Latest

ఏపీలో స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రిజర్వేషన్ల ఖరారు, చట్టసవరణలు పూర్తిచేసి అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలింగ్ మెటీరియల్ సేకరణకు టెండర్లు నిర్వహించాలని సూచించారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఎన్నికల కమిషన్ కూడా ఈ ప్రక్రియను సమీక్షిస్తోంది.

కొండగట్టు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు.. పోలీసులకు SP ఆదేశాలు
TG: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద రోడ్డు <a href="https://www.theclearcutnews.com/n/MJPz7jK">ప్రమాద</a> స్థలాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రహదారి పరిస్థితి, వాహనాల కదలిక, వాహనాల వేగం తదితర అంశాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల్లో విచారించి సమగ్ర దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
TG: బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మహబూబ్‌నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ డి.కె.అరుణ, మేయర్ గుమ్మల మమతా శ్రీనివాస్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో DCC ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు.

ఇడుపులపాయ ట్రిపుల్ఐటిలో అసోసియేట్ డీన్ అకాడమిక్స్ నియామకం
AP: కడప జిల్లా వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో కొత్త అసోసియేట్ డీన్ అకాడమిక్స్ నియామకం చేపట్టారు. కెమిస్ట్రీ విభాగంలో మెంటర్‌గా ఉన్న డాక్టర్ బి.ఈశ్వర్ నాయక్‌ను పియుసి విద్యార్థులకు, EEE విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న షేక్ ఖాజా హుస్సేన్‌ను ఇంజనీరింగ్ విద్యార్థులకు అసోసియేట్ డీన్ అకాడమిక్స్‌గా నియమించారు. ఈ విషయాన్ని పరిపాలనాధికారి డాక్టర్ పి.రవికుమార్, డైరెక్టర్ ప్రొఫెసర్ జి.విజయ ప్రకాష్ తెలిపారు.

చెకుముకి సైన్స్ సంబరాలు.. పోస్టర్ ఆవిష్కరణ
AP: తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. జన విజ్ఞాన వేదిక తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ఆగస్టు 27న 8, 9, 10వ తరగతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టాలెంట్ టెస్ట్ పోస్టర్‌ను యూటీఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు జీజే రాజశేఖర్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్, జన విజ్ఞాన వేదిక నాయకులు చంగయ్య, రామ్మూర్తి, మస్తాన్ తదితరులు ఆవిష్కరించారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ప్రైవేటీకరించొద్దు: AISF
TG: జీవో నంబర్ 97ను వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ ఫరూక్‌నగర్ తహసీల్దార్ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను కొత్త పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు.

ఆయిల్ ఎఫెక్ట్: పడిపోయిన రూపాయి!
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 91 డాలర్లు దాటడంతో US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మరింత తగ్గింది. మంగళవారం ట్రేడింగ్‌లో రూపాయి 7 పైసలు తగ్గి 95.68కి పడిపోయింది. ఆయిల్ పేమెంట్స్ కోసం డాలర్లకు డిమాండ్ పెరగడం, RBI ఎఫ్‌సిఎన్ బి స్వాప్ ఫెసిలిటీని ముందే ముగించడం, అలాగే ఇరాన్-యుఎస్ ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాపై ఆందోళనలు ఇందుకు కారణమయ్యాయి. ఇక ఇదే ప్రభావంతో బిజినెస్ మార్కెట్‌లో సెన్సెక్స్ 278 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయాయి.

అనంతపురం జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు
AP: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగు చూస్తోంది. ఇటీవల వెస్ట్ కొడిపల్లిలో జరిగిన ఘటన మరవకముందే, యర్రకొండాపురం గ్రామంలో మరొక వివాదాస్పద అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం బయటపడింది. సర్వే నంబర్ 38లో ఉన్న 6.67 ఎకరాల భూమిని, ఇప్పటికే మృతిచెందిన వ్యక్తి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆగస్టు 14, 2026న ఈ అక్రమ రిజిస్ట్రేషన్ దస్తావేజులను రద్దు చేసినట్లు సమాచారం.

గిరిజనుల సాగు భూములకు సౌకర్యాలు కల్పించాలి
TG: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల గిరిజన రైతుల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. గిరిజనులు సాగుచేస్తున్న భూములకు హక్కుపత్రాలు మంజూరు చేయడంతోపాటు బోర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం భద్రాచలం ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందజేశారు. మండలంలోని పది గ్రామాల్లో గిరిజనులు సుమారు 20ఏళ్లుగా పోడు భూముల్లో సాగు చేస్తున్నారని, సాగునీటివసతి లేక పంటలు నష్టపోతున్నారని తెలిపారు. హక్కుపత్రాలు లేని రైతులకు వెంటనే పట్టాలు అందించి ప్రభుత్వ రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అభివృద్ధికి నోచుకోని పెదపాలెం
AP: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామం ఇబ్బందులతో అల్లాడుతోంది. వర్షం వస్తే చాలు రోడ్లు నీళ్లతో నిండిపోతున్నాయి. దోమలు విపరీతంగా ఇంట్లోకి వచ్చి ఇబ్బందికి గురి చేస్తున్నాయిజ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. ఎక్కడ నీరు అక్కడే నిలిచి ఉంటోంది.

రిషభ్ పంత్ సూపర్ రికార్డు!
భారత క్రికెటర్ రిషభ్ పంత్ టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టి అరుదైన రికార్డు సాధించారు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో, మన ఇండియా తరఫున టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన మొదటి ప్లేయర్‌గా పంత్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో బెన్ స్టోక్స్ (138), మెకల్లమ్ (107), గిల్‌క్రిస్ట్ (100) తర్వాత ఈ ఫీట్ సాధించి రిషభ్ పంత్ 4వ క్రికెటర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసిన పంత్, భారత్‌ను 352 పరుగులతో లీడ్ లో ఉంచారు.
తెలంగాణ లో పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి: SFI
తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీవో నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వం పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేసి, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కోరారు.

పేదలకు ‘భూలక్ష్మి’ పథకంతో ఎకరం భూమి: కవిత
TG: తాము అధికారంలోకి వస్తే ‘భూలక్ష్మి’ పేరుతో భూమిలేని పేద కుటుంబాలకు ఎకరం భూమి ఇస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పేదల భూములను సీఎం రేవంత్‌రెడ్డి లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీలకు పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఆచరణలో సామాజిక న్యాయం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. పేదలకు భూమి పంపిణీతోనే తెలంగాణ సమాజంలో గుణాత్మక మార్పు వస్తుందని అన్నారు.

భారతీయ సినిమాలపై కొరియన్ నటుడి ప్రేమ!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు కాంగ్ హూన్ మన భారతీయ సినిమాలపై తన అభిమానాన్ని తెలిపారు. అమీర్ ఖాన్ '3 ఇడియట్స్' సినిమా తనకు పట్టుదలను నేర్పిందని, ఆయనకు పెద్ద అభిమానినని చెప్పారు. ప్రజలపై మంచి ప్రభావం చూపే భారతీయ సినిమాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు. ఇండియాకు రావాలనేది తన చాలా రోజుల కోరికని, అవకాశాల కోసం ఎదురుచూసిన రోజులే తనను బలంగా మార్చాయని చెప్పారు.

‘అబద్ధాల రావు’ అంటూ హరీశ్‌పై పొంగులేటి ఫైర్
TG: మాజీ మంత్రి హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హరీశ్‌రావు కాదు.. ‘అబద్ధాల రావు’ అంటూ ఫైర్ అయ్యారు. 22A అంశంలో కొండను తవ్వి ఎలుకను పట్టి, దాన్నే గొప్పగా చెప్పుకుంటున్నారని సెటైర్లు వేశారు. సాఫ్ట్ కాపీ అప్‌లోడ్ చేయకపోవడంతో తప్పు జరిగిందని తామే గుర్తించామని తెలిపారు. ప్రభుత్వ భూములు కాకపోతే 22A నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపుపై కేంద్రం, EC, BRS కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

చూపు లేకపోయినా... ఈ యాప్ ఉంటే చాలు!
కంటిచూపు, వినికిడి సమస్యలు ఉన్నవారికి సాయపడేలా కొత్త యాప్స్ వచ్చాయి. బెంగళూరుకు చెందిన రుక్మణి ఛేత్రీ, తరుణ్ సర్వాల్ ప్రారంభించిన 'సైన్‌ఏబుల్' యాప్ ద్వారా వినికిడి లోపం ఉన్నవారు వీడియో కాల్స్‌లో సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రీటర్స్ సాయం పొందుతున్నారు. దీనికి నెలకు రూ.499 లేదా 30 నిమిషాలకు రూ.75 చార్జ్ చేస్తారు. అలాగే 'బీ మై ఐస్' యాప్ బ్లైండ్ యూజర్లను వాలంటీర్లతో లైవ్ వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ చేస్తూ రోడ్డు దాటడం, షాపింగ్ చేయడంలో వాలంటీర్లు సాయం చేస్తున్నారు.

తెలుగు నేర్చుకున్నా.. మాట్లాడేస్తున్నా!
బాలీవుడ్ నటి రాషా తడాని తన మొదటి తెలుగు సినిమా (శ్రీనివాస మంగాపురం) విషయాలను పంచుకున్నారు. మొదట్లో తెలుగు కొంచెం కష్టంగా అనిపించినా, ఇప్పుడు మాటలు అర్థం చేసుకుంటూ మాట్లాడగలుగుతున్నానని చెప్పారు. షూటింగ్ సమయంలో కారం మసాలా దోశ తింటూ ఎంజాయ్ చేశానని తెలిపారు. గ్రీన్ స్క్రీన్ వాడకుండా లైవ్ లొకేషన్లలోనే షూటింగ్ చేశారని, తెలుగు సినిమాలో నటించాలనే తన చిన్ననాటి కల ఇప్పటికి నెరవేరిందని అన్నారు.

ఈ నెల 27 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు
AP: కాకినాడ జిల్లాలో ఈనెల 27 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. గొల్లప్రోలు MEO ఆఫీస్‌లో చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్‌ను విద్యాశాఖ అధికారులు, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల స్థాయి పరీక్ష ఈనెల 27న, మండలస్థాయి సెప్టెంబరు 11న, జిల్లాస్థాయి సెప్టెంబరు 27న, రాష్ట్రస్థాయి నవంబరు 1, 2, 3 తేదీల్లో జరుగుతాయన్నారు.

దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించాలి
AP: తిరుపతి జిల్లాలో దళితుల సమస్యల పరిష్కారం కోసం ‘చలో కలెక్టరేట్’కు పిలుపు ఇచ్చారు. దళితులకు స్మశానాలు, వాటికి దారులు, భూ సమస్యలు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24న పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్లు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. సమస్యలపై కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. జిల్లాలోని పలు గ్రామాల్లో దళితులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని, అనేక ప్రాంతాల్లో స్మశానాలకు స్థలాలు, దారులు లేవని ఆరోపించారు.

అల్లు అర్జున్ పోస్ట్ డిలీట్.. ఏం జరిగింది?
Independence Day సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురుతున్నట్లున్న ఆ ఆర్ట్‌లో, జాతీయ జెండాపై ఉండాల్సిన అశోక చక్రం లేకపోవడం గమనించిన నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. వివాదం పెద్దది కావడంతో ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ఈ విషయంపై ఆయన గానీ, ఆయన టీమ్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆ పోస్ట్ స్క్రీన్‌షాట్లు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భూబాధితులకు న్యాయం చేయాలి.. కలెక్టర్‌కు సీపీఎం ఫిర్యాదు
AP: తిరుపతిలో భూసమస్యపై సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. శెట్టిపల్లిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం భూములు తీసుకున్నప్పటికీ అర్హులైన లబ్ధిదారులకు వారి వాటా భూమికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆరోపించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా భూ బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యపై ఇప్పటికే సుమారు 40 సార్లు అర్జీలు ఇచ్చినా పరిష్కారం కాలేదన్నారు.