Latest

అత్యాచారం కేసులో కోర్ట్ సంచలన తీర్పు
TG: హైదరాబాద్ LBనగర్‌లో 13ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు కనుకు మహేశ్‌కు 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.13వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.4లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2022లో బాలికను బెదిరించి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో పోక్సో కోర్టు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

మోదీ భయపడ్డారు.. ఆ భయం స్పష్టంగా కన్పిస్తుంది
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిపై ప్రధాని మోదీ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని ప్రకటించగా, దానిని రీట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ "డర్ గయా.. ఆయనలో భయం కనిపిస్తోంది" అంటూ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు చేసిన పోరాటం వల్లే కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చిందని అన్నారు. యువత ఐక్యతే ప్రభుత్వాన్ని నిర్ణయాలు మార్చేలా చేసిందని పేర్కొన్నారు.

విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు పోస్ట్‌పోన్
TG: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు వైద్యారోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) శుక్రవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులు తెలిపారు. జూలై 24 పరీక్షలు మాత్రమే వాయిదా పడగా, మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీక్ష ముగిసినా.. CJP పోరాటం కొనసాగుతుంది
సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల ఆమరణ నిరాహార దీక్ష విరమించడం ఊరటనిచ్చిందని CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వీడియో రిలీజ్ చేశారు. దేశ ప్రయోజనాల కోసం వాంగ్‌చుక్ చూపిన ధైర్యాన్ని కొనియాడుతూ, ఆయన ప్రాణాలు దేశానికి ఎంతో విలువైనవని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో కొత్త చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. దీక్ష ముగిసినా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జంతర్‌మంతర్ వద్ద CJP శాంతియుత నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

CM రేవంత్ రెడ్డికి KTR అల్టిమేటం
TG: గ్లోబరీనా సంస్థ తన బినామీ కంపెనీ అంటూ CM రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు పంపినట్లు తెలిపారు. 48 గంటల్లో ఆరోపణలను రుజువు చేయాలని, లేకుంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా నిజంగా తన బినామీ సంస్థ అయితే అదే కంపెనీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుందని ప్రశ్నించారు. CCSలో విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.
విద్యార్థులకు ప్రధాని మోదీ భరోసా
నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకొస్తామని, దీనికి సంబంధించిన ప్రత్యేక బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని వెల్లడించారు. రీఎగ్జామ్ ద్వారా విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇవాళ CJP ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరపనున్నారు.
చిన్నారుల ముఖాల్లో కారు తెచ్చిన సంతోషం
చిన్నారుల అమాయకత్వంలోని ఆనందం ఎంత వెలకట్టినా కొనలేనిది. ఈ వీడియో అందుకో ఉదాహరణ. రోడ్డు పక్కన కారు దగ్గర నిలబడి ఉన్న ఒక అబ్బాయి, అమ్మాయితో వీడియో కారునే తదేకంగా చూస్తున్నారు. ఆ అమ్మాయి అమాయకంగా కారు ఓనర్‌ని చూసి “మీ కారులో ఎక్కొచ్చా?” అని అడుగుతుంది. కారు యజమాని చిరునవ్వు నవ్వి వాళ్లను కారులోకి ఎక్కించుకున్నాడు. పిల్లల ముఖాల్లోని ఆనందం ఆ వీడియోకు ప్రధాన ఆకర్షణగా మారింది.
గాయం చేశాక మందు రాస్తే లాభం ఏంటి?
నెలన్నర రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న తర్వాత ప్రధాని తీరిగ్గా స్పందించారని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా మండిపడ్డారు. పేపర్ లీక్ జరిగిన తర్వాత శిక్షలు వేయడం వల్ల సమస్య తీరదని, గాయమయ్యాక మందు రాయడం కంటే అసలు గాయమే కాకుండా చూసుకోవడం ముఖ్యమన్నారు. వ్యవస్థలో జవాబుదారీతనం, సమర్థత లేకపోవడం వల్లే లీక్‌లు జరుగుతున్నాయని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు పోరాటం ఆగదని చెప్పారు.

దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల నిరాహార దీక్షను గురువారం అర్ధరాత్రి దాటాక కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో విరమించారు. దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నీట్ పేపర్ లీకేజీలపై స్పష్టత, పారదర్శకత కోసం ఆయన ఈ దీక్ష చేపట్టారు. కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు, ఇచ్చిన స్పష్టమైన హామీలతో సంతృప్తి చెంది ఆయన దీక్షను ముగించారు.

గ్లోబరీనా KTR బినామీ కంపెనీ: CM
TG: వివాదాస్పద గ్లోబరీనా కంపెనీ KTR బినామీ సంస్థ అని CM రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కంపెనీతో కేటీఆర్‌కు సంబంధం లేకుంటే సీసీఎస్‌లో ఫిర్యాదు చేసి విచారణ కోరాలని సవాల్ విసిరారు. BRS హయాంలో గ్లోబరీనా సంస్థకు ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకన కాంట్రాక్టు అక్రమంగా అప్పగించారని, ఆ సంస్థ తప్పిదాల వల్ల 2019లో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. విజిలెన్స్ విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై KTR క్షమాపణలు చెప్పాలన్నారు.

ఎల్‌నినో ముప్పు.. అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలి
AP: దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో ఈసారి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని CM చంద్రబాబు హెచ్చరించారు. తాగునీటి కొరతతో పాటు పశుగ్రాస సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎల్‌నినో పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన, తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పశుగ్రాస కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సంక్షోభాన్ని ఎదుర్కోవాలని సూచించారు.

ఉచిత కంటి పరీక్షలతో దేశానికి రూ.3.6 లక్షల కోట్ల లాభం!
పాఠశాలల్లో ఉచిత కంటి పరీక్షలు, తక్షణ రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేస్తే భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా రూ.3.6 లక్షల కోట్ల లబ్ధి చేకూరుతుందని 'IAPB', 'సేవా', 'ఫ్రెడ్ హాల్లోస్' సంస్థల ఉమ్మడి 'వాల్యూ ఆఫ్ విజన్' నివేదిక పేర్కొంది. అందరికీ ప్రాథమిక నేత్ర వైద్యం అందించడం ద్వారా ఉత్పాదకత, ఉద్యోగావకాశాలు పెరిగి దేశ ప్రగతి వేగవంతమవుతుందని అంతర్జాతీయ విశ్లేషకుల ఒపీనియన్ ను బిజినెస్ స్టాండర్ట్ పబ్లిష్ చేసింది.
కజకస్తాన్ లో హీట్ వేవ్- ఆపై హెవీ రెయిన్ !
కజకిస్తాన్ రాజధాని అస్తానా వాతావరణం మైండ్ బ్లాక్ చేస్తోంది! కొద్దిరోజుల కిందటే 39.5°C రికార్డు స్థాయి ఎండలతో అల్లాడిపోయిన ఈ నగరంలో, హఠాత్తుగా కుండపోత వర్షం, వడగళ్ళు పడ్డాయి. ఆకాశానికి తూట్లు పడినట్లు కురిసిన ఈ వానకి రోడ్లన్నీ నదులుగా మారిపోయి, కార్లు నీళ్లలో చిక్కుకుపోయాయి. దెబ్బకి హీట్‌వేవ్ నుంచి ఉపశమనం దేవుడెరుగు... ఈ హఠాత్ వరదల బీభత్సానికి జనాలు అవాక్కయ్యారు!
గుజరాత్ ను కుదిపేస్తున్న భారీ వర్షాలు !
గ్యాప్ లేకుండా పడుతున్న కుండపోత వర్షాలకు గుజరాత్ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా సూరత్, వల్సాడ్, నవసారి జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ఇళ్లు, రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. అహ్మదాబాద్-ముంబై రైల్వే ట్రాక్ వరద నీటిలో చిక్కుకోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అహ్మదాబాద్, వడోదర సిటీల్లో డ్రైనేజీలు పొంగి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని సమీక్షించిన సీఎం భూపేంద్ర పటేల్ రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించారు. వల్సద్ లో 16 గంటల్లో వెయ్యి మి.మీటర్ల వర్షం పడింది.

మొహమాటానికి పోతే మిగిలేది టెన్షన్, ఆవేదనే !
అందరినీ మెప్పించడానికి "అవును" అనడం ప్రశాంతతను ఇవ్వకపోగా మనశ్శాంతిని దూరం చేస్తుంది. మనసులో అసంతృప్తిని దాచుకుని బయటకు నవ్వడం నిజమైన శాంతి కాదు. "ఎవరినీ బాధ పెట్టకూడదు" అనే ఆలోచనతో స్వంత ఒపీనియన్ ను అణచి వేసుకోవడం వల్ల టెన్షన్, ఆవేదన పెరుగుతాయి. కోపం లేకుండా, స్పష్టంగా "లేదు" అని చెప్పడం నేర్చుకున్నప్పుడే అసలైన ఆనందం, ఆత్మగౌరవం లభిస్తాయని ‘ద మోస్ట్ ట్రూత్‌ఫుల్ బుక్ ఆఫ్ లైస్: ఎ గైడ్ టు ఓవర్‌కమింగ్ యువర్ లిమిటింగ్ సెల్ఫ్’ అనే సైకాలజీ గైడ్ చెబుతోంది. దీని రచయిత అంకిత్ భంజ్.

చర్చలకు న్యూట్రల్ స్టేజ్ అయితే ఓకే అంటున్న స్టూడెంట్స్
పేపర్ లీక్ లపై నిరసన తెలుపుతున్న CJP, విద్యార్థి సంఘాలతో చర్చలకు రెడీ అని కేంద్రం మళ్లీ ప్రకటించింది. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా చర్చల్లో పాల్గొంటారని, కేంద్రం ఇప్పటి వరకూ నాలుగు ప్రతిపాదనలు పంపిందన్నారు. కానీ మంత్రుల ఇళ్లు లేదా ఆఫీసులలో కాకుండా జంతర్ మంతర్ లేదా తటస్థ ప్రదేశంలోనే చర్చలు జరగాలని CJP స్పష్టం చేసింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇవ్వాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు.

పెల్లెట్ గన్స్ వాడింది నిజమేనంటున్న మెడికల్ రిపోర్టులు
పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో జరిగిన "చలో సంసద్" ప్రదర్శనలో ఆందోళనకారులపై భద్రతా బలగాలు పెల్లెట్ తుపాకులు ప్రయోగించారని ఒక స్టూడెంట్ మెడికో-లీగల్ రిపోర్ట్ నిర్ధారించిందని, మరొకరు చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని బాధితులు చెబుతున్నారు. అయితే, ప్రదర్శనకారులపై పెల్లెట్ గన్లు లేదా షాట్‌గన్లు అసలు వాడలేదని ఢిల్లీ పోలీసులు ఈ వార్తలను పూర్తిగా ఖండించారు.

స్టూడెంట్స్ కి సచిన్ మెసేజ్ !
పేపర్ లీకేజీలపై పోరాడుతున్న విద్యార్థులకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. విద్యావ్యవస్థ పారదర్శకంగా, మెరిట్ కి పట్టం కట్టాలని అన్నారు. ఓడినా పరవాలేదు కానీ మోసం కూడదు- షార్ట్‌కట్‌లు వద్దన్న తన తండ్రి మాటలను గుర్తుచేస్తూ.. కష్టపడి చదివే యువతకు అన్యాయం జరగకుండా, నిజాయితీకి పట్టం కట్టే వాతావరణాన్ని సమాజం కల్పించాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రతిపక్ష ఎంపీల ర్యాలీ
విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఢిల్లీలోని గాంధీ స్మృతికి బయలుదేరారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన విద్యార్థుల డిమాండ్లకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతున్న వారి స్వరానికి బలాన్ని ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు, వారి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇండియా మేల్కొంది- GenZ
దేశంలో నీట్, నెట్ వంటి పోటీ పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్, చెన్నై, కలకత్తా, జైపూర్, బెంగళూరు వరకు దాదాపు 30కి పైగా ప్రముఖ నగరాల్లో యువత భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ‘ఇండియా మేల్కొంది’ అంటూ పేపర్ లీక్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి.
మమ్మల్ని కాదు.. రేపిస్టులను పట్టుకోండి!
ఉత్తరప్రదేశ్ ఆజంఘడ్‌లో నిరసన తెలుపుతున్న ప్రొటెస్టర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై ఒక యువతి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను అడ్డుకోవడం ఆపి, అసలైన రేపిస్టులను పట్టుకుంటే అత్యాచారాలు ఆగుతాయని పోలీసుల ముందే దైర్యంగా చెప్పింది. తమ హక్కులను అడగడం తప్పా అని ప్రశ్నిస్తూ, న్యాయం కావాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.