాగునీటి సమస్య
AP: కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురంలో కొన్ని నెలలుగా తాగునీటి సమస్యతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. సక్రమంగా తాగునీరు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు మినరల్ వాటర్ కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అవసరాల కోసం బోరు నీటిని వాడుతున్నా, ఆ నీరు తాగడానికి పనికిరావడం లేదని అంటున్నారు. గ్రామానికి సంబంధించిన తాగునీటి చెరువు గురక, డెక్కతో నిండిపోయి ఉండటంతో నీటి నాణ్యత సరిగా లేదని అంటున్నారు.

మోదీపై బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్’(Intellectual Naxals) అనే పదాన్ని ఉపయోగించారు. సమాజంలో ‘నక్సల్ మెంటాలిటీ’ ఉన్నవారిని గుర్తించాలని అన్నారు. దీనిపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇన్‌స్టాలో స్పందించారు. ఈ ముసలివాళ్లు ‘దిమాగీ నక్సల్’ అని అనగానే ఏదో బ్రహ్మాస్త్రం వదిలేశామని అనుకుంటున్నారని, అయితే పిల్లలకు నక్సల్ అంటే ఏమిటో తెలియదని రాశారు. పుస్తకాల్లోనుంచి తొలగించిన చాప్టర్‌లను తిరిగి పెట్టమని పేర్కొన్నారు. కొంచెం ‘థెరపీ’ చేయించుకోమని సలహా ఇచ్చారు.

🚨 Fake News ఎందుకు మళ్లీ మళ్లీ వైరల్ అవుతుందో తెలుసా? 👀
ఒక ఫేక్ న్యూస్ ఒక్కసారి వైరల్ అయితే.. మళ్లీ మళ్లీ మన ముందుకు ఎందుకు వస్తుంది? దీనికి మన మెదడు, సోషల్ మీడియా రెండూ కారణమే. భయం, కోపం, ఆశ్చర్యం కలిగించే వార్తలు మన దృష్టిని త్వరగా ఆకర్షిస్తాయి. మనకు నచ్చిన అభిప్రాయాలకు సరిపోయే విషయం కనిపిస్తే, నిజమా కాదా అని చెక్ చేయకుండానే నమ్మే అవకాశం ఉంటుంది. ఒకే విషయం పదేపదే కనిపిస్తే అది నిజమేనన్న భావన కలగొచ్చు. ఒకరు షేర్ చేస్తే మరొకరు ఫార్వర్డ్ చేస్తారు. ఇలా వార్త వేగంగా వ్యాపిస్తుంది. వైరల్ అయిందంటే నిజమని కాదు, షేర్ చేసే ముందు మూలం, తేదీ చెక్ చేయడం ముఖ్యం.
మేడారంలో సీఎం రేవంత్ తులాభారం
కొత్త పెన్షన్ల పంపిణీకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. తులాభారంలో ఆయన 68 కేజీల బరువు తూగారు. విశేషమేంటంటే.. పోయిన ఏడాది సెప్టెంబర్‌లో తులాభారంలోనూ ఆయన బరువు 68 కిలోలే ఉన్నారు. అలాగే త్వరలో విదేశీ పర్యటన ఉన్నందున మంత్రి సీతక్క ముందుగానే రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు.

“LO”తో మొదలైన ఇంటర్నెట్ కథ!
ఇవాళ ప్రపంచాన్ని ఒక్క క్లిక్‌తో కలుపుతున్న ఇంటర్నెట్.. అసలు ఎలా మొదలైందో తెలుసా? 1969లో అమెరికా పరిశోధనా సంస్థ అర్పానెట్‌ను ప్రారంభించింది. దూరంగా ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకోగలవా అనేదే లక్ష్యం. మొదట నాలుగు కంప్యూటర్లను మాత్రమే కలిపారు. తొలి సందేశంగా “LOGIN” పంపుతుండగా సిస్టమ్ క్రాష్ అయి “LO” మాత్రమే చేరింది. ఆ చిన్న ప్రయోగమే తర్వాత ప్రపంచాన్ని మార్చిన ఇంటర్నెట్‌కు పునాదిగా మారింది. ఒక చిన్న “LO”.. ఇంత పెద్ద మార్పుకు నాంది పలికింది!

చిన్నారి భూమికకు అండగా నిలిచిన ఇంజినీరింగ్ అసిస్టెంట్లు
AP: తిరుపతి జిల్లా పాకాల మండలానికి చెందిన భూమికకు ప్రాణదాతలుగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ముందుకొచ్చారు. సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మోహన్ రాజు కుమార్తె భూమిక తలసేమియాతో బాధపడుతోంది. తన చికిత్స కోసం రూ.50 లక్షలు అవసరమని తెలుసుకున్న Association of Secretariat Engineers(ASE), Association of Engineering Assistants, Andhra Pradesh సభ్యులు మొత్తం రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.