Latest

నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి
AP: ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోని భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలతో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పారుపక గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూములను ఆక్రమించి మతపరమైన కట్టడాలు నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగితే భవిష్యత్తులో గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి నిర్మాణాలపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆ ఓటర్లకు Alert.. నేటి నుంచే నోటీసులు!
TG: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఈరోజు నుంచి ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. తెలంగాణాలో 92.8 లక్షల మంది ఓటర్ల వివరాల్లో తప్పులను అధికారులు గుర్తించారు. వారిలో 60.51 లక్షల అనామలీస్, 32.36 అన్-మ్యాపింగ్ లో ఉన్నారు. వీరందరికి నోటీసులు ఇవ్వనున్నారు. 2002లో ఓటర్ల లిస్ట్ తో వివరాలు మ్యాచ్ కాకపోవడం, ఎన్యుమరేషన్ Formsలో తేడాలు వంటి కారణాలతో నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారు కొన్ని Documentsతో వివరాలను Verify చేసుకోవాలని అధికారులు సూచించారు.

హౌస్‌కీపింగ్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
AP: విశాఖ విమానాశ్రయంలో ఉద్యోగాలు కోల్పోయిన హౌస్‌కీపింగ్ కార్మికుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు డిమాండ్ చేశారు. ఆరు రోజులుగా విమానాశ్రయం వద్ద కార్మికులు చేస్తున్న నిరసనకు ఆయన సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగాలు కోల్పోయిన హౌస్‌కీపింగ్ సిబ్బందికి న్యాయం చేయాలని కోరారు.

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. సొంతింటి కల సాకారం
TG: సొంతింటి కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద ప్రజలకు గొప్ప వరమని మంచిర్యాల 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ అన్నారు. డివిజన్‌లో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నారని తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. చివరకు ప్రమాదం
TG: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని తిరందాజ్ టాకీస్ సమీపంలో సంగీత మొబైల్ ఎదురుగా మిషన్ భగీరథ పనుల కోసం తవ్విన గుంత ప్రమాదకరంగా మారింది. గుంతను 15 రోజులుగా పూడ్చకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితమే స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇద్దరు వ్యక్తులు అదే గుంతలో పడిపోయారు. టర్నింగ్ వద్ద గుంత ఉండటంతో ఎప్పుడు పెద్ద ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

దేశంలో అత్యధిక డిగ్రీలున్నదెవరికో తెలుసా?
దేశంలో అత్యధిక డిగ్రీలున్నదెవరికో తెలుసా? మహారాష్ట్రకు చెందిన శ్రీకాంత్ జిచ్కర్‌కు. దేశంలో అత్యంత విద్యావంతుల్లో ఒకరిగా నిలిచిన ఆయన సివిల్ సర్వెంట్, రాజకీయ నాయకుడు కూడా కావడం విశేషం. 1973 నుంచి 1990 వరకు 42 యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాసి 20 డిగ్రీలు సాధించారు. చాలా వాటిలో ఫస్ట్ క్లాస్, గోల్డ్ మెడల్స్ వచ్చాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన పేరు నమోదైంది. 26 ఏళ్లకే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికై దేశంలో అతి చిన్న వయసు ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2004లో రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించారు.

పంచాయతీ ఎన్నికల డ్రాఫ్ట్ జాబితా విడుదల
AP: స్థానిక సంస్థల ఎన్నికలు–2026కు సంబంధించిన ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని రింతాడ గ్రామ సచివాలయం వద్ద ప్రచురించారు. పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ స్థానిక నాయకుల సమక్షంలో జాబితాను విడుదల చేశారు. మొత్తం 5,391 మంది ఓటర్లకు 14 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించారు. అన్ని కేంద్రాలను జిటిడబ్ల్యూ హైస్కూల్, రింతాడలోనే ఏర్పాటు చేయనున్నారు. ప్రజల పరిశీలన కోసం జాబితాను సచివాలయం నోటీసు బోర్డులో ఉంచారు.

కన్నతల్లినే కడతేర్చిన కొడుకు.. వనపర్తిలో దారుణం
TG: నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లినే కొడుకు దారుణంగా హతమార్చిన ఘటన వనపర్తిలో కలకలం రేపింది. గాంధీనగర్ కాలనీలో 60 ఏళ్ల రజియా బేగంను బలమైన ఆయుధంతో తలపై మోది హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు కుటుంబ కలహాలు కారణమా? లేక మరేదైనా ఇతర కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. తల్లిపై కన్నకొడుకు ఇంతటి కర్కశత్వానికి పాల్పడటంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

అధ్వానంగా మారిన రహదారి.. పట్టించుకోని అధికారులు
TG: కొమురంభీమ్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మొగవెల్లి–సోమిని మధ్య రహదారి పలుచోట్ల భారీ గుంతలతో అధ్వానంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతోపాటు గూడెం, అహేరి వైపు వెళ్లే వాహనాలు కూడా ఇదే రహదారిని వినియోగిస్తున్నాయి. గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

బహుజన రాజ్యాధికారంతోనే సామాజిక మార్పు
AP: జనాభాలో బహుజనులు అధికంగా ఉన్నా.. రాజకీయ అధికారం మాత్రం కొద్దిమంది ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉందని, ఈ పరిస్థితి మారాలంటే బహుజన రాజ్యాధికారం సాధించాల్సిందేనని ఏఐబీఎస్పీ నేతలు అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో చంద్రప్ప అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం, జిల్లా గౌరవ అధ్యక్షులు తరిగొండ మణి మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో లేదన్నారు.

వివాహ వేడుక నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం
TG: పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివాహానికి హాజరై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా నక్కలపల్లి స్టేజ్ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ప్రమాదంలో పెద్దకొత్తపల్లి మండలం చిన్నకార్పాముల గ్రామానికి చెందిన మద్దటి పెద్ద చిన్నయ్య (68) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడగా, స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పండుగ వేళ ధరల షాక్.. సామాన్యుడికి తలనొప్పి!
నిత్యావసర రేట్లు సామాన్యులను కలవరపెడుతున్నాయి. బియ్యం ధరలు భారీగా పెరిగాయి. సన్న బియ్యం కిలో రూ.63 నుంచి రూ.70 వరకు అమ్ముతున్నారు. షుగర్ రకాన్ని బట్టి కిలో రూ. 42-44 నుంచి రూ. 60-65 వరకు పెరిగింది. పప్పులు, శనగలు, వంట నూనెల ధరలూ పెరిగాయి. కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. దీనికితోడు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా భారంగా మారాయి. ధరల పెరగడానికి కారణాలపై మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పండుగలు, శుభకార్యాల సమయంలో కామన్ మ్యాన్‌కు పెరిగిన రేట్లు తలనొప్పిగా మారాయి.

డ్రైవింగ్ చేస్తూ ఈ తప్పులు చేస్తే చర్యలే!
AP: హెల్మెట్ లేకుండా బయటకు వస్తే ఇక కష్టమే.. కోరుకొండలో పోలీసులు కఠిన తనిఖీలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో నార్త్‌జోన్ డీఎస్పీ జీవన సమక్షంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని డీఎస్పీ జీవన సూచించారు.

🎙️ రాజమౌళి AIకి నో.. 1,500 గొంతులు ఎందుకు?
ఒక్కసారి ఊహించండి.. ఒక సినిమాను 50 భాషల్లో విడుదల చేయాలంటే ఎంతమంది గొంతులు కావాలి? అదే ఇప్పుడు రాజమౌళి టీమ్ ముందు ఉన్న పెద్ద పని. మహేశ్ బాబు ‘Varanasi’ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు భారీగా డబ్బింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదట AI వాయిస్‌లతో పని సులభం చేయాలనుకున్నా.. ఇప్పుడు నిజమైన డబ్బింగ్ ఆర్టిస్టుల వైపు మొగ్గినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇందుకోసం దాదాపు 1,500 మంది ఆర్టిస్టులను ఆడిషన్ చేయనున్నారట. కారణం సింపుల్.. డైలాగ్ అనువదిస్తే సరిపోదు, ఎమోషన్ కూడా అదే స్థాయిలో వినిపించాలి.

చండీగఢ్‌లో టెర్రరిస్టులు కలకలం.. ముగ్గురు అరెస్ట్
నిన్న అర్ధరాత్రి చండీగఢ్‌లో పోలీసులు భారీ టెర్రరిస్టుల కుట్రను భగ్నం చేశారు. సెక్టార్-43 ISBT వెనుక ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద అనుమానిత IED, పేలుడు పదార్థాలు, గన్ రికవరీ చేసుకున్నారు. దాదాపు 5 కిలోల జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్, పవర్ సోర్స్, వైర్లు వారి దగ్గర ఉన్నట్లు గుర్తించారు. ఐదు బుల్లెట్లు కూడా రికవరీ చేశారు. నిందితులకు విదేశీ హ్యాండ్లర్‌తో లింక్స్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

గోసంగి సంఘం నూతన జిల్లా కార్యవర్గం ఏర్పాటు
TG: గోసంగి సంఘం నూతన జిల్లా కార్యవర్గం కొలువుదీరింది.. అధ్యక్షుడిగా ఈర్నాల వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లాలో గోసంగి సంఘం ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఈర్నాల వినోద్ కుమార్ మాట్లాడుతూ.. డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలకు కట్టుబడి గోసంగి జాతి విద్యా, ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఓనం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
TG: మినీ ఇండియాగా పేరొందిన పటాన్‌చెరు నియోజకవర్గం విభిన్న సంస్కృతులకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్‌లోని ఎస్‌ఎన్ గార్డెన్స్‌లో కేరళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల పండుగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి వర్గం అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

తులసినాథం నాయుడుకు ప్రతిష్ఠాత్మక గిడుగు పురస్కారం
AP: తెలుగు భాషకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు పి. తులసినాథం నాయుడుకు ప్రతిష్ఠాత్మక గిడుగు సేవా పురస్కారం లభించింది. విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయ ఆడిటోరియంలో నిర్వహించిన మల్లెతీగ సృజనోత్సవంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు ముని మనవడు గిడుగు వెంకట నాగేశ్వరరావు చేతుల మీదుగా తులసినాథం నాయుడు పురస్కారం స్వీకరించారు. తెలుగు భాష, సాహిత్య రంగానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు.

మహారాష్ట్రలో దారుణం.. మంటల్లో ముగ్గురు పసికందులు
మహారాష్ట్రలోని అమరావతి డిస్ట్రిక్ట్ ఉమెన్స్ హాస్పిటల్‌లో దారుణ ఘటన జరిగింది. ఈరోజు ఉదయం 3:30 గం. సమయంలో NICUలో మంటలు చెలరేగాయి. వెంటిలేటర్ బ్లాస్ట్ అవ్వడంతో ముగ్గురు పసికందులు మృతి చెందారు. డాక్టర్లు, నర్సులు వెంటనే శిశువులను (పసికందులు) బయటకు తీసుకెళ్లారు. ఘటన సమయంలో 39 మంది నవజాత శిశువులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆరుగురిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ప్రమాదంపై అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

ముట్టుకుంటే 100 కోట్లు.. ఇదేం అవినీతి: ఆకునూరి
TG: అధికారులే రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెడుతుంటే.. ఇక రాజకీయ నాయకుల <a href="https://www.theclearcutnews.com/n/MrptHW9">అవినీతి</a> ఏ స్థాయిలో ఉంటుందో ఊహించగలమా? అంటూ రిటైర్డ్ IAS ఆకునూరి మురళీ ప్రశ్నించారు. తెలంగాణలో వెలుగులోకి వస్తున్న అక్రమాస్తుల వ్యవహారంపై ఆయన తన <a href="https://x.com/Murali_IASretd/status/2091390063963967690?s=20">ఎక్స్</a> వేదికగా స్పందించారు. దొరికిన అవినీతి అధికారులే ఇంత భారీగా ఆస్తులు కూడబెట్టారంటే.. దర్యాప్తు జరగని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అవినీతిని అరికట్టేందుకు స్వచ్ఛ రాజకీయాలు, రాజకీయ ప్రక్షాళన, కఠిన శిక్షలు, స్వతంత్ర అవినీతి నిరోధక సంస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

1995 నుంచి పెన్షన్ అదే.. రిటైరీల ఆవేదన
TG: మూడు దశాబ్దాలుగా పెన్షన్ సవరణ లేకపోవడంతో బ్యాంకు విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పెన్షన్‌ను అప్‌డేట్ చేయాలని ఆలిండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సి.జైన్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ అమీర్‌పేటలో ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 12వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి 1,500 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ అధికారులు హాజరయ్యారు.