Latest
కావాలంటే మీరూ ఎలక్షన్స్‌లో నిల్చోండి: కంగనా రనౌత్
కావాలంటే మీరూ ఎలక్షన్స్‌లో నిల్చొని గెలవండి. అంతేకానీ, ప్రభుత్వంలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో చెప్పొద్దు అంటూ ఎంపీ, నటి కంగనా రనౌత్ అన్నారు. దిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనలను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు తాము తప్పకుండా సమాధానం చెప్తామని అన్నారు. ప్రతిపక్షాలు సభలో ఆందోళన చేయాలని అనుకుంటున్నాయని, దాన్ని తిప్పికొడతామని చెప్పారు.

బైక్‌పై వెంబడించి డ్రైవర్, కండక్టర్‌పై దాడి
AP: బస్సు ఆపలేదని యువకుడు RTC సిబ్బందిపై దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు కోసం బస్టాప్‌లో ఎదురుచూస్తుండగా డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహానికి గురైన ఓ యువకుడు బైక్‌తో వెంబడించాడు. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద బస్సును అడ్డగించి డ్రైవర్ సురేశ్, కండక్టర్ లీలా ప్రసాద్‌పై దాడి చేశాడు. సీట్లు ఖాళీ లేకపోవడంతోనే ఆపలేదని తోటి ప్రయాణికులు నచ్చజెప్పినా యువకుడు వినలేదు. ఘటనతో కరకట్ట రూట్‌లో గంటసేపు ట్రాఫిక్ జామ్‌అయింది. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాక్రోచ్ నిరసనకు మద్దతుగా మిస్డ్ కాల్
ఎడ్యుకేషన్ సిస్టంలో పేపర్ లీకేజీలు, ఇతర సమస్యలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ, సోనమ్ వాంగ్‌చుక్ ఆధ్వర్యంలో 'చలో సంసద్' మార్చ్ నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు తెలిపేందుకు 70116 70115 అనే ఫోన్ నెంబర్ కేటాయించారు. ప్రతి ఒక్కరూ ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి అటెండెన్స్ నమోదు చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సాగుతున్న ఈ పోరాటానికి అందరూ మద్దతు పలకాలన్నారు.

చిన్నారుల ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడని పూజలు
AP: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, కరవు తొలగిపోవాలని కోరుతూ భీమా లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు చిన్నారుల చేత తలపై నీటి బిందెలను మోయించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆ పవిత్ర జలాలతో స్వామివారికి జలాభిషేకం చేశారు. ఆలయం కోట గుడిలో చిన్నపిల్లలతో పూజలు చేయడం గ్రామ ఆచారం. చిన్నారుల అమాయక ప్రార్థనలను దేవుడు త్వరగా ఆలకిస్తాడనే విశ్వాసంతో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు.

గొడ్డళ్లు, తుపాకీతో స్మగ్లర్స్.. అటవీశాఖ హైఅలర్ట్
AP: మార్కాపురం జిల్లా కనిగిరి రేంజ్ పరిధిలోని శేషాచలం కనుమల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ మళ్లీ అలజడి రేపింది. వెలిగండ్ల మండలంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గొడ్డళ్లతో పాటు ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వారు దాడులు చేసేందుకు ఆయుధాలు సమకూర్చుకోవడంతో అధికారులు షాక్ అయ్యారు. CSపురం, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లో 15 వేల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉండటంతో అధికారులు అప్రమత్తమై నిఘా పెంచారు.

జాబ్ రావడంతో మారిన భర్త.. భార్యకు చిత్రహింసలు
TG: ఖమ్మం జిల్లా శంభునిగూడెంకు చెందిన సుమ(25)కు లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన వజ్జా వెంకటేశ్వర్లుతో మ్యారేజ్ అయింది. వివాహం అనంతరం కొద్దిరోజులపాటు హైదరాబాద్‌లో ఉన్నారు. భర్తకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను అనుమానించడం, వరకట్నం తీసుకురావాలని వేధించి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. భర్త, ఆడపడుచుల వేధింపులు తాళలేక ఆమె గడ్డిమందు తాగింది. కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు వెంకటేశ్వర్లు, ఆడబిడ్డలు విజయ, రజిత, సుజాతలపై కేసు నమోదు చేశారు.

బ్యారికేడ్లు ఎక్కి నిరసనలు కొనసాగించిన AAP నేతలు
కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన 'ఛలో సంసద్' ర్యాలీకి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మద్దతిచ్చారు. AAP నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అతిషి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఎక్కి ఆందోళనకారులను కలిశారు. నీట్ 2026 ప్రశ్నాపత్రం లీక్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సిసోడియా డిమాండ్ చేశారు. యువత పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని నిరసనలు చేస్తున్నారని అన్నారు.

సీజేపీ నిరసనకారులకు మద్దతుగా వాలంటీర్స్
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యావ్యవస్థలో పేపర్ లీకేజీలపై జరుగుతున్న నిరసనల్లో వేలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు. ఉక్కపోతను తట్టుకునేందుకు సీజేపీ వాలంటీర్స్ నిరసనకారులకు విసనకర్రలతో గాలి ఊపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మద్దతుదారులకు వైద్య సేవలు, తాగునీరు అందిస్తూ వాలంటీర్లు మద్దతుగా నిలుస్తున్నారు.

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య
TG: భార్య వేధింపులు తట్టుకోలేక పెళ్లయిన మూడు నెలలకే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన సదర్ లాల్(27) తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేస్తున్నాడు. మేలో హర్యాతండాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. మగతనం లేదని అతని భార్య వేధిస్తోంది. ఇటీవల అత్తగారింటికి వెళ్లగా కుటుంబ సభ్యులతో కలిసి సదర్ లాల్‌ను అవమానించింది. తీవ్ర మనస్తాపంతో కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

CJPతో కేంద్ర ప్రభుత్వం చర్చలు
సీజేపీ తరఫున అషుతోష్ రాన్కా, తను కలిసి కేంద్ర మంత్రి జే.పీ.నడ్డాను కలిసేందుకు వెళ్లినట్టు సామాజిక కార్యకర్త సౌరవ్ దాస్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు ప్రభుత్వం దిగివచ్చిందని, త్వరలో తమకు విజయం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు పార్లమెంట్ ఎదుట సీజేపీ ఆందోళన ఉధృతంగా సాగుతున్న టైంలో కేంద్రం నుంచి ఆహ్వానం రావడంపై ఉత్కంఠ నెలకొంది.

బాలికను అడ్డగించిన కానిస్టేబుల్ అరెస్ట్
TG: నల్గొండ టౌన్‌లో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదైంది. గుర్రంపోడ్ PSలో విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్, సైకిల్‌పై వెళ్తున్న బాలికను అడ్డగించి, అనుచితంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంటికి వెళ్లిన బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. CCTV ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మాస్క్ ధరించి తిరిగినట్లు గుర్తించారు. ఆరోపణలు విచారణలో నిజం కావడంతో ఆయనను అరెస్టు చేశారు. అతడిపై గతంలో కూడా పోక్సో కేసులు నమోదైనట్లు సమాచారం.
జంతర్ మంతర్ వద్ద రాళ్ళతో ఆగి వున్న ట్రక్
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద CJP పిలుపునిచ్చిన ‘చలో సంసద్’ మార్చ్ వద్ద రాళ్లతో పార్క్ చేసిన ఒక ట్రక్కును స్థానికులు గుర్తించారు. పార్లమెంట్ నిరసనకు ఎలాంటి అనుమతి లేకపోవడంతో తమ శాంతియుత నిరసనను భగ్నం చేయడానికి చూస్తున్నారని CJP ఆరోపించింది
బాలుడి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే!
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరీలో 'సంపూర్ణ సమాధాన్ దివస్' కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మేజిస్ట్రేట్, జిల్లా పోలీసులు, ఉన్నదాధికారులు పాల్గొన్నారు. ఇంతలో అక్కడికి 13ఏళ్ల బాలుడు అమితాబ్ గుప్తా వచ్చి తన ఇంటిని బంధువులు ఆక్రమించారని నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదిచ్చాడు. "కమీషన్ ఇస్తేనే పని అవుతుందా?" అంటూ పోలీసును ప్రశ్నించాడు. ఆ బాలుడి ధైర్యాన్ని చుసిన అక్కడివారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రవితేజ ‘ఇరుముడి’ టైటిల్ సాంగ్ వైరల్
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఇరుముడి కట్టు’ టైటిల్ సాంగ్‌కు ఆడియెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. తాజాగా రవితేజ అయ్యప్ప మాలలో ఉంటూ తన సినిమాలోని ఈ పాటను చూస్తూ మురిసిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రియుడి ఫ్రెండ్స్ ప్రెజర్‌తో యువతి ఆత్మహత్య
AP: కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన రజిని, రాజేంద్ర నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల రజినికి కుటుంబసభ్యులు పెళ్లి నిశ్చయించారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని స్నేహితులు రజినిపై పెళ్లి రద్దు చేసి రాజేంద్రను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. ఇంటి వారిని బాధపెట్టలేక, ప్రియుడిని వదులుకోలేక రజిని తీవ్ర మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకుంది. సూసైడ్ నోట్‌లో “చనిపోవాలని లేదు.. ఏం చేయాలో తెలియడం లేదు” అని రాసింది. యువతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
రైలు నుంచి దొంగను తోసేసిన ప్రయాణికుడు
రాయ్‌పూర్ జిల్లా మాంధర్-ఉర్కురా మధ్య ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ దొంగ ప్రయాణికుడి పర్సు కొట్టేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కోచ్ అటెండెంట్లు అతడిని పట్టుకునే క్రమంలో దొంగ రైలు తలుపు మెట్లు పట్టుకుని వేలాడాడు. ఆ టైంలో రూర్కెలాకు చెందిన ప్రయాణికుడు కె.ఆర్.సురేష్ కుమార్ అతన్ని కాలితో తన్నడంతో ఆ యువకుడు కింద పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో GRP పోలీసులు సురేష్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరైన ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. పడిపోయిన దొంగ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్ల నిరసన
AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వివాదాస్పద జీవో 369ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్స్ పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘ పెనుమాక సుబ్బారావు పిలుపు మేరకు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి జులై 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక పెన్‌డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ అకస్మాత్తు నిర్ణయాలతో తమ వృత్తికి భవిష్యత్తులో ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వాష్‌రూమ్ గ్రిల్స్ పగులగొట్టి.. లాకర్ ఖాళీ చేసి
TG: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని గురుకృప ఎక్స్‌పోర్ట్స్ ఆఫీస్‌లో జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది. రాత్రి దుండగులు వాష్‌రూమ్ గ్రిల్స్ పగులగొట్టి లోపలికి ప్రవేశించి, లాకర్‌లో భద్రపరిచిన కిలోకు పైగా బంగారు ఆభరణాలను అపహరించారు. సూరత్‌కు చెందిన ఓ జ్యువెలరీ వ్యాపారి బంజారాహిల్స్‌లోని ఈ ఎక్స్‌పోర్టు కార్యాలయ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నారు. డైమండ్ ఫిక్సింగ్ కోసం సిద్ధంగా ఉంచిన 7 నెక్లెస్‌లు, 7జతల విలువైన చెవిపోగులను దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సితార ఘట్టమనేని 14వ పుట్టినరోజు
కూతురు సితార ఘట్టమనేని 14వ పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సితారను ముద్దాడుతున్న క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ ‘నువ్వు ఎంత పెద్దదానివైనా ఎప్పటికీ నా చిన్న నక్షత్రానివే. హ్యాపీ 14 సితార. వచ్చే ఏడాదంతా నీకు అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. లవ్ యు ఆల్వేస్’ అని రాశారు. అభిమానులు, సినీ ప్రముఖులు సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.

రౌడీషీటర్ దాడిలో ఇంటర్ విద్యార్థి హతం
TG: హైదరాబాద్ నగరం కాలాపత్తర్ పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. శాలిబండలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఫైజాన్(18) ఆదివారం తెల్లవారుజామున మిత్రులతో కలిసి బిర్యానీషాటెక్రీ కొండ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడకు వచ్చిన బాలాపూర్ రౌడీషీటర్ అబ్రార్, అతని స్నేహితులను తమ బస్తీకి ఎందుకు వచ్చారని ఫైజాన్ అడిగాడు. కోపానికి గురైన గ్యాంగ్ కత్తులతో ఫైజాన్ తల, కడుపులో దారుణంగా పొడిచారు. తీవ్ర గాయాలైన ఫైజాన్ ప్రాణాలు కోల్పోయాడు. పాత కక్షలతోనే ఈ దాడి జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపించగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు
TG: హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై కీలక చర్యలు తీసుకుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదు, CCTV ఆధారాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ ఆరోపణలు నిజమని నిర్ధారించింది. దీంతో ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ NPA నుంచి పంపించేశారు. ఈ నిర్ణయం ప్రివిలేజ్ కమిటీ సిఫార్సుల మేరకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సర్వీస్‌లో తిరిగి జాయినింగ్‌కు సంబంధించిన తుది నిర్ణయం DOPT తీసుకుంటుందని పోలీస్ అకాడమీ అధికారులు వెల్లడించారు.