Latest

PDF ఉపాధ్యాయ MLC అభ్యర్థిగా హనుమంతరావు
AP: 2027లో జరగనున్న కృష్ణా -గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా యుటిఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంత రావు పేరును డిక్లేర్ చేశారు. ఇవాళ విజయవాడలో జరిగిన 2003 డీఎస్సీ పెన్షన్ పోరాట వీరుల విజయోత్సవ సభలో ఏపి యుటిఎఫ్, పీడీఎఫ్ ఫోరమ్ ఈ విషయాన్ని ప్రకటించింది. యుటిఎఫ్‌తోపాటు మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాలు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచాయి.

కుకునూర్‌లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి
TG: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని యువత, గ్రామ ప్రజలు కోరుతున్నారు. స్కూల్ ఏర్పాటుకు అవసరమైన ఐదెకరాల భూమి, తరగతి గదులు, తాగునీరు, విద్యుత్, విశాలమైన ఆటస్థలం, రహదారి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కుకునూర్ గ్రామం వెల్దుర్తి మండలంలో భాగమేననే విషయాన్ని మండల కేంద్ర ప్రజలు గుర్తించాలని వారు కోరారు. గతంలో వెల్దుర్తి మండలానికి మంజూరైన మైనారిటీ పాఠశాల, జ్యోతిబా ఫూలే పాఠశాలలు ప్రస్తుతం తూప్రాన్‌లో నిర్వహించబడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

కాంగ్రెస్ నాయకుడు, ఆయన కుమారుడి హత్య
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు అనీసూర్ రెహ్మాన్(50), ఆయన కొడుకు అబూ సుఫియాన్ (24)ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అనీసూర్ రెహ్మాన్ బెంగాల్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు. నాడియా జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ. ఆయన నకషిపారా ప్రాంతంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. బెతువాదహారి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా నగడి రైల్వే గేట్ దగ్గర కారు మీద కాల్పులు జరిపారు. తర్వాత పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఇద్దరూ అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఆరు తరాల ఉమ్మడి కుటుంబం.. 83 మందికి ఒకే వంటిల్లు!
AP: అనంతపురం జిల్లా కుర్లపల్లిలో ఆరు తరాలుగా కొనసాగుతున్న ఓ భారీ ఉమ్మడి కుటుంబం ఆసక్తికరంగా మారింది. ఈ కుటుంబంలో ఏకంగా 83 మంది ఉన్నారు. అందరికీ ఒకే వంటింట్లో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తారు. రోజుకు 50 కిలోల బియ్యం అవసరం అవుతుంది. ఆదివారం నాన్‌వెజ్ వండితే ఒక పొట్టేలు, 10 కిలోల చికెన్ వండుతారు. సాయంత్రం బజ్జీలు చేయాలంటే 15 కిలోల పిండి అవసరమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. <a href="https://www.youtube.com/watch?v=Av8N3HDPrXw">83 మంది ఒకే కుటుంబంగా,</a> ఒకే ఇంట్లో కలిసి జీవించడం నిజంగా ఆశ్చర్యమే.

మన కన్ను 👀 ఎంత పవర్‌ఫుల్లో తెలుసా?
మన ఫోన్లలో 50 లేదా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటేనే చాలా గొప్ప అని అనుకుంటాం. కానీ సైన్స్ ప్రకారం మన కన్ను దాదాపు 576 మెగాపిక్సెల్స్ పవర్‌తో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎంతటి అడ్వాన్స్‌డ్ కెమెరా వచ్చినా మన కంటి చూపులోని న్యాచురాలిటీని మ్యాచ్ చేయలేదు. కళ్ళు చూసే దృశ్యాలను సూపర్ ప్రాసెసర్‌లాంటి మన బ్రెయిన్ ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి మనకి క్లియర్‌గా చూపిస్తుందని అంటున్నారు.

పెరియార్ జీవిత విశేషాలను వివరించే పుస్తకం
బాల జయరామన్ ఆంగ్లంలో రాసిన ‘Periyar’ పుస్తకానికి తెలుగు అనువాదం ఈ పుస్తకం. ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ ఇ.వి.రామస్వామి జీవితంలోని విశేషాలను వివరించే పుస్తకం ఇది. ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం ఉద్యమించిన పోరాట యోధుడు ఆయన. జెండర్, కుల అసమానతలపై ఆయన అనేక రచనలు చేశారు. ద్రవిడ అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసింది. ధర రూ.150. కొనేందుకు <a href="https://hyderabadbooktrust.com/products/periyar-bala-jayaraman?srsltid=AfmBOoqpAbeB7xM3l09vKW3iogjfY1k0N9bv51F2QFe3xTqHcEpnnd8G&sku_id=60248779">లింక్</a>.

రష్మిక కామెంట్స్‌పై యశ్ రియాక్షన్!
గతంలో నటి రష్మిక తనను 'మిస్టర్ షో ఆఫ్' అని అనడంపై కన్నడ హీరో యశ్ స్పందించారు. 2017లో ఒక ఇంటర్వ్యూలో రష్మిక చేసిన ఈ కామెంట్స్ పై యశ్ టాక్సిక్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ, 'ఆమె ఏ ఉద్దేశంతో అలా అనిందో నాకు తెలియదు, అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త' అని అన్నారు. ఎవరైనా సరే తమ అభిప్రాయం చెప్పవచ్చని, కానీ ఇతరుల మాటల వల్ల తన క్యారెక్టర్ మారదని చెప్పారు. అంతేకాకుండా తోటి నటీనటులను గౌరవించని వాళ్లు తన ఫ్యాన్స్ కాదని, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయద్దని తెలిపారు.
దారి మర్చిపోయిన స్టార్ హీరో.. Help చేసిన కామన్ మ్యాన్
తమిళనాడులోని శివగంగైలో మలయాళ సినీ నటుడు మమ్ముట్టీకి ఆసక్తికర అనుభవం ఎదురైంది. కరైకుడిలో షూటింగ్ పూర్తి చేసుకొని దారి తప్పిన ఆయనకు ఓ స్థానిక వ్యక్తి కేరళకు వెళ్లే మార్గాన్ని చూపించారు. తనకు సాయం చేసిన వ్యక్తికి మమ్ముట్టీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఆ వ్యక్తిని ఆప్యాయంగా ‘నమ్మ ఫ్రెండూ’ అంటూ పలకరించారు. దారి చూపి సాయం చేసిన స్థానికుడిని మమ్ముట్టీ అభినందించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జాబ్ కొట్టాలనుకునే యువతకు బంపర్ ఆఫర్
TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతీ యువకులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఉచిత కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. అచలగురు మందిరంలో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని MLA, ఫౌండేషన్ ఛైర్మన్ వేముల వీరేశం ఆదివారం ప్రారంభించారు. నిపుణులైన ఫ్యాకల్టీతో మూడునెలల పాటు శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కోచింగ్ తీసుకోలేని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ లక్ష్యాలను సాధించాలని సూచించారు.

🏠 మీ ఇల్లు మీ అలవాట్లను గమనిస్తే..?
ఒక్కసారి ఊహించండి… మీరు ఇంటికి చేరుకునేలోపే లైట్లు వెలగడం, గది ఉష్ణోగ్రత మారడం, మీకు ఇష్టమైన సంగీతం ప్లే అవడం. ఇది మ్యాజిక్ కాదు. ఇంట్లోని సెన్సర్లు, పరికరాలు మీరు ఎప్పుడు వస్తారు, ఏ గదిలో ఎంతసేపు ఉంటారు, ఏ సమయానికి ఏ పరికరం వాడతారు వంటి అలవాట్లను గమనిస్తాయి. AI ఈ సమాచారంలో కనిపించే నమూనాలను గుర్తించి, మీ అవసరాలను ముందే అంచనా వేయగలదు. అంటే ఇల్లు కేవలం మన ఆదేశాలు పాటించడం కాదు… మన అలవాట్లను గమనించి, వాటికి తగ్గట్టుగా స్పందించే స్థాయికి మారుతోంది.

'విశ్వనాథ్ అండ్ సన్స్' రికార్డు వసూళ్లు!
హీరో సూర్య కొత్త సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. థియేటర్లలో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

కెమెరాలు ఆఫ్ చేసి.. పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ
TG: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ముందుగా ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆఫ్ చేసిన దుండగులు.. అనంతరం లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించినట్లు తెలుస్తోంది. ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రామగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కైట్ ఎగరేస్తుండగా కరెంటు తీగకు తగిలింది.. ఏమైందంటే?
దిల్లీలోని కొండ్లి ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. టెర్రస్‌పై గాలిపటం (కైట్) ఎగరేస్తున్న ఓ బాలుడి గాలిపటం దారం కరెంటు తీగను తాకడంతో ఎలక్ట్రిక్ షాక్‌కు గురై గాయాలయ్యాయి. దీంతో పేరెంట్స్, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ ఓవర్‌హెడ్ లైన్లకు దగ్గరలోని టెర్రస్‌లు, భవనాలపై గాలిపటాలు ఎగరేయకూడదు. ముఖ్యంగా మెటల్‌తో ఉన్న దారాలు, మాంజాను అసలు వాడకూడదు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశముంది.

మెడలోనుంచి గోల్డ్ చైన్ చోరీ..
మేడ్చల్ పరిధిలోని గిర్మాపూర్‌లో రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్తున్న ఒక మహిళ దగ్గరికి బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. ఆమె వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేసి, CCTV ఫుటేజ్ చెక్ చేస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండమని పోలీసులు చెబుతున్నారు.

నాగదేవత మండపం ప్రారంభం
TG: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద నాగదేవత మండపాన్ని ఆదివారం ప్రారంభించారు. తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం మాట్లాడుతూ రూ 1,20,000 సొంత ఖర్చులతో వెంగళ శివలక్ష్మి నరసయ్య ఈ మండపం నిర్మించారని పేర్కొన్నారు. వారికి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో మచ్చ శ్రీనివాస్, సుద్దాల కర్ణాకర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
TG: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండలం తిరుమలగిరి గ్రామంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో TPCC ఉపాధ్యక్షుడు, DCC అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. గిరిజన యువతీ యువకులతో కలిసి ఉత్సవాల్లో సందడి చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు భరోసా
TG: స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా దొరకుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో 62 వేల కొత్త రేషన్ కార్డుల ద్వారా సుమారు 2 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 1.06 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

పచ్చదనం పరిరక్షణకు విరాళం
AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో మొక్కలను కాపాడేందుకు తమ వంతు సహాయాన్ని అందించేందుకు విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ఓల్డ్ ఐరెన్ డీలర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. మొక్కలకు రక్షణగా ట్రీ గార్డ్స్ కోసం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ను కలిశారు. రూ.50 వేల చెక్కును టీడీపీ నాయకులు, ఇబ్రహీంపట్నం మండలం క్లస్టర్ ఇంచార్జి గరికపాటి శివకు చెక్‌ను అందజేశారు. గ్రామస్తుల తరఫున దాతలకు గరికిపాటి శివ కృతజ్ఞతలు చెప్పారు.

గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
AP: నెల్లూరు జిల్లా ఉదయగిరి వ్యవసాయ కళాశాలలో గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. కళాశాల అసోసియేట్ డిన్ టి.గోపికృష్ణ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఉత్తరకోస్తా కళింగ సీమలో ఉద్దానం ప్రాంతాన సోంపేట తాలూకాలో 1909 ఆగస్టు 16వ తేదీన గౌతు లచ్చన్న జన్మించారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమం, రైతు పోరాటాలు జమీందారీ వ్యతిరేక ఉద్యమాలలో కీలక పాత్ర వహించారని అన్నారు. 2006 ఏప్రిల్ 19న కన్నుమూశారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్ డాక్టర్ ఎం.కిషన్ తేజ్ పాల్గొన్నారు.

తైవాన్ తన డిఫెన్స్ బడ్జెట్‌ను ఎందుకు పెంచుతోంది?
చైనా నుంచి పెరుగుతున్న సైనిక ఒత్తిడి నేపథ్యంలో తైవాన్ తన రక్షణను మరింత బలోపేతం చేసుకుంటోంది. 2027లో రక్షణ బడ్జెట్‌ను దాదాపు 16% పెంచి, తొలిసారి 1 ట్రిలియన్ తైవాన్ డాలర్లను దాటించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఖర్చు ఆధునిక ఆయుధాలు, సామర్థ్యాల పెంపుతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సంసిద్ధతపైనా ఉంటుంది. అమెరికా కూడా తైవాన్ తన రక్షణ కోసం మరింత ఖర్చు చేయాలని కోరుతోంది. ఇటీవల నిర్వహించిన సైనిక విన్యాసాల్లో దాడి, సముద్ర దిగ్బంధనం, ఇంటర్నెట్ అంతరాయం వంటి పరిస్థితులను కూడా పరీక్షించారు.
చందుపట్ల గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు
TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలో ముత్యాలమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం సందర్భంగా తెలంగాణ పల్లెల్లో బోనాల సందడి మొదలైంది. డప్పుల చప్పుళ్లు, డీజే మోతలు, పోతురాజుల నృత్యాల మధ్య మహిళలు నైవేద్యంతో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా గుట్టపై ఉన్న ముత్యాలమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.