Latest

గురుకుల విద్యార్థిని మృతిపై ఆందోళన
TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాలలో గిరిజన విద్యార్థిని ముడావత్ అశ్విని అనుమానాస్పద మృతిపై గురువారం ఆందోళన చేపట్టారు. LHPS, SFI నాయకులు గురుకుల పాఠశాల వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. అశ్విని మృతిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ కోరారు.

హైదరాబాద్ ఓటర్లకు బిగ్ అలర్ట్..
హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ స్థానాల్లో 2023 మెజారిటీల కంటే తొలగించిన ఓట్లే ఎక్కువ ఉన్నాయని సబీర్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ తెలిపింది. 42.15 లక్షల మందిలో 19.41 లక్షల ఓట్లు డిలీట్ చేయడానికి ప్రాసెస్ మొదలైంది. యాకుత్‌పురా, మలక్‌పేట్‌లో ఈ ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉంది. జుక్కల్ MLA తండ్రి వయసు 27గా తప్పుగా పడటం, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆఫీస్‌కు రాంగ్ నోటీస్ వెళ్లడం వంటి టెక్నికల్ లోపాలు బయటపడ్డాయి. టైట్ పోటీ ఉండే చోట ఇది రిజల్ట్స్‌ను డిసైడ్ చేసే ఛాన్స్ ఉండటంతో గడువు పెంచాలని లీడర్స్ డిమాండ్ చేస్తున్నారు.

సత్తెనపల్లిలో పేకాట క్లబ్‌పై దాడి
AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో అనధికారంగా నిర్వహిస్తున్న పేకాట క్లబ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. క్లబ్‌లోని అద్దాలు, ఫర్నీచర్, బీరువా, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇటీవల పేకాట ఆడేందుకు వచ్చిన వారిని వీడియో తీస్తున్నారనే కారణంతో క్లబ్ నిర్వాహకులు కొందరిపై దాడిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

దాచేపల్లిలో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం
AP: పల్నాడు జిల్లా దాచేపల్లి పంచాయతీ పరిధిలో జనసేన సీనియర్ నాయకుడు నల్లబోతుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం చేపట్టారు. వర్షపాతం తగ్గిపోవడం, భూగర్భజలాలు పడిపోతున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సూచించిన విధానంలో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. దాచేపల్లిలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. వర్షపునీటిని భూమిలోకి ఇంకింపజేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. ప్రతిఇంటి వద్ద ఇలాంటి డ్రైన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
డ్రైనేజీ లీకేజీతో రోడ్డుపై మురుగునీరు
AP: గుంటూరు పట్టణంలోని డొంక రోడ్డు మూడు వంతెనల కింద గత నాలుగైదు రోజులుగా డ్రైనేజీ లీకేజీతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వల్ప వర్షం కురిసినా వంతెనల కింద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. దుర్వాసనతో పాటు పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు స్పందించి డ్రైనేజీ లీకేజీని అరికట్టి, నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

ఢిల్లీలో సీఎం రేవంత్‌ను కలిసిన మాధవరెడ్డి
TG: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మంత్రివర్గ విస్తరణలో మాధవరెడ్డికి అవకాశం దక్కుతుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. మాధవరెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ నియోజకవర్గంలోనూ జోరుగా సాగుతోంది.

ప్రజల ఇబ్బందులు చూసి సొంత నిధులతో రోడ్డు
TG: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం చౌలపల్లి గ్రామంలో ప్రజలు, భక్తుల రాకపోకల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ సొంత నిధులతో మట్టి రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కోట మైసమ్మ దేవాలయం నుంచి హనుమాన్ దేవాలయం వరకు చేపట్టిన రోడ్డు పనులను గురువారం గ్రామస్థుల సమక్షంలో ప్రారంభించారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు సహకారం కొనసాగిస్తానని రవీందర్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన
TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్‌లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. దేగామ గ్రామం నుంచి బజార్హత్నూర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

400 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
TG: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట నుంచి సిద్దిపేటకు అక్రమంగా తరలిస్తున్న 400 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. నిఘా ఏర్పాటు చేసిన అధికారులు డీసీఎంను వెంబడించి సిద్దిపేటలోని మహాలక్ష్మి రైస్‌మిల్ వద్ద అడ్డుకున్నారు. తనిఖీల్లో వాహనంలో 120 క్వింటాళ్ల బియ్యం లభించగా, మిల్ పరిసరాల్లో మరో 280 క్వింటాళ్లు గుర్తించారు. డ్రైవర్ శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. రైస్‌మిల్ యజమాని నాగరాజును విచారణ చేపట్టారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టి వ్యక్తి మృతి
TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని జయప్రకాష్ నగర్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చారకొండ మండలం కమాల్‌పూర్ తండాకు చెందిన చంద్రశేఖర్ (41) బైక్ పై కల్వకుర్తి వైపు వెళ్తుండగా లారీని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కల్వకుర్తి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

రేపు చికెన్, మటన్ షాపులు బంద్.. రీజన్ ఇదే!
శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగన సందర్బంగా రేపు హైదరాబాద్ (GHMC) పరిధిలోని అన్ని మాంసం దుకాణాలను క్లోజ్ చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నగరంలోని రిటైల్ చికెన్, మటన్, బీఫ్ షాపులతో పాటు GHMC గుర్తింపు పొందిన పశువధశాలలన్నీ కచ్చితంగా బంద్ పాటించాలని కమిషనర్ చెప్పారు. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేసి ఆ రోజు సీక్రెట్‌గా మాంసం అమ్మినా, జంతువులను చంపినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వెటర్నరీ టీమ్స్ ఆ రోజు అన్ని చోట్లా స్పెషల్ తనిఖీలు చేయనున్నాయి.

స్వచ్ఛ భారత్ లక్ష్యం నీరుగారుతోంది
TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ లక్ష్యం నీరుగారుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన వాహనాన్ని సక్రమంగా వినియోగించకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు నెలకొంటున్నాయని తెలిపారు. చెత్తను క్రమం తప్పకుండా సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన వాహనం నిరుపయోగంగా ఉండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి చెత్త సేకరణ వాహనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.

అత్తామామలు నన్ను బేబీలా చూసుకుంటున్నారు- రష్మిక
విజయ్ దేవరకొండతో మ్యారేజ్ తర్వాత రష్మిక తన లైఫ్ అప్‌డేట్స్‌ను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేశారు. ఫిబ్రవరిలో వీరి వెడ్డింగ్ జరగ్గా, రీసెంట్ ఇంజూరీ బ్రేక్ వల్ల ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసే ఛాన్స్ దొరికిందని రష్మిక తెలిపారు. విజయ్ వల్ల తాను బెటర్ పర్సన్‌గా మారుతున్నానని, అత్తామామలు, ఆనంద్ తనను బేబీలా చూసుకుంటున్నారని చెప్పారు. త్వరలోనే విజయ్‌తో కలిసి 'రణబాలి' మూవీ షూటింగ్‌లో జాయిన్ అవ్వబోతున్నట్లు రష్మిక క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ వీళ్ళను 'ViRosh' అని పిలుస్తున్నారు.

దాచేపల్లిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
AP: పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని ముత్యాలంపాడు రోడ్డు వద్ద అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు వైపు నుంచి పట్టణంలోకి వస్తున్న రెండు లారీలు మలుపు వద్ద ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, మరో లారీ స్వల్పంగా దెబ్బతింది. లారీల్లో ఉన్న డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

లా స్టూడెంట్‌పై తప్పుడు కేసు..
నోయిడా ప్రొటెస్ట్ కేసులో ఢిల్లీ యూనివర్సిటీ లా స్టూడెంట్ ఆకృతి చౌదరిపై పెట్టిన NSA డిటెన్షన్‌ను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. శాలరీ పెంపు కోసం జరిగిన కార్మికుల నిరసనల్లో 25 ఏళ్ల ఆకృతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఐదు నెలలుగా ఆమె కస్టడీలో ఉంది. పోలీసులు చూపించిన అరెస్ట్ టైమింగ్స్, ఆధారాల్లో అవకతవకలు ఉన్నాయని జస్టిస్ అతుల్ శ్రీధరన్ బెంచ్ గుర్తించింది. ఈ కేసు మొత్తం ప్రభుత్వం అల్లిన కల్పిత కథ అని మండిపడుతూ, తప్పుడు అరెస్ట్‌కు నోయిడా అడ్మినిస్ట్రేషన్ ఆమెకు రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం భారీ నిరసన
TG: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం Journalists Co-operative Housing Society ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ నుంచి మీడియా అకాడమీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన కొనసాగనుంది. ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యానికి కారణం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉద్యమించి తమ హక్కును సాధించుకోవాలని పిలుపునిచ్చింది.

SBI కస్టమర్స్‌కి బ్యాడ్ న్యూస్..
SBI సాలరీ అకౌంట్ హోల్డర్స్ మంత్లీ ATM విత్‌డ్రా రూల్స్‌ను మార్చింది. ఇకపై ఇతర బ్యాంకుల ATMలలో జరిగే ఉచిత ట్రాన్సాక్షన్ల నెంబర్ ను నెలకి 10 నుండి 5కి తగ్గించింది. ఈ ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత చేసే ప్రతి విత్‌డ్రాపై రూ.20 ప్లస్ GST ఛార్జీ పడుతుంది. అలాగే నాన్-క్యాష్ ట్రాన్సాక్షన్స్‌పై రూ.10 ప్లస్ GST అదనంగా విధిస్తారు. అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త రూల్స్‌ను కస్టమర్స్ తప్పక గమనించాలి.

గ్రామంలో మురుగు నీటి కష్టాలు.. పట్టించుకోని అధికారులు
TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏక్‌మై గ్రామంలోని 10వ వార్డులో డ్రైనేజీ పూడుకుపోవడంతో మురుగు నీరు రోడ్డుపై నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాల్వలో గడ్డి, చెత్త పేరుకుపోవడంతో డ్రైనేజీ నీరు సక్రమంగా ప్రవహించక దుర్వాసన వెదజల్లుతోంది. నీరు నిలిచిపోవడంతో దోమల బెడద కూడా పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామపంచాయతీ అధికారులను కోరారు.

గురజాల మండలానికి 22 పశువుల షెడ్లు మంజూరు
AP: పల్నాడు జిల్లా పశువుల షెడ్ల నిర్మాణానికి అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి సూచించారు. పల్లె పండగ 3.0లో భాగంగా గురజాల మండలానికి 22 పశువుల షెడ్లు మంజూరైనట్లు తెలిపారు. గురజాల పట్టణంలోని ఉపాధి హామీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో పశువుల షెడ్డుకు రూ.2 లక్షలు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పశువుల షెడ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కోటప్పకొండలో మంత్రి లోకేష్ ప్రత్యేక పూజలు
AP: కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని మంత్రి నారా లోకేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం నర్సరావుపేట సమీపంలోని కోటప్పకొండ దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు మంత్రిని ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని క్యాండిల్ నిరసన
TG: నర్సు అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఖమ్మంలో నాయకులు డిమాండ్ చేశారు. కొవ్వొత్తులతో క్యాండిల్ నిరసన నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వామపక్ష, ఆదివాసీ సంఘాలతో పాటు AIYF, AISF, PDSU, ABVP నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాధితురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. న్యాయం జరిగే వరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.