Latest

పవన్ కల్యాణ్ కమలం పువ్వులో ఒక రెక్క: TPCC చీఫ్
TG: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కమలం పువ్వులో ఒక రెక్క అని, ఆయన BJP ఆడిస్తున్న ఆటలో పావుగా మారి వారు చెప్పినట్లు ఆడుతున్నారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారన్నారు. రాజకీయంగా పవన్ కల్యాణ్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు జీర్ణించుకోవట్లేదు అన్నారు.

KUDA ఆఫీస్ ముట్టడి.. హన్మకొండలో ఉద్రిక్తత
TG: హన్మకొండలోని బాలసముద్రం కమర్షియల్ ప్లాట్ల వేలాన్ని నిలిపివేయాలని BJP హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు. కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(KUDA) ఆఫీస్‌ను ముట్టడించారు. భూముల వేలంపాటను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ నాయకులు లోపలికి వెళ్లడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ, కొలను సంతోష్ రెడ్డి, ఇతర నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్: KTR
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. ఈ విషయం ప్రజలు అందరికీ తెలిసిపోయి విసుక్కుంటున్నారని మాజీ మంత్రి KTR ఫైరయ్యారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో BRS నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సినిమా సగం అయిపోయిందని, ఇంకా సగమే ఉందని తెలిపారు. CM రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా ఒక సినిమా ఫెయిలైతే నిర్మాత ఒక్కరే నష్టపోతారు. కానీ రేవంత్ రెడ్డి సినిమాలో మొత్తం తెలంగాణ ప్రజలు అందరూ నష్టపోతున్నారని విమర్శించారు.

సాయికృష్ణ కేసు.. CI నాగరాజు అరెస్ట్‌కు రంగం సిద్దం ?
AP: విజయవాడ సాయికృష్ణ కేసు విచారణ కొనసాగుతున్న వేళ నిందితుడిగా ఉన్న CI నాగరాజు గత మూడురోజులుగా ఓ కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం. నాగరాజును ఈరోజు పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయన అనుచరులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కేసులో నిందితుడిగా ఉన్న ఓ పోలీస్ అధికారి కోర్టు సిబ్బంది ఇంట్లో ఆశ్రయం పొందడం పలు అనుమానాలకు తావిస్తుంది. నాగరాజు అక్కడ ఎందుకు ఉంటున్నారు? , ఆయనకు ఎలాంటి సహకారం అందుతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సిల్లీ రీజన్ చూపి నన్ను MP కాకుండా చేశారు
TG: BJP నిర్దాక్షిణ్యంగా తన రాజ్యసభ సీటు చోరీకి పాల్పడిందని, ఎన్నికల కమిషన్ కూడా కాంప్రమైజ్ అయిందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సన్సేషనల్ కామెంట్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే తన నామినేషన్ వెంటనే తిరస్కరించారని ఫైరయ్యారు. నారాయణపేటలో మహిళ ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకున్నామని అన్నారు. సిల్లీ రీజన్ చూపి తనకు రాజ్యసభ ఎంపీ కాకుండా చేశారని ధ్వజమెత్తారు.

హైదరాబాద్‌లో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్
HYDలోని KBR పార్క్ పరిసరాల్లో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ విధానాన్ని పోలీసులు అమలుచేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా వాహనాలను అనుమతించడం లేదు. పంజాగుట్ట వైపు నుంచి మాదాపూర్ వెళ్లాల్సిన వాహనాలను బసవతారకం ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్45 మీదుగా దారి మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ మార్పుల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణాలను మరింత సులభతరం చేయడానికి చేపడుతున్న హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహించిన్నట్లు అధికారులు తెలిపారు.

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
TG: ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీలోని గుర్రాలపాడుకు చెందిన బొబ్బాల లింగరాజుకు చింతకాని మండలం నరసింహపురానికి చెందిన స్వాతికి 9ఏళ్ల క్రితం మ్యారేజ్ అయింది. లింగరాజు పాల వ్యాపారంతో పాటు, ఖమ్మంలోని మొబైల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఏడాది నుంచి ఖమ్మంలోని పంపింగ్ వెల్ రోడ్‌లో అద్దెకు ఉంటున్నారు. భార్యాభర్తలకు గొడవ జరగడంతో, స్వాతి ఇద్దరు కుమారులకు ఎలుకల మందు తాగించి, తాను కూడా తాగింది. స్థానికులు వెంటనే ముగ్గుర్నీ హాస్పిటల్‌కు తరలించారు. ఇద్దరు కుమారులు వేదిక్(7), తనుష్(5) మృతి చెందారు. తల్లి స్వాతి చికిత్స పొందుతోంది.
ప్రకృతి ఒడిలో యోగా.. వావ్ అనాల్సిందే !
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. పశ్చిమబెంగాల్‌లోని జల్దపార నేషనల్ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకృతి ఒడిలో నిర్వహించారు. నదీ తీరాన, పచ్చని అడవి మధ్య అటవీ సిబ్బంది ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. వీరితో పాటు మావటిలతో ఉన్న ఏనుగులు కూడా ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. ప్రకృతితో మమేకమై చేసిన ఈ యోగా ప్రదర్శన వీడియో నెటిజన్‌లను ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. క్షణాల్లోనే దగ్ధం
TG: కరీంనగర్ డిపోకు చెందిన RTC ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు 41 మంది ప్రయాణికులతో బయల్దేరింది. తిమ్మాపూర్ మండలం అలుగునూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, బస్సులో ఉన్న 41 మంది ప్రయాణికులను కిందకు దించేశాడు. క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఏ ఒక్క పరీక్ష జీవితానికి అంతిమం కాదు: KA పాల్
నీట్ (NEET) పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ఎవరూ సూసైడ్ చేసుకోవద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ KA పాల్ అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని, వారి భవిష్యత్తును ఒక్క పరీక్షతో ముడిపెట్టవద్దని తల్లిదండ్రులకు సూచించారు. పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్క పరీక్ష కూడా విద్యార్థుల జీవితానికి అంతిమం కాదని, యువత ఆత్మహత్యలు తీసుకోవద్దన్నారు.

మూవీ సీన్‌ను తలపించేలా బంగారం చోరీ
AP: మోతిలాల్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నంద్యాల జిల్లా డోన్ హైవేపై శనివారం అర్థరాత్రి భారీ మొత్తంలో బంగారంతో ప్రయాణిస్తున్నాడు. విషయాన్ని ముందే పసిగట్టిన దొంగల ముఠా స్కార్పియో కారులో ఆ ప్రైవేట్ బస్సును ఫాలో చేస్తూ వచ్చింది. బస్సు డోన్ హైవేపై ఉన్న భారత్ డాబా దగ్గర ఆగడంతో బంగారం ఉన్న బ్యాగ్ అపహరించుకుని స్కార్పియోలో పరారయ్యారు. బస్సు జడ్చర్ల చేరుకున్న తర్వాత మోతిలాల్ బ్యాగ్ కన్పించకపోవడంతో డోన్ PSలో ఫిర్యాదు చేశాడు. 2.750 కిలోల బంగారం చోరీ చేశారని, దానివిలువ రూ.4.50 కోట్లు ఉంటుందని బాధితుడు తెలిపాడు.

వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఈ టిప్స్ ట్రై చేయండి
వర్షాల వల్ల వచ్చే హ్యుమిడిటీ (తేమ) కి జుట్టు జిడ్డుగా మారి, విపరీతంగా రాలిపోతోందా? అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే: వర్షంలో తడిస్తే వెంటనే వాష్: వర్షపు నీటిలో ఉండే కాలుష్యం స్కాల్ప్‌ను పాడు చేస్తుంది. అందుకే తడిస్తే వెంటనే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. స్కాల్ప్ డ్రైగా ఉంచండి: తలస్నానం తర్వాత జుట్టును పూర్తిగా ఆరనివ్వండి. తడి జుట్టుతో ముడి వేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కండిషనర్ మస్ట్ : వర్షాకాలంలో జుట్టు ఫ్రిజ్జీగా (గరుకుగా) మారకుండా ఉండటానికి వారానికి రెండుసార్లు మంచి కండిషనర్ లేదా హెయిర్ సీరమ్ వాడండి.

నరసాపురంలో యువతి దారుణ హత్య
AP: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ యువతిని(31) మార్గాని రమేశ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. నరసాపురం రైల్వేస్టేషన్ నుంచి సఖినేటిపల్లికి కారులో వెళ్తున్న యువతిపై నిందితుడు కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. అడ్డుకోబోయిన కారు డ్రైవర్ సురేశ్‌పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతి డెడ్‌బాడీని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన సురేశ్‌కి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ ఏర్పాటు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తుపై AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును త్వరగా ఛేదించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో ఉన్న ప్రాధాన్యత, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యున్నత పోలీస్ అధికారులతో 'సిట్' బృందాన్ని ఏర్పాటు చేశారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఏర్పాటుచేసిన ఈ ప్రత్యేక బృందానికి (SIT) చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ రవిప్రకాశ్‌ను నియమించారు.

'మార్నింగ్ లేవగానే ఫోన్ల వాడకాన్ని తగ్గించాలి'
TG: ప్రతిఒక్కరూ మార్నింగ్ లేవగానే సెల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించి యోగా, వ్యాయామం చేయాలని మినిస్టర్ సీతక్క సూచించారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ZPHS బాలుర పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు. ప్రతిరోజు ప్రతిఒక్కరూ యోగా చేయడం ద్వారా పలు రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని తెలిపారు.

నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
TG: హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొరొల్లగూడెం స్టేజీ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కంటైనర్ బోల్తా పడింది. హైవేపై అడ్డంగా వాహనం పడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు రెండు క్రేన్లతో కంటైనర్‌ను పక్కకు తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం విజయవాడ మార్గంలో కైతాపురం నుంచి బొర్రాల్లగూడెం స్టేజ్ వరకు వాహనాలను పంపిస్తున్నారు.

ఆ ఆరోపణలు అవాస్తవం: TUTA
TG: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ 2012 నోటిఫికేషన్ ద్వారా 2014లో నియమితులైన అధ్యాపకులపై కొందరు వ్యక్తులు చేసిన ఆరోపణలను తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (TUTA) తీవ్రంగా ఖండించింది. అధ్యాపకులపై చేసిన ఆ ఆరోపణలు పూర్తిగా ఏకపక్షమైనవి, న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ప్రజావేదికలపై తప్పుగా చిత్రీకరించేవిగా ఉన్నాయని స్పష్టం చేశారు. హైకోర్టులో అప్పీళ్లు పెండింగ్‌లో ఉండగా సింగిల్ జడ్జి తీర్పును అంతిమ తీర్పుగా ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని TUTA సభ్యులు పేర్కొన్నారు.

సినీ నిర్మాత గొట్టిముక్కల పద్మారావు మృతి
TG: సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు మృతి చెందారు. హైదరాబాద్ కూకట్‌పల్లి వివేకానందనగర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున కన్ను మూశారు. నవంబరు 8, 1954లో కూకట్‌పల్లిలో జన్మించిన పద్మారావు 1996లో తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి విశేషంగా కృషిచేశారు. చిన్నప్పట్టి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. తొలి సినిమాగా 1985లో రాజశేఖరరెడ్డి దర్శకత్వంతో సుమన్ హీరోగా 'కంచు కవచం' సినిమాను నిర్మించారు.

'అది ప్రమాదం కాదు, ప్లాన్‌తోనే నిప్పంటించాడు'
TG: మిర్యాలగూడలోని కలల్వాడ కాలనీలో ఈ నెల 5న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో వనం చంద్రమ్మ (50), ఆమె మనువడు నక్కా లక్ష్మణ్(16), మనవరాలు నక్కా ప్రణతి(14) సజీవ దహనమైన విషయం తెలిసిందే. పోలీసుల లోతైన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. అది ప్రమాదం కాదని, పెట్రోల్ పోసి తగలబెట్టి ప్రమాదంగా చిత్రీకరించారని తేల్చారు. చంద్రమ్మ పెద్ద కుమార్తె ధనమ్మకు, భర్త శిరీశ్‌కుమార్‌కు ఇల్లు నిర్మించుకునే విషయంలో ఆర్థికపరమైన గొడవలు జరిగాయి. దీంతో శిరీశ్‌కుమార్, గాఢనిద్రలో ఉన్న చంద్రమ్మ, పిల్లలు లక్ష్మణ్, ప్రణతిలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

సూసైడ్‌కు సిద్దమైన మహిళ.. కాపాడిన పోలీసులు
TG: కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకోవాలనుకున్న ఓ మహిళను ఉప్పల్ పోలీసులు కాపాడారు. నాగోల్‌లోని మమతానగర్‌కు చెందిన బోడుగ స్వాతి(56) ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో ఒంటరిగా కన్పించగా, డ్యూటీలో ఉన్న ఉప్పల్ బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు మోహన్ చౌహన్, శివకృష్ణ ఆమెను గమనించారు. ఆమెను ఆపి మాట్లాడగా, ఇంట్లో జరిగిన గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి మూసీనది వైపు వెళ్తున్నట్లు తెలిపింది. వెంటనే ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి జీవితంపై నమ్మకం కల్పిస్తూ కుటుంబసభ్యులతో మాట్లాడేలా చేశారు. పోలీసుల అప్రమత్తతతో ఒక కుటుంబంలో విషాదం తప్పింది.

మరికొద్ది గంటల్లో నీట్.. విద్యార్థిని సూసైడ్
TG: ఆంధ్రప్రదేశ్‌లోని YSR కడప జిల్లాకు చెందిన జాఫర్ హుస్సేన్ కుటుంబం HYDలోని మియాపూర్‌లో నివాసముంటోంది. జాఫర్ కుమార్తె షేక్ సనా(19) NEET రీఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతుంది. లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్న సనా.. పరీక్ష ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. రీఎగ్జామినేషన్ ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నీట్ పరీక్ష రాసినా ర్యాంక్ రాలేదు. దీంతో సనా మళ్లీ ప్రిపేర్ అవుతుంది. ఇవాళ జరిగే నీట్ పరీక్ష ఆమె రాయాల్సి ఉంది.