Latest

పీవీ సింధు వెనుక ఉన్న అసలైన శక్తి..
తన భర్త వెంకట దత్త సాయి గురించి భారత బ్యాడ్మింటన్ 'పీవీ సింధు' ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆటలో గెలుపోటములు ఎదురైనప్పుడు దత్తా తనను ఎంతగానో ప్రోత్సహిస్తారని చెప్పారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్సే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు, అలాగే విశాఖపట్నంలో 'PV Sindhu Centre for Sports Excellence' నిర్మిస్తున్నామని అన్నారు. ఆట తనకు ఇచ్చిన దానిలో కొంతైనా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

చిన్నారులకు కొత్త జీవితం
TG : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఆగస్టు 13 నుంచి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు. ఈ విషయాన్ని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. <br>దీని కోసం ఎలాంటి అపాయింట్‌మెంట్ అవసరం లేదు. పిల్లల పేరెంట్స్ ఆస్పత్రి పాత భవనంలోని 32వ రూంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం మొదటి అంతస్తులోని సీటీ ఆఫీస్‌కి వెళ్లాలి. అక్కడ వివరాలు చెబుతారు. తద్వారా చిన్నారికి కొత్త జీవితాన్ని అందించవచ్చు.

కొత్త యాప్‌తో రైతులకు కష్టాలు
TG: మెదక్ జిల్లాలో కొత్త ఎరువుల బుకింగ్ యాప్ రైతులకు కొత్త తిప్పలు తెచ్చిపెట్టింది. యాప్‌లో అన్ని వివరాలు నమోదు చేసి యూరియా బుక్ చేసేలోపే స్టాక్ ఖాళీగా చూపిస్తుండటంతో అన్నదాతలు <a href="https://www.theclearcutnews.com/n/VbwizMx">ఆందోళన</a> చెందుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్, ఫార్మర్ రిజిస్ట్రీ, ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ వంటి నిబంధనలు చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందిగా మారాయి. యాప్ ఓపెన్ అయ్యేందుకు గంటల తరబడి వేచి చూసినా, బుకింగ్ చేసేలోపే స్టాక్ నిల్ అవుతోందని రైతులు వాపోయారు. చేగుంట, రామాయంపేట ప్రాంతాల్లో రైతులు నిరసనలు చేపట్టారు.

‘SIR’ పేరుతో ఫోన్ చేస్తే నమ్మొద్దు: సుదర్శన్ రెడ్డి
TG: ఓటర్లను లక్ష్యంగా చేసుకుని SIR పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం పేరుతో ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు లేదా లింకులు పంపి ఫారం పూర్తి చేయాలని ఎవరైనా కోరితే స్పందించవద్దని సూచించారు. ఫారం నింపిన తర్వాత రూ.5 చెల్లించాలని, నెట్‌బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వాలని కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లాగిన్, పాస్‌వర్డ్, CVV, ATM PIN వంటి వివరాలను ఇవ్వొద్దని అన్నారు.

నన్ను గుర్తుపడతావు కదూ అమ్మా..!
భారత స్వాతంత్య్ర పోరాటంలో చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప విప్లవకారుడు ఖుదీరాంబోస్. 1908లో కేవలం 18 సంవత్సరాల వయసులోనే బ్రిటీష్ పాలకులు ఆయనను ఉరితీశారు. కనీసం చేతులకు సంకెళ్లు కూడా సరిగ్గా పట్టక జారిపోయేంత చిన్న వయసు అది. అయినా సరే, ఆయన కొంచెం కూడా భయపడలేదు. భగవద్గీతను చేతిలో పట్టుకుని... 'నా మెడపై ఉండే ఉరితాడు గుర్తుతో నన్ను గుర్తుపట్టు భారత్‌మాతా' అని నవ్వుతూ ప్రాణాలు అర్పించాడు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన ధైర్యం, త్యాగం భారత స్వాతంత్య్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయి.
పసిబిడ్డ చేసిన చిన్న పనికి.. తల్లిపై దారుణం
పంజాబ్ రాష్ట్రం కాపుర్తలాలో దారుణ ఘటన జరిగింది. మాతా శ్రీ భద్రకాళి టెంపుల్ వద్ద బిక్షాటన చేస్తున్న మహిళపై ఓ వ్యక్తి ఇష్టానుసారంగా దాడి చేశాడు. ఆమెతో ఉన్న పసిబిడ్డ బైక్‌ను తాకిందని కోపంతో బైక్ ఓనర్ వికాస్ శర్మ.. మహిళను కిందకు తోసి చెప్పుతో కొట్టి, కాలితో తన్నాడు. అక్కడున్నవారు ఆపినా దాడి కంటిన్యూ చేశాడు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసులు సుమోటోగా కేసు బుక్ చేసి, అతడిపై BNS సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

కొత్త స్మార్ట్ రేషన్ కార్డు.. నకిలీకి నో ఛాన్స్!
TG: తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న స్మార్ట్ రేషన్ కార్డులకు మల్టీ లేయర్ సెక్యూరిటీ కల్పిస్తోంది. ఫేక్ కార్డులకు అడ్డుకట్ట వేసేలా చాలా సెక్యూరిటీ ఫీచర్లతో కార్డులను డిజైన్ చేస్తున్నారు. పాస్‌పోర్టులు, కరెన్సీ నోట్లలో వాడే అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లను ఇందులో అమలు చేస్తున్నారు. కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు, బెనిఫిషియరీ డీటెయిల్స్, రేషన్ షాప్ నంబర్, సంతకానికి చోటు ఉంటుంది. డిజిటల్ ద్వారా కార్డు ఆథెంటిసిటీని గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

బైక్‌పై నుంచి పడిన యువకుడిని ఈడ్చుకెళ్లిన కారు
TG: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వద్ద హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొనడంతో తాండ్రకు చెందిన శివయాదవ్ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆయనను ఢీకొని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలతో శివయాదవ్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

KBR పార్క్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు
TG: హైదరాబాద్ KBR పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని ఆగస్టు 18 నుంచి అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. శుక్రవారం పార్క్ వాకర్లతో అధికారులు ముఖాముఖి నిర్వహించి కొత్త ట్రాఫిక్ మార్పులపై అవగాహన కల్పించారు. వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలని, ముఖ్యంగా ఉదయం వేళల్లో రాంగ్ రూట్‌లో వెళ్లవద్దని సూచించారు. కొత్త నిబంధనలకు వాహనదారులు, పార్క్ వాకర్లు సహకరించాలని కోరారు. ప్రజల సలహాలు, సూచనల కోసం పార్క్ వద్ద QR కోడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో విషాదం.. టన్నెల్‌లోకి నీరు, మట్టి
ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు టన్నెల్‌లోకి ఒక్కసారిగా నీరు, మట్టి చేరడంతో దారుణం జరిగింది. టన్నెల్‌లో ఉన్న 22 మంది కార్మికుల్లో 21 మందిని రెస్క్యూ టీమ్స్ బయటకు తీసుకువచ్చాయి. వీరిలో ఏడుగురు చనిపోగా, మరో 14 మంది గాయపడి హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఘటనపై CM పుష్కర్ సింగ్ ధామి ఆందోళన వ్యక్తం చేశారు. చిక్కుకున్న కార్మికులను సేఫ్‌గా బయటకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

భూములు అమ్మే అధికారం ఎవరిచ్చారు?: హరీశ్‌రావు
TG: ప్రభుత్వానికి చెందిన విలువైన వారసత్వ భూములను భవిష్యత్ తరాలకు కాపాడాల్సిన బాధ్యత CM రేవంత్‌రెడ్డిపై ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, రాయదుర్గం ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని BRS తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అధికారంలోకి రాకముందు ప్రభుత్వ భూములను జాతి సంపదగా పేర్కొన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు వాటిని ఎందుకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.

తెల్లవారుజామున షాకింగ్ యాక్సిడెంట్
TG: హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలానికి ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలో నేషనల్ హైవేపై అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయాణికులు నిద్రలో ఉండటంతో కేకలు, ఆర్తనాదాలతో భయానక పరిస్థితి నెలకొంది. స్థానికులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన 21 మందిని 108 అంబులెన్సుల్లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

పోలీసులపై దాడి.. పైనుంచి దూకేందుకు డ్రామా
TG: వాట్సాప్ గ్రూపుల ద్వారా హైదరాబాద్‌లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బేగంపేట ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ వద్ద అనుమానితుడిని అదుపులోకి తీసుకోగా 50గ్రాముల గంజాయి లభించింది. విచారణలో బాలానగర్ రాజీవ్‌కాలనీలో ఉంటున్న కిరణ్, దుర్గాప్రసాద్, కమలాకర్ ఈ దందా వెనుక ఉన్నట్లు గుర్తించారు. నార్కోటిక్స్ బృందాలు దాడిచేసి ముగ్గురిని అరెస్ట్ చేశాయి. కిరణ్ ఓ ఇన్‌స్పెక్టర్‌పై స్క్రూడ్రైవర్‌తో దాడికి యత్నించి అనంతరం నాల్గో అంతస్తు నుంచి దూకేందుకు డ్రామా చేసినట్లు పోలీసులు తెలిపారు.

స్కూల్ ఫీజుల నియంత్రణపై రౌండ్‌టేబుల్
తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం తెలంగాణ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ (ఈ నెల 14) హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సమావేశం జరగనుంది. మాజీ IAS అధికారి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్దమయ్యారు.

నకిలీ DAPపై మంత్రి తుమ్మల సీరియస్
TG: రాష్ట్రంలో నకిలీ DAP ఎరువుల తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. నకిలీ ఎరువులతో నష్టపోయిన రైతులకు సంబంధిత వ్యక్తుల నుంచే పరిహారం ఇప్పిస్తామని తెలిపారు. ఇప్పటికే నకిలీ DAP తయారీకి సంబంధించి 8మందిపై కేసులు నమోదు చేసి, ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నకిలీ ఎరువులను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.

పాత రోజులు ఎందుకు అంత బాగున్నట్టు అనిపిస్తాయి?
“అప్పట్లోనే జీవితం బాగుండేది.. ఇప్పుడు ఏదీ అంత బాగా అనిపించట్లేదు” అని ఎప్పుడైనా అనిపించిందా? చిన్నప్పటి ఫ్రెండ్స్, స్కూల్ రోజులు, ఫ్యామిలీతో గడిపిన క్షణాలు గుర్తొస్తే.. అప్పటి రోజులే బెటర్ అనిపిస్తాయి. కానీ నిజంగా అప్పటి రోజులే బెటర్ అని కాదు. మన మెమరీ మంచి జ్ఞాపకాలను ఎక్కువగా గుర్తుంచుకుని, చెడు అనుభవాలను కాస్త వెనక్కి నెట్టేస్తుంది. అందుకే గతం మరింత అందంగా కనిపిస్తుంది. దీన్నే రీసెర్చర్లు ‘రోజీ వ్యూ’ అంటారు. అంటే పాత రోజులు పర్ఫెక్ట్ అని కాదు.. మన మెమరీ వాటిని అందంగా చూపిస్తుందన్నమాట.

ఓటర్ లిస్ట్‌పై 4 రోజులు స్పెషల్ క్యాంపెయిన్
AP: ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ఈ ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా రోజుల్లో BLOలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు అందుబాటులో ఉండి ఓటర్ల నమోదు, దరఖాస్తుల పూర్తి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఆదివాసీల మనసు గెలిచిన కలెక్టర్
TG: ఆదిలాబాద్ గ్రామీణ మండలం పిప్పలేరి పంచాయతీ పరిధిలోని దహిగూడ గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా, స్థలాల కొరత కారణంగా ఇళ్ల నిర్మాణం సాధ్యం కాలేదు. స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ భూమిని కేటాయించి 17మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. మౌలిక సదుపాయాలు త్వరగా కల్పించేలా చర్యలు చేపట్టారు. దీంతో కలెక్టర్‌పై గౌరవం, కృతజ్ఞతతో గ్రామస్థులు తమ గ్రామానికి రాజర్షిషా గూడగా పేరు పెట్టారు. కలెక్టర్ రాజర్షిషా తన పేరుతో ఏర్పాటు చేసిన గ్రామ బోర్డుకు ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

ఖేలో ఇండియా క్రీడలకు తెలంగాణ రెడీ: వాకిటి
తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలను డిసెంబరు 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన ఆయన.. CM రేవంత్‌రెడ్డి రాసిన ఆహ్వాన లేఖను అందజేశారు. ఖేలో ఇండియా క్రీడల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారని చెప్పారు. పోటీలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. తెలంగాణలో నూతన క్రీడా విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.

అమరావతి అభివృద్ధికి బిగ్ బూస్ట్
AP: అమరావతి నిర్మాణంలో సీడ్ యాక్సెస్ రోడ్డు మొదటి మెట్టు అని CM చంద్రబాబు అన్నారు. ఉండవల్లి వద్ద అమరావతిని విజయవాడ, మంగళగిరి, గుంటూరుతో అనుసంధానించే సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను ఆయన ప్రారంభించారు. ఈ రహదారికి అనుసంధానంగా బకింగ్‌హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్‌తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఘట్టాన్ని స్వర్ణాంధ్ర విజన్‌కు తొలి విజయంగా అభివర్ణించారు.

పేదల సొంతింటి కల.. నెరవేర్చే బాధ్యత మాదే: CM
TG: పదేళ్ల BRS పాలన.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని CM రేవంత్‌రెడ్డి కోరారు. హైదరాబాద్ KPHB కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో అమలైన పథకాలకు అదనంగా తమ ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు పథకం కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని, పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 55 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు.