Latest

రూ.10 వేల కోట్ల విండ్.. 4 వేల జాబ్స్!
ఏపీలో విండ్ ఎనర్జీది కొత్త చాప్టర్! అనంతపురం రాయదుర్గంలో సుజ్లాన్ రూ.10,000 కోట్ల పెట్టుబడితో 1,325 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్ ప్రారంభించనుంది. దీంతో ప్రత్యక్ష, పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది – ఇది ఏపీ ఎకనమీకి ఊతం! మరోవైపు, కణేకల్లు హులికెరలో S-144 అత్యాధునిక బ్లేడ్ ఉత్పత్తి లైన్ను మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభిస్తారు. ప్రస్తుతం 1,700 MW సామర్థ్యం ఉన్న సుజ్లాన్, 2030 నాటికి 5K MW లక్ష్యం పెట్టుకుంది. ప్రభుత్వంతో భారీ రాయితీలు పొందిన సుజ్లాన్ తక్కువ ధరకే కరెంటు ఇస్తుందని ఆశిద్దాం.

స్మార్ట్ కార్డు.. స్మార్ట్ సమస్యలు?
నర్సంపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సోమవారం స్టార్ట్ అయింది. మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ కార్డుదారులకు కొత్త కార్డులు అందజేశారు. ఇక క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేదు, సరుకులు డైరెక్ట్‌గా అందుతాయని ఆమె చెప్పారు. ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. పేర్లు, చిరునామాలు తప్పుగా ప్రింట్ కావడం, వృద్ధులకు ఫింగర్ ప్రింట్ సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలు తలెత్తితే ఆటోమెటిక్ గా కార్డులు క్యాన్సల్ కూడా అవుతాయి. అప్పుడు రేషన్ సరుకులు అందవు. ముందే చెక్ చేసుకుంటే మంచిది. తర్వాత బాధలు అనవసరం.

కొత్త బస్టాండ్.. పాత కష్టం
కామారెడ్డి కొత్త బస్టాండ్ – పేరు కొత్తే కానీ, పరిస్థితి పాతదే! కాస్త వర్షం కురిస్తే చాలు, బస్టాండ్ చుట్టూ నీళ్లే నీళ్లు. డ్రైనేజీ అంటూ ఏదీ లేకపోవడంతో నీరు అక్కడే నిలిచిపోతోంది. ప్రయాణికులు కాలికింద గుంతలు, బురద. వాహనాలు ఏ స్టాప్‌లో దిగాలో తెలియక సతమతమవుతున్నాయి. ఇక బస్సు ఎక్కేందుకు ప్రజలు ఇబ్బంది పడటం రోజువారీ దృశ్యం. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదా? పక్కా డ్రైనేజీ, గుంతల పూడ్చి శాశ్వత పరిష్కారం – ఇదే ప్రజల డిమాండ్. కొత్త భవనాలు మస్తు కట్టొచ్చు. కష్టాలు పోతేనే కదా పరిష్కారం.

పరకాల-అంబాల రోడ్డు.. c/o బురద
పరకాల నుంచి అంబాలకు వెళ్లే రహదారి ఇప్పుడు బురద మడుగులా మారింది. ఓ వైపు వర్షం కురిస్తే చాలు – రోడ్డంతా నీళ్లు, మట్టి, బురదే. స్కూటీలు, కార్లు, ఆటోలన్నీ ఈ బురదలో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నాయి. పాదచారులు బురదలో కాలు పెడితే బూట్లు ఊడిపోయే ప్రమాదం! ప్రతీ వర్షానికి ఇదే పాత కథ – మరమ్మత్తు పేరుతో సాధారణ ప్యాచ్‌వర్క్, మళ్లీ అదే అవస్థ. అందుకే ఇప్పుడు గ్రామస్థులంతా డిమాండ్ పెడుతున్నారు – కొత్తగా డ్యూరబుల్ రోడ్డు వేయాలి, ఆఫీసర్లు స్పందించాలి. ఇప్పటికైనా రిపేరింగ్ మొదలెడితే, ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు!

ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్
TG: ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని అధికారులకు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు. దరఖాస్తుదారుల సమస్యలను అధికారులు బాధ్యతగా నమోదు చేసుకుని, ప్రతి వినతిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా సమస్యలకు వేగంగా పరిష్కారం చూపాలన్నారు.
భూపాలపల్లిలో చైన్ స్నాచింగ్
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనగర్‌లో పట్టపగలే దొంగతనం చేసే ప్రయత్నం జరగడంతో ప్రజలు భయపడిపోయారు. సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సాంబరెడ్డి, అహల్య దంపతులను దొంగలు వెంబడించారు. అహల్య మెడలోని బంగారు గొలుసును ఓ దొంగ లాక్కునేందుకు చూడగా, అది తెగి ఆమె మెడలోనే పడిపోవడంతో ప్లాన్ ఫెయిల్ అయింది. వెంటనే ఆ దొంగ వీధి చివర బైక్‌పై సిద్ధంగా ఉన్న ఇంకో వ్యక్తితో కలిసి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి CCTV కెమెరాల్లో రికార్డయింది.

దబ్బిర్‌పేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
TG: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో అర్హులైన కుటుంబాలకు కొత్త భరోసా లభించింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబ్బిర్‌పేట గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా మంజూరైన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో కార్డులు మంజూరైనట్లు నాయకులు తెలిపారు. సర్పంచ్ ధనసరి సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రవి, ఉపసర్పంచ్ రవీందర్‌రావు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కార్డులు అందజేశారు.

నిశ్చితార్థమై 2 రోజులకే.. కారు ప్రమాదం!
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పంజాగుల దగ్గర ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుండూరుకు చెందిన నరేందర్ (26) మిత్రులతో కారులో వెళ్తుండగా కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది – రోడ్డు పక్కన పడిన ఆ కారు అతనిపైకి తిరగబడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి కల్వకుర్తి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేవలం కొద్ది రోజుల కిందటే నరేందర్ నిశ్చితార్థం జరిగింది – ఇప్పుడా ఇంట్లో వేడుకలకు బదులు విషాదం చోటుచేసుకుంది. యాక్సిడెంట్లు ఇలా ఎన్ని ప్రాణాలు తీసుకుంటాయో..

బ్రిడ్జి నిర్మాణం నత్తనడక.. గ్రామాలకు రాకపోకలు బంద్
AP: బ్రిడ్జి నిర్మాణం పూర్తికాక.. గిరిజన గ్రామాలకు రాకపోకలు కష్టంగా మారాయి. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని కోరుకొండ నుంచి వీరవరం బురుగుబైలు వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చాలాకాలంగా కొనసాగుతున్నా పూర్తికాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు, గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పలు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు.

ఆసుపత్రి పనుల్లో స్పీడు పెంచండి : మంత్రి పొన్నం
TG : హుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, నిర్మాణం వేగంగా, నాణ్యతగా జరగాలని ఆదేశించారు. అనుకున్న సమయానికే పనులన్నీ పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఈ భవనం పూర్తయితే నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. పనుల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు చూసుకోవాలని స్పష్టం చేశారు.
నా బట్టల గురించి మీకెందుకు?: తమిళనాడు మహిళా మంత్రి
తమిళనాడు టీవీకే ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి ఎస్.కీర్తనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో వివాదానికి దారితీసింది. వెస్టర్న్ బట్టల్లో ఉన్న ఓ అమ్మాయి కారు నుంచి దిగుతున్న ఆ వీడియో మంత్రి కీర్తనదే అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే తను అది కాదని కీర్తన తన ఎక్స్ అకౌంట్‌లో క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అది తనే అయినా తన బట్టలు, రూపం గురించి మీకెందుకు అని ప్రశ్నించారు. పార్టీ విధానాలు నచ్చకపోతే వ్యక్తిగత జీవితాలపై కథలు అల్లుతారా అని మండిపడ్డారు.

విద్యుత్ సమస్యపై ఫోన్ చేసినా స్పందన కరువు
TG: రాత్రంతా కరెంట్ లేదు.. ఫోన్ చేసినా ఏఈ స్పందించలేదంటూ ఎక్మాయి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు విద్యుత్ లేక దోమల బెడదతో అవస్థలు పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. విద్యుత్ సమస్యపై సంబంధిత ఏఈ, ఓపీ అధికారికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. అత్యవసర సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రోస్టర్ పాయింట్ 22ను వెంటనే సవరించాలి!
TG : నిర్మల్ టీఎన్జీవో భవన్లో MCF జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్ మాట్లాడుతూ.. రోస్టర్ పాయింట్ 22 వల్ల మాల విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఈ విభజన జరిగిందని, ఆ నియమాన్ని వెంటనే మార్చాలని ఆయన అడిగారు. రాజ్యాంగ నిర్మాతలు అంబేడ్కర్, పూలే చూపిన బాటలో మాలలంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని పి. శంకర్, శకుంతల, తిరుపతయ్య, బత్తుల రంజిత్ పిలుపునిచ్చారు.
ముంజంపల్లి–శాలపల్లి రోడ్డుపై నరకయాతన
TG: 10 ఏళ్లుగా రహదారి పరిస్థితి మారలేదు.. గుంతలమయమైన ముంజంపల్లి–శాలపల్లి రోడ్డుపై ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూర్ మండలం ముంజంపల్లి నుంచి శాలపల్లి వరకు ఉన్న రహదారి అధ్వానంగా మారింది. సాలేపల్లి, చెగ్యాం, తాళ్లకొత్తపేట, సానబండ గ్రామాల ప్రజలు, విద్యార్థులు, రైతులు నిత్యం ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు పదేళ్లుగా రహదారి దుస్థితి ఇలాగే ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు భూములు ఇవ్వాలి.. ప్రజాసంఘాల డిమాండ్
AP: పల్నాడు జిల్లాలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు. వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే భూముల్లో ఉన్న ఎర్రచందనం, ఇతర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.

చదువు పెరిగినా సంతోషం కరువే!
చదువు పెరిగే కొద్దీ పిల్లల్లో ఆనందం పెరగాల్సింది పోయి తగ్గుతోంది. 'Student Well-Being Pulse Report' 2026 ప్రకారం 8వ తరగతిలో 62 శాతంగా ఉన్న విద్యార్థుల సంతోషం, 12వ తరగతికి వచ్చేసరికి 43 శాతానికి పడిపోయింది. 8 వేల మందికి పైగా విద్యార్థులపై చేసిన అధ్యయనంలో నమ్మకం, ఉత్సాహం తగ్గుతున్నాయని తేలింది. ముఖ్యంగా అమ్మాయిలలో మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. పరిస్థితి తీవ్రంగా ఉన్నా, కౌన్సెలర్లను కలిసి సలహాలు తీసుకుంటున్న వారు కేవలం 6 శాతమే. పిల్లలపై చదువుల భారం ఏ స్థాయిలో ఉందో ఆలోచించాల్సిన సమయమిది.

మీ బ్రెయిన్ యంగ్‌గా ఉండాలా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి!
కొత్త భాషలు నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ ఏజ్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ యంగ్‌గా, హెల్దీగా ఉంటుందని రీసెర్చర్లు వెల్లడించారు. ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడే వ్యక్తుల్లో డిమెన్షియా వంటి మైండ్ సంబంధిత వ్యాధులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. మనం వేరే భాషలు నేర్చుకునేటప్పుడు బ్రెయిన్‌లోని డిఫరెంట్ రీజియన్స్ నిరంతరం యాక్టివ్‌గా ఉండి, కాన్సంట్రేషన్, ఫోకస్ అండ్ మెమరీ పవర్‌ను పెంచుతాయి. వయసుతో సంబంధం లేకుండా ఏ టైమ్‌లోనైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.
స్టూడెంట్స్‌తో డ్యామ్‌లో స్నానం.. ప్రిన్సిపాల్‌పై యాక్షన్!
రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలో స్టూడెంట్స్‌తో కలిసి డ్యామ్‌లో స్నానం చేసినట్లు Govt. స్కూల్ ప్రిన్సిపాల్ లాల్‌చంద్ మీనాపై ఆరోపణలొచ్చాయి. దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. స్టూడెంట్స్‌తో ఆయన డ్యామ్‌లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ యాక్షన్ తీసుకున్నారు. ఆగస్ట్ 15న 200 మందికి పైగా స్టూడెంట్స్‌ను డ్యామ్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ స్నానం చేయడంపై బ్యాన్ ఉన్నప్పటికీ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రిన్సిపాల్‌పై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీకు ఆదేశించారు.

కులం పేరుతో దూషించాడనే కక్ష.. వృద్ధుడి దారుణ హత్య
AP: నెల్లూరు జిల్లాలో దారుణం.. కులం పేరుతో దూషించాడనే కక్షతో 85 ఏళ్ల వృద్ధుడిని కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన కలకలం రేపింది. కలిగిరి మండలం నాగిరెడ్డిపాలెం సెంటర్‌లో సంఘన రామిరెడ్డి (85)పై బక్క సంజీవ్ కుమార్ (30) కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో రామిరెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దాడి అనంతరం నిందితుడు నేరుగా కలిగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఐస్‌క్రీమ్ బిజినెస్‌లో బిగ్ చేంజ్.. కారణం ఇదే!
Ozempic వంటి వెయిట్‌లాస్ డ్రగ్స్ వాడకం పెరగడం, కస్టమర్లు హెల్త్ కాన్షియస్‌గా మారి ప్రోటీన్ అండ్ లో-సుగర్ ఫుడ్స్ వైపు వెళ్లడంతో ఐస్‌క్రీమ్ ఇండస్ట్రీలో పెద్ద మార్పులు వస్తున్నాయి. మ్యాగ్నమ్ వంటి కంపెనీలు బరువు పెరగకుండా ఉండేందుకు ప్రోటీన్లు, విటమిన్లు కలిపిన కొత్త రకం 'హెల్దీ ఐస్‌క్రీమ్స్'ను తయారు చేస్తున్నాయి. అయితే కెమికల్స్, ఆర్టిఫిషియల్ పదార్థాలతో చేసే ఇవి ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో జనాలు నాచురల్ ఫ్లేవర్స్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందుల మధ్య అద్భుత ప్రతిభ
TG: నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సంజన ప్రభుత్వ పాఠశాలలో చదివి 548 మార్కులతో ఉన్నత విద్యకు ఎంపికై ప్రతిభ చాటింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామచంద్రరావు బంజర్‌కు చెందిన సింగిశాల యేసురావు, నాగరాణి దంపతుల కుమార్తె సంజన టేకులపల్లి ఆదర్శ పాఠశాలలో పదోతరగతి చదివి 548 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. మహబూబ్‌నగర్ సమగ్ర విద్యా సంస్థలో సీటు సంపాదించింది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సాధించిన విజయంపై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రతినిధులు ఎల్.ఎస్.రెడ్డి, కిన్నెర వెంకటేశ్వరరావు సంజనను సన్మానించారు.