Latest

జన్నారం మండలంలో ఓటర్ల జాబితాలపై కీలక ప్రకటన
TG: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసి, పరిశీలన అనంతరం జాబితాలను ప్రకటించినట్లు మంచిర్యాల జిల్లా జన్నారం మండల తహశీల్దార్ బక్కయ్య తెలిపారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీసుబోర్డుల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రదర్శించినట్లు వెల్లడించారు. ఓటర్లు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాలో పేరు లేని అర్హులైన కొత్త ఓటర్లు ఫారం-6 ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

రూ.40 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం
TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట్ గ్రామంలో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, సీసీ రోడ్డు, నూతన గ్రామపంచాయతీ భవనాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. మహిళా సమాఖ్య భవనానికి రూ.10 లక్షలు, సీసీ రోడ్డుకు రూ.10 లక్షలు, గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు ఖర్చు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

శ్రామికులకు వెల్డింగ్ మిషన్ల పంపిణీ
AP: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నూతక్కి, యర్రబాలెం గ్రామాలకు చెందిన శ్రామికులకు మంత్రి నారా లోకేశ్ సొంత నిధులతో వెల్డింగ్ మిషన్లను పంపిణీ చేశారు. నూతక్కికి చెందిన షేక్ మసూద్‌తో పాటు యర్రబాలెంకు చెందిన మిరియాల శేఖర్‌బాబు, ఉమ్మలేటి శ్రీకాంత్, షేక్ మొహమ్మద్ రసూల్‌కు పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శ్రామికులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.

పోక్సో చట్టంపై అవగాహన
AP: NTR జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులోని చైతన్య స్కూల్‌లో సైబర్ ఫ్రాడ్స్, ఆన్‌లైన్ మోసాలు, పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై అర్జున్ మాట్లాడుతూ.. గుర్తుతెలియని ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులకు స్పందించవద్దని సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఓటీపీ వంటి కీలక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని వివరించారు. చిన్నారుల రక్షణ కోసం పోక్సో చట్టంలోని అంశాలను, బాలలపై జరిగే నేరాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

విద్యార్థుల హక్కులను కాలరాయొద్దు: KTR
TG: GO 97ను వెంటనే రద్దు చేయాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జీవో కారణంగా రాష్ట్రంలోని వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీవోకు వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పూర్తి మద్దతు ఉంటుందని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై కొన్ని చోట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు.

SC విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు: మంత్రి డోలా
AP: SC విద్యార్థులకు JEE, NEET పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన విద్యతో పాటు అత్యాధునిక సౌకర్యాలు అందించనున్నట్లు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండలో ఏర్పాటు చేయనున్న జేఈఈ, నీట్ ఎక్స్‌లెన్స్ సెంటర్లలో అదనపు భవనాల నిర్మాణం, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలపై సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అదనపు భవనాలతో పాటు అంతర్గత రహదారులు, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టు, ఖోఖో కోర్టు, మల్టీపర్పస్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఉద్యమమే: ఆర్. కృష్ణయ్య
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై జాతీయ BC సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. CM రేవంత్‌రెడ్డి రూ.2,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను బ్యాంకులో జమ చేసినట్లు ప్రకటించారని, ఆర్థికశాఖ నుంచి నిధులు విడుదల కాకపోతే వాటిని ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారని ప్రశ్నించారు. APలో BC విద్యార్థుల పూర్తి ఫీజులతోపాటు రూ.15వేల ఉపకార వేతనాలు అందిస్తున్నారని, తెలంగాణలోనూ అదేవిధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు.

ఉన్న నీటితోనే పంటలు కాపాడుకోవాలి: ఉత్తమ్
TG: నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతులు పంటల సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31 శాతం వర్షపాతం లోటు ఉందని, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి, MBC (మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్) ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు.

ఇక ప్రతి ఫిర్యాదుకూ పరిష్కారం: పొంగులేటి
TG: రాష్ట్రంలోని 22ఏ నిషేధిత భూముల సమస్యలపై ప్రజల నుంచి కాల్ సెంటర్‌కు వస్తున్న ప్రతి ఫిర్యాదును పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పలు జిల్లాల్లో 22ఏ భూముల పరిస్థితి, పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు. ఇప్పటివరకు కాల్ సెంటర్‌కు సుమారు 400 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులకు వెంటనే పంపించి, సమస్య పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

జనసేన ఎంపీ కొడుకుపై FIR!
TG : హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర ఈ నెల 16న రోడ్డు దాటుతున్న భారతి (26) అనే యువతిని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. నిర్లక్ష్యంగా కారు నడిపి ఆమె మరణానికి కారణమయ్యాడని AP జనసేన రాజ్యసభ MP రమేష్ కొడుకు సంజూష్‌పై BNS 106(1) సెక్షన్ కింద కేసు నమోదైంది.

కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థి చివరి మాటలు!
మరో నీట్ అభ్యర్థి చదువు, భవిష్యత్తుపై ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో సూరజ్ సుభాష్ షిండే (19) అనే విద్యార్థి 'అమ్మ, నాన్న క్షమించండి, వచ్చే జన్మలో ఖచ్చితంగా డాక్టర్ అవుతాను. జాగ్రత్తగా, సంతోషంగా ఉండండి' అని సూసైడ్ నోట్‌లో రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు.

గంజాయి అమ్మినా, వాడినా కఠిన చర్యలు!⚠️
TG : తాండూరులోని విలియం మూన్ స్కూల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గరున్న బ్యాగులను తనిఖీ చేయగా 1,260 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో ఆ గంజాయిని తీసుకోని, ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. గంజాయి లేదా వేరే ఏ మత్తు పదార్థాలైనా అమ్మినా, వాడినా కఠిన చర్యలు ఉంటాయని, సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు చెప్పాలని అధికారులు సూచించారు.

రోడ్లపై పశువులను వదిలితే చర్యలు తప్పవు..
AP : విజయనగరం జిల్లాలో రాజాం ఏరియా మెయిన్ రోడ్డుపై పశువులను విడిచిపెట్టడం వల్ల ట్రాఫిక్ పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. పశువుల యజమానులు తమ పశువులను ఇళ్ల వద్దనే కట్టేయాలని, రోడ్లపైకి వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్, SI నవీన్ కుమార్ హెచ్చరించారు.

మన స్టూడెంట్స్ కి గూగుల్ భారీ ఆఫర్
మన దేశంలోని స్టూడెంట్స్ కి గూగుల్ ఏఐ ప్లస్ సభ్యత్వాన్ని వన్ ఇయర్ ఫ్రీ గా ఇస్తామని గూగుల్ ప్రకటించింది. ఇండియా లోని స్టూడెంట్స్ జెమినీ బేస్ ఏఐ టూల్స్‌ను పూర్తి ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అలాగే జెమినీలో స్టూడెంట్స్ కోసం స్పెషల్ హబ్ కూడా రానుంది. లెసన్స్ చదవడం, రీసెర్చ్ చేయడం, ఎగ్జామ్స్ ప్రిపరేషన్, రివిజన్ ఇలా అన్నీ ఒకే చోట ఉండడం వలన స్టూడెంట్ కి హెల్ప్ అవుతుందని గూగుల్ సంస్థ ప్రకటించింది. విద్యార్థులకు హెల్ప్ అయ్యే అనేక ఫీచర్స్ ని త్వరలో తెస్తామని తెలిపింది

GO 97ను రద్దు చేయాల్సిందే : RS ప్రవీణ్ కుమార్
తెలంగాణలో విద్యార్థులు GO 97కి వ్యతిరేకంగా రోడ్లపై పోరాడుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నారని BRS నాయకుడు RS ప్రవీణ్ కుమార్ విమర్శించారు. పోలీసులు విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.<br>ఎవరినీ సంప్రదించకుండా స్కిల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టారని, TASK ఉండగా మళ్లీ ఇదెందుకని అడిగారు. 1982 ఎడ్యుకేషన్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఉన్న ఈ జీవో రద్దు చేసేవరకు BRS విద్యార్థులకు అండగా పోరాడుతుందని చెప్పారు.

ఏపీ లో ఫ్రైడే భారీ వర్షాలు...!
ఏపీ స్టేట్ లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అలెర్ట్ చేసింది. పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. ఈ రెండు జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. శుక్రవారం బయటికి వెళ్లే వారు అలెర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు.

తన Rules లీక్ చేసిన సిద్ధార్థ్! 🎬
హీరో సిద్ధార్థ్ నటించిన 'ఆపరేషన్ సఫేద్ సాగర్' వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సందర్భంగా సినిమాల్లో తన రూల్స్ గురించి ఆయన మాట్లాడారు. సినిమాలో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, చెడ్డ పాత్రలను హీరోగా చూపిస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే క్యారెక్టర్లు తాను ఎప్పటికీ చేయనని చెప్పారు. ఐటెం సాంగ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, మహిళలను కించపరిచేలా ఉండే పాటల్లో ఇప్పటివరకు నటించలేదని, భవిష్యత్తులో కూడా నటించనని అన్నారు.

ఉపసర్పంచులకు గౌరవ వేతనం ఇవ్వాలి
TG: కామారెడ్డిలో ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలు, ఉపసర్పంచుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రాజంపేట ఉపసర్పంచ్ మీర్ ఇమ్రాన్ అలీ హాజరయ్యారు. ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఉపసర్పంచులతోపాటు వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఇమ్రాన్ అలీ కోరారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చివ్వెంల మండలంలో టీచర్ల నిరసన
TG: చివ్వెంల మండల కాంప్లెక్స్ సమావేశాల సందర్భంగా ఉదయం టీ విరామ సమయంలో చివ్వెంల ZPHSలో టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 2వ PRCని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలన విడుదల చేయాలని కోరారు. CPSని రద్దు చేసి OPSను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 27న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని, సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నిరసన తెలపాలని, సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ మహాధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.

రాత్రి పూట అడవులు మెరుస్తాయని తెలుసా?
మన దేశంలోని పశ్చిమ కనుమల్లో రాత్రి పూట అడవులు మెరుస్తూ కనిపిస్తాయని మీకు తెలుసా? వీటిని ‘Glowing Forests’ అంటారు. ఇందుకు కారణం మైసెనా జాతికి చెందిన బయోలుమినిసెంట్ శిలీంధ్రాలు. వర్షాకాలంలో ఇవి మెరుస్తాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి కాంతిని విడుదల చేస్తాయి. కుళ్ళిపోతున్న కలప, ఇతర సేంద్రియ పదార్థాలపై పెరుగుతాయి. ఇవి కాంతిని పంచినప్పుడు పరిసరాలు చాలా అందంగా కనిపిస్తాయి.

దళితుల స్మశాన భూమి ఆక్రమణ..
AP : వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం పిచ్చుకలపాలెం గ్రామంలోని దళితుల స్మశానవాటిక ఆక్రమణకు గురైందని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సర్వే నంబర్ 280-2లోని 299 సెంట్ల స్మశాన భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించి, కంచె వేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. త్వరలోనే సర్వే చేయించి, హద్దులు నిర్ణయించి బోర్డు ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.