Latest

నర్సంపేటలో హైఅలర్ట్.. ప్రధాన కూడళ్లలో పోలీసులు
Local· 20 Aug 2026

నర్సంపేటలో హైఅలర్ట్.. ప్రధాన కూడళ్లలో పోలీసులు

TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా పోలీసులు మూడోరోజూ పట్టణంలో విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: పొన్నం
Local· 20 Aug 2026

రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: పొన్నం

TG: మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని రాజీవ్ గాంధీ బలంగా విశ్వసించారని పేర్కొన్నారు. యువత అభివృద్ధికి అనేక అవకాశాలు కల్పించేందుకు ఆయన తీసుకున్న చర్యలను గుర్తు చేశారు. దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే శంకర్
Local· 20 Aug 2026

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే శంకర్

TG: రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక రంగానికి కొత్త దిశ చూపిన నాయకుడని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని రాజీవ్ కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో సాంకేతికతకు ప్రాధాన్యం పెంచి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని పేర్కొన్నారు.

మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్‌కుమార్ కన్నుమూత
National· 20 Aug 2026

మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్‌కుమార్ కన్నుమూత

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్‌కుమార్ (80) మరణించారు. తిహార్ జైలులో ఉన్న ఆయన హెల్త్ పాడవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984 నవంబర్ 1, 2వ తేదీల్లో జరిగిన అల్లర్లలో ఐదుగురి మృతికి ఆయన కారణమైనట్లు కోర్టు తేల్చింది. దిల్లీ హైకోర్టు 2018 డిసెంబర్ 17న సజ్జన్‌కుమార్‌కు జీవిత ఖైదు విధించింది.

గేదెలను తప్పించబోయి గూడ్స్ వాహనం బోల్తా
Local· 20 Aug 2026

గేదెలను తప్పించబోయి గూడ్స్ వాహనం బోల్తా

TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ శివారులో గూడ్స్ వాహనం బోల్తాపడింది. తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వాహనం మార్గమధ్యంలో ఒక్కసారిగా గేదెలు రోడ్డుపైకి రావడంతో డ్రైవర్ వాటిని తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. డ్రైవర్‌కు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనలో వాహనం కొంతమేర దెబ్బతింది. రహదారులపై పశువులు అకస్మాత్తుగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ జెండాపై నిర్లక్ష్యం.. అధికారులపై చర్యలకు డిమాండ్
Local· 20 Aug 2026

జాతీయ జెండాపై నిర్లక్ష్యం.. అధికారులపై చర్యలకు డిమాండ్

AP: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో జాతీయ జెండా పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ భీం భారత్ సైనిక్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎం.పి.డి.ఓ. కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పోలవరపు ఖాజావలి మాట్లాడుతూ.. డేవిస్‌పేట గ్రామ సచివాలయం వద్ద ఆగస్టు 15న ఎగురవేసిన జాతీయ జెండాను నిబంధనల ప్రకారం అదేరోజు సాయంత్రం దించాల్సి ఉన్నప్పటికీ, రెండురోజుల పాటు చీకట్లోనే ఉంచారని ఆరోపించారు. జాతీయ జెండాను గౌరవించడంలో నిర్లక్ష్యం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

రజినీకాంత్‌ సినిమాలో రామ్‌.. క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్‌!
Entertainment· 20 Aug 2026

రజినీకాంత్‌ సినిమాలో రామ్‌.. క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్‌!

టాలీవుడ్‌ హీరో రామ్‌ పోతినేని మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తున్న ‘ధర్మన్‌’ సినిమాలో 'కీ' రోల్‌ చేస్తున్నాడు. అశ్వత్‌ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రజినీకాంత్‌తో రామ్‌ తలపడనున్నట్లు తెలుస్తోంది. 2022లో ‘ది వారియర్‌’తో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌కు ఇది సెకండ్ తమిళ్ సినిమా. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై రామ్‌ ఉత్సాహంగా ఉన్నట్లు మూవీ టీమ్ తెలిపింది. ఈ మూవీని కమల్‌ హాసన్‌ నిర్మిస్తుండగా, సిమ్రాన్‌, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

బీఫ్‌ మాంసం ఎగుమతుల్లో భారత్ రికార్డ్!
International· 20 Aug 2026

బీఫ్‌ మాంసం ఎగుమతుల్లో భారత్ రికార్డ్!

భారత్‌ నుంచి గేదె మాంసం ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. 2025-26లో ఇవి 25.6% పెరిగి 5.1 బిలియన్‌ డాలర్లకు చేరగా, 2026-27లో 6 బిలియన్‌ డాలర్లు దాటొచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వియత్నాం, ఈజిప్ట్, మలేషియా, UAE, రష్యా, ఉజ్బెకిస్తాన్‌ మార్కెట్లకూ వ్యాపారం విస్తరించింది. భారత్‌లో బీఫ్‌ ఎగుమతికి అనుమతి లేదు. పాలివ్వని, వయసు మళ్లిన, సంతానోత్పత్తి లేని గేదెల మాంసాన్నే ఎగుమతి చేస్తారు. పాత గేదెలను అమ్మితే వచ్చే డబ్బుతో రైతులు కొత్తవాటిని కొంటూ పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటున్నారు.

నూతనకల్‌లో రాజీవ్ గాంధీ జయంతి!
Local· 20 Aug 2026

నూతనకల్‌లో రాజీవ్ గాంధీ జయంతి!

TG : నూతనకల్ మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. మండల అధ్యక్షులు కట్టా మల్లారెడ్డి ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, మన దేశానికి కంప్యూటర్ సాంకేతికతను పరిచయం చేసి, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. నవభారత నిర్మాణం కోసం చేసిన ఆయన సేవలను ఎప్పటికీ మరవలేమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం.. 10 మందికి గాయాలు
Local· 20 Aug 2026

ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం.. 10 మందికి గాయాలు

AP: విశాఖపట్నంలో విధులకు వెళ్తున్న పోలీస్ సిబ్బంది వాహనం ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం జూ పార్క్ సమీపంలో పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఏఆర్ విభాగానికి చెందిన సుమారు 10 మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే తోటి పోలీస్ సిబ్బంది, స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Press Meetలో YS జగన్ హాట్ కామెంట్స్.. రాజీనామాకు డిమాండ్!
AP· 20 Aug 2026

Press Meetలో YS జగన్ హాట్ కామెంట్స్.. రాజీనామాకు డిమాండ్!

AP: తాడేపల్లిలో YSRCP నేత జగన్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ లేకుండా తండ్రి కొడుకులు బ్యాటింగ్‌ చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడుతున్నారని, కౌన్సిల్‌లో మాత్రం మాట్లాడటం లేదని అన్నారు. తప్పులు బయటకొస్తే లోకేశ్‌ రాజీనామా చేయాల్సి వస్తుందని అన్నారు. DSCలో తప్పులు జరిగాయి కాబట్టే కౌన్సిల్‌లో చర్చకు దూరంగా ఉంటున్నారని ఆరోపించారు. DSCలో జరిగిన అక్రమాలపై CBI విచారణ జరపాలని మీడియాతో అన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్‌ చేశారు.

కపటిలో పశువులకు వైద్యం కరువు.. రైతుల ఆవేదన
Local· 20 Aug 2026

కపటిలో పశువులకు వైద్యం కరువు.. రైతుల ఆవేదన

AP: కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామంలో పశువులకు అత్యవసర వైద్యం అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో వెటర్నరీ డాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ, అవసరమైన మందులు, వైద్య పరికరాలు లేవని చెప్పి పశువులను ఆదోని పశు వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో పశువులను దూరంగా తరలించాల్సి రావడం వల్ల సమయం, డబ్బు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం ఆలస్యం కావడంతో పశువుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు.

నోయిడా కార్మికుల కన్నీటి కథ!
Current Affairs· 20 Aug 2026

నోయిడా కార్మికుల కన్నీటి కథ!

నోయిడాలో వేతన పెంపు కోసం ఆందోళన చేసిన కార్మికులపై పోలీసులు తీవ్రమైన కేసులు మోపారు. హత్యాయత్నం వంటి ఆరోపణలతో 106 మంది అరెస్ట్ కాగా, వారు సగటున 53 రోజులు జైల్లో గడిపారని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' దర్యాప్తులో తేలింది. అయితే నిరసన ప్రదేశంలో ఉన్నంత మాత్రాన బాధ్యులను చేయలేమని, నిర్దిష్ట ఆధారాలు లేవని పేర్కొంటూ కోర్టులు 84% మందికి బెయిల్ మంజూరు చేశాయి. కొందరిపై 'NSA' చట్టం ప్రయోగించి, వాట్సాప్ చాట్లు, చదివిన పుస్తకాలను ఆధారాలుగా చూపడం గమనార్హం.

ఉద్యోగాలు కోల్పోయిన 607 మందికి న్యాయం చేయాలి
Local· 20 Aug 2026

ఉద్యోగాలు కోల్పోయిన 607 మందికి న్యాయం చేయాలి

AP: విజయవాడలో అర్బన్ ఈ–సేవ ఉద్యోగుల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. 2003 నుంచి ప్రభుత్వ అర్బన్ ఈ–సేవ కేంద్రాల్లో సుమారు 18 ఏళ్లపాటు సేవలందించిన 607 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఈ–సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని ఆగస్టు 17 నుంచి 20 వరకు ఈఎస్‌డీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్యోగ సాధన సంకల్ప దీక్షలు చేపట్టారు. కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి. నాగేశ్వరరావు మద్దతు తెలిపారు.

అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.. Press meetలో జగన్!
AP· 20 Aug 2026

అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.. Press meetలో జగన్!

AP: తాడేపల్లిలో ఈరోజు YSRCP అధినేత జగన్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. DSC స్కామ్‌పై మేము మొదటి నుంచి పోరాడుతున్నామని అన్నారు. తాము లేవనెత్తిన అంశాలు కరెక్ట్ అని ప్రభుత్వమే అంగీకరించిందన్నారు. CM చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటనలే ఇందుకు నిదర్శనమన్నారు. తప్పు చేసిన వారు గింజుకుంటున్నారు కానీ.. CBI ఎంక్వైరీకి ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే CMకు ఇచ్చిన టైమ్ ప్రతిపక్ష నేతకూ ఇవ్వాల్సి వస్తుందని, అందుకే హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు.

గొల్లప్రోలు మున్సిపాలిటీలో పునర్విభజన
Local· 20 Aug 2026

గొల్లప్రోలు మున్సిపాలిటీలో పునర్విభజన

AP: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన పూర్తయింది. ఇప్పటివరకు ఉన్న 20 వార్డులను 23 వార్డులుగా పునర్వ్యవస్థీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని వార్డుల సరిహద్దులను నిర్ణయించారు. పునర్విభజనకు సంబంధించిన సరిహద్దులతో కూడిన 23 వార్డుల వివరాలను పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. మున్సిపల్ కమిషనర్ సంపత్తి దివిజ ఆధ్వర్యంలో నోటీస్ బోర్డులో గెజిట్ వివరాలను ప్రదర్శించారు.

నేడు సౌత్ స్టేట్స్ CMలతో అమిత్‌ షా భేటీ.. Hot Topics ఇవే!
Current Affairs· 20 Aug 2026

నేడు సౌత్ స్టేట్స్ CMలతో అమిత్‌ షా భేటీ.. Hot Topics ఇవే!

తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా కోవళంలో 31వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ మీట్ ఈరోజు జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో జరిగే ఈ భేటీకి సౌత్ స్టేట్స్ CMలు, అధికారులు హాజరవుతున్నారు. రాష్ట్రాల్లో సమస్యలు, నీటి పంపకాలు, ఎడ్యుకేషన్, హెల్త్, లా అండ్ ఆర్డర్, ఎకనామిక్ డెవలప్‌మెంట్‌పై చర్చించే అవకాశముంది. ముఖ్యంగా కావేరీ వాటర్ డిస్ప్యూట్స్, ఏపీ-తెలంగాణ విభజన అంశాలపై చర్చకు ఇంపార్టెన్స్ ఉండనుంది. ఈ సమావేశాలు కేంద్ర-రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్, వివాదాల పరిష్కారానికి కీలక వేదికగా నిలుస్తున్నాయి.

క్రీడా మైదానాలపై నిర్లక్ష్యం.. అధికారులపై స్థానికుల ఆగ్రహం
Local· 20 Aug 2026

క్రీడా మైదానాలపై నిర్లక్ష్యం.. అధికారులపై స్థానికుల ఆగ్రహం

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సర్కిల్ పరిధిలోని క్రీడా మైదానాల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్వాల్‌గూడ, శంషాబాద్ డివిజన్లలోని పలు మైదానాలు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి ఆటలకు అనుకూలంగా లేకుండా మారాయని స్థానికులు చెబుతున్నారు. యువత, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు కూడా భద్రత లేకపోవడంతో దొంగల పాలయ్యాయని ఆరోపించారు. మైదానాల దుస్థితిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

తెలంగాణకే బిగ్ ఇన్సిపిరేషన్ ఈ విలేజ్!
Motivational· 20 Aug 2026

తెలంగాణకే బిగ్ ఇన్సిపిరేషన్ ఈ విలేజ్!

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామం జిల్లాలోనే తొలి ‘బాల్యవివాహ రహిత గ్రామం’గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఊరిలో జీరో బాల్య వివాహాలు, 18 ఏళ్లలోపు బాలికల్లో జీరో ప్రెగ్నెన్సీస్, అలాగే జీరో స్కూల్ డ్రాప్‌అవుట్స్ సాధించి గ్రామం ఆదర్శంగా నిలిచింది. దీంతో తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన చేతుల మీదుగా అంకుసాపూర్‌కు ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ సర్టిఫికేట్’ అందజేశారు. ఇతర గ్రామాలకు కూడా ఇది బిగ్ ఇన్సిపిరేషన్‌గా నిలుస్తోంది.

ఆఫర్ చూసి మోసపోకండి.. టాస్క్ ఫ్రాడ్‌పై అలర్ట్
Local· 20 Aug 2026

ఆఫర్ చూసి మోసపోకండి.. టాస్క్ ఫ్రాడ్‌పై అలర్ట్

AP: టాస్క్ పేరుతో వచ్చే ఆకర్షణీయమైన మెసేజ్‌లకు స్పందిస్తే క్షణాల్లో డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఆధారిత సైబర్ మోసాలపై వారం రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్సుమిల్లి గ్రామంలో సీఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ప్రజలు, యువత, విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, అపరిచితులకు నగదు బదిలీ చేయవద్దని సూచించారు.

మాంసం వ్యర్థాలతో ప్రజారోగ్యంపై ఆందోళన
Local· 20 Aug 2026

మాంసం వ్యర్థాలతో ప్రజారోగ్యంపై ఆందోళన

TG: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో మాంసం వ్యర్థాల సమస్య స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉప్పల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ప్రైవేట్ కంటైనర్‌లో మాంసం వ్యర్థాలను నిల్వ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వ్యర్థాలు కుళ్లిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తోందని, అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.