Latest

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
TG: శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు, కారు ఎదురుగా ఢీకొన్న ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వనపర్తి జిల్లా గోపాల్ పేట గ్రామానికి చెందిన పార్వతమ్మ కుటుంబ సభ్యులతో కారులో శ్రీశైలం వెళ్ళి తిరిగి వస్తున్నారు. దోమలపెంట ఫారెస్ట్ రేంజ్ రాసమొల్లబావి టర్నింగ్‌లో శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారులో ఉన్న పార్వతమ్మ కాలికి తీవ్రంగా గాయమైంది. వైద్యం కోసం అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.

సర్దార్ గౌతు లచ్చన్న 117 వ జయంతి వేడుకలు
AP: విజయవాడ రూరల్ సెంట్రల్ నియోజకవర్గంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష , APSRTC ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంగి గురుమూర్తి , రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని, మైలవరం నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అంకెం సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

28 ఏళ్లకే అనన్య రాజ్ కన్నుమూత
బాలీవుడ్ నటి అనన్య రాజ్ 28 ఏళ్ల చిన్న వయసులోనే కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, జూలై 15న నిద్రలోనే తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె హిందీలో '7 అవర్స్ టు గో', 'ది ఫైనల్ ఎగ్జిట్', 'ఘోస్ట్' లాంటి సినిమాల్లో నటించారు. తెలుగులోనూ 'తగ్గేదే లే' అనే సినిమాలో నటించారు.

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం
TG: ఖమ్మం జిల్లా వేంసూర మండలం కుంచపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థులను గ్రామానికి చెందిన ఇజ్జగాని మధు అభినందించారు. ఒక్కో విద్యార్థికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.30 వేలను అందించారు. విద్యార్థులు మరింత ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు.

మంత్రి తుమ్మలపై మాజీ మంత్రి పువ్వాడ ఫైర్
TG: ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. గతంలో తనపై కాశీం రజ్వీ అంటూ తప్పుడు ప్రచారం చేసినవారు, ప్రస్తుతం తుమ్మలతోపాటు ఆయన కుమారుడి పక్కన ఉంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఖమ్మంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు.

నందివాడ మండలంలో తాగునీటి సమస్య
AP: కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురంలో కొన్ని నెలలుగా తాగునీటి సమస్యతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. సక్రమంగా తాగునీరు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు మినరల్ వాటర్ కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అవసరాల కోసం బోరు నీటిని వాడుతున్నా, ఆ నీరు తాగడానికి పనికిరావడం లేదని అంటున్నారు. గ్రామానికి సంబంధించిన తాగునీటి చెరువు గురక, డెక్కతో నిండిపోయి ఉండటంతో నీటి నాణ్యత సరిగా లేదని అంటున్నారు.

మోదీపై బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్’(Intellectual Naxals) అనే పదాన్ని ఉపయోగించారు. సమాజంలో ‘నక్సల్ మెంటాలిటీ’ ఉన్నవారిని గుర్తించాలని అన్నారు. దీనిపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇన్‌స్టాలో స్పందించారు. ఈ ముసలివాళ్లు ‘దిమాగీ నక్సల్’ అని అనగానే ఏదో బ్రహ్మాస్త్రం వదిలేశామని అనుకుంటున్నారని, అయితే పిల్లలకు నక్సల్ అంటే ఏమిటో తెలియదని రాశారు. పుస్తకాల్లోనుంచి తొలగించిన చాప్టర్‌లను తిరిగి పెట్టమని పేర్కొన్నారు. కొంచెం ‘థెరపీ’ చేయించుకోమని సలహా ఇచ్చారు.

🚨 Fake News ఎందుకు మళ్లీ మళ్లీ వైరల్ అవుతుందో తెలుసా? 👀
ఒక ఫేక్ న్యూస్ ఒక్కసారి వైరల్ అయితే.. మళ్లీ మళ్లీ మన ముందుకు ఎందుకు వస్తుంది? దీనికి మన మెదడు, సోషల్ మీడియా రెండూ కారణమే. భయం, కోపం, ఆశ్చర్యం కలిగించే వార్తలు మన దృష్టిని త్వరగా ఆకర్షిస్తాయి. మనకు నచ్చిన అభిప్రాయాలకు సరిపోయే విషయం కనిపిస్తే, నిజమా కాదా అని చెక్ చేయకుండానే నమ్మే అవకాశం ఉంటుంది. ఒకే విషయం పదేపదే కనిపిస్తే అది నిజమేనన్న భావన కలగొచ్చు. ఒకరు షేర్ చేస్తే మరొకరు ఫార్వర్డ్ చేస్తారు. ఇలా వార్త వేగంగా వ్యాపిస్తుంది. వైరల్ అయిందంటే నిజమని కాదు, షేర్ చేసే ముందు మూలం, తేదీ చెక్ చేయడం ముఖ్యం.
మేడారంలో సీఎం రేవంత్ తులాభారం
కొత్త పెన్షన్ల పంపిణీకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. తులాభారంలో ఆయన 68 కేజీల బరువు తూగారు. విశేషమేంటంటే.. పోయిన ఏడాది సెప్టెంబర్‌లో తులాభారంలోనూ ఆయన బరువు 68 కిలోలే ఉన్నారు. అలాగే త్వరలో విదేశీ పర్యటన ఉన్నందున మంత్రి సీతక్క ముందుగానే రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు.

“LO”తో మొదలైన ఇంటర్నెట్ కథ!
ఇవాళ ప్రపంచాన్ని ఒక్క క్లిక్‌తో కలుపుతున్న ఇంటర్నెట్.. అసలు ఎలా మొదలైందో తెలుసా? 1969లో అమెరికా పరిశోధనా సంస్థ అర్పానెట్‌ను ప్రారంభించింది. దూరంగా ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకోగలవా అనేదే లక్ష్యం. మొదట నాలుగు కంప్యూటర్లను మాత్రమే కలిపారు. తొలి సందేశంగా “LOGIN” పంపుతుండగా సిస్టమ్ క్రాష్ అయి “LO” మాత్రమే చేరింది. ఆ చిన్న ప్రయోగమే తర్వాత ప్రపంచాన్ని మార్చిన ఇంటర్నెట్‌కు పునాదిగా మారింది. ఒక చిన్న “LO”.. ఇంత పెద్ద మార్పుకు నాంది పలికింది!

చిన్నారి భూమికకు అండగా నిలిచిన ఇంజినీరింగ్ అసిస్టెంట్లు
AP: తిరుపతి జిల్లా పాకాల మండలానికి చెందిన భూమికకు ప్రాణదాతలుగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ముందుకొచ్చారు. సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మోహన్ రాజు కుమార్తె భూమిక తలసేమియాతో బాధపడుతోంది. తన చికిత్స కోసం రూ.50 లక్షలు అవసరమని తెలుసుకున్న Association of Secretariat Engineers(ASE), Association of Engineering Assistants, Andhra Pradesh సభ్యులు మొత్తం రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.

PDF ఉపాధ్యాయ MLC అభ్యర్థిగా హనుమంతరావు
AP: 2027లో జరగనున్న కృష్ణా -గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా యుటిఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంత రావు పేరును డిక్లేర్ చేశారు. ఇవాళ విజయవాడలో జరిగిన 2003 డీఎస్సీ పెన్షన్ పోరాట వీరుల విజయోత్సవ సభలో ఏపి యుటిఎఫ్, పీడీఎఫ్ ఫోరమ్ ఈ విషయాన్ని ప్రకటించింది. యుటిఎఫ్‌తోపాటు మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాలు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచాయి.

కుకునూర్‌లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి
TG: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని యువత, గ్రామ ప్రజలు కోరుతున్నారు. స్కూల్ ఏర్పాటుకు అవసరమైన ఐదెకరాల భూమి, తరగతి గదులు, తాగునీరు, విద్యుత్, విశాలమైన ఆటస్థలం, రహదారి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కుకునూర్ గ్రామం వెల్దుర్తి మండలంలో భాగమేననే విషయాన్ని మండల కేంద్ర ప్రజలు గుర్తించాలని వారు కోరారు. గతంలో వెల్దుర్తి మండలానికి మంజూరైన మైనారిటీ పాఠశాల, జ్యోతిబా ఫూలే పాఠశాలలు ప్రస్తుతం తూప్రాన్‌లో నిర్వహించబడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

కాంగ్రెస్ నాయకుడు, ఆయన కుమారుడి హత్య
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు అనీసూర్ రెహ్మాన్(50), ఆయన కొడుకు అబూ సుఫియాన్ (24)ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అనీసూర్ రెహ్మాన్ బెంగాల్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు. నాడియా జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ. ఆయన నకషిపారా ప్రాంతంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. బెతువాదహారి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా నగడి రైల్వే గేట్ దగ్గర కారు మీద కాల్పులు జరిపారు. తర్వాత పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఇద్దరూ అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఆరు తరాల ఉమ్మడి కుటుంబం.. 83 మందికి ఒకే వంటిల్లు!
AP: అనంతపురం జిల్లా కుర్లపల్లిలో ఆరు తరాలుగా కొనసాగుతున్న ఓ భారీ ఉమ్మడి కుటుంబం ఆసక్తికరంగా మారింది. ఈ కుటుంబంలో ఏకంగా 83 మంది ఉన్నారు. అందరికీ ఒకే వంటింట్లో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తారు. రోజుకు 50 కిలోల బియ్యం అవసరం అవుతుంది. ఆదివారం నాన్‌వెజ్ వండితే ఒక పొట్టేలు, 10 కిలోల చికెన్ వండుతారు. సాయంత్రం బజ్జీలు చేయాలంటే 15 కిలోల పిండి అవసరమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. <a href="https://www.youtube.com/watch?v=Av8N3HDPrXw">83 మంది ఒకే కుటుంబంగా,</a> ఒకే ఇంట్లో కలిసి జీవించడం నిజంగా ఆశ్చర్యమే.

మన కన్ను 👀 ఎంత పవర్‌ఫుల్లో తెలుసా?
మన ఫోన్లలో 50 లేదా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటేనే చాలా గొప్ప అని అనుకుంటాం. కానీ సైన్స్ ప్రకారం మన కన్ను దాదాపు 576 మెగాపిక్సెల్స్ పవర్‌తో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎంతటి అడ్వాన్స్‌డ్ కెమెరా వచ్చినా మన కంటి చూపులోని న్యాచురాలిటీని మ్యాచ్ చేయలేదు. కళ్ళు చూసే దృశ్యాలను సూపర్ ప్రాసెసర్‌లాంటి మన బ్రెయిన్ ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి మనకి క్లియర్‌గా చూపిస్తుందని అంటున్నారు.

పెరియార్ జీవిత విశేషాలను వివరించే పుస్తకం
బాల జయరామన్ ఆంగ్లంలో రాసిన ‘Periyar’ పుస్తకానికి తెలుగు అనువాదం ఈ పుస్తకం. ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ ఇ.వి.రామస్వామి జీవితంలోని విశేషాలను వివరించే పుస్తకం ఇది. ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం ఉద్యమించిన పోరాట యోధుడు ఆయన. జెండర్, కుల అసమానతలపై ఆయన అనేక రచనలు చేశారు. ద్రవిడ అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసింది. ధర రూ.150. కొనేందుకు <a href="https://hyderabadbooktrust.com/products/periyar-bala-jayaraman?srsltid=AfmBOoqpAbeB7xM3l09vKW3iogjfY1k0N9bv51F2QFe3xTqHcEpnnd8G&sku_id=60248779">లింక్</a>.

రష్మిక కామెంట్స్‌పై యశ్ రియాక్షన్!
గతంలో నటి రష్మిక తనను 'మిస్టర్ షో ఆఫ్' అని అనడంపై కన్నడ హీరో యశ్ స్పందించారు. 2017లో ఒక ఇంటర్వ్యూలో రష్మిక చేసిన ఈ కామెంట్స్ పై యశ్ టాక్సిక్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ, 'ఆమె ఏ ఉద్దేశంతో అలా అనిందో నాకు తెలియదు, అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త' అని అన్నారు. ఎవరైనా సరే తమ అభిప్రాయం చెప్పవచ్చని, కానీ ఇతరుల మాటల వల్ల తన క్యారెక్టర్ మారదని చెప్పారు. అంతేకాకుండా తోటి నటీనటులను గౌరవించని వాళ్లు తన ఫ్యాన్స్ కాదని, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయద్దని తెలిపారు.
దారి మర్చిపోయిన స్టార్ హీరో.. Help చేసిన కామన్ మ్యాన్
తమిళనాడులోని శివగంగైలో మలయాళ సినీ నటుడు మమ్ముట్టీకి ఆసక్తికర అనుభవం ఎదురైంది. కరైకుడిలో షూటింగ్ పూర్తి చేసుకొని దారి తప్పిన ఆయనకు ఓ స్థానిక వ్యక్తి కేరళకు వెళ్లే మార్గాన్ని చూపించారు. తనకు సాయం చేసిన వ్యక్తికి మమ్ముట్టీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఆ వ్యక్తిని ఆప్యాయంగా ‘నమ్మ ఫ్రెండూ’ అంటూ పలకరించారు. దారి చూపి సాయం చేసిన స్థానికుడిని మమ్ముట్టీ అభినందించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జాబ్ కొట్టాలనుకునే యువతకు బంపర్ ఆఫర్
TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతీ యువకులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఉచిత కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. అచలగురు మందిరంలో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని MLA, ఫౌండేషన్ ఛైర్మన్ వేముల వీరేశం ఆదివారం ప్రారంభించారు. నిపుణులైన ఫ్యాకల్టీతో మూడునెలల పాటు శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కోచింగ్ తీసుకోలేని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ లక్ష్యాలను సాధించాలని సూచించారు.

🏠 మీ ఇల్లు మీ అలవాట్లను గమనిస్తే..?
ఒక్కసారి ఊహించండి… మీరు ఇంటికి చేరుకునేలోపే లైట్లు వెలగడం, గది ఉష్ణోగ్రత మారడం, మీకు ఇష్టమైన సంగీతం ప్లే అవడం. ఇది మ్యాజిక్ కాదు. ఇంట్లోని సెన్సర్లు, పరికరాలు మీరు ఎప్పుడు వస్తారు, ఏ గదిలో ఎంతసేపు ఉంటారు, ఏ సమయానికి ఏ పరికరం వాడతారు వంటి అలవాట్లను గమనిస్తాయి. AI ఈ సమాచారంలో కనిపించే నమూనాలను గుర్తించి, మీ అవసరాలను ముందే అంచనా వేయగలదు. అంటే ఇల్లు కేవలం మన ఆదేశాలు పాటించడం కాదు… మన అలవాట్లను గమనించి, వాటికి తగ్గట్టుగా స్పందించే స్థాయికి మారుతోంది.