Latest

హరీశ్‌రావు హౌస్ అరెస్ట్.. TIMS సందర్శనకు ముందే హైటెన్షన్!
TG: కోకాపేట్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట MLA హరీశ్‌రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సనత్‌నగర్‌లోని TIMS హాస్పిటల్‌ను సందర్శించేందుకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. హరీశ్‌రావు హౌస్ అరెస్ట్‌తో BRS వర్గాల్లో ఆందోళన నెలకొంది.
షాకింగ్ రైడ్!
హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ ఏరియాలో తీవ్ర నిర్లక్ష్యంతో కూడిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే స్కూటర్‌పై ఐదుగురు యువకులు ఎంతో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కెమెరాకు చిక్కారు. ఎటువంటి హెల్మెట్ లేకుండా, కనీస ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్డుపై ఇలా డేంజరస్ డ్రైవింగ్ చేయడం చూసి స్థానికులు షాక్ అవుతున్నారు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్స్, ఇలాంటి ఓవర్ లోడింగ్ అండ్ రాష్ డ్రైవింగ్ చేసే వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గుతాయి
AP: వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో కొత్త విధానాలను అనుసరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ సూచించారు. మైలవరం మండలం మొరుసుమిల్లిలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. PMDS విధానం ద్వారా నేలలో తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచి పంటల స్థిరత్వాన్ని పెంచుకోవచ్చని రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు.

ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పట్టణ సమీపంలోని ఆదర్శనగర్ కాలనీలో ఏపీ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యురాలు డాక్టర్ కే. మేఘమాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 100 మందికి నాడి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు.

గోల్డ్ రేట్స్‌లో బిగ్ చేంజ్!
భారత్‌లో ఈ వారం స్టార్టింగ్ నుంచీ ప్రతి రోజూ గోల్డ్ రేట్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. US ఫెడ్ నిర్ణయాలు, గ్లోబల్ పరిణామాల వల్లే బంగారం వైపు ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. గుడ్ రిటర్న్స్ డేటా ప్రకారం, నేడు ఆగస్టు 19 ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,900గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,42,910 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లో ప్రైసెస్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి కాబట్టి, షాపింగ్ వెళ్లేముందు లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర్.

స్మార్ట్ సిటీ రోడ్డు.. పైపులైన్ టెస్ట్‌కే కుంగిందా?
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ.40 కోట్లతో రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డులో ఎక్కువ భాగం ఒక్కసారిగా కుంగిపోయింది. నిన్న గోరకుండ్ చౌక్ దగ్గరలో కొత్తగా ఏర్పాటు చేసిన నీటి పైపులైన్‌ను టెస్ట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పైపును కనెక్ట్ చేసిన తరువాత హై ప్రెజర్ కారణంగా నీరు రోడ్డుకింద నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చింది. కొద్దిసేపటికే రోడ్డు కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

టీచర్ లేక మూతపడిన గిరిజన పాఠశాల
TG: ఉపాధ్యాయుడు విధులకు హాజరుకాకపోవడంతో పాఠశాలకు తాళం పడింది. కుమురంభీమ్ జిల్లా జైనూర్ మండలంలోని పానపటార్ పంచాయతీ పరిధి మర్కగూడ ఐటీడీఏ పాఠశాల పది రోజులుగా మూతపడినట్లు గ్రామస్తులు తెలిపారు. పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేయడంతో అధికారులు డిప్యూటేషన్‌పై మరో ఉపాధ్యాయుడిని నియమించినప్పటికీ, ఆయన కూడా విధులకు హాజరుకాకపోవడంతో విద్యాబోధన పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. 15 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు తాళం పడటంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓట్లు అడిగే ముందు..బడులను మార్చండి!: అభిజీత్ దీప్కే
విద్య, ఉద్యోగం, భవిష్యత్‌పై చైతన్యం కలిగించేలా CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే గ్రామా ప్రజలతో మాట్లాడారు. “మా ఓట్లు కావాలంటే ముందుగా ప్రభుత్వ బడులను బాగుచేయాలి” అని వారికి స్పష్టం చేశారు. పిల్లల చదువు విషయంలో పేరెంట్స్ బాధ్యతగా ఉండాలని సూచించారు. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌తో పాటు గ్రామాల్లో కూడా విద్యావకాశాలపై ఆలోచించాల్సిన అవసరముందన్నారు. చదువు పూర్తయ్యాక యువత వ్యవసాయం, కన్స్ట్రక్షన్ వంటి పనులకే కాకుండా మంచి అవకాశాలు అందిపుచ్చుకునేలా మార్పు రావాలని పిలుపునిచ్చారు.

PF, ESI డబ్బులు వెంటనే జమచేయాలి: CITU
TG: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ కార్మికుల పీఎఫ్, ఈఎస్‌ఐ నిధులను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో కార్మికుల పీఎఫ్ డబ్బులు ఖాతాల్లో జమ చేయడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ నూరాల్ నజీబ్‌కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఎన్. రమేష్ మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలన్నారు.

విత్తన గుళికల తయారీపై అవగాహన
AP: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు విత్తన గుళికల విధానం ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు సూచించారు. విజయనగరం జిల్లా రాజాం మండలం గారా చీపురుపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో రాజాం ఏడీఏ రఘు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రయోగాత్మకంగా విత్తన గుళికలను తయారు చేశారు. బీజామృతం, ఘనజీవామృతం పొడి, బంకమట్టి, బూడిదతో గుళికలను తయారు చేసి నీడలో ఆరబెట్టే విధానాన్ని రైతులకు వివరించారు.

APలో మరో కొత్త పార్టీ.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన!
AP: త్వరలో రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టనున్నట్లు మాజీ MP విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల పక్షాన గొంతు వినిపించేందుకు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలలో విజయవాడలో మీడియా సమావేశం పెట్టి, పార్టీ రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానన్నారు. పార్టీకి శ్రీవారి ఆశీస్సులు కోరినట్లు చెప్పారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు.

బ్యాంకులు Gen-Z కోసం మారబోతున్నాయా?
బ్యాంకింగ్ అంటే ఇంకా బ్రాంచ్‌కు వెళ్లడం, ఫారాలు నింపడం, గంటల తరబడి వెయిట్ చేయడమేనా? Gen-Zకి మాత్రం ఆ మోడల్ పెద్దగా వర్క్ అవ్వదు. వాళ్లకు కావాల్సింది మరింత ఫాస్ట్, సింపుల్, ఎప్పుడైనా అందుబాటులో ఉండే బ్యాంకింగ్. అందుకే యువత కోసం బ్యాంకింగ్‌ను ఎలా మార్చాలనే దానిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లతో చర్చించారు. కాలేజ్ నుంచే యువతతో బ్యాంకుల సంబంధం మొదలై, ఉద్యోగం, సేవింగ్స్, భవిష్యత్ అవసరాల వరకు కొనసాగాలన్నది ప్రధాన ఆలోచన. రేపటి బ్యాంకింగ్… మరింత మనకు దగ్గరగా ఉండొచ్చు.

దభోల్కర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
TG: మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ వైజ్ఞానిక దృక్పథం కోసం జీవితాంతం పోరాడిన డా. నరేంద్ర దభోల్కర్‌ను స్మరించుకుంటూ ఇవాళ (ఆగస్టు 20న) హైదరాబాద్‌లో నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డేను నిర్వహించనున్నారు. దభోల్కర్ వర్ధంతి సందర్భంగా మూఢనమ్మకాలను తిరస్కరించి, విజ్ఞానాన్ని స్వీకరించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ప్రశ్నించడం, హేతుబద్ధంగా ఆలోచించడం, ఆధారాలను పరిశీలించడం వంటి శాస్త్రీయ విలువలను ప్రజల్లో పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించనున్నారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమం జరగనుంది.

ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: CPM
TG: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని CPM డిమాండ్ చేసింది. వనపర్తి జిల్లా ఘనపూర్ మండలంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కమిటీ సభ్యుడు మేకల ఆంజనేయులు మాట్లాడుతూ.. కేంద్రంలోని BJP ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. విజయ్ మరో కీలక నిర్ణయం!
మహిళా ప్రభుత్వ ఉద్యోగుల కోసం తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడో బిడ్డకు కూడా 365 రోజుల పెయిడ్ మ్యాటర్నిటీ లీవ్స్ కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి డి. సరత్‌కుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటివరకు మూడో బిడ్డకు 12 వారాల సెలవు మాత్రమే ఉండేది. మొదటి ఇద్దరు పిల్లలకు వర్తించే 365 రోజుల సెలవులను మూడో బిడ్డకూ కూడా ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులు డెలివరీ తర్వాత శిశు సంరక్షణకు ఈ నిర్ణయం మరింత తోడ్పడనుంది.

తులం బంగారం హామీ ఏమైంది? : సండ్ర
TG: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని మాజీ MLA సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన భారీ నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా కేసీఆర్ ఈ పథకాలను ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారులు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణలక్ష్మి కింద సాయం, తులం బంగారం అందించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సండ్ర డిమాండ్ చేశారు.

AI మనల్ని Smart చేస్తుందా… లేక Lazyగానా?
AIకి మన పనులన్నీ అప్పగించేస్తే.. మెదడుకి పని తగ్గిపోతుందా? ఒక మెయిల్ రాయడం నుంచి ఐడియా చెప్పడం వరకు AI పనులను సెకన్లలో చేసి పెడుతోంది. దీంతో టైమ్ సేవ్ అవుతుంది. కానీ ప్రతి సందేహానికి AIనే అడిగి, ఆలోచించే పనినీ దానికి అప్పగిస్తే.. మనమే ఆలోచించి సమస్యను పరిష్కరించే అలవాటు తగ్గొచ్చు. 2025లో 319 మంది జ్ఞాన ఆధారిత ఉద్యోగులపై అధ్యయనంలో, AIపై ఎక్కువ నమ్మకం ఉన్నవాళ్లు క్రిటికల్ థింకింగ్‌కు తక్కువ శ్రమ పెట్టినట్లు కనిపించింది. అంటే AI మంచిదా చెడ్డదా అనేది కాదు.. దాన్ని ఎలా వాడుతున్నామన్నదే అసలు విషయం.

SC వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఆగదు: రత్నాకర్
AP: SC వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే రాజకీయ కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా. RS.రత్నాకర్ ఆరోపించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. SC వర్గీకరణతో మాల సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ప్రయోజనాలను మరింత విభజించడం వల్ల దళితుల మధ్య ఐక్యత దెబ్బతింటుందని అన్నారు. దేశ సంపద, అధికార వ్యవస్థల్లోనూ సామాజిక న్యాయం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పంటలసాగులో మార్పులు తప్పవు: గరిమా అగర్వాల్
TG: ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే పరిస్థితులపై ప్రజలు, రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి, వైద్య ఆరోగ్య అంశాలపై రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను అధికారులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ప్రతి గ్రామానికి అవగాహన సామగ్రి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆయిల్‌పామ్, పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.

సామాజిక న్యాయమే మా ఆశయం: రేవంత్‌రెడ్డి
TG: బహుజనులు, కల్లుగీత కార్మికులు, గౌడన్నల అండదండలతో వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలిచి కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని CM రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం, బహుజనులకు అధికారం తమ ప్రజా ప్రభుత్వ ఆశయమని తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ట్యాంక్‌బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం వివరించారు.

విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాకు పిలుపు
TG: రాష్ట్రంలోనే అతిపెద్ద విద్యుత్ కేంద్రం యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్(YTPS) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు సమరశంఖం పూరించారు. PRCతోపాటు మొత్తం 14డిమాండ్ల సాధన కోసం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ‘చలో హైదరాబాద్’ పేరుతో విద్యుత్తుసౌధలో మహాధర్నా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యుత్తు సంస్థలకు చెందిన ఉద్యోగులు, ఇంజినీర్లు, ఆర్టిజన్లు పెద్దసంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని JAC చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు.