Latest

భారత్ Forex Reserves రికార్డ్.. $729.33B!
భారత్ Forex Reserves మరోసారి కొత్త రికార్డ్ సృష్టించాయి. ఆగస్టు 21తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు ఏకంగా $729.33Bకు చేరాయి. ఒక్క వారంలోనే $12.42B పెరిగాయి. ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు, గోల్డ్ నిల్వలు పెరగడం దీనికి కారణం. RBI తీసుకున్న కొన్ని చర్యలతో విదేశాల నుంచి భారీగా డాలర్లు భారత్‌లోకి వచ్చాయి. ఇలా నిల్వలు పెరగడం వల్ల ప్రపంచంలో ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినా, దేశానికి కొంత బలమైన రక్షణ ఉంటుంది. రూపాయిపై ఒత్తిడి వచ్చినప్పుడు RBIకి మార్కెట్‌లో జోక్యం చేసుకునే అవకాశం కూడా పెరుగుతుంది.

కరెంట్ బిల్లులు చెల్లించినా అదనంగా డబ్బులు డిమాండ్
TG: వరంగల్ జిల్లా శంభునిపేటలో విద్యుత్ వినియోగదారులకు ఫోన్ చేసి రూ.3 వేలు డిమాండ్ చేసినట్లు ఓ అసిస్టెంట్ లైన్‌మ్యాన్‌పై ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ బిల్లులు పూర్తిగా చెల్లిస్తున్నప్పటికీ అదనంగా డబ్బులు ఇవ్వాలని కోరినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని వినియోగదారులు కోరారు.

Gen Zకి ఉద్యోగాలు, చదువే పెద్ద టెన్షనా?
దేశంలోని Gen Z యువతను ప్రస్తుతం ఎక్కువగా ఏ విషయం టెన్షన్ పెడుతోంది? తాజాగా వచ్చిన ఓ పోల్‌లో దీనికి ఆసక్తికరమైన సమాధానం కనిపించింది. Gen Zలో 53% మందికి ఉద్యోగాలు, ఉపాధి ప్రధాన సమస్యగా అనిపిస్తే.. మరో 22% మంది చదువు, పరీక్షల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. అంటే మొత్తం 75% మందికి ఈ రెండు విషయాలే పెద్ద సమస్యలుగా కనిపిస్తున్నాయి. కష్టపడి చదివినా, పనిచేసినా అందరికీ సమానంగా అవకాశాలు దొరకడం లేదనే భావన కూడా యువతలో ఉంది. ఈ అసంతృప్తి CJP వైపు యువతను ఆకర్షిస్తోందా అనే చర్చ మొదలైంది.

ముహమ్మద్ ప్రవక్తను ‘గొప్ప ఫెమినిస్ట్’ అన్న జర్నలిస్ట్
‘The Wire’ న్యూస్ సంస్థ జర్నలిస్ట్ అర్ఫా ఖానుమ్ షేర్వానీ ఈద్-ఎ-మిలాద్ సందర్భంగా ముహమ్మద్ ప్రవక్తను ‘ఆ కాలపు అత్యంత గొప్ప ఫెమినిస్ట్’ అని పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. ప్రవక్త మహిళలకు వారసత్వం, సమ్మతి, విడాకులు వంటి హక్కులు ఇచ్చారని, 1400 సంవత్సరాల క్రితం పురుషాధిపత్య వ్యవస్థను సవాలు చేశారని ఆమె అందులో రాశారు. ఈ పోస్ట్‌కు కొందరు సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు ఖండిస్తున్నారు.

అనంతగిరిలో తెలుగు భాషా, క్రీడా దినోత్సవాలు
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి గిరిజన బాలికల పాఠశాల–2లో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎం బి. మంగమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతులను స్మరించుకున్నారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాష ప్రాధాన్యత, మాతృభాష పరిరక్షణ, క్రీడల ఆవశ్యకతపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

రక్తదాతలకు సర్టిఫికెట్ల పంపిణీ
TG: జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మెరుగు నరేష్ గౌడ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. రక్తదానం చేసిన దాతలకు నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. మండల వైద్యాధికారి తేజశ్రీ, గ్రామ సర్పంచ్ బండమీది కవిత గోపి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్తదానం ఎంతో మంది రోగుల ప్రాణాలను కాపాడటంలో కీలకంగా నిలుస్తుందని తెలిపారు. జన్మదిన వేడుకలను ఆర్భాటాలకు దూరంగా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

నోటీసుల ప్రక్రియ పకడ్బందీగా చేయాలి
TG: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో భూముల రీసర్వే ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. కోటపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, తహసీల్దార్ రాఘవేంద్ర, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డితో కలిసి ఎస్ఐఆర్, భూముల రీసర్వేపై సమీక్ష నిర్వహించారు. రీసర్వే పనుల్లో నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసుల జారీ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

దొంగ బంగారం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు
TG: దొంగతనాల ద్వారా వచ్చిన బంగారాన్ని కొనుగోలు చేస్తే వ్యాపారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. చోరీలకు పాల్పడే వ్యక్తులు దోచుకున్న బంగారాన్ని తక్కువ ధరకు విక్రయించి నగదుగా మార్చుకునే అవకాశం ఉందన్నారు. జ్యుయెలరీ షాపుల యజమానులు తక్కువ ధరకు బంగారం విక్రయించేందుకు ఎవరైనా తీసుకొస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా ఉన్న బంగారం విషయంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించి దర్యాప్తునకు సహకరించాలని డీసీపీ కోరారు.

బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
మంగళగిరి-తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తాడేపల్లి కేఎల్ రావు కాలనీలో రూ.64 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోని రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

‘ముస్లిం సంస్థల కార్యక్రమాలు ఇస్లాం పరిధిలోనే ఉండాలి’
కేరళంలోని సమస్త కేరళ జమియ్యతుల్ ఉలమా సంస్థ ఎపి(కాంతపురం) వర్గం ముస్లిం సంస్థలకు వార్నింగ్ ఇచ్చింది. మహల్ కమిటీలు, మసీదులు, మద్రసాలు, ఇతర ముస్లిం సంస్థలు తమ పేరుతో జరిపే కార్యక్రమాలు ఇస్లామిక్ నియమాల పరిధిలోనే ఉండాలని చెప్పింది. ఇటీవల మలబార్ ప్రాంతంలో ఓణం పండుగ జరుపుకున్నప్పుడు ముస్లిం అమ్మాయిలు పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. మిలాద్-ఎ-షరీఫ్ (నబి దినం) కార్యక్రమాల్లో కూడా మహిళలు పాల్గొన్నారు. దీంతో సంస్థ ఈ ప్రకటన చేసింది.

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌పై కీలక సమీక్ష
AP: అక్రిడిటేషన్ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి రెండో జాబితా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అక్రిడిటేషన్ దరఖాస్తులు, ధ్రువపత్రాలు, అభ్యంతరాలు, క్రిమినల్ కేసులకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి దరఖాస్తుదారుడి అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.

వేప చెట్టు వివాదం.. ఘర్షణలో ఇద్దరు మృతి
TG: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనలో మంద వెంకటేశ్వర్లు యాదవ్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సైదాను 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకుంది. అడ్డుకునే క్రమంలో మేళ్లచెరువు ఎస్సై నవీన్‌కుమార్‌కు గాయాలయ్యాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

బస్ ఎక్కుతుండగా ప్రమాదం.. క్లీనర్ సేవ్ చేశాడు!
డ్రైవర్ బస్సు స్టార్ట్ చేసే టైమ్‌లో ఓ వృద్ధ ప్రయాణికుడు ఎక్కుతుండగా అదుపుతప్పి పడిపోబోయాడు. అదే సమయంలో పార్వతి బస్సు క్లీనర్ అతుల్ కుకు తన క్విక్ రిఫ్లెక్సెస్‌తో వెంటనే స్పందించి అతడిని కాపాడాడు. కుట్టియట్టూర్–కన్నూర్ రూట్‌లో జరిగిన ఈ ఘటనలో అతుల్ క్విక్ రియాక్షన్ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. చిన్న యాక్షన్ అయినా.. ఒకరి ప్రాణాన్ని కాపాడేంత పెద్ద ఇంపాక్ట్ ఇచ్చింది. సరైన టైమ్‌లో రెస్పాండ్ అయిన అతుల్‌కు నెటిజన్స్ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

AMUDA పరిధి విస్తరణపై జాయింట్ కలెక్టర్ హర్షం
AP: కోనసీమ జిల్లా అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (AMUDA) పరిధి భారీగా విస్తరించడంపై జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడుతో కలిసి సమావేశం నిర్వహించారు. గతంలో 11 మండలాలు, 120 రెవెన్యూ గ్రామాలతో 896.16 చదరపు కిలోమీటర్లుగా ఉన్న అముడా పరిధి, తాజా ఉత్తర్వులతో 14 మండలాలు, 176 రెవెన్యూ గ్రామాలు, 1,765.45 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందన్నారు. జీఓఎంఎస్ నం.203 ప్రకారం ఈ విస్తరణ జరిగిందని తెలిపారు.

పవర్‌ఫుల్ డైలాగ్‌తో నాగార్జున 'king 100'
హీరో నాగార్జున ఫాన్స్ ఎదురుచూస్తున్న ఆయన 100వ సినిమా అప్‌డేట్ వచ్చేసింది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్‌ని గ్లింప్స్ ద్వారా రివీల్ చేశారు. ఈ సినిమాకి 'కింగ్ 100' అనే టైటిల్ పెట్టారు. తమిళ్ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమాని నిర్మిస్తోంది. "మనుషుల్లో రెండు రకాలు.. ఒకటి డబ్బున్న వాళ్లు, మరొకటి డబ్బు లేని వాళ్లు" అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో నాగార్జున క్యారెక్టర్‌ని పరిచయం చేశారు.

NFCలో 538 పోస్టులు.. ITI, Diploma, ఇంజినీరింగ్ వారికి ఛాన్స్
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ <a href="https://www.nfc.gov.in/recruitment.html">(NFC)</a> హైదరాబాద్‌లో 2026–27 అప్రెంటిస్‌షిప్‌కు 538 పోస్టులు ఉన్నాయి. ఇందులో 432 ఐటీఐకు, 106 డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ పోస్టులున్నాయి. 10th + ఐటీఐ, డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఏజ్ మినిమమ్ 18 ఏళ్లు, మ్యాక్సిమమ్ జనరల్‌కు 25, OBCకు 28, SC/STకు 30 ఏళ్లు ఉండాలి. సెప్టెంబర్ 16, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ITI వారు <a href="https://www.apprenticeshipindia.gov.in/candidate-login">NAPS,</a> డిప్లొమా/గ్రాడ్యుయేట్ వారు <a href="https://nats.education.gov.in/student_register.php">NATS</a> ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.

ప్రభుత్వ సేవలకు టైమింగ్ లేదా?
AP: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి సచివాలయం–1లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ ధ్రువపత్రాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల పనుల కోసం సచివాలయానికి వచ్చే ప్రజలు గంటల తరబడి సిబ్బంది కోసం వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా సచివాలయంలో సమయపాలన పాటించాలని కోరుతున్నారు.
గిడుగు రామ్మూర్తి సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే
AP: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు నిర్వహించారు. గిడుగు చిత్రపటానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు భాషను ప్రజల వాడుక భాషగా తీర్చిదిద్దేందుకు గిడుగు రామమూర్తి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన భాషా సేవలను నేటి తరానికి పరిచయం చేయడంతోపాటు, గిడుగు ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

లైసెన్స్‌కు ముందు 3 గం. వీడియో క్లాసులు తప్పనిసరి
TG: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి రాష్ట్రంలో కొత్త రూల్ రాబోతోంది. పర్మినెంట్ లైసెన్స్‌కు అప్లై చేసుకున్నవారు ముందుగా 3 గం. వీడియో లెసన్స్ చూడాలి. రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్‌పై అవేర్‌నెస్ కల్పించడమే దీని టార్గెట్. వీడియో క్లాసులు కంప్లీట్ చేసినవారినే ట్రాక్ టెస్ట్‌కు అనుమతిస్తారు. ట్రాక్ టెస్ట్‌లో పాస్ అయితేనే లైసెన్స్ ఇస్తారు. ప్రస్తుతం ఈ సిస్టమ్‌ను కూకట్‌పల్లి RTAలో ట్రయల్ బేసిస్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సక్సెస్ అయితే అన్ని జోనల్ ఆఫీసుల్లోనూ అమలు చేయనున్నారు.

ట్రాక్టర్ డ్రైవర్.. విద్యుత్ టవర్‌కు ఉరి!
పోలవరం జిల్లా చింతూరులో శనివారం విషాదం చోటుచేసుకుంది. చట్టికి చెందిన సోడే రాజ్ కుమార్ (ట్రాక్టర్ డ్రైవర్) శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి – శనివారం శబరి నది పక్కన ఉన్న విద్యుత్ టవర్ వరకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గాలించగా ఆ స్థితిలో కనిపించాడు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (గమనిక :- NCRB 2022 నివేదిక ప్రకారం, మొత్తం 1.71లక్షల ఆత్మహత్యల్లో 10.2% ప్రేమ వివాహేతర సంబంధాలవల్ల జరిగాయి.)

అభివృద్ధితో పాటు పచ్చదనం కావాలి
AP: గుంటూరు జిల్లా ఇన్నర్ రింగ్‌రోడ్డులో డ్రెయిన్ నిర్మాణం కోసం ఇప్పటికే నాటిన మొక్కలను తొలగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనం పెంపు కార్యక్రమాల్లో భాగంగా ఒక్కో మొక్కకు రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ప్రజాధనం ఖర్చు చేస్తున్న సమయంలో, నిర్మాణ పనుల పేరుతో వాటిని తొలగించడం పర్యావరణానికి, ప్రభుత్వ నిధులకు నష్టం కలిగించడమేనని విమర్శిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో డ్రెయిన్ పనులు చేపట్టి ఉంటే మొక్కలను కాపాడే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.