Latest

నిరసనలు విరమించి సహకరించండి: జేపీ నడ్డా
ప్రభుత్వంతో చర్చలు జరపాలని సీజేపీ నిరసనకారుల నుంచి ఈరోజు ఉదయం తనకు ప్రతిపాదన వచ్చిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఉదయం 11:50 గంటల నుంచి సీజేపీతో చర్చలు కొనసాగుతున్నాయని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వారితో ప్రాథమికంగా వివరంగా మౌఖిక చర్చ జరిపి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు తనకు లిఖితపూర్వక వినతిపత్రాన్ని సమర్పించారని వెల్లడించారు. నిరసనకారులందరూ తమ ధర్నాను విరమించి, పరిపాలనా యంత్రాంగానికి సహకరించాలని అభ్యర్థించారు.

గ్లాసులో నీటితో కరెంట్ తయారు చేసుకోవచ్చా?
గ్లాసులోని నీటితో మన ఇంట్లోకి కావాల్సిన కరెంట్ తయారు చేసుకోవచ్చా? అసాధ్యం అంటారా? భారత సంతతికి చెందిన ఒక శాస్త్రవేత్త ఇదంతా సాధ్యమేనని అంటున్నారు. తన ప్రయోగాలు గనుక ఆశించిన ఫలితాన్ని ఇస్తే అనంతమైన విద్యుత్తు మన సొంతమవుతుందని అంటున్నారు. ఆయన పేరు యోగేంద్ర నారాయణ్ శ్రీవాత్సవ. తన సిద్ధాంతాన్ని రుజువు చేసేందుకు సొంత ఖర్చులతో ప్రయోగాలకు కూడా ఆయన సిద్ధం అవుతున్నారు.
డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు
దేశంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ రూ.5.6 లక్షల కోట్ల ఖర్చుతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాయి. వీటి వల్ల సౌండ్ పొల్యూషన్, వాటర్, కరెంట్ కొరత ఏర్పడుతుందని మహారాష్ట్రలో స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. పర్యావరణానికి ముప్పు ఉందంటూ నిరసనలు తెలుపుతున్నారు.

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం?
దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా దూరం కానుందా? చిన్నతనంలోనే సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, చదువుపై శ్రద్ధ తగ్గడం, ఆన్‌లైన్ నేరాల బారిన పడటం వంటి దుష్ప్రభావాలను లోనవుతున్నారు. దీన్ని అరికట్టాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో అమలు చేస్తున్న ఏజ్ లిమిట్ రూల్‌ను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం కింద తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది.

మాతా–శిశు సంక్షేమానికి కొత్త అడుగు
AP: మాతా శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు రవాణా సేవల్ని అందించేందుకు 'తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాలను సీఎం చంద్రబాబునాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రత్యేక SUV/MUV వాహనాలను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ వీరపాండ్యన్, ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు పాల్గొన్నారు.

కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన
TG: సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలిస్తారు. తరువాత ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. రాత్రి కొడంగల్‌లో బస చేసి మరుసటి రోజు (22న) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
బాన్సువాడ బాలింతలను నిమ్స్‌లో పరామర్శించిన హరీశ్ రావు
TG: బాన్సువాడ మాతా శిశు హాస్పిటల్లో బాలింతలకు చేసిన ఆపరేషన్ ఫెయిలవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు సోమవారం నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి బాలింతలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు.
దిల్లీ నిరసనలో యువతి కన్నీళ్లు
‘చలో సంసద్' మార్చ్ సందర్భంగా దిల్లీ పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. లాఠీఛార్జ్ చేయడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ‘నిరసన తెలుపుతున్న విద్యార్థుల స్థానంలో మీ బిడ్డలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని’ ఓ యువతి కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులను వేడుకుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరీక్ష పేపర్ లీకేజీలపై పోరాడుతున్న తమపై పోలీసులు ఇలా దాడి చేయడం దారుణమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి 10 మందిలో 9 మందికి రక్తంలో కొవ్వు సమస్య: ICMR
భారతీయుల ఆరోగ్యంపై 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్-ఇండియా డయాబెటిస్' చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దేశంలో ప్రతి 10 మంది పెద్దవారిలో తొమ్మిది మంది 'డైస్లిపిడెమియా'(రక్తంలో కొవ్వుల అసాధారణ నిష్పత్తి) సమస్యతో బాధపడుతున్నారని తెలిపింది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం, మంచి కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ సమస్య సిటీలో 89%, గ్రామీణ ప్రాంతాల్లో 86.5% విస్తరించి ఉందని, పురుషుల కంటే మహిళల్లోనే దీని తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
సీజేపీ నిరసనలో పోలీసులపై యువతి ఆగ్రహం
సీజేపీ నిరసన సందర్భంగా తమపై భౌతిక దాడి సరైంది కాదని ఒక యువతి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిరసనకు విద్యార్థుల పట్ల ఇలా వ్యవహరించడం దారుణమని ధ్వజమెత్తింది. తమ మీద చెయ్యి వేసే హక్కు లేదంటూ పోలీసులపై విరుచుకుపడింది. పక్కనున్న తోటి నిరసనకారి ఆ యువతిని ఆపే ప్రయత్నం చేసింది.
ప్రభుత్వం నిద్రపోతోందా..యువతి సూటి ప్రశ్న
‘మా నాన్న, మా ఊరిలోని మనుషులంతా బీజేపీ వాళ్లు. మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ బీజేపీ నేతలే. మా ఇంట్లో అందరితో యుద్ధం చేయాల్సి వస్తోంది. యూపీ..ఆగ్రా నుంచి పారిపోయి రావాల్సి వస్తోంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? పడుకుంటోందా?’ అంటూ ఓ యువతి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ అవకతవకలకు నిరసనగా దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో మాస్క్ వేసుకుంది పాల్గొంది. ప్రభుత్వం నిద్రపోతోందా అని ఆక్రోశించింది.
రైల్వే టీసీ అవతారంలో యువతిపై వేధింపులు
బిహార్ రాష్ట్రం సమస్తిపూర్ నుండి ఛప్రా వెళ్తున్న ఒంటరి యువతిని రైల్వే టీసీ పేరుతో ఒక వ్యక్తి వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వాష్‌రూమ్ వైపు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులు పోలీసులకు చెప్పగా, పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకోకుండా వదిలేశారు. నిందితుడిపై నిర్లక్ష్యం వహించిన రైల్వే పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు.

తండ్రి బాటలోనే సోనమ్ వాంగ్చుక్
లడాఖ్‌కు ఎస్టీ హోదా సాధించడం కోసం 1984లో సోనమ్ వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యాల్ ఐదు రోజులు నిరాహార దీక్ష చేశారు. ఉద్యమం పెద్దది కావడంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా లేహ్‌కు వచ్చి ఆయనకు జ్యూస్ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఎస్టీ హోదా ఇస్తామని ఇచ్చిన హామీని 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. తండ్రి బాటలోనే ప్రస్తుతం సోనమ్ వాంగ్చుక్ కూడా ప్రస్తుతం అదే రీతిలో సీజేపీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
సమస్యలను లేవనెత్తడానికి కాకపోతే పార్లమెంట్ దేనికోసం?
సీజేపీ నిరసనపై కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ స్పందించారు. అహింసాత్మక నిరసన జరుగుతుండగా లాఠీ చార్జ్ చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. లాఠీ చార్జ్ హింసాత్మక చర్య అని, దీని వెనుక కారణమేంటో అర్థం కావడం లేదన్నారు. ప్రజలు తమ ఆందోళనలను వ్యక్తం చేసే స్థలం కావాలని, కనీసం పార్లమెంట్ అందుకు అవకాశం ఇవ్వాలన్నారు. పార్లమెంట్ ఈ సమస్యలను లేవనెత్తడానికి కాకపోతే మరి దేనికోసం అని ప్రశ్నించారు.

జేపీ నడ్డాను కలిసిన CJP ప్రతినిధులు
దిల్లీలో నిరసన తరువాత కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులతో ప్రభుత్వం సమావేశమైంది. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ 'X' వేదికగా స్పందిస్తూ తను, అశుతోష్ రాన్కాతో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను ఆయన నివాసంలో కలిశామని తెలిపారు. తాము తమ డిమాండ్లతో కూడిన లేఖను సమర్పించగా, ఈలోగా ఆయన అంతర్గతంగా దీనిపై మాట్లాడతానని హామీ ఇచ్చారని అన్నారు.
సీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ దారుణం: ప్రియాంకా గాంధీ
సీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ దారుణమని కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. వారు మన పిల్లలని..వారే దేశ భవిష్యత్తు అని తెలిపారు. ఈ పార్లమెంట్ వారిదని..ఇది ఎవరి వ్యక్తిగత సామ్రాజ్యం కాదని పేర్కొన్నారు. రాహుల్ ఈ సమస్యను చాలా కాలంగా లేవనెత్తుతున్నారని తెలిపారు. మాట్లాడకుండా పిల్లలపై లాఠీచార్జ్ చేయడం ఏమిటని మండిపడ్డారు.

ఇది బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణి: రేవంత్ రెడ్డి
TG: విద్యార్థులు NEET పేపర్ లీక్ కుంభకోణంపై న్యాయం కోరుతూ పార్లమెంట్ వరకు మార్చ్ చేస్తుండగా, వారిని లాఠీలతో కొడుతూ, టియర్ గ్యాస్ ఉపయోగించి దాడి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ యువతను పోలీసు బలప్రయోగంతో అణచివేయాలని చూస్తోందన్నారు. విద్యార్థులపై పడే ప్రతి దెబ్బ బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక భయాన్ని బయటపెడుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నిరాహార దీక్షను విరమించిన నేహా బోరా
23 రోజులుగా విద్యార్థి నాయకులు నేహా బోరా, మనీష్ కుమార్, అమీన్ అమితోజ్‌లు జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. పార్లమెంటు సభ్యులు మనోజ్ ఝా, రాజారామ్ సింగ్, అమ్రా రామ్‌లతోపాటు న్యాయవాదులు, ప్రొఫెసర్లు దీక్షను విరమించాలని వారిని కోరారు. ఎలా పోరాడాలో ప్రతిపక్షాలన్నింటికీ మార్గం చూపించారని రాజారామ్ సింగ్ వారితో అన్నారు. వారి విజ్ఞప్తితో నిరాహార దీక్షను విరమించారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది.

త్రిపుర డీజీపీ అనుమానాస్పద మృతి
త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. అగర్తలా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని ఆఫీస్ బాత్రూంలో స్పృహ లేకుండా పడి ఉన్న ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్స్ ఆయనను పరిశీలించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. అనురాగ్ ధన్‌ఖడ్ 1994 బ్యాచ్‌కు చెందిన త్రిపుర క్యాడెర్ ఐపీఎస్ అధికారి.
పార్లమెంట్ ఎదుట నిరసన..ఎంపీ రేణుకా చౌదరి మద్దతు
దిల్లీ పార్లమెంట్ ముందు వివిధ డిమాండ్లతో నిరసన తెలుపుతున్న యువతకు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకాచౌదరి మద్దతు తెలిపారు. నిరసన చేస్తున్న యువతను అడ్డుకునేందుకు పార్లమెంట్ గేట్లు మూయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ దేశ యువతదని, గేట్లు ఎలా బంద్ చేస్తారని భద్రతా సిబ్బందిని, ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. యువత హక్కుల కోసం పోరాడుతుంటే వారిని అడ్డుకోవడం సరికాదన్నారు.

సర్వం..లీకులమయం
2014 నుంచి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు సంబంధించి పేపర్ లీక్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణం, రాజస్థాన్‌లో రీట్ పరీక్ష, బీహార్‌లో BPSC పరీక్షలు, తెలంగాణలో TSPSC ప్రశ్నాపత్రాలు లీక్ అయిన ఘటనలు జరిగాయి. 2024లో దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో కూడా ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. తరువాత పరీక్షల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎక్సమినేషన్స్ చట్టం, 2024ను అమల్లోకి తీసుకొచ్చింది.