Latest

గిరిజనుల సాగు భూములకు సౌకర్యాలు కల్పించాలి
Local· 18 Aug 2026

గిరిజనుల సాగు భూములకు సౌకర్యాలు కల్పించాలి

TG: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల గిరిజన రైతుల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. గిరిజనులు సాగుచేస్తున్న భూములకు హక్కుపత్రాలు మంజూరు చేయడంతోపాటు బోర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం భద్రాచలం ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందజేశారు. మండలంలోని పది గ్రామాల్లో గిరిజనులు సుమారు 20ఏళ్లుగా పోడు భూముల్లో సాగు చేస్తున్నారని, సాగునీటివసతి లేక పంటలు నష్టపోతున్నారని తెలిపారు. హక్కుపత్రాలు లేని రైతులకు వెంటనే పట్టాలు అందించి ప్రభుత్వ రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అభివృద్ధికి నోచుకోని పెదపాలెం
Local· 18 Aug 2026

అభివృద్ధికి నోచుకోని పెదపాలెం

AP: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామం ఇబ్బందులతో అల్లాడుతోంది. వర్షం వస్తే చాలు రోడ్లు నీళ్లతో నిండిపోతున్నాయి. దోమలు విపరీతంగా ఇంట్లోకి వచ్చి ఇబ్బందికి గురి చేస్తున్నాయిజ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. ఎక్కడ నీరు అక్కడే నిలిచి ఉంటోంది.

రిషభ్ పంత్ సూపర్ రికార్డు!
Sports· 18 Aug 2026

రిషభ్ పంత్ సూపర్ రికార్డు!

భారత క్రికెటర్ రిషభ్ పంత్ టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టి అరుదైన రికార్డు సాధించారు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో, మన ఇండియా తరఫున టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన మొదటి ప్లేయర్‌గా పంత్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో బెన్ స్టోక్స్ (138), మెకల్లమ్ (107), గిల్‌క్రిస్ట్ (100) తర్వాత ఈ ఫీట్ సాధించి రిషభ్ పంత్ 4వ క్రికెటర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసిన పంత్, భారత్‌ను 352 పరుగులతో లీడ్ లో ఉంచారు.

తెలంగాణ లో పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి: SFI
Local· 18 Aug 2026

తెలంగాణ లో పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి: SFI

తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీవో నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వం పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేసి, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కోరారు.

పేదలకు ‘భూలక్ష్మి’ పథకంతో ఎకరం భూమి: కవిత
TG· 18 Aug 2026

పేదలకు ‘భూలక్ష్మి’ పథకంతో ఎకరం భూమి: కవిత

TG: తాము అధికారంలోకి వస్తే ‘భూలక్ష్మి’ పేరుతో భూమిలేని పేద కుటుంబాలకు ఎకరం భూమి ఇస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పేదల భూములను సీఎం రేవంత్‌రెడ్డి లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీలకు పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఆచరణలో సామాజిక న్యాయం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. పేదలకు భూమి పంపిణీతోనే తెలంగాణ సమాజంలో గుణాత్మక మార్పు వస్తుందని అన్నారు.

భారతీయ సినిమాలపై కొరియన్ నటుడి ప్రేమ!
Entertainment· 18 Aug 2026

భారతీయ సినిమాలపై కొరియన్ నటుడి ప్రేమ!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు కాంగ్ హూన్ మన భారతీయ సినిమాలపై తన అభిమానాన్ని తెలిపారు. అమీర్ ఖాన్ '3 ఇడియట్స్' సినిమా తనకు పట్టుదలను నేర్పిందని, ఆయనకు పెద్ద అభిమానినని చెప్పారు. ప్రజలపై మంచి ప్రభావం చూపే భారతీయ సినిమాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు. ఇండియాకు రావాలనేది తన చాలా రోజుల కోరికని, అవకాశాల కోసం ఎదురుచూసిన రోజులే తనను బలంగా మార్చాయని చెప్పారు.

‘అబద్ధాల రావు’ అంటూ హరీశ్‌పై పొంగులేటి ఫైర్
TG· 18 Aug 2026

‘అబద్ధాల రావు’ అంటూ హరీశ్‌పై పొంగులేటి ఫైర్

TG: మాజీ మంత్రి హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హరీశ్‌రావు కాదు.. ‘అబద్ధాల రావు’ అంటూ ఫైర్ అయ్యారు. 22A అంశంలో కొండను తవ్వి ఎలుకను పట్టి, దాన్నే గొప్పగా చెప్పుకుంటున్నారని సెటైర్లు వేశారు. సాఫ్ట్ కాపీ అప్‌లోడ్ చేయకపోవడంతో తప్పు జరిగిందని తామే గుర్తించామని తెలిపారు. ప్రభుత్వ భూములు కాకపోతే 22A నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపుపై కేంద్రం, EC, BRS కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

చూపు లేకపోయినా... ఈ యాప్ ఉంటే చాలు!
Health· 18 Aug 2026

చూపు లేకపోయినా... ఈ యాప్ ఉంటే చాలు!

కంటిచూపు, వినికిడి సమస్యలు ఉన్నవారికి సాయపడేలా కొత్త యాప్స్ వచ్చాయి. బెంగళూరుకు చెందిన రుక్మణి ఛేత్రీ, తరుణ్ సర్వాల్ ప్రారంభించిన 'సైన్‌ఏబుల్' యాప్ ద్వారా వినికిడి లోపం ఉన్నవారు వీడియో కాల్స్‌లో సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రీటర్స్ సాయం పొందుతున్నారు. దీనికి నెలకు రూ.499 లేదా 30 నిమిషాలకు రూ.75 చార్జ్ చేస్తారు. అలాగే 'బీ మై ఐస్' యాప్ బ్లైండ్ యూజర్లను వాలంటీర్లతో లైవ్ వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ చేస్తూ రోడ్డు దాటడం, షాపింగ్ చేయడంలో వాలంటీర్లు సాయం చేస్తున్నారు.

తెలుగు నేర్చుకున్నా.. మాట్లాడేస్తున్నా!
Entertainment· 18 Aug 2026

తెలుగు నేర్చుకున్నా.. మాట్లాడేస్తున్నా!

బాలీవుడ్ నటి రాషా తడాని తన మొదటి తెలుగు సినిమా (శ్రీనివాస మంగాపురం) విషయాలను పంచుకున్నారు. మొదట్లో తెలుగు కొంచెం కష్టంగా అనిపించినా, ఇప్పుడు మాటలు అర్థం చేసుకుంటూ మాట్లాడగలుగుతున్నానని చెప్పారు. షూటింగ్ సమయంలో కారం మసాలా దోశ తింటూ ఎంజాయ్ చేశానని తెలిపారు. గ్రీన్ స్క్రీన్ వాడకుండా లైవ్ లొకేషన్లలోనే షూటింగ్ చేశారని, తెలుగు సినిమాలో నటించాలనే తన చిన్ననాటి కల ఇప్పటికి నెరవేరిందని అన్నారు.

ఈ నెల 27 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు
Local· 18 Aug 2026

ఈ నెల 27 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు

AP: కాకినాడ జిల్లాలో ఈనెల 27 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. గొల్లప్రోలు MEO ఆఫీస్‌లో చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్‌ను విద్యాశాఖ అధికారులు, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల స్థాయి పరీక్ష ఈనెల 27న, మండలస్థాయి సెప్టెంబరు 11న, జిల్లాస్థాయి సెప్టెంబరు 27న, రాష్ట్రస్థాయి నవంబరు 1, 2, 3 తేదీల్లో జరుగుతాయన్నారు.

దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించాలి
Local· 18 Aug 2026

దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించాలి

AP: తిరుపతి జిల్లాలో దళితుల సమస్యల పరిష్కారం కోసం ‘చలో కలెక్టరేట్’కు పిలుపు ఇచ్చారు. దళితులకు స్మశానాలు, వాటికి దారులు, భూ సమస్యలు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24న పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్లు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. సమస్యలపై కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. జిల్లాలోని పలు గ్రామాల్లో దళితులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని, అనేక ప్రాంతాల్లో స్మశానాలకు స్థలాలు, దారులు లేవని ఆరోపించారు.

అల్లు అర్జున్ పోస్ట్ డిలీట్.. ఏం జరిగింది?
Current Affairs· 18 Aug 2026

అల్లు అర్జున్ పోస్ట్ డిలీట్.. ఏం జరిగింది?

Independence Day సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురుతున్నట్లున్న ఆ ఆర్ట్‌లో, జాతీయ జెండాపై ఉండాల్సిన అశోక చక్రం లేకపోవడం గమనించిన నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. వివాదం పెద్దది కావడంతో ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ఈ విషయంపై ఆయన గానీ, ఆయన టీమ్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆ పోస్ట్ స్క్రీన్‌షాట్లు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భూబాధితులకు న్యాయం చేయాలి.. కలెక్టర్‌కు సీపీఎం ఫిర్యాదు
Local· 18 Aug 2026

భూబాధితులకు న్యాయం చేయాలి.. కలెక్టర్‌కు సీపీఎం ఫిర్యాదు

AP: తిరుపతిలో భూసమస్యపై సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. శెట్టిపల్లిలో ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ప్రభుత్వం భూములు తీసుకున్నప్పటికీ అర్హులైన లబ్ధిదారులకు వారి వాటా భూమికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆరోపించారు. గ్రీవెన్స్‌ డే సందర్భంగా భూ బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యపై ఇప్పటికే సుమారు 40 సార్లు అర్జీలు ఇచ్చినా పరిష్కారం కాలేదన్నారు.

మంత్రి ఫరూక్‌కు ఉరుసు మహోత్సవ ఆహ్వానం
Local· 18 Aug 2026

మంత్రి ఫరూక్‌కు ఉరుసు మహోత్సవ ఆహ్వానం

AP: విజయవాడలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఉరుసు మహోత్సవ ఆహ్వానం అందించారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం ముస్తాబాదాలోని హజరత్ సయ్యద్ ముస్తఫావలీ ఆవులియా 61వ ఉరుసు మహోత్సవాలు ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాలని కోరుతూ దర్గా కమిటీ సభ్యులు సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ బాబా, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూఖ్ షుబ్లీతో కలిసి రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

సభలో కరుణానిధి ప్రస్తావన.. Sorry చెప్పిన విజయ్!
National· 18 Aug 2026

సభలో కరుణానిధి ప్రస్తావన.. Sorry చెప్పిన విజయ్!

తమిళనాడు అసెంబ్లీలో మాజీ సీఎం, DMK నేత కరుణానిధిని అటవీ శాఖ మంత్రి R.V. రంజిత్ కుమార్ ‘కలైంగర్‌’ అని సంబోధించకుండా నేరుగా మాట్లాడంపై వివాదం చెలరేగింది. DMK సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో CM జోసెఫ్ విజయ్ జోక్యం చేసుకుని మంత్రి తరఫున క్షమాపణలు చెప్పారు. కరుణానిధిని అలా ప్రస్తావించడం సరైంది కాదని అంగీకరించారు.

భువనగిరిలో ముఖ్య నేతల కీలక సమావేశం
Local· 18 Aug 2026

భువనగిరిలో ముఖ్య నేతల కీలక సమావేశం

TG: యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని న్యూ వివేర హోటల్‌లో కాంగ్రెస్ PAC (పొలిటికల్ ఎఫైర్ కమిటీ) కీలక సమావేశం నిర్వహించారు. యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు జిల్లాల్లో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై చర్చించారు.

విధుల్లోనే ప్రాణాలు కోల్పోయిన లైన్‌మెన్
Local· 18 Aug 2026

విధుల్లోనే ప్రాణాలు కోల్పోయిన లైన్‌మెన్

TG: పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న పి. వెంకటేష్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. రొంపిచర్ల మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ విధుల్లో భాగంగా బొగ్గరం గ్రామ పరిధిలోని పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎడ్జ్ ఫ్యూజ్ సేకరణ పనులు చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

అయోధ్య రామ్‌మందిర్ కేసులో కీలక మలుపు!
National· 18 Aug 2026

అయోధ్య రామ్‌మందిర్ కేసులో కీలక మలుపు!

అయోధ్య రామమందిరం విరాళాల దొంగతనం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) సమర్పించిన ఫైనల్ రిపోర్ట్‌ను ఉత్తరప్రదేశ్ హోం డిపార్ట్మెంట్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి అందించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ముందే, జూన్ 13న రాష్ట్ర ప్రభుత్వం లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ త్రీ-మెంబర్ SITని ఏర్పాటు చేసింది. ఇక ఈ నివేదిక ఆధారంగా నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంది.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతి
Local· 18 Aug 2026

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతి

AP: పల్నాడు జిల్లా నుకొండలో APUWJ 70వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలపై చర్చించారు. అనంతరం వినుకొండ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలు, వృత్తిపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు.

ఫ్యాక్టరీ వద్దంటూ సచివాలయం ఎదుట బైఠాయింపు
Local· 18 Aug 2026

ఫ్యాక్టరీ వద్దంటూ సచివాలయం ఎదుట బైఠాయింపు

AP: NTR జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్‌పేట గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న శ్రీసాయిరామ లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీకి గ్రామస్తులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు. గ్రామస్తుల అనుమతి లేకుండా ఫ్యాక్టరీ నిర్మాణం సుమారు 70శాతం పూర్తవడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేయాలని గ్రామ సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం గ్రామసభలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపకపోతే అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు.

రూ.700 ట్రిప్‌కు రూ.600 పార్కింగ్ ఏంటని? డ్రైవర్ ఆగ్రహం
AP· 18 Aug 2026

రూ.700 ట్రిప్‌కు రూ.600 పార్కింగ్ ఏంటని? డ్రైవర్ ఆగ్రహం

AP: భోగాపురం ఎయిర్‌ పోర్టులో కమర్షియల్ ట్యాక్స్, వెయిటింగ్ ఛార్జీల వసూలుపై క్యాబ్ డ్రైవర్ సిబ్బందిని నిలదీశారు. తన ట్రిప్ ఛార్జీ రూ.700 కాగా, పార్కింగ్‌కే రూ.600 వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి నిబంధనలు కావని, దారుణం, అన్యాయమంటూ మండిపడ్డారు. నిబంధనల ప్రకారమే ఛార్జీలు వసూలు చేస్తున్నామని సిబ్బంది స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు వాహనం కదపనని డ్రైవర్ తేల్చిచెప్పారు.