Latest

రోగుల కష్టాలు పట్టవా?.. ఆసుపత్రిలో దుస్థితి
Local· 28 Aug 2026

రోగుల కష్టాలు పట్టవా?.. ఆసుపత్రిలో దుస్థితి

TG: జగిత్యాల జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో తాగునీటి వసతి సరిగా లేకపోవడంతో పాటు రాత్రివేళ పడుకునేందుకు సరైన సౌకర్యాలు లేవని చెబుతున్నారు. దోమలు, ఈగల బెడదతో పాటు అపరిశుభ్రత కారణంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. రక్త, మూత్ర పరీక్షల కోసం వెళ్లిన సమయంలోనూ సిబ్బంది సకాలంలో స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

ఎమ్మార్పీఎస్‌కు కొత్త నాయకత్వం.. అధ్యక్షుడిగా శామప్ప
Local· 28 Aug 2026

ఎమ్మార్పీఎస్‌కు కొత్త నాయకత్వం.. అధ్యక్షుడిగా శామప్ప

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. బి. కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మండల అధ్యక్షుడిగా పోషమొల్ల శామప్ప మాదిగ, ఉపాధ్యక్షుడిగా పరశురాంను నియమించారు. ఎంఎస్‌పీ మండల అధ్యక్షుడిగా పోతురాజు భీమ్‌సప్ప, ఎంఎస్‌ఎఫ్‌ మండల అధ్యక్షుడిగా కొత్త మళ్లేశ్‌ను ఎన్నుకున్నారు.

గురజాల ఓటర్ల జాబితాపై అప్డేట్.. 44వేల మందికి నోటీసులు
Local· 28 Aug 2026

గురజాల ఓటర్ల జాబితాపై అప్డేట్.. 44వేల మందికి నోటీసులు

AP: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటరు జాబితా సర్వేలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయని ఆర్డీవో మురళీకృష్ణ తెలిపారు. గతంలో 2,75,012 మంది ఓటర్లు ఉండగా, సర్వే అనంతరం ప్రస్తుతం 2,41,254 మంది ఉన్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా 304 నుంచి 328కి పెరిగిందన్నారు. ఇప్పటివరకు 44,511 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాని వారు 7,081 మంది ఉన్నారని చెప్పారు.

పాపను వదిలి.. గోదావరిలోకి దూకి
Local· 28 Aug 2026

పాపను వదిలి.. గోదావరిలోకి దూకి

AP: పశ్చిమగోదావరి జిల్లా చించినాడ వశిష్ఠ వంతెన వద్ద తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు తమ కుమార్తెతో కలిసి స్కూటీపై వచ్చారు. అనంతరం చిన్నారిని వాహనంపైనే కూర్చోబెట్టి గోదావరి నదిలోకి దూకినట్లు పోలీసులు తెలిపారు. ఒంటరిగా ఏడుస్తున్న పాపను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తరలించి, గోదావరిలో దంపతుల కోసం గాలింపు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జగ్గయ్యపేటలో ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక
Local· 28 Aug 2026

జగ్గయ్యపేటలో ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక

AP: ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలి.. ప్రతి అర్జీపై పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ‘ఒక నెల–ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేటలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జగ్గయ్యపేటలోని ఎస్.వి.ఎస్. కళ్యాణ మండపంలో ఇవాళ ఉదయం 10గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారని చెప్పారు.

విమానాశ్రయ ప్రైవేటీకరణ ఆపాలి.. సీపీఎం తీర్మానం
Local· 28 Aug 2026

విమానాశ్రయ ప్రైవేటీకరణ ఆపాలి.. సీపీఎం తీర్మానం

AP: తిరుపతి విమానాశ్రయ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దశలవారీగా పోరాటాలను రూపొందించి ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. సీపీఎం తిరుపతి జిల్లా కమిటీ సమావేశంలో ప్రజా సమస్యలు, దళిత–గిరిజన సమస్యలు, విద్యా రంగ పరిస్థితులు, విమానాశ్రయ ప్రైవేటీకరణపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు.

పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
Local· 28 Aug 2026

పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

TG: రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయత, సోదరభావాన్ని చాటుతూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జూపాక మమత శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినులు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, సర్పంచ్, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు రాఖీలు కట్టి వేడుకల్లో భాగస్వాములయ్యారు.

అమలాపురంలో ప్రతిష్టాత్మక న్యాయ సదస్సు
Local· 28 Aug 2026

అమలాపురంలో ప్రతిష్టాత్మక న్యాయ సదస్సు

AP: ఆస్తి చట్టాలు, సవరించిన నిశ్చయాత్మక ఉపశమన చట్టంపై విస్తృత చర్చకు అమలాపురంలో ఈ నెల 30న జిల్లా న్యాయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐఏఎల్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ఎండీ. అజామ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కాలేజ్ శ్రీ సి. పద్మనాభ రెడ్డి సెమినార్ హాల్‌లో సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి.శివశంకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై కానున్నారు.

రూ.3 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన అధికారులు
Local· 28 Aug 2026

రూ.3 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన అధికారులు

AP: నెల్లూరులో రూ.3 లక్షల లంచం తీసుకుంటూ తెలుగు గంగ ఇరిగేషన్ శాఖకు చెందిన ముగ్గురు అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి లంచం తీసుకుంటున్న సమయంలో ఈఈ మహేష్, డీఈఈ గౌతమ్, ఏఈఈ నారాయణరాజులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారులు వారి కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించారు. లంచం వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వీధి నాటకాలతో హెచ్‌ఐవీపై బిగ్ అవేర్‌నెస్
Local· 28 Aug 2026

వీధి నాటకాలతో హెచ్‌ఐవీపై బిగ్ అవేర్‌నెస్

AP: వీధి నాటకాల ద్వారా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో గొర్రెల శ్రీనివాస్ కళాజాత బృందం అవగాహన కార్యక్రమం చేపట్టింది. ఆలమూరు, కొత్తూరు సెంటర్, మడికి ప్రధాన కూరగాయల మార్కెట్ సర్కిల్‌లో వీధి నాటకాల ద్వారా హెచ్‌ఐవీ ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదనే అంశాలను వివరించారు.

మైనారిటీ పాఠశాలలో వైద్య శిబిరం
Local· 28 Aug 2026

మైనారిటీ పాఠశాలలో వైద్య శిబిరం

TG: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వరంగల్ జిల్లా నర్సంపేటలోని మైనారిటీ పాఠశాలలో ఆర్‌బీఎస్‌కే బృందం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ప్రథమ చికిత్స పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీపాల మాట్లాడుతూ వైద్య శిబిరం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.

పిల్లల చేతికి వాహనం.. ప్రాణాలకు ప్రమాదం
Local· 28 Aug 2026

పిల్లల చేతికి వాహనం.. ప్రాణాలకు ప్రమాదం

AP: పిల్లల సరదా కోసం మైనర్ల చేతికి ద్విచక్ర వాహనాలు అప్పగిస్తే వారి ప్రాణాలతోనే చెలగాటం ఆడినట్లవుతుందని కాకినాడ జిల్లా రౌతులపూడిలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు, రవాణా శాఖ అధికారులు ఎన్నిసార్లు అవగాహన కల్పిస్తున్నా కొందరు తల్లిదండ్రులు నిబంధనలను పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. తాజాగా రౌతులపూడిలో మైనర్ బాలబాలికలు ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దృశ్యం చర్చనీయాంశంగా మారింది. లైసెన్స్ పొందే వయస్సు రాకముందే వాహనం నడపడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అంబేడ్కర్‌పై అసత్య ప్రచారం.. అధికారులకు ఫిర్యాదు
Local· 28 Aug 2026

అంబేడ్కర్‌పై అసత్య ప్రచారం.. అధికారులకు ఫిర్యాదు

AP: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు అధికారులను కోరారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనాను రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ సభ్యులు కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్‌పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

వృద్ధుడిపై రాయితో దాడి.. నిందితుడి అరెస్ట్
Local· 28 Aug 2026

వృద్ధుడిపై రాయితో దాడి.. నిందితుడి అరెస్ట్

TG: వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కోసం డబ్బుల వసూళ్ల విషయంలో మొదలైన వివాదం ఘర్షణకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చెరుకుపల్లి రెవెన్యూ శివారులో వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో బైరంపల్లి రాములు (58)పై కార్తిక్ అలియాస్ వంశీ (22) రాయితో దాడి చేశాడు. రాములు నోటిలోని నాలుగు పళ్లు విరిగి తీవ్ర రక్తస్రావమైంది. కొందుర్గ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్తిక్‌ను షాద్‌నగర్ కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు ఎస్‌హెచ్‌ఓ వరప్రసాద్ తెలిపారు.

సర్కార్‌కు ఉద్యోగుల అల్టిమేటం.. ఇక పోరుబాటే
TG· 28 Aug 2026

సర్కార్‌కు ఉద్యోగుల అల్టిమేటం.. ఇక పోరుబాటే

TG: తమ సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ నిర్వహించి నగరాన్ని నిర్బంధిస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్ మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో నిర్వహించిన ఉద్యోగుల మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదార్ల సమస్యలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలు చేపడతామని ప్రకటించారు.

బీసీల విద్యపై కాంగ్రెస్ కుట్ర చేస్తోంది: ఆర్. కృష్ణయ్య
TG· 28 Aug 2026

బీసీల విద్యపై కాంగ్రెస్ కుట్ర చేస్తోంది: ఆర్. కృష్ణయ్య

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకుండా పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ఫైరయ్యారు. ఎన్నికల సమయంలో పేద కులాల విద్యాభివృద్ధికి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ పరిసరాల్లో బీసీ విద్యార్థి, యువజన, నిరుద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘ఫీజులపై మహా తిరుగుబాటు’ ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు.

మీరాలం ఇక టూరిజం హబ్: CM రేవంత్ రెడ్డి
TG· 28 Aug 2026

మీరాలం ఇక టూరిజం హబ్: CM రేవంత్ రెడ్డి

TG: హైదరాబాద్‌లోని మీరాలం చెరువు అభివృద్ధి పనులపై CM రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెరువు వద్దకు చేరుకున్న CM.. భారీ క్రేన్‌పై నుంచి జరుగుతున్న పనులను పరిశీలించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. చెరువులో ఐల్యాండ్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. మీరాలంను ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు.

అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ: CM చంద్రబాబు
AP· 28 Aug 2026

అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ: CM చంద్రబాబు

AP: 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం దక్కితే.. ప్రపంచస్థాయి క్రీడా వేదికగా అమరావతిని తీర్చిదిద్దాలని CM చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో ప్రతిపాదిత స్పోర్ట్స్‌ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ఒలింపిక్స్‌ నిర్వహణకు అనువైన ప్రదేశంగా రూపొందించాలని సూచించారు. రాజధాని నిర్మాణం, రైతుల లేఔట్లు, మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల కోసం కేటాయింపుల అనంతరం సీఆర్‌డీఏ వద్ద మిగిలిన 3,800 ఎకరాలను అత్యంత పొదుపుగా వినియోగించాలని స్పష్టం చేశారు.

మారికవలస స్కూల్ రద్దు వద్దు...  2 రోజులుగా parents ఆందోళన
Local· 27 Aug 2026

మారికవలస స్కూల్ రద్దు వద్దు... 2 రోజులుగా parents ఆందోళన

మారికవలస పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాడేరు ఐటీడీఏలో రెండో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. వారి డిమాండ్ స్పష్టంగా ఉంది – "మా పిల్లలను మారికవలస పాఠశాలలోనే కొనసాగించాలి." సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను రద్దు చేయడం ఆదివాసులకు తీవ్ర అన్యాయమని, ఆదివాసి ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లో చదువుకునే అవకాశాన్ని లేకుండా చేయడం తీవ్ర దెబ్బ అని ఆందోళన వ్యక్తం చేశారు. <br>విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని, మారికవలస గురుకుల స్కూలు కొనసాగించాలని, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

కిట కిట లాడుతున్న RTC బస్సులు
Local· 27 Aug 2026

కిట కిట లాడుతున్న RTC బస్సులు

రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని వరంగల్‌–తొర్రూరు మార్గంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో బస్సుల్లో రద్దీ నెలకొంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వరంగల్‌–తొర్రూరు రూట్‌లో అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

3 కి.మీ.అదనం... హైవేతో సూరారంకు అన్యాయం..
Local· 27 Aug 2026

3 కి.మీ.అదనం... హైవేతో సూరారంకు అన్యాయం..

కొత్త హైవే వచ్చి ఊరిని మరింత దూరం చేసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం మెయిన్ రోడ్డును నేషనల్ హైవే అధికారులు మూసేశారు. ఇప్పుడా గ్రామానికి వెళ్లాలంటే.. వల్లభాపూర్ మీదుగా సుమారు 3 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిందే. ఎల్కతుర్తి, హుజురాబాద్, హనుమకొండ వైపు రోజూ వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, రైతులు, ద్విచక్ర వాహనదారులు – అందరికీ ఇది భారీ ఇబ్బంది. "అసలు సూరారం మండలంలోనే అతి పెద్ద గ్రామం. ఇలా మార్గం మూసేయడం వల్ల నిత్యావసరాలకే ఆటంకం" అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.