Latest

జర్నలిస్టుల కష్టానికి ఫలితం రావాలి
AP: అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు ప్రభుత్వం ముందడుగు వేసింది. జర్నలిస్టుల సమస్యపై మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య దర్శి సురేష్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. సీఆర్‌డీఏ కమిషనర్‌కు మెమో పంపడంతోపాటు, ప్రపోజల్‌ను మంత్రివర్గ ఉపసంఘం ముందుంచుతామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల కృషికి ఫలితంగా స్కీమ్‌కు మార్గం సుగమం కావడంపై సొసైటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి
బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో అంకితభావంతో పనిచేయాలని జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన బాల్య వివాహాల నిర్మూలన అవగాహన పోస్టర్‌ను జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్‌తో కలిసి ఆవిష్కరించారు. బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.

అదనపు తరగతి గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే
విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదిని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తీగల సునేంద్ర ప్రారంభించారు.

పరిహారం కాజేస్తారు..అప్రమత్తంగా ఉండండి
AP: పోలవరం ప్రాజెక్టులో పరిహారం పొందిన నిర్వాసితులు మధ్యవర్తులు, దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్ సూచించారు. కొంతమంది గ్రామాల్లోని ప్రభావిత కుటుంబాలను సంప్రదించి, వారికి అందిన పరిహారంపై అధిక వడ్డీ ఇస్తామని హామీ ఇస్తూ మభ్యపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కొన్ని సంస్థలు, అధిక వడ్డీకి రుణాలు ఇచ్చే వ్యక్తులు, అనుమానాస్పద పెట్టుబడి పథకాల ద్వారా నిర్వాసితులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించారు.

NASA కొత్త టెలిస్కోప్ విశ్వంలో ఏం వెతకబోతోంది?
విశ్వం ఎలా విస్తరిస్తోంది? కనిపించని డార్క్ మ్యాటర్ అసలు ఏంటి? గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం NASA కొత్త నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఇది ఒకేసారి చాలా పెద్ద ప్రాంతాన్ని పరిశీలించగలదు. ముఖ్యంగా డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీపై మరింత క్లారిటీ తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు.. మన సౌర కుటుంబం బయట ఉన్న వేలాది గ్రహాలను గుర్తించి, విశ్వం గురించి మనకున్న అవగాహనను మరింత పెంచనుంది.

విద్య వైద్య రంగాల సమస్యలను పరిష్కరించాలి
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలతో పాటు విద్యా, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ ఆర్డీవో అర్చనకు వినతిపత్రం అందించారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందడం లేదని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతులు
అలంపూర్ క్షేత్రానికి వచ్చిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి RDS సమస్యలపై మాజీ ఛైర్మన్ సీతారామిరెడ్డి, రైతులు వినతిపత్రం ఇచ్చారు. జిల్లాలో ఉన్న ఆయిల్ ఫార్మ్ రైతుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. చేనేత సమస్యలపై రాజోలి చేనేత కార్మికులు వినతిపత్రం ఇచ్చారు.

కనీస వేతనాలు అమలు చేయాలి
TG: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను వెంటనే అమలు చేయాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్(TUCI) డిమాండ్ చేసింది. రాష్ట్ర నాయకులు అలివేల ఆచారి మాట్లాడుతూ తెలంగాణలో కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది వర్కర్లకు అత్యల్ప వేతనాలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కేజీబీవీల్లో మెరుగైన వేతనాలు అందుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం వేతనాలు పెంచకపోవడం దారుణమని తెలిపారు.

సెప్టెంబర్ 2 , 3వ తేదీల్లో మహాసభలు
గట్టు మండల మాచర్లలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.నర్సింలు, అసంఘటిత రంగ కూలీలు కలిసి రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పాంప్లెట్లను విడుదల చేశారు. సెప్టెంబర్ 2, 3వ తేదీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా న్యూటౌన్ షాలిమార్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర ఎనిమిదో మహాసభలు జరుగుతాయని తెలిపారు. అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరారు.

గద్వాలకు రైల్వే అభివృద్ధికి కీలక అడుగు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బీరెల్లి రోడ్డు మార్గంలో రూ.66 కోట్లతో మరో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు వెల్లడించారు. స్టేషన్‌లో మూడు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు, ప్లాట్‌ఫారాల ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 2027 ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు

డ్రెయిన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
AP: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రెయిన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నామని కమిషనర్ అలీమ్ బాషా తెలిపారు. మార్కండేయ కాలనీలోని టిడ్కో ప్రాంతంలో డ్రెయిన్లను పరిశీలించిన ఆయన కాజా ఈస్ట్ లేక్ వాకింగ్ ట్రాక్, బాప్టిస్ట్‌పేటకు అనుసంధానమైన డ్రెయిన్‌ను ఇంజినీరింగ్, ఉద్యానవన విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కండేయ కాలనీ టిడ్కో వద్ద డ్రెయిన్ల పరిస్థితి, నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కమిషనర్ నీటి పారుదల సక్రమంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

పశుసంవర్ధక శాఖలో ప్రమోషన్స్
జోగులాంబ గద్వాల జిల్లాలో పనిచేసే ముగ్గురు ప్రమోషన్స్ పొందినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకట్ నారాయణ తెలిపారు. ధరూరు మండలం మార్లబీడు గ్రామానికి వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్‌గా రాఘవేంద్ర, గట్టు మండలం ఆలూరు గ్రామానికి జూనియర్ వెటర్నరీ ఆఫీసర్‌గా వెంకటేష్, మహబూబ్ నగర్ జిల్లా నన్చర్లకు లైవ్ స్టాక్ అసిస్టెంట్‌గా భార్గవి ప్రమోషన్ పొందాలని వెంకటనారాయణ తెలిపారు.
నాకూ, నీకూ పోలికేంది?: సీఎం రేవంత్
TG: నాకూ, నీకూ పోలికేంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై సెటైర్ వేశారు. తను ఒకసారి ‘గుంపుమేస్త్రీ’ అనే పదం వాడినందుకు, అప్పట్నుంచీ తనను గుంపుమేస్త్రీ అని అంటున్నారని అన్నారు. గుంపుమేస్త్రీ నలుగురితో పని చేయించి, చక్కటి ఇల్లు కడతాడని, నాకూ నీకూ పోలికేంటి అని ఇన్‌డైరెక్టుగా కేసీఆర్‌పై సెటైర్స్ వేశారు. తనకూ, ఆయనకూ నందికి పందికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.

నేపాల్ వరదల్లో 903కి చేరిన మృతుల సంఖ్య
నేపాల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో చనిపోయినవారి సంఖ్య 903కి పెరిగింది. అధికారుల ప్రకారం 4,247 మంది ఇంకా కనిపించడం లేదు. ఇప్పటివరకు 10,451 మందిని కాపాడారు. సహాయక చర్యల కోసం 20 వేల మంది సైనికులు, 14 హెలికాప్టర్లు పని చేస్తున్నాయి. ఆరు ప్రత్యేక వైద్య బృందాలు కూడా సాయం చేస్తున్నాయి. ఇప్పటిదాకా 149 నుంచి 180 మంది భారతీయులను కాపాడగా, 275 నుంచి 320 మంది ఇంకా కనిపించడం లేదు. కొందరు తెలుగు యాత్రికులు సురక్షితంగా కాఠ్మండు చేరుకున్నారు.

గంజాయి నిందితుల అరెస్ట్
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ మొగులయ్య మాట్లాడుతూ మల్దకల్ మండలం విటలాపురం, ఇటిక్యాల మండలం శనగపల్లి గ్రామాలకు చెందిన గోకారి, బీసన్న పంటపొలాల్లో గంజాయి మొక్కలను సాగు చేసి, వాటిని ఎండబెట్టి గంజాయిగా తయారు చేసి అమ్కుతున్నారని తెలిపారు. వాళ్ల బండ్లు తనిఖీ చేసి రూ.6 లక్షల విలువ చేసే 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

అమ్మను తొలిసారి థియేటర్‌కు తీసుకెళ్లిన కూతురు
అమ్మతో కలిసి సినిమా చూడాలని చాలామందికి ఉంటుంది.. కానీ తన సొంత సంపాదనతో తొలిసారి అమ్మను థియేటర్‌కు తీసుకెళ్లిన ఓ కూతురి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. తన సంపాదించిన డబ్బుతో అమ్మకు టికెట్ కొని, ఆమెతో కలిసి సినిమా చూసిన క్షణాలను వీడియోగా షేర్ చేసింది. థియేటర్‌లో అమ్మ ఆనందంగా సినిమా చూస్తున్న దృశ్యాలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. పెద్ద గిఫ్ట్ ఏమీ కాకపోయినా.. తన సంపాదనతో అమ్మకు ఇచ్చిన ఈ చిన్న సంతోషం అందరికీ కనెక్ట్ అవుతోంది.

గజారామం నర్సరీలో ఉచితంగా టేకు మొక్కల పంపిణీ
రైతులు తమ పట్టా భూముల్లో టేకు మొక్కలు నాటేందుకు గజారామం నర్సరీలో ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు పలమనేర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి చొప్ల నాయక్ తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు పట్టా పాస్‌బుక్ లేదా ఆధార్ ప్రతిని సమర్పించి ఉచితంగా టేకు మొక్కలను పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని చొప్ల నాయక్ సూచించారు.

2027లో AI మనల్ని దాటేస్తుందా?
AI ఎంత వేగంగా ఎదుగుతోందో చెబుతూ ఎలాన్ మస్క్ మరోసారి సంచలన కామెంట్ చేశారు. 2027 చివరి నాటికి.. కంప్యూటర్‌లో జరిగే దాదాపు ప్రతి పనిని AI మనుషుల కంటే మెరుగ్గా చేయగలదని ఆయన అన్నారు. కోడింగ్, రీసెర్చ్, డేటా విశ్లేషణ లాంటి డిజిటల్ పనుల్లో AI సూపర్‌హ్యూమన్ స్థాయికి చేరొచ్చన్నది ఆయన అంచనా. అయితే ఇది మస్క్ వ్యక్తిగత అంచనా మాత్రమే.. 2027 నాటికి AI నిజంగా మనుషులను పూర్తిగా దాటేస్తుందనడానికి ఇప్పటివరకు ఖచ్చితమైన ఆధారం లేదు.

1830లో ‘హిందూ మతం’ అనే పదం లేదా?
మద్రాసు ప్రెసిడెన్సీలో 1830లో క్రిమినల్ జడ్జిగా పనిచేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వద్దకు వచ్చిన కేసుల వివరాలు అప్పటి సమాజం గురించి కొత్త విషయాలు చెప్తున్నాయి. అప్పట్లో సాక్షుల వివరాలను రాసేటప్పుడు పేరు, తండ్రి పేరు, కులం, మతం, వృత్తి వంటి విషయాలను రికార్డు చేసేవారని తెలుస్తోంది. ఈ విషయాన్ని రచయిత, చరిత్ర పరిశోధకుడు బొల్లోజు బాబా తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేశారు. మతం అనే కాలమ్‌లో ‘హిందూ మతం’ అనే పదం కనిపించలేదని, దీనికి బదులుగా స్మార్తం, శైవం, రామానుజం వంటి పేర్లు మాత్రమే ఉన్నానని ఆయన వివరించారు.

AI కోసం Apple కంప్యూటర్లే ఎందుకు?
AI ట్రైనింగ్ అంటే భారీ డేటా సెంటర్లు, వేలాది GPUలు గుర్తొస్తాయి. కానీ OpenAI ఇప్పుడు మరో దారి ఎంచుకుంటోంది. కంపెనీ వేలాది Mac mini, Mac Studio కంప్యూటర్లను కొనుగోలు చేసినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. వీటిని ముఖ్యంగా రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ కోసం, మన కంప్యూటర్‌పై మనలాగే క్లిక్ చేసి పనులు చేసే AI ఏజెంట్లను ట్రైన్ చేయడానికి వాడుతున్నట్టు సమాచారం. Apple చిప్‌లలోని యూనిఫైడ్ మెమరీ ఈ పనులకు బాగా సరిపోవడం ప్రధాన కారణమట.

ఒడిశా కేడర్ ఐపీఎస్..హైదరాబాద్‌లో కన్నుమూత
ఒడిశా కేడర్‌కు చెందిన కేరళం ఐపీఎస్ అధికారి షఫీన్ అహ్మద్.కె(50) క్యాన్సర్‌తో మరణించారు. 2003 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన షఫీన్ సీఐటీయూ నాయకుడు హబీబ్ కుమారుడు. ఒడిశాలో క్రైమ్ బ్రాంచ్, సైబర్ క్రైమ్ ఐజీగా పనిచేస్తున్నారు. కేరళంలో డిప్యుటేషన్‌పై తిరువనంతపురం రూరల్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్‌గా కూడా ఉన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతూ ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇక్కడే కన్నుమూశారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేశారు.