Latest

నన్ను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు: CM
TG: కొడంగల్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని CM రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌లో తనను రాజకీయంగా దెబ్బతీయాలని కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రస్థాయిలో బలహీనపరచాలంటే తన పునాదులను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. పేర్లు వేరైనా BRS, BJP రెండూ ఒక్కటేనని విమర్శించారు. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం రోజుకు 18గంటలు పనిచేసినా నాకు టైమ్ సరిపోవడంలేదన్నారు.
ఇది SP, కాంగ్రెస్, BJP ఇష్యూ కాదు- అఖిలేష్ యాదవ్
పార్లమెంట్‌లో విద్యార్థుల సమస్యలకు మద్దతుగా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ BJPపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది SP, కాంగ్రెస్ లేదా BJPకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూ కాదు, దేశంలోని స్టూడెంట్స్ సమస్య" అని స్పష్టం చేశారు. రోడ్లపై ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్, ఆడపిల్లలపై పోలీసులు దారుణంగా దాడి చేస్తుంటే సభలో కేంద్రం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బయట స్టేట్‌మెంట్స్ ఇచ్చే ప్రధాని మోదీ, సభలోకి వచ్చి విద్యార్థుల హక్కులపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఫైర్ అయ్యారు.
2 రోజులుగా వర్షం లోనే- MP చంద్రశేఖర్ ఆజాద్
2 రోజులుగా వర్షంలో తడుస్తూ, స్టూడెంట్స్ కి మద్ధతుగా నిరసన కొనసాగిస్తున్న వీడియోను పంచుకుంటూ భీమ్ ఆర్మీ చీఫ్, MP చంద్రశేఖర్ ఆజాద్ ఎక్స్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. "వర్షపు బొట్టునైనా భరిస్తాం కానీ, అమాయకులపై జరిగే అన్యాయాన్ని అస్సలు సహించం" అని, అన్యాయం చేసినవారు ఎంతటి శక్తిమంతులైనా, వారి వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నా సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలే తన పోరాటానికి ప్రధాన బలమని చెబుతూ, "జై భీమ్.. జై భారత్" అంటూ తన ఆందోళనను కొనసాగిస్తున్నారు.

కరీంనగర్ MP ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
TG: ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల అరెస్టుకు నిరసనగా కరీంనగర్‌లో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు బీజేపీ MP కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనకు దిగడంతో BJP కార్యకర్తలతో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, కర్రలతో పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తెచ్చి, అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

సోనమ్ వాంగ్‌చుక్ కు ప్రొటెస్టర్స్ రిక్వెస్ట్!
సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 25వ రోజుకు చేరడంతో ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని, దీక్ష విరమించాలని ప్రొటెస్టర్స్ విజ్ఞప్తి చేశారు. దేశానికి ఆయన సేవలు చాలా అవసరమని అభిజీత్ దిప్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటికీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. గాంధీ, అంబేడ్కర్ మార్గంలోనే శాంతియుతంగా పోరాటం సాగుతుందని వెల్లడించారు.

కొట్టుకుపోయిన రోడ్డు.. ట్రాక్టర్‌లో గర్భిణి తరలింపు
TG: ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి–పెద్దగొళ్లగూడెం మధ్య ఇసుకవాగు బ్రిడ్జి వద్ద డైవెర్షన్ రోడ్డు భారీ వర్షానికి కొట్టుకుపోయింది. 25 గ్రామాల ప్రజలతో పాటు ఛత్తీస్‌గఢ్–తెలంగాణ రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో ప్రసవం కోసం పేరూరు ఆస్పత్రికి వచ్చిన గర్భిణి వసంతకు నొప్పులు ఎక్కువ కావడంతో ఏటూరునాగారం హాస్పిటల్‌కు తరలించాలని డాక్టర్స్ రిఫర్ చేశారు. రోడ్డు తెగిపోవడంతో ఉన్నతాధికారుల సలహా మేరకు కాన్పు చేశారు. అనంతరం అధికారులు ట్రాక్టర్ ఏర్పాటుచేసి వాగు ఉధృతి తక్కువగా ఉన్న ప్రాంతం నుంచి 108 అంబులెన్స్‌లో ఏటూరునాగారం ప్రభుత్వ హాస్పిటల్‌కు పంపించారు.
ప్రశ్నపత్రాలను అమ్ముకుంటున్నారు: రేవంత్‌రెడ్డి
TG: BJP అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నీట్ పేపర్లను బఠానీల్లా కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాజకీయ పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని, ప్రజా ఆందోళనలు పరిగణనలోకి తీసుకుని ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్లు అమ్ముకున్న వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని అన్నారు.

పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అదే: హైడ్రా కమిషనర్
TG: పవన్ కళ్యాణ్ జన్వాడ కోడి చెరువు భూమి వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ ఆ భూమిని కొనుగోలు చేశారని, ఆయన భూములు దాదాపు ఆరేడు ఎకరాల వరకు కోడి చెరువులో ఉన్నాయని చెప్పారు. మిగతా 3, 4 ఎకరాలు మాత్రమే ఎఫ్‌టీఎల్ బయట ఉన్నాయని స్పష్టం చేశారు. 'చెరువులో ఫెన్స్ వేయకూడదు. కానీ పవన్ కల్యాణ్ చెరువులో ఫెన్స్ వేశారు. అది ఆయన చేసిన తప్పు' అని అన్నారు.

నిధుల కోసం గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు
TG: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో రాత్రి వేళల్లో రహస్యంగా తవ్వకాలు చేపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామానికి చెందిన నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాలు జరిగిన ప్రదేశంలో తాయత్తు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయ వంటి పూజా సామగ్రి కనిపించడంతో గుప్తనిధుల కోసం పక్కా ప్రణాళికతో తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు.

ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడుతున్నారా ?
మన దేశంలో యాంటీబయాటిక్స్ చాలా ఎక్కువగా వాడేస్తున్నారు. అయితే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో యాంటీబయాటిక్స్ కొనొద్దని పరిశోధకులు చెప్తున్నారు. ‘ది ల్యాన్సెట్ పబ్లిక్ హెల్త్ సర్వే’లో ఈ విషయం వెల్లడిస్తూ డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నారని, దీంతో బాక్టీరియా తన రూపాన్ని మార్చుకుని 'యాంటీబయోటిక్ రెసిస్టెన్స్' అనే ప్రమాదం తీసుకొస్తుందని హెచ్చరించారు.

తల లేకున్నా కాక్రోచ్ బతకగలదు
కాక్రోచ్(బొద్దింక) ఎలాంటి కఠిన పరిస్థితులనైనా తట్టుకోగలవు. తల తెగినా ఇవి వారం రోజులు జీవించగలవు. కాక్రోచ్ నర్వ్ సిస్టం శరీరం అంతటా విస్తరించి ఉండటమే దీనికి కారణం. అందువల్ల బ్రెయిన్ సిగ్నల్స్ లేకపోయినా ఇవి కదలగలవు. వీటి రక్తం ప్రెజర్‌తో ప్రవహించదు. తల తెగినా ఎక్కువ రక్తస్రావం కాదు. శ్వాస తీసుకోవడానికి నోరు, ముక్కు కాకుండా శరీరంపై ఉండే చిన్న రంధ్రాలను ఉపయోగిస్తాయి. అయితే నోరు లేకపోవడం వల్ల తిండి, నీరు లేక చివరకు డీహైడ్రేషన్‌తో చనిపోతాయి.

రైతులకు ఖర్చులు తగ్గించేలా కేంద్రం సహకారం అందించాలి
AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిశారు. పంటల సాగులో రైతులకు ఖర్చులు తగ్గించేలా కేంద్రం సహకారమందించాలని అచ్చెన్నాయుడు కోరారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మెరుగైన ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు.

సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం
సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర 14 రోజులుగా వైరల్ న్యూమోనియాతో బాధపడుతూ కన్నుమూశారు. విజయవాడలోని హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తన కూతురి పెళ్లిని దగ్గరుండి జరిపించి తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకొని సంతోషంగా ఉన్న అక్క ఇంతలోనే దేవుడి వద్దకు వెళ్ళిపోవడం తీరని లోటని మెహర్ రమేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

వాంగ్‌చుక్‌కు విదేశాల్లో పెరిగిన మద్దతు
ఎడ్యుకేషన్ సిస్టంలో లోపాలపై పోరాడుతూ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌కు అమెరికాలో మద్దతు పెరుగుతోంది. న్యూయార్క్, శాన్‌జోస్ నగరాల్లో ‘హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’ సభ్యులు ఆయనకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లండన్, డబ్లిన్‌లలోని భారత కార్యాలయాల వద్ద కూడా నిరసనలు జరిగినట్లు సంస్థ ప్రకటించింది.
మద్యం మత్తులో కత్తితో హల్‌చల్
కర్ణాటకలోని మూడబిద్రి బస్టాండ్ దగ్గర మద్యం మత్తులో ఓ యువకుడు కత్తితో హల్‌చల్ చేశాడు. మొబైల్ షాప్‌లోకి వెళ్లి షాప్ యజమానిని బెదిరిస్తూ మొబైల్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కత్తితో షాప్ ముందున్న స్తంభాలను కూడా కొట్టాడు. ఈ ఘటన అక్కడి CCTVలో రికార్డ్ అయింది. స్థానికులు యువకుడిని చుట్టుముట్టి కత్తిని లాక్కొని పట్టుకున్నారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

రాహుల్ గాంధీపై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు
రాజకీయ ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ విద్యార్థులను వాడుకుంటున్నారని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని అన్నారు. పూర్తిస్థాయి చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసినా, కాంగ్రెస్ ఇలా రాజకీయ ప్రదర్శన చేస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన
దిల్లీలోని పార్లమెంట్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నల్లటి బట్టలు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదంటూ నినాదాలు చేశారు.

గిగ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కవిత
TG: గిగ్ వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది రోజంతా కష్టపడినా కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం రావడం లేదన్నారు. మూడేళ్లుగా రేట్లు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. అగ్రిగేటర్ సంస్థలు అధిక కమీషన్లు, కోత విధిస్తూ డ్రైవర్లను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

48 ఏళ్ల తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ బస్సు
AP: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాలగూడెం గ్రామానికి 48 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు వచ్చింది. గ్రామస్థులు విద్య, వైద్య అవసరాల కోసం 8 కిలోమీటర్ల నడిచి వెళ్లి బస్కెక్కేవారు. ప్రజల కష్టాలను గమనించిన ప్రజాప్రతినిధులు ఊరికి బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో గ్రామస్థులు సంతోషంతో బస్సుకు పూజలు చేశారు.

యురేనస్, నెప్ట్యూన్‌లపై డైమండ్ల వర్షం
మన దగ్గర వాన వస్తే నీటి చుక్కలు పడతాయి. కానీ యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలపై మాత్రం వజ్రాల వర్షం కురుస్తుంది. ఈ గ్రహాలు రాళ్లతో కాకుండా మీథేన్, నీరు, అమోనియా వంటి మంచు రూపాలతో నిండి ఉంటాయి. గ్రహం లోపలికి వెళ్లేకొద్దీ ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఆ ప్రెజర్‌కి మీథేన్‌లోని కార్బన్ విడిపోయి చిన్న డైమండ్లలా మారుతుంది. అక్కడి గాలి వేగం, తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోవడం స్పేసిషిప్స్‌కి సాధ్యం కాకపోవడం వల్ల ఆ వజ్రాలను సేకరించడం కుదరదు.

కొడంగల్‌లో సీఎం రేవంత్ ర్యాలీ
TG: నిన్న దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ అంబేడ్కర్ చౌరస్తాలో ర్యాలీ చేశారు. నిందితులకు శిక్ష వేయాల్సిందిపోయి విద్యార్థులపై లాఠీలతో దాడి చేస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసుల దెబ్బలకు రాహుల్‌కు రక్తాలొచ్చాయని ఆగ్రహించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని కేంద్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు.