Latest

రాజస్థాన్ లో గర్భిణీలకు ఫేక్ ఇంజెక్షన్లు- 5గురి మృతి
రాజస్థాన్‌లోని కోట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల అనంతరం ఐదుగురు బాలింతలు మరణించగా, డెలివరీ టైమ్ లో వారికి ఇచ్చిన ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పరీక్షల్లో సీసాల్లో ఔషధం బదులు నీరే ఉన్నట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. అమృత్‌సర్‌కు చెందిన జాక్సన్ ల్యాబొరేటరీస్ తయారు చేసిన ఈ బ్యాచ్‌పై విచారణ కొనసాగుతోంది. 2023 నుంచే ఆ సంస్థపై తయారీ నిలిపివేత ఆదేశాలు ఉన్నప్పటికీ నకిలీ ఔషధాల సరఫరా కొనసాగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

వ్యసనాలతో బ్రెయిన్ డ్యామేజ్: నిపుణుల వార్నింగ్
మద్యం, డ్రగ్స్ లేదా స్క్రీన్ అడిక్షన్ ఏదైనా... అది మెదడు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వ్యసనాల వల్ల బ్రెయిన్‌లోని 'డోపమైన్' కెమికల్ విడుదల తారుమారై, ఆలోచనా శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతాయని ప్రముఖ వైద్యుడు రషిక్కారా అయ్యర్ అన్నారు.. మానసిక ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపించడం వంటి సమస్యలు వస్తాయి. మెదడులోని భావోద్వేగాలను కంట్రోల్ చేసే భాగాలపై ప్రభావం చూపడం వల్ల చిన్న చిన్న విషయాలకే కోపం, ఆందోళన,డిప్రెషన్ లాంటివి కలుగుతాయి. వ్యసనం అనేది మెదడుకు సంబంధించిన జబ్బు అని గుర్తించాలి. అడిక్షన్‌కు దూరంగా , మెదడు ను యాక్టివ్‌గా ఉంచుకోవడం ముఖ్యమని రషిక్కారా తెలిపారు.

సముద్రంలో చిక్కుకున్న మరో ఫిషింగ్ బోటు
AP: సముద్రంలో ఇంజిన్ మొరాయించడంతో విశాఖకు చెందిన మరో ఫిషింగ్ బోటు ఒడిశాలోని పూరి సముద్ర జలాల్లో చిక్కుకుపోయింది. జూన్ 22న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన 9మంది మత్స్యకారులు బోటు ఇంజిన్ ఆగిపోవడంతో సముద్రంలోనే చిక్కుకుపోయారు. తాము సురక్షితంగా ఉన్నామని, తమను కాపాడాలని మత్స్యకారులు వీడియో సందేశం ద్వారా తమ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తక్షణమే విశాఖ కలెక్టర్‌తో మాట్లాడారు. కలెక్టర్.. కోస్ట్‌గార్డ్ బృందాల సాయంతో మత్స్యకారులను రక్షించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు.
ఇంట్లోకి వచ్చిన చిరుత.. CCTVలో షాకింగ్ దృశ్యాలు
AP: తిరుపతిలో అర్థరాత్రి ఓ లెక్చరర్ ఇంట్లోకి చిరుత సంచారం.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరకంబాడి రోడ్డులోని వెంకటాపురంలో లెక్చరర్ బాలాజీ ఇంటి లోపల ఒక పెంపుడు కుక్క కట్టేసి ఉండగా దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఇంట్లో వాళ్లు కేకలు పెట్టడంతో చిరుత బయటకు పరుగులు తీసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు CC TV కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతమూడు రోజులుగా చిరుత సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు
AP: ప్రముఖ యూట్యూబర్, ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్‌పై కృష్ణా జిల్లా గన్నవరం PSలో రాజద్రోహం కేసు నమోదైంది. జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే FIR నమోదు అయింది. ఈ కేసులో భాగంగా పోలీసులు BNS సెక్షన్ 147, 148, 152 లతో పాటు, UAPA చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు తనపై నమోదైన అన్ని కేసులను ఒకేసారి విచారించాలని రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

గల్లంతైన మత్స్యకారుల్లో ఐదుగురు క్షేమం
AP: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులలో ఐదుగురి ఆచూకీని అధికారులు గుర్తించారు. గల్లంతైన మత్స్యకారుల్లో కారె చిన్నయ్యను సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక సిబ్బంది గుర్తించి సురక్షితంగా కాపాడారు. చిన్నయ్యతో పాటు మరో నలుగురు మత్స్యకారులు కూడా అదే ప్రాంతంలో ఉన్నారు. అయితే వారు వాణిజ్య నౌకపైకి ఎక్కలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆచూకీ ఇంకా తెలియని మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

రైల్వే ట్రాక్‌పై షాకింగ్ ఘటన
AP: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌బాడీలను పరిశీలించారు. నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని.. వారంతా సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మంత్రి ఆరోపణలపై ప్రకాష్ రాజ్ ఫైర్
AP: నటుడు ప్రకాష్‌రాజ్‌కు, యూట్యూబర్, ప్రశ్న రావణ్‌కు మధ్య చీకటి సంబంధాలు ఉన్నాయని కందుల దుర్గేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. వేర్వేరు సందర్భాల్లో నేను చేసే ట్విట్లను, మాట్లాడుకున్న వాయిస్ మెసెజెస్‌తో సోషల్ మీడియాలో లీక్ చేసి ప్రశ్న రావణ్, నేను మాట్లాడుతున్నట్లు పెట్టిన ఆడియో అవాస్తవమని, దీన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని అనుకోవడం సరికాదని ప్రకాష్ రాజ్ ఫైరయ్యారు. గాలి మాటలు సృష్టించి చేస్తున్న అక్రమ అరెస్టులను, దౌర్జన్యాన్ని తెలుగు ప్రజలు చూస్తున్నారన్నారు.

ప్రశ్న రావణ్ మరోసారి అరెస్ట్
AP: ఇప్పటికే నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్టై బెయిల్ పొందిన ప్రశ్న రావణ్‌ను తాజాగా ఐదోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రశ్న రావణ్‌పై రాష్ట్రవ్యాప్తంగా PSలలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఆయన్ను వరుసగా అరెస్టు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మచిలీపట్నం నుంచి ఆయనను నక్కపల్లి రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాజాగా గన్నవరం స్టేషన్‌లో నమోదైన కేసులో ఆదివారం తెల్లవారుజామున రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్
AP ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ప్రముఖ యూట్యూబర్, ప్రశ్న రావణ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుల దర్యాప్తును CBIకి అప్పగించాలని ఆయన హైకోర్టును కోరారు. ప్రతివాదులుగా AP ప్రభుత్వం, DGPతో పాటు పలువురు జిల్లా SPలను చేర్చారు. యూట్యూబర్ రావణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టనున్నట్లు AP హైకోర్టు తెలిపింది.

విశాఖ తీరంలో టెన్షన్.. ఆ ఏడుగురి జాడే లేదు
AP: విశాఖ తీరంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వీరు జూలై 1న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. సముద్రం ఒక్కసారిగా మారడంతో తిరిగి హార్బర్‌కు వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. నిన్న మత్స్యకారులు తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, మధ్యాహ్నం 3గంటల కల్లా విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంటామని చెప్పారు. ఇంకా రాకపోవడంతో ఆందోళన మొదలైంది.

ఫేక్ సాలరీ స్లిప్స్‌తో SBIకి టోకరా
TG: ఫేక్ సాలరీ స్లిప్స్, తప్పుడు గుర్తింపు పత్రాలు సమర్పించి మేడిపల్లి SBI బ్రాంచ్ నుంచి రూ.10 లక్షల పర్సనల్ లోన్ పొంది మోసానికి పాల్పడిన ఓ నర్సింగ్ అధికారిణిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. సనత్‌నగర్‌లోని ESIC సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సీనియర్ నర్సింగ్ అధికారిణిగా పనిచేస్తున్నట్లు ప్రతిభ అనే మహిళ 2023 ఏప్రిల్‌లో పర్వతాపూర్ SBI బ్రాంచ్‌లో రూ.10లక్షల పర్సనల్ లోన్ తీసుకుంది. బ్యాంకు అంతర్గత విచారణలో మోసం బయటపడటంతో మేడిపల్లి పోలీసులకు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి పోలీసులు నర్సింగ్ అధికారిణిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సాయికృష్ణను లాకప్‌లోనే చంపేశారు: అంబటి
AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసును CBIకి అప్పగించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. సాయికృష్ణను లాకప్‌లోనే చంపి డెడ్‌బాడీ కూడా మాయం చేశారని ఆయన ఆరోపించారు. కేసు భూస్థాపితం చేయాలని CI నాగరాజు చూశారని, జగన్ సాయికృష్ణ తల్లిని పరామర్శించే వరకూ కేసు నమోదు చేయలేదని ఫైరయ్యారు. జగన్ వెళ్లకపోయి ఉంటే కేసు రిజిస్టర్ కూడా అయ్యేదికాదని అన్నారు. CI నాగరాజు ఈ కేసులో వాస్తవాలు బయటకు రాకుండా చేశారని ఆరోపించారు.

ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో స్టూడెంట్ మిస్సింగ్
TG: ఖమ్మం జిల్లా కారేపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో మైనర్ విద్యార్థిని మిస్సింగ్ ఘటన విద్యార్థుల భద్రతపై ఆందోళనకు దారితీసింది. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో అధికారులు పాఠశాలలో విస్తృతంగా విచారణ నిర్వహించారు. విద్యార్థులను పంపించే విషయంలో పాటించాల్సిన నిబంధనలను అమలు చేయకపోవడం, పర్యవేక్షణ లోపమే ఈ ఘటనకు కారణమని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు విద్యార్థిని ఆచూకీ గుర్తించి భరోసా కేంద్రానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్‌డెడ్
TG: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోని హైదరాబాద్-విజయవాడ హైవేపై అతివేగంగా వచ్చిన ట్రావెల్స్ బస్సు ఎదురుగా ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోగా, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిట్యాల పోలీసులు తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. నేషనల్ హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

నన్ను చంపవచ్చు కానీ ప్రశ్నను చంపలేరు
AP: యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్‌ను మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నాలుగుసార్లు రావణ్‌ను అరెస్ట్ చేయగా, నాలుగు సార్లు బెయిల్ వచ్చింది. ఎలమంచిలి కోర్టులో రావణ్ బెయిల్‌పై విడుదలైన కాసేపటికే నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రావణ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కావాలంటే తననను స్టేషన్‌లోనే చంపేయాలని అన్నారు. తనను చంపకుండా స్టేషన్ల చుట్టూ తిప్పినా తానే ఆహారం మానేసి చనిపోతానని అన్నాడు. తనను చంపవచ్చు కానీ ప్రశ్నను చంపలేరని అన్నారు.

గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
AP: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రాథమికంగా రూ.1,500 కోట్లు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులకు అదనంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్(UCG), అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్(UIDF), యాన్యుటీ మోడల్ కింద రూ.580 కోట్లను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఇస్తామన్నారు. అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

రీసర్వేతో భూ వివాదాలకు చెక్
AP: గత ప్రభుత్వం ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా(22A) పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని CM చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కంగుంది గ్రామంలో 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 322 మంది రైతులకు ఎసైన్‌మెంట్ పట్టాలు ఇచ్చారు. భూ వివాదాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సమీక్షిస్తున్నానని తెలిపారు. రీసర్వే చేసి వివాదాలను పరిష్కరిస్తున్నట్లు CM పేర్కొన్నారు.

రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు
TG: రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవని మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడూతూ.. అప్పుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మా మాట అసెంబ్లీలో ఒకటే.. బయట ఒకటే. మీరు మాత్రం శ్వేతపత్రంలో ఒకలా, అసెంబ్లీలో మరోలా, ప్రెస్‌మీట్లలో ఇంకోలా చెప్తున్నారని ఫైరయ్యారు. హామీలు అమలు చేయలేక, బయటపడుతున్న అవినీతి ఆరోపణలు, స్కామ్‌ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే CM రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రోజుకో కొత్త అప్పుల లెక్క చెప్తున్నారని విమర్శించారు.

KCR వస్తే ఫోన్ కూడా మాట్లాడలేరు: రేవంత్ రెడ్డి
TG: తెలంగాణను దోచుకునేందుకు KCR మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని CM రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అప్పులు, తప్పులు చేసిన వాళ్లు మళ్లీ వస్తే రాష్ట్రంలో ఫోన్ కూడా స్వేచ్చగా మాట్లాడుకునే పరిస్థితి ఉండదని ఫైరయ్యారు. రాష్ట్రంలో కులగణన చేసి వందేళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని స్పష్టం చేశారు. నల్లమల నుంచి వచ్చిన నాకు ఏమీ తెలియదని కొందరు అవహేళన చేశారన్నారు. గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తిగా పరిపాలన చేయడానికి కావాల్సిన అవగాహన నాకు ఉందన్నారు.

దూసుకొస్తున్న వేడి నీటి అల - ఎల్ నినో యాక్టివ్
పసిఫిక్ మహాసముద్రంలో 14,500 కిలోమీటర్ల పొడవైన ఒక భారీ వేడి నీటి అల (Monster Wave) దూసుకొస్తోంది! నాసా (NASA) శాటిలైట్ కనిపెట్టిన ఈ పరిణామంతో 'ఎల్ నినో' (El Nino) మళ్లీ యాక్టివ్ అయిందని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. ఈ వింటర్ నాటికి ఇది మరింత తీవ్రరూపం దాల్చే ఛాన్స్ 63% ఉందట. దీనివల్ల గ్లోబల్ వెదర్ పూర్తిగా మారిపోయి, రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణం పీక్స్‌కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది!