Latest

జంతర్ మంతర్ వద్ద భారీ పోలీసు బందోబస్తు
ఇవాళ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు CJP ఛలో పార్లమెంట్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. జంతర్ మంతర్ దగ్గర దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్‌ను తరలించే ముందు కూడా ఇలాగే భారీ ఎత్తున పోలీసులు దీక్షా స్థలిని చుట్టుముట్టారు. CJP ఫౌండర్ అభిజిత్ దీప్కేను, వివిధ విద్యార్థి సంఘాల నేతలను కూడా అక్కడి నుంచి తరలించనున్నట్లు సమాచారం. ఛలో పార్లమెంట్ కార్యక్రమానికి పెద్దఎత్తున సీజేపీ మద్దతుదారులు వస్తుండడంతో హైటెన్షన్ నెలకుంది.

రేకుల షెడ్‌లోనే అక్షర యజ్ఞం
AP: పోలవరం జిల్లా గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామపంచాయతీ పరిధిలోని మెట్టగూడెంలోని గిరిజన ప్రాథమిక పాఠశాల దయనీయ స్థితిలో ఉంది. 51మంది విద్యార్థులు చదువుతున్న ఈ స్కూల్‌కు భవనం లేక మట్టిగోడలతో నిర్మించిన రేకుల షెడ్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్క ఉపాధ్యాయురాలే బోధిస్తున్నారు. బెంచీలు లేక విద్యార్థులు నేలపై కూర్చుని చదువుతున్నారు. ఎండకాలంలో షెడ్ వేడెక్కిపోగా, వర్షాకాలంలో పైకప్పు నుంచి నీరు కారుతోంది. మంచినీరు, మరుగుదొడ్లు, వంటగది కూడా లేదు. మౌలికవసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు
TG: హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఓ ట్రైనీ IPSను తోటి ట్రైనీ లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తూ బూతులు తిడుతున్నాడని ఓ మహిళా ఐపీఎస్ ట్రైనీ అత్తాపూర్ PSలో ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లయింట్ మేరకు అతడిపై కేసు నమోదైంది. తనను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాగే తనకు తెలియకుండా వ్యక్తిగత, ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించాడని ఆమె ఆరోపించారు.

జానీ మాస్టర్ పై బ్యాన్ ఎత్తేసిన డ్యాన్సర్స్ అసోసియేషన్ !
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై డ్యాన్సర్స్ అసోసియేషన్ విధించిన బ్యాన్ ను ఎత్తేశారు. వివాదంపై జానీ, ఆయన భార్య సుమలత ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఫిలిం ఫెడరేషన్ ఈ డెసిషన్ తీసుకుంది. నటుడు చిరంజీవి, బాలకృష్ణల జోక్యం కొంత వరకూ పనిచేసిందని తెలుస్తోంది. మూడు రోజుల క్రితండ్యాన్సర్స్ అసోసియేషన్లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య గొడవ జరిగింది. అప్పడు డ్యాన్సర్స్ అసోసియేషన్ జానీ మాస్టర్ సినిమాలకు పని చేయకూదని పిలుపునిచ్చింది.

క్లైమేట్ యాక్టివిస్ట్ వాంగ్ చుక్ గురించి మీకు తెలుసా?
లడఖ్‌కు చెందిన సోనమ్ వాంగ్‌చుక్ విద్యా సంస్కరణలు, పర్యావరణ ఆవిష్కరణలతో పాటు రాజకీయ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు. 1988లో SECMOL స్కూల్ ను స్థాపించి స్థానిక విద్యా విధానాన్ని మార్చడం ద్వారా టెన్త్ పాస్ శాతాన్ని 5% నుండి 75%కి పెంచారు. ఈ కృషికి గానూ 2018లో ఆయనకు రామన్ మెగసేసే అవార్డు దక్కింది. పర్యావరణ రక్షణ కోసం 'ఐస్ స్తూపాలు' లాంటి వినూత్న ఆవిష్కరణలు చేసిన వాంగ్‌చుక్, లడఖ్‌కు ప్రత్యేక గుర్తింపు, రక్షణ కల్పించే ఆరో షెడ్యూల్ అమలు కోసం పెద్ద ఎత్తున పోరాడారు. ఈ క్రమంలో జైలు శిక్షను కూడా ఎదుర్కొన్నారు. ఇటీవల విద్యా రంగ సంస్కరణల కోసం ఢిల్లీలో 20 రోజులకు పైగా దీక్ష చేస్తున్నారు.

కెన్ బెట్వా ప్రాజెక్టుకు నిరసన సెగ-150 మంది అరెస్ట్
మధ్యప్రదేశ్ చత్తర్‌పూర్ లోని కూపి గ్రామంలో గత 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న 'కేన్-బెట్వా' ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట నేత అమిత్ భట్నాగర్‌తో పాటు మరో 150 మంది నిరసనకారులను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. భూసేకరణ, పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఈ ప్రొటెస్ట్ నడుస్తోంది. ఈ రూ. 44,605 కోట్ల భారీ నదీ అనుసంధాన ప్రాజెక్టు వల్ల సుమారు 2,000 కుటుంబాలు నిరాశ్రయులవుతుండటంతో అక్కడ గొడవ నడుస్తోంది.

చిరంజీవి ప్రశంసలపై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యువ ప్రొడ్యూసర్, కొణిదెల ఫ్యామిలీకి చెందిన నిహారిక తీసిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు అవార్డు దక్కడం పట్ల మెగాస్టార్ ఫ్యామిలీలో ఆనందం వ్యక్తమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నిహారికను సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తూ రుద్రవీణ సినిమా నిర్మాతగా మీ నాన్న ( కొణిదెల నాగబాబు) అవార్డు తీసుకుంటే ఇప్పుడు నువ్వు అవార్డు దక్కించుకోవడం మాకు ఆనందంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు. దానిపై రెస్పాండ్ అయిన నీహారిక చిరంజీవి లాంటి వ్యక్తి ప్రశంసలు దక్కడంపై తోపే నన్ను నువ్వు తోపు అంటూంటే చాలా ఆనందంగా ఉంది అని అంది.

మానసిక సమస్యలతో తెలంగాణ టెక్కీ సూసైడ్ !
తెలంగాణలోని మేడిపల్లిలో ఒక విషాదకర సంఘటన వెలుగుచూసింది. తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తేజస్విని (25) అనే మాజీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, అర్ధరాత్రి బట్టలు లేకుండా వీధుల్లో పరిగెడుతూ స్థానిక బీరప్ప గుడి కోనేట్లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులో ఐటీ ఉద్యోగం వదిలేసిన ఆమె, గత కొంతకాలంగా తీవ్ర భయాందోళనలు, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిలిచిపోయిన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ సేవలు !
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా నిలిచిపోయాయి. దాంతో వేలాది మంది వినియోగదారులు ఎక్కౌంట్లలో లాగిన్ అవ్వడానికి, కొత్త పోస్టులు పెట్టడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెటా యాజమాన్యంలోని ఈ యాప్‌లలో సర్వర్ లోపం కారణంగానే ఈ టెక్నికల్ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. యూజర్లు తమ సమస్యలను ఇతర సోషల్ మీడియా వేదికలలో పంచుకుంటూ అసహనం వ్యక్తం చేస్తుండటంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

పార్లమెంట్ సెషన్స్ పై ఆల్ పార్టీ మీట్ కు టీఎంసీ రెబెల్స్ !
పార్లమెంట్ సమావేశాల కోసం కేంద్రం నిర్వహించిన ఆల్ పార్టీ మీట్లో గందరగోళం నెలకొంది. 20 మంది TMC తిరుగుబాటు ఎంపీలతో కూడిన 'నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా' (NCPI) ను ఈ సమావేశానికి ఆహ్వానించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందే వాళ్లను ఎలా ప్రత్యేక పార్టీ కింద పిలుస్తారని ప్రశ్నిస్తూ విపక్ష ఎంపీలు సమావేశం వాకౌట్ చేశారు. అందరినీ పిలవడం తమ బాధ్యత అందుకే పిలిచాం అని కేంద్రమంత్రి కిరిణ్ రిజిజు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి విపక్ష ఎంపీలు తిరిగి చర్చల్లో పాల్గొన్నారు.

ఈసారి ఫిఫా కప్ కొట్టేది స్పెయినే-రొనాల్డో
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ విజయం సాధిస్తుందని బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డో నజారియో స్పష్టం చేశారు. ఈ టోర్నమెంట్‌లో స్పెయిన్ ఆడిన దాదాపు అన్ని మ్యాచ్‌లపై పూర్తి కంట్రోల్ సాధించిందని, ఫైనల్లో కూడా వారు సులువుగా గెలుస్తారని ఆయన ESPN Brasil ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. స్పెయిన్ ఒకవేళ ముందే గోల్స్ చేస్తే, బంతిని తమ కంట్రోల్ లో ఉంచుకుని అర్జెంటీనాకు కోలుకునే ఛాన్స్ ఇవ్వదని రోనాల్డో అంచనా వేశారు.

వాంగ్ చుక్ కు దక్కని రిలీఫ్- ఆస్పత్రిలోనే దీక్ష !
లడఖ్ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయనను ఆసుపత్రి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేసేందుకు పర్మిషన్ కోరుతూ ఆయన భార్య వేసిన పిటిషన్‌పై ఇంటెరిం రిలీఫ్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దాంతో ఆయన ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే కొనసాగనున్నారు. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నామని, అవసరమైన అన్ని మెడికల్ ఫెసిలిటీస్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామం ఆయన మద్దతుదారుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో దద్దరిల్లుతున్న మిడిల్ ఈస్ట్
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య వివాదం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) ప్రాంతం మరోసారి యుద్ధ మేఘాల నీడలోకి వెళ్ళింది. ఇరు దేశాలు పరస్పరం వైమానిక దాడులు, క్షిపణి దాడులకు దిగడంతో పాత అణు ఒప్పందాలు పూర్తిగా పక్కకు పోయాయి. సరిహద్దుల్లో సైరన్ల మోత, వరుస పేలుళ్లతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అక్కడి ప్రజలకు బతుకు నిత్య నరకంగా మారింది. ఈ తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుండగా, మిడిల్ ఈస్ట్ ప్రస్తుతం వార్ ఫీల్డ్ లా మారిపోయింది.
రైతులకు అండగా ఉంటాం: సబితా ఇంద్రారెడ్డి
TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, BRS నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కలిశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో తమ సాగుభూములను బలవంతంగా తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా రైతులు తమ భూములను రక్షించాలని వేడుకున్నారు. రైతుల సమస్యలను విన్న ఆమె, భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు BRS పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ఫైరయ్యారు.

ప్లాట్లు ఇప్పిస్తానని, రాత్రికి రాత్రే పరార్
TG: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో ప్లాట్ల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి వెంకటేష్ అనే వ్యక్తి పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు. డబ్బులు చెల్లించిన తర్వాత ప్లాట్లు ఇవ్వకపోవడంతో అతని ఇంటి ముందు వారు ఆందోళనకు దిగారు. అయితే అక్కడికి చేరుకునే సరికి వెంకటేష్ ఇల్లు అమ్ముకుని కుటుంబంతో కలిసి పరారైనట్లు తెలిసి వారు షాక్‌కు గురయ్యారు. తమ కష్టార్జిత సొమ్మంతా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేష్‌ను అరెస్ట్ చేసి, తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులు, ప్రభుత్వాన్ని కోరారు.
నీట్, ప్రశ్నాపత్రాల లీక్‌లపై ప్రతిఒక్కరూ స్పందించాలి: తులసిచందు
TG: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రేపు ఢిల్లీలో నిర్వహించనున్న ‘ఛలో పార్లమెంట్’కు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. ఛలో పార్లమెంట్‌కు ప్రముఖ జర్నలిస్ట్ తులసిచందు తన మద్ధతు ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జరిగే ఈ కార్యక్రమానికి అందరూ సపోర్ట్‌గా ఉండాలని కోరారు. ప్రధాని మోడీ పాలనలో జరిగిన నీట్, ప్రశ్నాపత్రాల లీక్‌లపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలన్నారు.
వర్షాల కోసం గాడిదలకు పెళ్లి
AP: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో గ్రామస్థులు వినూత్న ఆచారాన్ని నిర్వహించారు. వర్షాలు కురవాలని రెండు గాడిదలను వధూవరులుగా అలంకరించి, డప్పుచప్పుళ్లతో ఊరేగింపు చేశారు. అనంతరం వేద మంత్రాల సాక్షిగా గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. మంగళసూత్రం కట్టి, తలంబ్రాలు పోసి, హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఇలానే గాడిదలకు పెళ్లి చేయడంతో మంచి వర్షాలు కురిశాయని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
3 మేయర్లు కాదు.. ముందు ఒక కార్పొరేషన్ గెలిపించండి
TG: BJP నుంచి బయటకు వెళ్లిన గోషామహల్ MLA రాజాసింగ్ మరోసారి పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన ఆయన, MP ఈటల రాజేందర్, కేంద్రమంత్రి బండి సంజయ్ కలిస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందా అంటూ పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. పార్టీలో సీనియర్ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంటని నిలదీశారు. త్వరలో జరగనున్న GHMC ఎన్నికలపై మాట్లాడుతూ, 3 కార్పొరేషన్ల మేయర్లను గెలవడం కాదు, ముందుగా ఒక కార్పొరేషన్‌లో సగం కార్పొరేటర్లను గెలిపించి చూపించాలని సవాల్ విసిరారు.

కారం చల్లి రాళ్లు రువ్విన రైతులపై కేసు నమోదు
TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం చేపట్టిన 600 ఎకరాల భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున చేరుకున్న రైతులు, గ్రామస్తులు అధికారులను, పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చెలరేగి, కొందరు రైతులు పోలీసులపై కారం చల్లి రాళ్లు, కుర్చీలు విసిరారు. ఈ ఘటనలో DCP యోగేష్ గౌతమ్‌తో పాటు పలువురు CIలకు గాయాలయ్యాయి. పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి, దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. వీడియో ఆధారంగా గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వాంగ్‌చుక్ భార్య
ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, ఆయన భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వాంగ్‌చుక్‌ను అక్రమంగా నిర్బంధించారని, వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె పిటిషన్‌లో కోరారు. వ్యక్తిగత వైద్యులు, న్యాయవాదులను కలిసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 21 రోజుల నిరాహార దీక్ష అనంతరం పోలీసులు ఆయనను శనివారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారని, చికిత్స విషయంలో పారదర్శకత లేదని ఆమె ఆరోపించారు.

బెట్టింగ్ కోసం చోరీ.. నిందితుడు అరెస్ట్
TG: హైదరాబాద్‌లోని సరస్వతినగర్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవాలయంలో జరిగిన చోరీ కేసును సరూర్‌నగర్ పోలీసులు ఛేదించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువకుడు బూర్ల అనిల్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, హుండీ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీ నష్టాలు రావడంతో అప్పుల పాలైన నిందితుడు డబ్బు కోసం ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో దేవాలయంలోకి ప్రవేశించి చోరీ చేసిన అతడిని CCTV దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.