Latest

ఆసుపత్రిలో ఫోన్ ఛార్జింగ్ కష్టాలు
TG: నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో రోగుల సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డుల్లో ఉన్న మొబైల్ ఛార్జింగ్ పాయింట్లకు ఆసుపత్రి సిబ్బంది స్టిక్కర్లు వేసి మూసివేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లు ఛార్జ్ చేసుకునే అవకాశం లేక అత్యవసర సమయంలో వైద్యులను, కుటుంబ సభ్యులను సంప్రదించలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోగుల సేవలో ఉండే తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వాపోతున్నారు. వెంటనే స్పందించి ప్రత్యేక మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కోరారు.
మెడికోపై కారు ఎక్కించిన యువకులు
AP: రాజమండ్రిలోని అప్పారావు రోడ్డులో జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ స్టూడెంట్‌ని ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టారు. కిందపడిన ఆమెపై నుంచే కారు పోనిచ్చారు. దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. మెడికోను స్థానిక ఆసుపత్రికి తరలించగా, బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. నామవరానికి చెందిన ఇద్దరు యువకులు తప్పతాగి స్పీడ్‌గా కారు నడుపుతుండగాఈ యాక్సిడెంట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

గాయంతో భీమవరంలో వరుణ్ తేజ్ జోరు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్లలో స్పీడు పెంచారు. వరుణ్ కాలికైన గాయం ఇంకా తగ్గకపోయినా, భీమవరంలోని ఒక కాలేజీలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌కి వచ్చి సందడి చేశారు. 2018లో ‘తొలిప్రేమ’ ఈవెంట్ ఇక్కడే జరిగిందని, అప్పటి మ్యాజిక్ ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతుందని నమ్మకంగా చెప్పారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో, రితీకా నాయక్ హీరోయిన్‌గా, థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లలోకి వస్తోంది.

క్షుద్రపూజల ఆరోపణలపై హరీశ్‌రావు మాస్ వార్నింగ్
TG: BRS నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ నేతలు చేసిన క్షుద్రపూజల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వర్షాలు పడకుండా తాను క్షుద్రపూజలు చేశానని ఆరోపించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలకు హద్దులు ఉండాలని, నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పటికే సంబంధిత కాంగ్రెస్ నేతలకు న్యాయ నోటీసులు పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అంశాలను తాము ప్రశ్నిస్తున్నందుకే తనపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

Evening Fat Burning Workout
అధిక బరువు, కొవ్వుతో బాధపడేవారికి 'Evening Fat Burning Workout' ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ సాయంత్రం 60 Squats, 1 నిమిషం Plank, 30 Tricep Dips, 30 High Knees, Mountain Climber, 50 Crunches, 50 Push Ups, 50 Jumping Jacks చేయడం వల్ల శరీరంలో అనవసర కొవ్వు సులువుగా కరుగుతుంది. వర్కౌట్ ముందు 5-10 నిమిషాల Warm Up తప్పనిసరి. మధ్యలో 30-60 సెకన్ల బ్రేక్ తీసుకుంటూ, తగినన్ని నీళ్లు తాగుతూ క్రమం తప్పకుండా చేస్తే అద్భుతమైన ఫిట్‌నెస్ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

హస్తకళలకు క్యూఆర్ కోడ్.. దేశంలోనే తొలిసారిగా!
AP: రాష్ట్రంలో హస్తకళలకు టెక్నాలజీని జోడిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ CM పవన్ కల్యాణ్ సూచనలతో దేశంలో తొలిసారిగా హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్స్‌కు క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ‘లేపాక్షి’ ఆధ్వర్యంలో స్పెషల్‌గా డిజైన్ చేసిన క్యూఆర్ కోడ్ వ్యవస్థను స్టార్ట్ చేశారు. కళాఖండంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే పూర్తి ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి వస్తుంది. దీంతో ఫేక్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్స్‌కు అడ్డుకట్ట పడటంతో పాటు, ఏపీ కళలకు మంచి గుర్తింపు వస్తుందని అధికారులు తెలిపారు.

తెలంగాణ భవన్‌లో జయశంకర్ జయంతి వేడుకలు!
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయశంకర్ ఆశయాలకు నివాళులర్పించారు.

బస్సు కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్
TG: జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలోకి RTC బస్సు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ గ్రామం బయట ఉన్న స్టేజి వరకు వెళ్లి బస్సు ఎక్కాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కలిసి స్టేజి వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామంలోకి RTC బస్సును నడిపి విద్యార్థులను అక్కడి నుంచే ఎక్కించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.

తరుణ్ తేజ్‌పాల్ దోషి: బాంబే హైకోర్టు
ప్రముఖ జర్నలిస్ట్, తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను గోవా బెంచ్(బాంబే హైకోర్ట్) రేప్ కేసులో దోషిగా నిర్ధారించింది. 2021లో ట్రయల్ కోర్టు ఆయన్ని నిర్దోషిగా విడుదల చేసిన తీర్పును ఈ కోర్టు కొట్టేసింది. 2013లో గోవాలో జరిగిన తెహల్కా ఈవెంట్‌లో ఎలివేటర్‌లో మాజీ కొలీగ్‌పై అత్యాచారం చేశాడని ఆయన మీద కేసు నమోదైంది. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు ఆయన్ని నిర్దోషిగా విడుదల చేయగా, హైకోర్టు ఆయన్ని దోషిగా గుర్తించింది.
ఆసుపత్రిలో కూలిన పైకప్పు భాగం
రాజస్థాన్ రాష్ట్రం సుజంగఢ్‌లో ఫతేపురియా మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి ఎంట్రెన్స్ పైకప్పులో కొంతభాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఒక మహిళ తలకు తీవ్రగాయాలయ్యాయి. మహిళను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఆసుపత్రి భవనం చాలా పాతదని అక్కడున్నవాళ్లు అంటున్నారు.

కూలిన ఇంటి పైకప్పు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా పాత ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 28 ఏళ్ల వ్యక్తి పెద్ద గాయాలై ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులీ వార్డులో ఈరోజు ఉదయం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జాగినట్లు పోలీసులు వెల్లడించారు.

ఒక్క నిర్లక్ష్యం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
AP: కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై వల్లూరు మండలం తోలగంగనపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కడప నుంచి కూరగాయలు, ప్రయాణికులతో కమలాపురం వైపు వెళ్తున్న ఆటో రోడ్డుపై నిలిపిన ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఢీకొన్న తీవ్రతకు ఆటో ముందు భాగం దెబ్బతినగా, కూరగాయలు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. గాయపడిన ఇద్దరికి స్థానికులు, 108 అంబులెన్స్ సిబ్బంది కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

పోషకాలతో నిండిన Fruit Timetable
ఉదయాన్నే అరటిపండు తింటే వెంటనే ఎనర్జీ, పైనాపిల్ తింటే మెటబాలిజం పెరుగుతుంది, అలాగే ఖాళీ కడుపుతో యాపిల్ తింటే అరుగుదల బాగుంటుంది. మధ్యాహ్న పూట ఆరెంజ్, మామిడి, పుచ్చకాయ లాంటివి తింటే శరీరానికి శక్తితో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది, శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. భోజనం చేశాక బొప్పాయి తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. రాత్రి పడుకునే ముందు కివీ పండు తింటే మంచి నిద్ర పడుతుంది. పండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం పెరిగి స్కిన్ బాగా గ్లో అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

కాసుల కోసం ప్రాణాలతో చెలగాటం
TG: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో ఏకంగా 22 మంది ప్రయాణికులను ఎక్కించుకున్న డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మన్నూరు-శాంతాపూర్ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దాసరి మధుకర్ అనే ఆటోడ్రైవర్ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రమాదకరంగా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రైవర్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
మహిళపై 15 అడుగుల కొండచిలువ దాడి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో పొలం పనుల్లో ఉన్న స్వప్న అనే మహిళా రైతుపై 15 అడుగుల భారీ కొండచిలువ దాడి చేసి, చుట్టుముట్టి మింగేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రాణభయంతో పెట్టిన కేకలు విన్న తోటి రైతులు, కూలీలు వెంటనే అక్కడికి చేరుకుని ధైర్యంతో కొండచిలువను తరిమికొట్టి ఆమెను కాపాడారు. ఆ పామును గోనె సంచిలో బంధించి, స్వప్నను చికిత్స కోసం జనగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుదుపులు.. మినిస్టర్ రామ్మోహన్ వివరణ
ఫుకెట్ నుంచి దిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ మంగళవారం పెద్ద గాలుల కారణంగా కుదుపుల (టర్బులెన్స్)కు గురైంది. ఈ ఘటన ఐదు నిమిషాల పాటు కొనసాగినట్లు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఘటనలో క్యాబిన్ స్టాఫ్‌కు వెన్నెముక, మెడ భాగాల్లో ఇంజరీ అయ్యిందని వెల్లడించారు. ప్రయాణ మధ్యలో ఫ్లైట్ సుమారు 300 అడుగుల ఎత్తు ఒక్కసారిగా కోల్పోయినప్పటికీ, 137 మంది ప్రయాణికులు, 8 మంది స్టాఫ్‌తో ఎయిర్ ఇండియా AI2379 ఫ్లైట్ ఉదయం 11.07 గంటలకు దిల్లీ ఎయిర్ పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ అయ్యిందన్నారు.

ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదం.. స్టూడెంట్ మృతి
TG: సికింద్రాబాద్ తిరుమలగిరి PS పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కాలేజ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. లాల్‌బజార్ నుంచి డెయిరీ ఫామ్ వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు మరో ద్విచక్ర వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టారు. ప్రమాద తీవ్రతకు ఒకరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరొకరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

జీతం తగ్గితే ఎలా బతకాలి?.. కార్మికుల ఆవేదన
TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు GO నెం.1181ను వ్యతిరేకిస్తూ గురువారం నిరసన చేపట్టారు. ఈ జీవో అమలుతో తమ నెలవారీ వేతనాల్లో సుమారు రూ.4 వేల కోత పడిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తక్కువ జీతాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, వేతనాల తగ్గింపు మరింత భారంగా మారిందన్నారు. జీవోను వెంటనే రద్దు చేసి, మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి స్థిరమైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

రంగు రంగుల అప్పడాలు?
భారతీయ ఇళ్లలో భోజనంతో పాటు అప్పడాలు, వడియాలు తినడం చాలా కామన్. అయితే మార్కెట్‌లో ఎట్రాక్టివ్‌గా ఉండే ఎరుపు, ఆకుపచ్చ వంటి అప్పడాలు, వడియాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే వీటిలో అనుమతి లేని ‘నాన్-పెర్మిటెడ్’ ఫుడ్ కలర్స్, సింథటిక్ రసాయనాలు వాడుతున్నారు. ఈ కెమికల్స్ వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

అద్దెకు వచ్చి.. లక్షలతో ఉడాయించిన దంపతులు
AP: కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని మోరగుడిలో నకిలీ బంగారం పేరుతో రూ.4 లక్షలు మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. కూలీ పనుల కోసం వచ్చామని చెప్పి గ్రామంలో అద్దెకు దిగిన దంపతులు స్థానికుడు సుబ్బరాయుడితో పరిచయం పెంచుకున్నారు. తమకు 44 తులాల బంగారు బిస్కెట్ దొరికిందని, తక్కువ ధరకే విక్రయిస్తామని నమ్మించారు. అనుమానం రాకుండా 2 గ్రాముల అసలు బంగారం ఇచ్చి పరీక్ష చేయించగా అది నిజమని తేలింది. దీంతో రూ.12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ముందస్తుగా రూ.4 లక్షలు తీసుకుని నకిలీ బంగారు బిస్కెట్ ఇచ్చి పరారయ్యారు.
నిమ్స్ కొత్త రికార్డు.. మూడేళ్లలో 1,000 సర్జరీలు
TG: హైదరాబాద్ NIMS హాస్పిటల్ వైద్యరంగంలో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. గత మూడేళ్లలో వెయ్యి రోబోటిక్ సర్జరీలను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2023 ఆగస్టులో ఫస్ట్ రోబోటిక్ సర్జరీలను చేసిన నిమ్స్‌లో ఇప్పటివరకు యూరాలజీలో 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో 248, సర్జికల్ ఆంకాలజీలో 162 రోబోటిక్ సర్జరీలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యాయని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఈ ఘనత సాధించిన మెడికల్ టీమ్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.