Latest

మా బాధ ఇంకెవరికీ రాకూడదు
TG: నీట్ పేపర్ లీక్ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని షేక్ సనా తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా స్వాగతించదగ్గదే అయినా, తమ కుమార్తెను తిరిగి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు కఠిన సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ కష్టం మరే కుటుంబానికీ రాకూడదనే ఉద్దేశంతోనే విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ఢిల్లీలో నిరసనల్లో పాల్గొన్నామని చెప్పారు.

విద్యార్థుల విజయాన్ని CM ఖాతాలో వేసుకోవడం సరికాదు
TG: నీట్ పరీక్షల వ్యవహారంలో విద్యార్థుల విజయాన్ని CM రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని TRS చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత చేసిన పోరాటం ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని అన్నారు. ఇది పూర్తిగా స్టూడెంట్ విజయమని స్పష్టం చేశారు. యువత ప్రశ్నిస్తారనే భయంతోనే కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిందని ఆరోపించారు. హామీలు అమలు చేయకుండా CM కొత్త ప్రకటనలు చేస్తే ప్రజలు నమ్మరని ఆమె ఫైరయ్యారు.
KGBVలో ఫుడ్ పాయిజనింగ్
AP: అనకాపల్లి జిల్లా కోటవురట్ల KGBVలో 30మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడిన ఐదుగురిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా, మిగిలిన వారికి పాఠశాలలోనే వైద్యులు ఓఆర్ఎస్ అందించి పరిశీలనలో ఉంచారు. మిగిలిన ఆహారాన్ని రాత్రి భోజనంగా ఇవ్వడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆహారం, తాగునీటి నమూనాలను పరీక్షలకు పంపించారు. RDO, DMHO సంఘటన స్థలాన్ని సందర్శించి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

పెద్ది ఆరోగ్యం నిలకడగా ఉంది.. వదంతులు నమ్మొద్దు
TG: నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు అత్యవసరంగా CPRతోపాటు ప్రత్యేక చికిత్స అందించగా, గుండె స్పందన తిరిగి సాధారణ స్థితికి వచ్చిందని వెల్లడించారు. న్యూమోనియా తీవ్రత కారణంగా శరీరం పూర్తిగా సహకరించడం లేదని, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందన్నారు. మెరుగైనవైద్యం కోసం ఆయనను HYDకు తరలిస్తున్నట్లు తెలిపారు.

స్మశానం పక్కన చదువు వద్దని పేరెంట్స్ ఆగ్రహం
AP: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట గిరిజన ఆశ్రమ పాఠశాల శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులను సాలూరు యూత్ ట్రైనింగ్ సెంటర్‌కి తరలించాలని అధికారులు నిర్ణయించారు. అయితే YTC పక్కనే స్మశానవాటిక ఉండటంతో తమ పిల్లలను అక్కడికి పంపబోమంటూ తల్లిదండ్రులు బస్సులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. అవసరమైతే TCలు ఇచ్చి ఇతర పాఠశాలల్లో చేర్పిస్తామని స్పష్టం చేశారు. 20KM దూరంలోని కేంద్రానికి పంపడం వల్ల పిల్లల చదువు, మానసిక స్థితిపై ప్రభావం పడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.

ఆస్పత్రిలో చేరిన YS షర్మిల
AP కాంగ్రెస్ అధ్యక్షురాలు YS షర్మిల ఆస్పత్రిలో చేరిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల తనకు కడుపుకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగినట్లు ఆమె సోషల్ మీడియాలో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను పంచుకుంటూ వెల్లడించారు. ప్రస్తుతం కోలుకుంటున్నానని, తన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఏ కారణంతో, ఎలాంటి సర్జరీ జరిగిందనే వివరాలను వెల్లడించలేదు. ఇటీవల పార్టీ కార్యక్రమాలు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్న షర్మిల.. నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన ఆందోళనల్లో కూడా కనిపించలేదు.
రాపిడో రైడర్‌గా MLC తీన్మార్ మల్లన్న
TG: హైదరాబాద్‌లో MLC, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న వినూత్నంగా రాపిడో రైడర్‌గా మారారు. నగరంలో ఓ ప్రయాణికుడు రాపిడో బుక్ చేసుకోగా, స్వయంగా బైక్‌పై వెళ్లి అతడిని పికప్ చేసి ఇంటి వద్ద దింపారు. ప్రయాణం ముగిసిన తర్వాత హెల్మెట్, మాస్క్ తొలగించడంతో కస్టమర్ ఆశ్చర్యపోయి మల్లన్నను గుర్తించాడు. రాపిడో రైడర్ల కష్టాలు, సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం, వారి జీవన పరిస్థితులను అర్థం చేసుకోవడానికే ఈ ప్రయోగం చేసినట్లు ఆయన తెలిపారు.

గుహలో చిక్కుకుని ఆంధ్రా భక్తుడి మృతి
AP: తమిళనాడులోని అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ (36) కుటుంబంతో కలిసి స్వామివారి దర్శనం అనంతరం గిరిప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా ఇడుక్కి పిళ్లైయార్ గుహలోకి ప్రవేశించారు. ఆ గుహలోకి వెళ్లి బయటకు వస్తే కుటుంబ కష్టాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అయితే మణికుమార్ గుహలో చిక్కుకుని ఊపిరాడక స్పృహ కోల్పోయారు. స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం
AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలం జోగంపేట వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయగడ మజ్జిగౌరమ్మ తల్లి దర్శనానికి వెళ్తున్న భక్తుల ఆటోను ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం అలజంగి గ్రామానికి చెందిన చింతల గురునాయుడు (60) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డికి గుండెపోటు
TG: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ MLA, BRS సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు వెంటనే హన్మకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ICUలో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో BRS శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, KTR హుటాహుటిన హన్మకొండకు బయలుదేరారు.

RSS బ్యాక్‌గ్రౌండ్‌తో విద్యాశాఖ పగ్గాలు
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ అదనపు బాధ్యతలను సీనియర్ బీజేపీ నేత ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. విద్యార్థి దశ నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావజాలంతో ప్రజాజీవితాన్ని ప్రారంభించిన జోషి, కార్యకర్త స్థాయి నుంచి కేంద్రమంత్రిగా ఎదిగారు. ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, తదితర శాఖలను నిర్వహిస్తున్న ఆయనకు విద్యాశాఖ బాధ్యతలు కూడా దక్కాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల మధ్య RSS నేపథ్యం ఉన్న నాయకుడికి విద్యాశాఖ బాధ్యతలు అప్పగించడంపై చర్చనీయాంశమైంది.

స్కూటీపై సరదా ప్రయాణం.. క్షణాల్లో విషాదం
TG: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రికెట్ ఆడేందుకు ముగ్గురు యువకులు ఒకే స్కూటీపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ (17), లక్ష్మీతేజ (17) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

షాపింగ్ మాల్‌లో భారీ చోరీ
AP: విజయవాడ వన్‌టౌన్‌లోని పూనమ్ కలెక్షన్స్ షాపింగ్ మాల్‌లో రూ.30 లక్షల విలువైన నగదు, బంగారం చోరీ కలకలం రేపింది. పనిలో చేరిన నెలరోజులు కూడా కాకముందే నలుగురు పనివాళ్లు యజమాని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఈ దోపిడీకి పాల్పడ్డారు. దుకాణానికి ఉద్దేశపూర్వకంగా తాళాలు వేయకుండా వదిలేసి, అర్ధరాత్రి లోపలికి ప్రవేశించి రూ.30 లక్షల నగదు, 300 గ్రాముల బంగారం దోచుకెళ్లారు. అనంతరం రాజస్థాన్‌కు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.

CM రేవంత్ రెడ్డికి MP రఘునందన్ సవాల్
TG: 'జెన్ జీ' ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25ఏళ్ల నుంచి 21కి తగ్గించాలని, రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ MP రఘునందన్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. జెన్‌జీకి నిజంగా ప్రాధాన్యం ఇస్తే ముందుగా కాంగ్రెస్‌లోనే ఓ యువ ఎమ్మెల్యేకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించాలని సవాల్ విసిరారు. GHMCకి యువ మేయర్‌ను చేయాలని సూచించారు.

CM రేవంత్ రెడ్డికి EC నోటీసులివ్వాలి: BJP
ఓటరు జాబితాలో పేరు లేకుంటే సంక్షేమ పథకాలు అందవని CM రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై BJP తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. BJP ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి. సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు CMకి నోటీసులు జారీ చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
క్రాకర్స్ షోకు ఊహించని స్పందన
TG: హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో క్రాకర్స్ డీలర్స్ అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన భారీ క్రాకర్స్ షో విజయవంతంగా జరిగింది. దేశంలోనే అతిపెద్ద బాణాసంచా ప్రదర్శనను తిలకించేందుకు సుమారు 2లక్షల మంది తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. రంగురంగుల బాణాసంచా ఆకాశాన్ని అలంకరించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే సమయంలో సెక్రటేరియట్ సమీపంలో విద్యార్థులకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ కూడా జరగడంతో నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

చితి మంటలు ఆరకముందే బూడిదను తవ్విన దుండగులు
TG: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ అంత్యక్రియలు ముగిసి కుటుంబసభ్యులు వెళ్లిన వెంటనే ఇద్దరు దుండగులు చితిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పి బూడిదను సంచుల్లో నింపి తీసుకెళ్లారు. స్థానికులు గమనించి వెంటపడటంతో వారు బూడిదను వదిలేసి పరారయ్యారు. మహిళలు చనిపోతే ఆనవాయితీగా వారి మెడలో ధరించే నల్లపూసల ఆభరణం నుంచి ఓ బంగారు గుండు తీసి మృతురాలి నోట్లో పెట్టి చితికి నిప్పంటిస్తారు. సుమారు రూ.10వేల విలువైన బంగారు గుండు కోసం చితి బూడిదను తవ్వడం స్థానికులను కలచివేసింది.

పేపర్ లీక్‌లకు శాశ్వత పరిష్కారం కావాలి
TG: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత స్పందించారు. మంత్రి రాజీనామా ఒక్కటే పరిష్కారం కాదని ఆమె స్పష్టంచేశారు. పేపర్ లీకేజీలకు శాశ్వత ముగింపు పలకాలంటే విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు నిజమైన న్యాయం జరగాలంటే మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన పరీక్షల నిర్వహణకు కఠిన చర్యలు, బలమైన సంస్కరణలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.

మొదటి విజయమిదే.. ఉద్యమం విరమిస్తున్నాం: CJP
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కొనసాగిన ఆందోళనను CJP విరమిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తొలి విజయం సాధించామని తెలిపింది. విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి కేంద్రం అంగీకరించిందని, నీట్ పేపర్ లీక్ బాధిత కుటుంబాలకు పరిహారం అంశంపైన సానుకూల స్పందన లభించిందన్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేసులు ఎత్తివేస్తామని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

క్షణాల్లో అగ్నికి ఆహుతైన దుకాణాలు
TG: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని పుణ్యక్షేత్రం చెర్వుగట్టు గుట్టకింద అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. బొమ్మల దుకాణంలో మంటలు చెలరేగడంతో 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత ఉద్ధృతమయ్యాయి. గ్రామపంచాయతీ కార్యాలయానికీ మంటలు వ్యాపించి కీలక దస్త్రాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.2.5 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇక AI సేవలు
AP: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కృత్రిమ మేధ (AI) డాక్టర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో సంజీవని పథకాన్ని ప్రారంభించిన ఆయన, ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. ఏఐ ఆధారిత వైద్యం, టెలిమెడిసిన్, రిమోట్ కేర్, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, అభా హెల్త్ ఐడీలతో వైద్యసేవలను మరింత ఆధునికీకరిస్తామని చెప్పారు. ఆధార్‌తో రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా రోగి ఆరోగ్య వివరాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.