Latest

రామాయణ కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో రచ్చ!
నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'రామాయణ' కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. లారా దత్తా (కైకేయి), రకుల్ ప్రీత్ సింగ్ (శూర్పణఖ), సాయి పల్లవి (సీత) లుక్‌లు ఆధునిక మోడలింగ్ స్టైల్‌లో ఉండటంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది త్రేతాయుగమా లేక 2026 మోడరన్ ఫ్యాషనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం రామాయణం నాటి పౌరాణిక వాతావరణం లోపించి, సీరియల్ కాస్ట్యూమ్స్‌లా ఉన్నాయని విమర్శిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి
AP: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి లావణ్య (25), రెండేళ్ల కుమార్తె కీర్తన మృతి చెందగా, తండ్రి వంశీకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. భాష్యం బ్లూమ్స్ స్కూల్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కుటుంబం, స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి ప్రాణాలు కోల్పోయింది. తండ్రి చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హోటల్ గదిలో యువతి సూసైడ్
AP: విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన షేక్ రషీదా బేగం(26) విశాఖపట్నంలోని గాజువాకలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఆమె సన్నిహితుడు లింగాల వెంకట గణేష్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఓ హోటల్‌లో గది తీసుకున్న ఆమె, ఎంతకీ బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది తలుపులు తెరిచి చూడగా రషీదా బేగం స్కార్ఫ్‌తో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం KGHకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముంపు గ్రామాలపై ఎందుకింత నిర్లక్ష్యం: షర్మిల
AP: గోదావరి వరదలతో ముంపునకు గురైన ప్రాంతాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని AP కాంగ్రెస్ అధ్యక్షురాలు YS షర్మిల విమర్శించారు. ప్రధాని మోదీని పొగడటంలో చూపుతున్న శ్రద్ధ, వరద బాధితులపై లేదని ఫైరయ్యారు. వంద గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ప్రభుత్వం తక్షణ పునరావాసం కల్పించడంలో విఫలమైందన్నారు. బాధితుల కన్నీళ్లు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వరద ప్రభావం తగ్గే వరకు బాధితులకు ఆహారం, వైద్య సేవలు, నిత్యావసర వస్తువులు అందించాలన్నారు.

టెలిగ్రామ్‌లో జాబ్ ఆఫర్.. భారీ మోసం
TG: టెలిగ్రామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో వచ్చిన మెసెజ్‌ను నమ్మిన HYDలోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన విద్యార్థి చరణ్ కౌశిక్ రూ.4.31 లక్షలు కోల్పోయాడు. మొదట గూగుల్ రివ్యూలు పూర్తిచేస్తే పారితోషికం ఇచ్చి నమ్మకం కల్పించిన సైబర్ మోసగాళ్లు, తర్వాత పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించారు. తొలుత లాభాలు చెల్లించడంతో బాధితుడు కుటుంబసభ్యుల సహకారంతో దశలవారీగా పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాడు. చివరకు రూ.4.31 లక్షలు కోల్పోయిన తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి
AP: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (RPC) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన యువతను వేధించడం సరైంది కాదన్నారు.

లిఫ్ట్ అడిగి.. కత్తితో బెదిరించి దోపిడీ
TG: లిఫ్ట్ పేరుతో ద్విచక్ర వాహనదారుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి నగదు, ఆన్‌లైన్ ద్వారా డబ్బులు దోచుకున్న ఆరుగురు యువకులను ఆల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ నగర్‌లో జూలై 31న పద్మారావు అనే వ్యక్తి నుంచి లిఫ్ట్ తీసుకున్న ఓ యువకుడు, కొద్దిదూరం వెళ్లిన తర్వాత మరో ఐదుగురితో కలిసి బాధితుడిని బెదిరించి రూ.5వేల నగదుతో పాటు గూగుల్ పే ద్వారా రూ.800 బదిలీ చేయించుకున్నారు. పోలీసులు రాజేంద్రనగర్ ప్రాంతంలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలో ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆగస్టు 15 నుంచి బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా సేవలను ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. జొమాటో, స్విగ్గీ కన్నా తక్కువ కమిషన్‌తో రెస్టారెంట్లను ఆకర్షించాలనే వ్యూహంతో ఫ్లిప్‌కార్ట్ ముందుకొస్తోంది. ఇతర సంస్థలు 16 నుంచి 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తుండగా, ఫ్లిప్‌కార్ట్ సుమారు 10 శాతం మాత్రమే వసూలు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఫుడ్ డెలివరీ యాప్‌ను కూడా తీసుకురానుంది.

కృష్ణా, గోదావరి జలాలపై కలిసి పోరాడాలి
AP: గోదావరి, కృష్ణా నది జలాల వివాదాల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు అమలైతే ఏపీ, తెలంగాణ రెండూ నీటి నష్టాన్ని ఎదుర్కొంటాయని హెచ్చరించారు. దీనిపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పోరాడాలని కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

హామీలు నెరవేర్చండి.. లేదంటే ఉద్యమం తప్పదు
AP: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరిపినా ఎలాంటి నిర్ణయాలు ప్రకటించకపోవడంపై AP JAC తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విజయవాడలో JAC ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆగస్టు 15లోగా ఉద్యోగుల ఆర్థిక, సేవాపరమైన సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించి ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

ధరల నియంత్రణకు ప్రభుత్వం బిగ్ స్టెప్
AP: బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్ APIIC రైతు బజార్‌లో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్‌లెట్లలో ఆదివారం నుంచి సబ్సిడీ ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. BPT స్టీమ్ రైస్‌ను కిలో రూ.52కు, BPT పచ్చి బియ్యాన్ని రూ.50కు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కందిపప్పు, పామాయిల్ ధరల నియంత్రణపైనా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

ప్రపంచానికి తెలంగాణ వైభవం చాటడమే లక్ష్యం
తెలంగాణ పర్యాటక రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో జరుగుతున్న తెలుగు అసోసియేషన్ మహాసభల్లో పాల్గొన్న ఆయన, NRI కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. తెలంగాణ పర్యాటకాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహంలో ప్రవాస తెలుగువారు కీలక పాత్ర పోషించాలని కోరారు. NRIలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: KTR
TG: ఇంజినీరింగ్ విద్యార్థులను "క్రిమినల్ వేస్ట్" అని CM రేవంత్ రెడ్డి అనడం సరికాదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసిన ఆయన, CM వ్యాఖ్యలను ఖండించకుండా మౌనం పాటిస్తే వాటిని సమర్థించినట్టేనని పేర్కొన్నారు. యువత రేపటి భారత నిర్మాణంలో కీలకమని, విద్యార్థులను అవమానించే వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు యువత మనోభావాలను దెబ్బతీస్తోందని విమర్శించారు.

చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మతో బాలుడి మృతి..
కర్ణాటకలోని మైసూరు జిల్లా గౌరిపుర గ్రామంలో ఐదేళ్ల ముకుంద్ మయూర్ అనే బాలుడు చిప్స్ (కుర్‌కురే) ప్యాకెట్‌లో వచ్చిన చిన్న ప్లాస్టిక్ బంతిని మింగాడు. ఆ బంతి గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లిన బాలుడిని వైద్యులు కాపాడలేకపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈనెల 5న మహారాష్ట్రలో CJP కీలక సమావేశం
CJP భవిష్యత్తు కార్యాచరణపై కీలక సభ్యులతో ఈనెల 5న మహారాష్ట్రలోని సంభాజీనగర్‌లో సమావేశముంటుందని ఆ పార్టీ తెలిపింది. ఈ సమావేశం CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే ఇంట్లో జరుగుతుందని వారు తెలిపారు. గత నెల దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా పార్టీ నెల రోజుల పాటు నిరసనలు చేపట్టింది. ప్రొటెస్ట్లు ఆగడంతో సపోర్టర్లు, వాలంటీర్లు కొన్నిరోజులు తమ ఫ్యామిలీతో గడపాలని పార్టీ వారితో చెప్పినట్లు తెలుస్తోంది.

బాలుడు కారుతో ర్యాష్ డ్రైవింగ్.. వెహికల్స్ ధ్వంసం
TG: హైదరాబాద్ కార్మిక్‌నగర్‌లో అద్దె కారుతో మైనర్ బాలుడి ర్యాష్ డ్రైవింగ్ కలకలం రేపింది. బాలుడు కారు డ్రైవ్ చేస్తూ అదుపుతప్పడంతో, చర్చికి బైక్ పై వెళ్తున్న ఇద్దరినీ ఆక్సిడెంట్ చేశాడు. ఈ ప్రమాదంలో వారికీ తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన పార్క్ చేసిన వెహికల్స్ పైకి కారు దూసుకెళ్లడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కారు నడిపిన మైనర్ బాలుడిని పట్టుకుని స్థానికులు మధురానగర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డయ్యింది.

శ్రీలంక సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం
శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. మొదట BCCI ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల టీమ్‌లో అతడి పేరు ఉన్నా, హెల్త్‌ను చూసి ఆడిస్తామని చెప్పారు. బుమ్రా ఫిట్‌నెస్ టెస్టు పాస్ అయ్యాడని మొన్న వార్తలు వచ్చాయి. కానీ, డాక్టర్లు చేసిన పరీక్షల్లో అతడి ఎడమ మోకాలిలో ఇంకా నొప్పి ఉన్నట్లు తేలింది. దీంతో రిస్క్ వద్దని, పూర్తిగా తగ్గేదాకా రెస్ట్ తీసుకోమని BCCI సూచించింది.
భుజంపై మొసలిని మోసుకొని పోలీస్ స్టేషన్‌కు.. ఆ తరువాత
బీహార్ సుపౌల్ జిల్లాలోని 5 అడుగులున్న మొసలి వరి పొలంలోకి వచ్చింది. అక్కడే పొలంలో పని చేసుకుంటున్న రైతులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. రైతులందరు దైర్యం చేసి ఆ మొసలిని జాగ్రత్తగా తాళ్లతో కట్టేశారు. మొసలి ఎవరిపై దాడి చేయకుండా అమిత్ కుమార్(రైతు) దాన్ని నోరిని కూడా తాళ్లతో కట్టాడు. మొసలిని భుజంపై మోసుకుంటూ దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. మొసలిని హ్యాండోవర్ చేసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్ దగ్గర్లోని ఓ నదిలో వదిలేశారు. దింతో ఆ రైతు మోసుకొస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యింది.

లష్కర్ బోనాల జాతరలో CM రేవంత్ రెడ్డి
TG: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రజాప్రతినిధులు లష్కర్ బోనాల జాతరలో పాల్గొన్నారు. ఈ బోనాల జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు.

కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో గొంతుకోసి..
TG: జనగామ జిల్లాకు చెందిన రజిత, నర్సంపేట మండలానికి చెందిన అనిల్ ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉపాధి కోసం నెలరోజుల క్రితం వరంగల్ నగరానికి వచ్చి కృష్ణాకాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతుండగా, రాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన అనిల్.. భార్య రజిత చేతులు, కాళ్లు కట్టి కత్తితో మెడ కోసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

నేడు జాతీయ జెండా రూపకర్త 'పింగళి వెంకయ్య' జయంతి
ఈరోజు ఇండియన్ ఫ్లాగ్‌ను డిజైన్ చేసిన పింగళి వెంకయ్య 150వ జయంతి. 1876 ఆగస్ట్ 2న కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో హనుమంత రాయుడు, వెంకటరత్నం దంపతులకు జన్మించారు. అయన ఒక వ్యవసాయ పరిశోధకుడు, విద్యావేత్త కూడా, మచిలీపట్నంలో ఒక విద్యాసంస్థను స్థాపించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా ఉన్న త్రివర్ణ పతాకం వెనుక ఆయన కృషి మరువలేనిది, తెలుగువారికీ గర్వకారణం. నేడు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ ముఖ్యనేతలు, ప్రముఖులు స్మరించుకుంటున్నారు.