Latest

💸 కరెన్సీలో భారీ మార్పు
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పేపర్ నోట్ల స్థానంలో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టేందుకు RBI కసరత్తు ప్రారంభించింది. తొలుత రూ.10, రూ.20 నోట్లను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకురానుండగా, విజయవంతమైతే ఇతర నోట్లకూ విస్తరించనుంది. ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఒక్కో నోటు తయారీకి రూ.2 నుంచి రూ.6 వరకు ఖర్చవుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

'ఆజాదీ' పాట వైరల్..ఎందుకంటే?
దేశంలో జరుగుతున్న పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థులు, యువత తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో ఆకలి, వివక్ష, అవినీతి నుంచి స్వాతంత్ర్యం కావాలంటూ సాగే ఈ 20 సెకన్ల 'ఆజాదీ' ర్యాప్ పాటను నినాదంగా వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్‌లో దీనికి మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఈ పాట విద్యార్థుల ఉద్యమానికి శక్తిగా నిలుస్తోంది.

KTRకు కాంగ్రెస్ బర్త్‌డే కానుక
TG: మాజీ మంత్రి KTR బర్త్ డే సందర్భంగా కానుకగా రేవంత్‌రెడ్డి సర్కార్ సన్నబియ్యాన్ని పంపించింది. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున 25కిలోల బియ్యాన్ని KTR పేరుతో HYDలోని తెలంగాణ భవన్‌కు ర్యాపిడో ద్వారా పంపించారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన పేర్కొన్నారు. ఇటీవల KTR ఓ నిరుపేద కుటుంబం ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అవసరమైతే ప్రతి నెలా ఇలాగే సన్నబియ్యం పంపేందుకు సిద్ధమని చెప్పారు.

USFI నేతల అరెస్ట్.. కరీంనగర్‌లో ఉద్రిక్తత
ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలను ఖండిస్తూ కరీంనగర్‌లో MP బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు USFI నాయకులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి నాయకులను కరెంట్ ఆఫీస్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. విద్యార్థులపై దాడులు ప్రజాస్వామ్య విరుద్ధమని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా నిరసన తెలిపిన వారినే అరెస్టు చేయడం అన్యాయమని నాయకులు ఫైరయ్యారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సూసైడ్ నోట్ రాసి ఏఎన్‌ఎం ఆత్మహత్య
AP: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తోనుకుమల గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న సాయి చందన ప్రియ(27) సచివాలయంలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. సచివాలయంలో లభించిన సూసైడ్ నోట్‌లో తండ్రి వైద్యం కోసం తన ఇన్సూరెన్స్ అమౌంట్‌ను కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేసుకోవాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.

ఒకే వ్యక్తిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు
ఉత్తరప్రదేశ్‌లోని ధౌరియా గ్రామానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సరోజ్(20), సావిత్రి(19), సంతోష్(18) ముగ్గురు అక్కాచెల్లెళ్లు. తమ కెమెరామెన్ వికాస్‌ను గుడిలో పెళ్లాడారు. ఫ్యామిలీ వేర్వేరు పెళ్లిళ్లు చేయాలని చూడటంతో, ఇలా చేశామన్నారు. స్థానిక హిందూ సంస్థలు సనాతన ధర్మానికి విరుద్ధమని అభ్యంతరం చెప్పినా.. ‘ఆ రోజుల్లో రాజులు ఎంతోమందిని పెళ్లిళ్లు చేసుకోలేదా? అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు మాకెందుకు?’ అంటూ ప్రశ్నించారు.

ఎమ్మెల్యే బాలకృష్ణకు మోకాలి సర్జరీ
నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ‘NBK 111’ సినిమా షూట్‌లో గాయమైంది. తొడ కండరాన్ని మోకాలి చిప్పకు కలిపే కణజాలం చిట్లడంతోపాటు ఇరువైపులా గాయాలు అయినట్లు డాక్టర్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్ డాక్టర్లు మూడు గంటల పాటు ఆయన ఎడమ మోకాలికి సర్జరీ చేశారు. దెబ్బతిన్న భాగాలను బాగు చేసినట్లు ఆర్థోపెడిక్ సర్జన్ గౌతమ్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపారు.
పార్టీ మారడం లేదు.. BRSలోనే ఉంటా
TG: BRSను వీడి మరో పార్టీలో చేరుతున్నానన్న ప్రచారాన్ని మేడ్చల్ MLA, మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారడం లేదని, BRSలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో KTR జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన, తన పార్టీ మార్పుపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. తనపై అభిమానంతో ఓ కార్యకర్త రక్తంతో లేఖ రాయడం బాధ కలిగించిందని, అతడిని గుర్తించి తప్పకుండా కలుస్తానని చెప్పారు.

యువత గొంతు నొక్కితే BJP పతనం ఖాయం
TG: యువత గొంతు నొక్కితే BJP రాజకీయ పతనం తప్పదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా లాఠీచార్జీలు, కేసులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కేనని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల మధ్య ఉండే నాయకత్వానికే దేశం మద్దతిస్తుందని, రాహుల్ గాంధీ విద్యార్థులతో కలిసి నిలబడటం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు.

పెట్రోల్, డీజిల్‌పై బిగ్ రిలీఫ్
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారానికి కేంద్రం బ్రేక్ వేసింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విడుదల చేసిన తాజా ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.59, డీజిల్ రూ.103.82గా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం లోకల్ ఇంధన ధరలను యథాతథంగా ఉంచినట్లు తెలుస్తోంది.
అర్ధరాత్రి మోదీ వీడియో
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని సోమవారం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
AI బ్లాక్ బోర్డ్‌ను ఆవిష్కరించిన చైనా సంస్థ
షాంఘైలో జరిగిన WAIC 2026లో iFLYTEK సంస్థ AI ఆధారిత బోధనా సాధనమైన AI బ్లాక్‌బోర్డ్‌ను ఆవిష్కరించింది. ఈ డిజిటల్ బోర్డ్ టీచర్ల ప్లేస్‌ను భర్తీ చేయడానికి కాకుండా వారికి సాయపడటానికి రూపొందించారు. ఈ స్మార్ట్ బోర్డు చేతిరాతను సరిదిద్దడం, 3D నమూనాలు చూపించేలా టీచర్లకు ఉపయోగపడుతుంది. వాయిస్ కమాండ్‌లతో కంట్రోల్ చేయడం, ఆటోమేటిక్‌గా పాఠాలను సేవ్ చేయడం లాంటి ఫీచర్లను అందిస్తుంది.
అడవి ఏనుగులను అదుపు చేసేందుకు కుంకీ ఏనుగులు
AP: విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను అదుపు చేసేందుకు కుంకీ ఏనుగులను పంపుతున్నట్లు డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మంగళగిరి వద్ద కుంకీ ఏనుగులను ఆయన పరిశీలించారు. వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకు తరలిస్తున్నారు. ఒడిశాతో చర్చలు జరిపి మరికొన్ని కుంకీలను రప్పించాలని అధికారులను పవన్ ఆదేశించారు.

దిల్లీ మెట్రో బిగ్ అలర్ట్..17 మెట్రో స్టేషన్లు బంద్
దిల్లీలో వరుసగా మూడో రోజు మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC) ప్రకటించింది. నేడు రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, సుప్రీంకోర్ట్, ITO, లోక్ కల్యాణ్ మార్గ్ మొత్తం 17 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల సౌకర్యం కోసం రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్‌చేంజ్ కొనసాగుతుందని DMRC సమాచారం ఇచ్చింది.

అమెరికాలో రోడ్డు ప్రమాదం..తెలంగాణ యువకుడు బ్రెయిన్ డెడ్
TG: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్‌కు చెందిన నిత్యానందరెడ్డి(26) అమెరికా రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. మూడేళ్ల క్రితం MS చదవడానికి అమెరికా వెళ్లిన అతను చదువు పూర్తిచేసుకుని అక్కడే ఉద్యోగంలో చేరారు. మిషిగన్‌లోని డెట్రాయిట్‌లో బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమించి మృతి చెందాడు

తెలంగాణలో విద్యాసంస్థలు షట్‌డౌన్
నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటన, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థలు మూతపడ్డాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ NSUI, SFI, AISF, PDSU తదితర సంఘాలు బంద్ నిర్వహించాయి. బంద్ ప్రభావంతో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, JNTU పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.

‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం
AP: రాష్ట్ర భూరికార్డులకు శాశ్వత భద్రత కల్పించేందుకు సీఎం చంద్రబాబు సచివాలయం నుంచి ‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలెట్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రతి భూభాగానికి ప్రత్యేక డిజిటల్ ఐడీతో టాంపర్-ప్రూఫ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. తొలి దశలో రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల్లో ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

సస్పెండ్ అయిన తహసీల్దార్ ఆత్మహత్య
AP: అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో PGRS విభాగంలో పనిచేస్తున్న తహసీల్దార్ శ్రీనివాసులు గురువారం చిత్తూరు సమీపంలోని సిద్ధంపల్లె వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో లక్కిరెడ్డిపల్లి మండలంలో తహసీల్దార్‌గా పనిచేసిన ఆయనపై వచ్చిన అభియోగాలపై ఇటీవల ఉన్నతాధికారులు విచారణ చేసి సస్పెండ్ చేశారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఒకవైపు దొంగలు..మరోవైపు పనిచెయ్యవు
TG: కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను దొంగలు రాత్రి వేళల్లో కేబుళ్లు, ఛార్జింగ్ గన్నులను ఎత్తుకెళ్తున్నారు. సీసీ కెమెరాలను కూడా పాడుచేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పెట్టిన 160 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లలో సగానికి పైగా పనిచేయడం లేదు. చాలాచోట్ల టెక్నికల్ సమస్యలు, మరికొన్ని చోట్ల చోరీలు ఇందుకు కారణం. గూగుల్ మ్యాప్స్ చూసి ఛార్జింగ్ కోసం వస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పోలీస్ విజన్-2047పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
AP: ఏపీ పోలీస్ కేడర్ వ్యూహాత్మక సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు సైబర్ నేరాలు, మహిళలు-పిల్లల భద్రత, అంతర్గత భద్రత, డిజిటల్ పోలీసింగ్‌పై అధికారులతో చర్చించారు. టెక్నాలజీ, పౌర-కేంద్రీకృత, ఇంటెలిజెన్స్ ఆధారిత పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని సూచించారు. ఏపీ పోలీస్ విజన్-2047కు స్పష్టమైన లక్ష్యాలతో రోడ్ మ్యాప్ రూపొందించాలన్నారు.

మంగళగిరిలో పురాతన గణేశ విగ్రహాలు లభ్యం
AP: గుంటూరు జిల్లా కాజ గ్రామంలో 1,600 ఏళ్ల నాటి రెండు చిన్న గణేశ విగ్రహాలు లభ్యమయ్యాయి. రైతు వెంకట్రామరెడ్డి పొలంలో దున్నుతుండగా నాగలికి తగిలి బయటపడ్డాయి. ఎర్ర ఇసుక రాతితో చేసిన ఈ విగ్రహాలు 3 సెంటీమీటర్లు, మరొకటి 5 సెంటీమీటర్ల ఎత్తు వున్నాయి. వీటితోపాటు 1-4వ శతాబ్దానికి చెందిన రంగుల మట్టిపాత్రల పెంకులు దొరికాయి. పల్నాడు జిల్లా చేజర్ల ఆలయంలోని విగ్రహంలా ఉండే ఈ చిన్న విగ్రహాలకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందని పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి చెప్పారు.