Latest

కల్వకుర్తిలో 2K రన్‌ను విజయవంతం చేయాలి
Local· 27 Aug 2026

కల్వకుర్తిలో 2K రన్‌ను విజయవంతం చేయాలి

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 30న 2K రన్‌ నిర్వహించనున్నారు. “RUN – SAY NO TO DRUGS” నినాదంతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్నమాల పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌ ఎక్స్‌ రోడ్‌ నుంచి రన్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని కోరారు.

సూర్యాపేట కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల ధర్నా
Local· 27 Aug 2026

సూర్యాపేట కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల ధర్నా

TG: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో పీఆర్సీ అమలు, 6 డీఏల మంజూరు, సీపీఎస్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ నేతలు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

వ్యాన్‌లో ప్రత్యేక అరలు.. అక్రమ మద్యం రవాణా గుట్టురట్టు
Local· 27 Aug 2026

వ్యాన్‌లో ప్రత్యేక అరలు.. అక్రమ మద్యం రవాణా గుట్టురట్టు

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అక్రమంగా తరలిస్తున్న రూ.6.38 లక్షల విలువైన 70 బాక్సుల ఐబీ మద్యాన్ని ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాద్రానగర్‌ హవేలీ నుంచి మద్యం తరలిస్తున్న వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు మహారాష్ట్ర భివాండీకి చెందిన ప్రధాన సరఫరాదారు ప్రవీణ్‌ సిరిగిరితో పాటు డ్రైవర్‌ ప్రదీప్‌ జైస్వాల్‌, అజయ్‌ భగవాన్‌ను అరెస్ట్‌ చేశారు. ఖాళీ వ్యాన్‌లో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి మద్యం రవాణా చేస్తుండగా ఎక్సైజ్‌ సీఐ రాథోడ్‌ బృందం తెల్లవారుజామున రూట్‌వాచ్‌ నిర్వహించి పట్టుకుంది.

పొట్టేలు – ఒంటరి తల్లికి కొండంత తోడు
Arts/Literature· 27 Aug 2026

పొట్టేలు – ఒంటరి తల్లికి కొండంత తోడు

రచయిత వివేక్ లంకమల రాసిన మొదటి నవల ‘పొట్టేలు’. ఝాన్సీ పబ్లిషర్స్ ద్వారా ఈ నవల పబ్లిష్ అయ్యింది. నవలలోని ‘పొట్టేలు’ పాత్ర కేవలం ఒక జీవిగా కాకుండా, ఒంటరితనం నుంచి బయటకు తీసుకురాగల నమ్మకం, తోడు, మార్పులకు ప్రతీకగా నిలుస్తుంది. ఒక తల్లి జీవితం విరక్తితో నిండిన సమయంలో ఆ పొట్టేలు తెచ్చిన మార్పు, దాన్ని కాపాడటానికి ఆమె పడే తాపత్రయం పాఠకుడి మనసును తాకుతాయి. రాయలసీమ మాండలికంలో సాగే ఈ నవల పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది. ధర రూ.150. కొనేందుకు <a href="https://amzn.in/d/0hzA8EPF">లింక్</a>.

ఫోన్ మాట్లాడొద్దన్నందుకు ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య
Crime· 27 Aug 2026

ఫోన్ మాట్లాడొద్దన్నందుకు ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య

TG: హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఇంటర్ స్టూడెంట్(17) రోజూ అర్ధరాత్రి దాకా ఫోన్ మాట్లాడుతోంది. దీన్ని గుర్తించి తండ్రి తనను మందలించాడు. మనస్తాపానికి గురైన ఆమె అర్ధరాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లింది. తండ్రి ఆమెను ఫాలో చేస్తూ వెళ్లగా, ఉప్పుగూడ వద్ద తండ్రి కళ్ల ముందే వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేశారు.

మాదాపూర్‌ గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే
Local· 27 Aug 2026

మాదాపూర్‌ గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే

TG: యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అధికారులు, గ్రామస్థులతో ఆయన చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అర్హత ఉన్న ఓటరు పేరు తొలగిపోకుండా ఆధారాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని తెలిపారు.

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. ఎంవీఐ హెచ్చరిక
Local· 27 Aug 2026

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. ఎంవీఐ హెచ్చరిక

AP: గుంటూరు జిల్లా మంగళగిరి పరిసరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ హెచ్చరించారు. 60 కిలోమీటర్ల వేగ పరిమితిని దాటితే స్పీడ్‌ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానాలు విధిస్తామని తెలిపారు. ప్రతి వాహనానికి నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరిగా ఉండాలని స్పష్టంచేశారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ జంప్‌ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలు విధించడంతోపాటు అవసరమైతే వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

ఎస్‌ఐఆర్‌ ముసాయిదా జాబితాపై ప్రజా విచారణ
Local· 27 Aug 2026

ఎస్‌ఐఆర్‌ ముసాయిదా జాబితాపై ప్రజా విచారణ

TG: జోగులాంబగద్వాల జిల్లా రాజోలి రైతువేదికలో ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్‌ జాబితాపై ప్రజా విచారణ నిర్వహించారు. రాజోలి పరిధిలోని నాలుగు పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించిన ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలించారు. మొత్తం 93మంది వివరాలను విచారణలో పరిశీలించగా, పోలింగ్‌‌స్టేషన్‌ 179లో 38మంది, 180లో 12మంది, 181లో 19మంది, 182లో 24మంది ఉన్నారు. ఎంపీడీవో అబ్దుల్‌ సయీద్‌ ఖాన్‌, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్యతో పాటు బీఎల్‌ఓలు ప్రజావిచారణలో పాల్గొన్నారు. ఓటర్ల వివరాలు, అభ్యంతరాలు, సంబంధిత ఆధారాలను పరిశీలించి నమోదు చేశారు.

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. హైవేపై ధర్నా
Local· 27 Aug 2026

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. హైవేపై ధర్నా

TG: మెదక్ జిల్లా మాసాయిపేటలో యూరియా కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జాతీయ రహదారి-44పై రైతులు ధర్నాకు దిగారు. ఫర్టిలైజర్‌ యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. యాప్‌లో నమోదు చేసిన గంటలోపే యూరియా స్టాక్‌ అయిపోయిందని చెబుతున్నారని, సర్వర్‌ సమస్యలతో చదువురాని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కనీసం ఒకటి, రెండు యూరియా బస్తాలైనా దొరికేవని పేర్కొన్నారు.

కాన్పూర్‌లో రోడ్డుపై 18 అడుగుల గొయ్యి
Viral· 27 Aug 2026

కాన్పూర్‌లో రోడ్డుపై 18 అడుగుల గొయ్యి

UPలోని కాన్పూర్ నగరంలోని జాజ్‌మౌ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. రోడ్డు అకస్మాత్తుగా కుంగి 18 అడుగుల లోతైన, 10 అడుగులు వెడల్పు ఉన్న పెద్ద గొయ్యి ఏర్పడింది. వర్షపు నీరు ఆ గొయ్యిలోకి వేగంగా ప్రవహిస్తూ నిజమైన వాటర్‌ఫాల్‌లా కనిపించింది. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. పోలీసులు బ్యారికేడింగ్ చేసి ఈ రోడ్డును మూసేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేస్తూ ‘జపనీస్ టెక్నాలజీతో నిర్మించిన వాటర్‌ఫాల్’ అని బీజేపీ ప్రభుత్వంపై సెటైర్ వేసింది. ఇలాంటి ఘటనలతో నిర్మాణ లోపాలపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.

వెన్నచర్ల పీహెచ్‌సీలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
Local· 27 Aug 2026

వెన్నచర్ల పీహెచ్‌సీలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

TG: మారుమూల గ్రామాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటీల్‌ ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ప్రసూతి సేవలు, ల్యాబొరేటరీని పరిశీలించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్‌ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

విద్యార్థుల భద్రతకు భంగం కలిగిస్తే సహించం: AIPSU
Local· 27 Aug 2026

విద్యార్థుల భద్రతకు భంగం కలిగిస్తే సహించం: AIPSU

TG: విద్యార్థుల భద్రత, విద్యా భవిష్యత్తుకు భంగం కలిగించేలా నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు నిర్వహిస్తే సహించేది లేదని AIPSU జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్‌ హెచ్చరించారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ‘విన్స్‌ పాఠశాల’ అనుమతులు, గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నిబంధనలు పాటించకుండా పాఠశాలను నిర్వహించడం వల్ల విద్యార్థుల విద్యా భవిష్యత్తుతో పాటు వారి భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వక్ఫ్‌ భూములపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
Local· 27 Aug 2026

వక్ఫ్‌ భూములపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

AP: వక్ఫ్‌ భూముల వివరాలు, హద్దులను నిర్ధారించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో వక్ఫ్‌ బోర్డుకు సంబంధించిన భూములను పల్నాడు జిల్లా వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ నూహ్‌, వీఆర్వో సైదా ఆధ్వర్యంలోని సర్వే బృందం పరిశీలించింది. భూముల విస్తీర్ణం, హద్దులు, ప్రస్తుత పరిస్థితిపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించడంతో పాటు భూముల సరిహద్దులను గుర్తించి అవసరమైన సమాచారాన్ని నమోదు చేశారు.

తుర్కపల్లి ప్రెస్‌క్లబ్‌ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
Local· 27 Aug 2026

తుర్కపల్లి ప్రెస్‌క్లబ్‌ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

TG: నల్గొండ జిల్లా కనగల్‌ మండలం తుర్కపల్లిలో సీనియర్‌ జర్నలిస్టుల ప్రెస్‌క్లబ్‌ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జర్నలిస్టుల సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి. ఆంజనేయులు, గౌరవాధ్యక్షుడిగా సూర్యంరాజు, ఉపాధ్యక్షుడిగా నర్సింహులు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాజ్‌కుమార్‌గౌడ్‌, సహాయ కార్యదర్శిగా శేఖర్‌, కోశాధికారిగా రాజ్‌కుమార్‌, సలహాదారుడిగా రాంనర్సింహారెడ్డి బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు మరో తొమ్మిది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు.

ఎస్సీ సెల్‌ గ్రామ అధ్యక్షుడిగా కొంకటి మహేష్‌
Local· 27 Aug 2026

ఎస్సీ సెల్‌ గ్రామ అధ్యక్షుడిగా కొంకటి మహేష్‌

TG: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలుకమనగర్‌లో కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలు, మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు సూచనల మేరకు ఈ కమిటీని ఎన్నుకున్నారు. మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బత్తిని సునీల్‌, ఉపాధ్యక్షుడు కందిక రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ కమిటీకి నూతన బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ సెల్‌ గ్రామ అధ్యక్షుడిగా కొంకటి మహేష్‌, ఉపాధ్యక్షుడిగా తనువుల కొమ్మలను ఎంపిక చేశారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
Local· 27 Aug 2026

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

TG: ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వనపర్తి కలెక్టరేట్‌ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో చేపట్టిన ఆందోళనలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, 2వ పీఆర్సీని ప్రకటించాలని కోరారు.

ఏకరూప దుస్తుల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కార్యక్రమం
Local· 27 Aug 2026

ఏకరూప దుస్తుల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కార్యక్రమం

TG: విద్యార్థినుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో పాటు సేవాభావాన్ని పెంపొందించేందుకు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఓ చంద్రకళ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌ఓ చంద్రకళ మాట్లాడుతూ.. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ద్వారా విద్యార్థినుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు.

NICలో 376 జాబ్స్.. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అప్లికేషన్స్
Jobs· 27 Aug 2026

NICలో 376 జాబ్స్.. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అప్లికేషన్స్

NICలో (Scientific/Technical Assistant-A) 376 పోస్టులకు <a href="https://recruitment.nic.in/">నోటిఫికేషన్</a> రిలీజ్ అయింది. సెప్టెంబర్ 1 నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ కాగా, సెప్టెంబర్ 30 చివరి తేదీ. జనరల్/EWSకు 30 ఏళ్లు, OBC-NCLకు 33, SC/STలకు 35 ఏళ్ల వరకు అర్హత ఉంది. సంబంధిత టెక్నికల్ డిగ్రీతో పాటు 2024, 2025 లేదా 2026 GATE స్కోర్ ఉండాలి. UR/OBC/EWS మేల్ క్యాండిడేట్స్‌కు రూ.800 ఫీజు ఉంటుంది. SC/ST/PwBD/మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. మరింత సమాచారం కోసం ఇక్కడ <a href="https://recruitment.nic.in/">Click</a> చేయండి.

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం
Local· 27 Aug 2026

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం

TG: నేరాల నియంత్రణతో పాటు గ్రామాల భద్రతకు సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని డీఎస్పీ శ్రీనివాస్‌ నాయుడు అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండలం నాంచారిపేట గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన 11 సీసీటీవీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించడంతో పాటు నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం స్థానికులు ముందుకు రావాలని సూచించారు.

వరంగల్‌ నుంచి తొర్రూర్‌కు బస్సు సౌకర్యం కల్పించాలి
Local· 27 Aug 2026

వరంగల్‌ నుంచి తొర్రూర్‌కు బస్సు సౌకర్యం కల్పించాలి

TG: రాత్రి 8గంటలు దాటితే వరంగల్‌ నుంచి తొర్రూర్‌, వర్ధన్నపేట ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, ఇతర పనుల కోసం వరంగల్‌కు వచ్చే ప్రజలు రాత్రివేళ స్వగ్రామాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రవాణాపై ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాత్రి 9గంటల తర్వాత వరంగల్‌ నుంచి తొర్రూర్‌కు ఒక బస్సును నడపాలని కోరారు.

తప్పుల్లేని ఓటర్‌ జాబితానే ఎస్‌ఐఆర్‌ లక్ష్యం
Local· 27 Aug 2026

తప్పుల్లేని ఓటర్‌ జాబితానే ఎస్‌ఐఆర్‌ లక్ష్యం

TG: అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తూ తప్పుల్లేని, స్పష్టమైన ఓటర్‌ జాబితా రూపొందించడమే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటీల్‌ అన్నారు. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో నోటీసులు జారీ చేసిన ఓటర్లతో నిర్వహించిన హియరింగ్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక ఓటరు వివరాలను ఆయన స్వయంగా యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.