Latest

బస్సులో మహిళ ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్, కండక్టర్
TG: పెద్దపల్లి జిల్లా మద్దికుంట గ్రామానికి చెందిన తాండ్ర నిరోషా అనే మహిళ RTC బస్సులో వెళ్తోంది. ఆమెకు తీవ్రమైన ఛాతి నొప్పి రావడంతో బస్సు సీట్లోనే స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన బస్సు కండక్టర్ సుమన్,, డ్రైవర్ రాజు వెంటనే అలర్ట్ అయ్యారు. బస్సును ఓదెలలోని 108 అంబులెన్స్ పాయింట్‌కు తీసుకొచ్చారు. మహిళను అంబులెన్స్ ఎక్కించి శ్రీరాంపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. డ్రైవర్, కండక్టర్‌లను శాలువాలతో సన్మానించి అభినందించారు.

వాట్పాప్ గ్రూప్‌లో పాలిటిక్స్.. పోలీసులకు ఫిర్యాదు
TG: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్-12లోని NBTనగర్ బస్తీ సమస్యలపై చర్చించుకునేందుకు స్థానికులు ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. గ్రూప్‌లో కొందరు పొలిటికల్ మెసెజెస్ పోస్టు చేస్తున్నారు. గ్రూప్‌లో రాజకీయ పరమైన పోస్టులు పెట్టకూడదని గ్రూప్ అడ్మిన్ హెచ్చరించారు. ఓ మహిళ నిరంతరం పొలిటికల్ మెసెజెస్ పోస్ట్ చేస్తుంది. అడ్మిన్ ఆమెను గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రూప్ నిబంధనలను ఉల్లంఘించినందుకే ఆమెను తొలగించామని, ఆమెను తిరిగి గ్రూప్‌లో చేర్చుకునే ప్రసక్తేలేదని అడ్మిన్ పోలీసుల ముందే తేల్చి చెప్పాడు.

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు.. CI ఫ్రెండ్ సురేష్ అరెస్ట్
AP: సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. పరారీలో ఉన్న CI నాగరాజు స్నేహితుడు సురేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తూ కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు సమాచారం. సాయికృష్ణ లాకప్‌డెత్ అనంతరం డెడ్‌బాడీని మాయం చేయడంలోనూ, కుటుంబసభ్యులతో రాజీకి రాయబారం నడపడంలోనూ CI నాగరాజుకు సురేష్ సహకరించినట్లు అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నానిల కోసం సెంట్రల్ డివిజన్ టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

పెళ్ళైన 40 రోజులకే అనుమానాస్పద మృతి
AP: విజయనగరం జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన కృష్ణవేణి(25)కి ఈ ఏడాది మే 13న తన దగ్గరి బంధువైన యాండ్రాపు మురళీతో మ్యారేజ్ అయింది. వివాహం అనంతరం విశాఖపట్నం జిల్లా PMపాలెం PS పరిధిలోని RH కాలనీలో నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మురళీ రోజూలాగే డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చేసరికి కృష్ణవేణి ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. మురళీ పోలీసులకు సమాచారం అందించారు. ACP అప్పలరాజు, CI బాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రెండు కార్లు ఢీకొని ముగ్గురు స్పాట్ డెడ్
AP: కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం పాలెంపల్లి వద్ద ఓవర్ స్పీడ్‌తో వచ్చిన రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు కార్లలో చిక్కుకున్న వారిని బయటకు తీసి 108 వాహనంలో కడప రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు తిరుపతి పట్టణం జీవకోనకు చెందిన హర్షవర్ధన్(27), కిషోర్(28), సుధీర్ కుమార్ రెడ్డి(24)గా పోలీసులు గుర్తించారు.

దిగ్గజ దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత
తమిళ సినీ ప్రముఖ నటుడు, దర్శకుడు కే. భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. నటుడు, దర్శకుడు, కథా రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలిగా భాగ్యరాజ్ తమిళ సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. నటుడిగా సుమారు 75కు పైగా చిత్రాల్లో నటించారు. 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆయనను ‘వన్ మ్యాన్ స్టూడియో’గా అభివర్ణించేవారు. భాగ్యరాజ్ మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల హల్‌చల్
TG: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని శ్రీ జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్‌లోకి చొరబడ్డ ఇద్దరు రౌడీషీటర్లు బెదిరింపులకు పాల్పడ్డారు. మద్యం మత్తులో షోరూమ్‌లోకి ప్రవేశించి షోరూమ్ మేనేజర్ పంకజ్ బండ్గర్‌ను కత్తితో బెదిరించారు. లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దౌర్జన్యానికి దిగారు. తర్వాత వచ్చినప్పుడు డబ్బులు సిద్ధంగా ఉంచాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. భయాందోళనకు గురైన పంకజ్ బండ్గర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. CCTV ఫుటేజ్ ఆధారంగా నిందితులు అలీమ్, యూనస్‌లను అరెస్ట్ చేశారు.

తెలంగాణకు ట్రంప్ స్పెషల్ థ్యాంక్స్
హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ పక్కనున్న రహదారికి తన పేరు పెట్టడంపై US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన పేరుతో రోడ్డుకు నామకరణం చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా గౌరవాన్ని అందుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిని తానేనని ట్రంప్ వెల్లడించారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 23న హైదరాబాద్‌లో విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ ప్రత్యేక ఫలకాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో కలిసి డిప్యూటీ CM భట్టివిక్రమార్క ఆవిష్కరించారు.

గోవాలో ఖుష్బూ కుమార్తె గ్రాండ్ వెడ్డింగ్ !
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ - దర్శకుడు సుందర్ సి ల పెద్ద కుమార్తె అవంతిక వివాహం మర్చంట్ నేవీ ఆఫీసర్ శ్రవణ్ శ్రీనివాసన్‌తో గోవాలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, త్రిషలతో పాటు బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ స్టార్-స్టడెడ్ వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కిడ్నాప్ చేసి.. తలకిందులుగా వేలాడదీసి దాడి
AP: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని ఎ పోలవరం గ్రామానికి చెందిన తమ్మిలేటి అంజిబాబు అనే వ్యక్తి అదే గ్రామంలో పందెంకోడి పుంజులను దొంగిలించాడనే నెపంతో కొంతమంది యువకులు దాడిచేశారు. అంజిబాబును కిడ్నాప్ తరహాలో కొంతమంది వ్యక్తులు కారులో తీసుకువెళ్లి తలకిందులుగా వేలాడతీసి కొట్టినట్లు సమాచారం. బాధితుడు చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని గ్రామస్తులు రోడ్డెక్కారు. కేసు నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం చేస్తూ దాడిచేసిన వారికే కొమ్ము కాస్తున్నారని PS ఎదుట గ్రామస్తులు ధర్నా చేశారు.

సాయికృష్ణ కేసు.. పోలీసులకు NHRC నోటీసులు
AP: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న CI నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. CI నాగరాజుకు అతడి స్నేహితుడు, ఇద్దరు సిబ్బంది సహకరించినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. నాగరాజు అరెస్ట్ తరవాత ఆరోపణలు ఎదుర్కొంటున్న నాని, అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి కోసం అధికారులు గాలిస్తున్నారు. మరోవైపు పోలీసులపై NHRC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ DGP, విజయవాడ CPలకు నోటీసులు జారీ చేసింది. డిలీట్ చేసిన CCTV ఫుటేజీని రికవరీ చేయాలని, సాయికృష్ణ అస్థికలను వెలికితీయాలని ఆదేశించింది.

ఇంటర్న్‌షిప్ లేకుండానే ప్రాజెక్ట్ రిపోర్ట్
TG : ఉస్మానియా యూనిర్సిటీ పరిధిలోని కొన్ని MBA కాలేజీలు విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇచ్చి కార్పొరేట్ రంగానికి సిద్ధం చేయాల్సి ఉండగా, వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. నిబంధనల ప్రకారం విద్యార్థులతో ఇంటర్న్‌షిప్ చేయించి, ప్రాజెక్టు రిపోర్టులు రూపొందించాలి. కానీ ఫేక్ ప్రాజెక్ట్ సర్టిఫికెట్లతో రిపోర్టులు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు ప్రైవేట్ MBA కాలేజీలు విద్యార్థులను ఏ కంపెనీకీ పంపకుండా, శిక్షణ ఇప్పించకుండానే ఫేక్ సర్టిఫికెట్లతో ముందుకెళ్తున్నాయి. దీని వెనుక OU ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఫైరవుతున్నాయి.

మూసీ నిర్వాసితులకు 2BHK ఇళ్లు
TG: మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్‌పై CM సమీక్ష నిర్వహించారు. భూసేకరణ కోసం ఆసక్తిగా ఉన్న వారికి టీడీఆర్ లేదా పరిహారం చెల్లించాలని రేవంత్ చెప్పారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న రక్షణశాఖ భూముల్లో ఉన్న కార్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాలన్నారు. ప్రజల సందర్శన కోసం నెక్లెస్ రోడ్డులో మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూసీ ప్రాజెక్టులో చేపట్టబోయే పనులు ఇందులో ప్రతిబింబించాలని అన్నారు.

రేవంత్ రెడ్డి ఆరిపోయే దీపం: KTR
TG: సీఎం రేవంత్ రెడ్డి ఆరిపోయే దీపం లాంటివారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఎద్దేవా చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న BRS నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. అసైన్డ్ రైతులకు పట్టాలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు పారిశ్రామిక పార్కుల పేరిట వేలాది ఎకరాలు లాక్కుంటున్నారని ఆరోపించారు. పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి కనీసం ధాన్యం కూడా పూర్తిగా కొనలేకపోతున్నారని విమర్శించారు.

రోడ్డెక్కిన అవుట్‌సోర్సింగ్ టీచర్లు.. మంత్రి ఇంటి ముట్టడి
AP: ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజన గురుకులాల అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు ధర్నా చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటిని ముట్టడించారు. 15 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులను తొలగించడం దారుణమన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులకు న్యాయం చేసేవరకు కదిలేది లేదంటూ బైఠాయించారు. న్యాయం చేయండి.. మా ఉద్యోగాల్ని కాపాడండి అని నినాదాలు చేశారు. రాష్ట్రంలో DSC-2025 వల్ల తమ ఉద్యోగ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుండటంతో 40రోజులుగా ఆందోళనలు చేస్తున్నామన్నారు.

వైరల్‌గా మారిన అధికారి మామూళ్ల చిట్టా
TG: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయిన నిజామాబాద్ ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నెలవారి మామూళ్ల చిట్టాను చూసి ACB అధికారులు షాక్ అయ్యారు. నిజామాబాద్ కల్లు దుకాణం రూ.15వేల మామూలును 20వేలకు పెంచారని, బోర్గం కల్లు దుకాణం మామూలు రూ.5వేల నుంచి రూ.12వేలకు పెంచారని ఇలా అనేక కల్లుడిపోల నుంచి నెలవారీ మామూళ్లను ఆయన సేకరించారని పేర్కొన్నారు. కల్లు డిపోలు, వైన్స్ షాపుల నుంచి నెలకు రూ. 2లక్షల వరకు అక్రమ వసూళ్లు అంటూ డైరీలో లెక్కలు రాసి పెట్టాడు. డైరీలో రాసిన వసూళ్ల చిట్టా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఫ్యూచర్ లో ఏఐకి కరోనాను ఎదుర్కొనే సత్తా
రాబోయే కాలంలో ప్రపంచాన్ని వణికించే మహమ్మారులను (Pandemics) ముందే గుర్తించి, అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త AI సాంకేతికతను అభివృద్ధి చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వేల సంఖ్యలో వైరస్ వేరియంట్లను ఎదుర్కొనే ‘సూపర్ యాంటిజెన్’ వ్యాక్సిన్‌ను కంప్యూటర్ సిమ్యులేషన్స్ మరియు AI సహాయంతో రూపొందించారు. వైరస్ జన్యు డేటాను విశ్లేషించడం ద్వారా, అది రూపాంతరం (Mutation) చెందినా పనిచేసేలా ఈ యూనివర్సల్ వ్యాక్సిన్ దోహదపడుతుంది. ఇటీవలే దీని మానవ క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతం కావడం విశేషం.

అల్లూరి జిల్లాలో మలేరియా అలజడి
AP: రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. దోమల బెడద, కలుషిత నీరు, పారిశుద్ధ్య లోపం తదితర సమస్యలతో ఇన్ఫెక్షన్ల ప్రభావం ఎక్కువవుతోంది. సాధారణ జ్వరాలతో పాటు మలేరియా, డెంగీ, గన్యా జ్వరాలతో ఆసుపత్రులకు తాకిడి పెరుగుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియాతో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో గతేడాది 7,119 మలేరియా కేసులు నమోదవ్వగా.. వారిలో ఎనిమిది మంది మరణించారు. ఈ ఏడాది జూన్ వరకు 2,392 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏడుగురు మృతి చెందారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,133 మలేరియా కేసులు నమోదయ్యాయి.

కొత్త కెఫిన్ ట్రెండ్ 'ప్రాఫీ' (Proffee).. నెట్టింట వైరల్!
కాఫీ ప్రియులకు సరికొత్త 'కెఫిన్ ఫిక్స్'గా మారిన ‘ప్రాఫీ’ (ప్రోటీన్ + కాఫీ) ట్రెండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. బ్లాక్ కాఫీ లేదా కోల్డ్ బ్రూలో ప్రోటీన్ పౌడర్ లేదా షేక్స్‌ను కలిపి దీనిని తయారు చేస్తున్నారు. వ్యాయామం చేసేవారికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు రోజంతా ఉల్లాసంగా ఉంచేందుకు ఈ హెల్తీ డ్రింక్ ఎంతో దోహదపడుతుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.ఇది బరువు తగ్గాలనుకునే వారికి మరియు జిమ్‌కు వెళ్లేవారికి ఒక అద్భుతమైన హెల్తీ ఆప్షన్‌గా మారుతోంది. అయితే, దీనిని డైట్‌లో చేర్చుకునే ముందు డైటీషియన్ల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరో 4 నెలల్లో 'వారణాసి' షూటింగ్ పూర్తి.
మహేష్ బాబు, రాజమౌళిల క్రేజీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్‌పై జక్కన్న అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. సినిమాలోని ప్రధానమైన, అత్యంత కష్టతరమైన ఐమాక్స్ (IMAX) యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కేవలం చిన్న కనెక్టింగ్ సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని, రాబోయే సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారానికల్లా (అంటే మరో నాలుగు నెలల్లో) షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

కంప్లీట్ వెజిటేరియన్ సిటీగా వారణాసి !
వారణాసి నగరం త్వరలోనే పూర్తి శాకాహార నగరంగా మారబోతోంది. నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాంసం, చేపలు, కోళ్ల దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించారు. ఆరు నెలల్లోగా 400 షాపులను ఇలా తరలించేస్తారు.వీటిని నగరం బయట పెట్టడం వల్ల దేశంలో ఇదిరెండో శాకాహార నగరంగా మారనుంది. ప్రస్తుతానికి గుజరాత్ లోని పాలితానా నగరం ప్రపంచంలోనే కంప్లీట్ వెజిటేరియన్ నగరంగా పేరు పొందింది. వారణాసిలో 72 శాతం హిందువులు, 27 శాతం ముస్లింలు ఉన్నారన్నది ఒక అంచనా