Latest

గణేశ్ లడ్డూ పంచాడు.. కోట్లు కొట్టేశాడు
TG: గతేడాది హైదరాబాద్‌లోని మైహోం భూజలో రూ.51 లక్షలకు గణేశ్ లడ్డూ దక్కించుకున్న కొండపల్లి గణేశ్‌పై సైబరాబాద్ EOWలో కేసు నమోదైంది. లడ్డూ వేలం దక్కించుకుని అందరిలో ధనవంతుడనే పేరు సంపాదించుకున్నాడు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే నెలకు 6శాతం లాభం ఇస్తామని నమ్మించి సిల్వియా దంపతుల నుంచి రూ.31లక్షలు తీసుకున్నాడు. లాభాలు ఇవ్వకుండా అతడు తప్పించుకు తిరుగుతుండటంతో బాధితులు ఆరా తీశారు. అప్పటికే గణేశ్, అతని సహచరుడు ఇళ్లను ఖాళీ చేశారు. మొత్తం ఐదుగురి నుంచి రూ.3.45కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

సర్కారీ బడులకు తాళం
దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 94 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని 'నీతి ఆయోగ్' తాజా రిపోర్టు తెలిపింది. అంటే రోజుకు సగటున 25 బడులు బంద్ అయ్యాయి. ప్రభుత్వ బడులు మూతపడటం వల్ల విద్యార్థుల అడ్మిషన్లు 2.26 కోట్లు తగ్గిపోయాయని, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య భారీగా పెరిగిందని 'నీతి ఆయోగ్' రిపోర్టు తెలిపింది. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది బడులను మూసేసి, ప్రైవేట్ స్కూళ్లకు సపోర్ట్ చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని ప్రతిపక్షాలు, ప్రజలు మండిపడుతున్నారు.
మాతృభాష తెలియకపోవడం అవమానం: నటుడు ధనుష్
మాతృభాష తెలియకపోవడం అవమానకరమని తమిళ్ యాక్టర్ ధనుష్ అన్నారు. చెన్నైలోని థాయ్ సత్య మెట్రిక్యులేషన్ స్కూల్‌లో స్టూడెంట్స్‌తో మాట్లాడిన ఆయన.. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను నేర్చుకోవాలని సూచించారు. మాతృభాషలో చదవడం, రాయడం తెలియకపోవడాన్ని గ్రేట్‌గా ఫీల్ అవ్వకూడదన్నారు. తాను చదువుకునే టైమ్‌లో ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేకపోయినా తమిళ్ బాగా మాట్లాడేవాడినని అన్నారు. ప్రస్తుతం తాను కలిసే 10 మందిలో 8 మందికి తమిళ్ చదవడం, రాయడం తెలియకపోవడం బాధ కలిగిస్తోందని ధనుష్ చెప్పారు.

నేతన్నలకు ప్రభుత్వం ఉపాధి భరోసా: ఆది శ్రీనివాస్
TG: నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని MLA ఆది శ్రీనివాస్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో నేతన్న విగ్రహానికి నివాళులర్పించారు. CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేనేత, వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. గత ఏడాది 6.70 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే 4.50 కోట్ల మీటర్లకు అవకాశం కల్పించామని చెప్పారు. బీమా, రుణమాఫీ, విద్యుత్ సబ్సిడీలతో నేతన్నలకు భరోసా కల్పిస్తున్నామన్నారు.

అఖిలపక్ష సమావేశానికి ఉదయనిధి స్టాలిన్ పట్టు
మేకేదాటు ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవ్వాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆనకట్ట కట్టాలనుకుంటుండగా, తమిళనాడు ప్రభుత్వం సమావేశం నిర్వహించకుండా తప్పించుకుంటోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కర్ణాటకకు వెళ్తారా లేదా అని, రైతు రుణాల మాఫీకి ఎంత సమయం పడుతుందో క్లారిటీ ఇవ్వాలని కోరారు.

అమెరికా ఒత్తిడితోనే UPI ఛార్జీలు?
దేశంలో UPI, RuPay లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే నిర్ణయం వెనుక అమెరికా ఒత్తిడి ఉందంటూ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) తెలిపింది. Visa, Mastercard వంటి అమెరికా సంస్థల కోసం భారత్ తన UPI విధానాలను మార్చకూడదని, దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రానికి GTRI సూచించింది.

Alert.. ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం
AP: రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈరోజు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం అనుకూలంగా మారిందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు. మత్స్యకారులు, రైతులు వాతావరణ హెచ్చరికలను గమనించాలని కోరారు.
చీకటిలో ఆసుపత్రి!
నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం వరకు కరెంట్ పోవడంతో ఆసుపత్రి ప్రాంగణమంతా చీకటిగా మారిపోయింది. జనరేటర్ సదుపాయం లేకపోవడంతో వార్డుల్లోని పేషెంట్లు, చిన్న పిల్లలు, వృద్ధులు, అటెండర్లు ఉక్కపోత, తీవ్రమైన దోమలతో రాత్రంతా ఇబ్బంది పడ్డారు. వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిలోనే ఇలాంటి పరిస్థితులు ఉండటంపై బాధితుల కుటుంబాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

ఈ ఏడాది నుంచి తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారాలు
TG: తెలంగాణ సాహిత్య అకాడమీ ఈ సంవత్సరం నుంచి ‘రాష్ట్ర సాహిత్య అకాడమీ’ పురస్కారాలను ఇవ్వనుంది. వివిధ సాహిత్య ప్రక్రియల్లోని బెస్ట్ రచనలకు పురస్కారాలు ఇవ్వనున్నట్టు అకాడమీ నిర్ణయించిందని సంస్థ సెక్రటరీ డా.సామాజు బాలాచారి తెలిపారు. కథ, నవల, నాటకం, కవిత్వం(అన్ని కవిత్వ రూపాలు), సాహిత్య పరిశోధన, విమర్శ ప్రక్రియలకు చెందిన గ్రంథాలను విడివిడిగా పురస్కారాలకు ఎంపిక చేయనున్నట్టు చెప్పారు.

బుర్ఖాలో వచ్చి.. గోల్డ్ చైన్ చోరీ
TG: వికారాబాద్ జిల్లా తాండూరులోని గాంధీచౌక్‌లో గంజిపల్లి సాయి జ్యువెలర్స్‌లో చోరీ జరిగింది. కస్టమర్ల ముసుగులో బుర్ఖాలు వేసుకొని వచ్చిన ఐదుగురు.. స్టాఫ్ దృష్టి డైవర్ట్ చేసి కౌంటర్‌లోని 10 గ్రా. గోల్డ్ చైన్‌ను దొంగలించారు. చోరీ తరువాత నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనకు సంబంధించి విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వైరల్‌గా మారిన సీసీటీవీ విజువల్స్ బేస్ చేసుకుని పోలీసులు కేసు బుక్ చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు.
Expiry సిరప్!
మహబూబాబాద్‌లోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మురళీ తన నాలుగేళ్ల కొడుకుకి వాంతులు, విరోచనాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు రెండు సిరప్‌లు రాయగా, ఒకదాన్ని బయట కొనాలని, మరో సిరప్‌ను ఆసుపత్రిలోనే ఇచ్చారు. ఇంటికెళ్లి పిల్లాడికి వేసేందుకు చూడగా, ఆ సిరప్ ఎక్స్‌పైరీ జూన్ 2026 నాటికే ముగిసినట్లు తండ్రి గమనించాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి 'ఎక్స్‌పైరీ మందులిచ్చి పిల్లాడి ప్రాణాలతో చెలగాటమాడుతారా?' అని ప్రశ్నించాడు.

ఇలాంటి రెస్ట్ కూడా అవసరమే
హిప్ బోన్ గాయం నుంచి కోలుకుంటున్న నటి రష్మిక డైలీ రొటీన్ నెమ్మదిగా, ప్రశాంతంగా గడుపుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో స్పందిస్తూ, రికవరీ టైమ్‌లో తగినంత విశ్రాంతి తీసుకుంటూ, పుస్తకాలు చదవడం, పజిల్స్ పూర్తి చేయడం, నచ్చిన షోలు చూడటం చాలా బాగుందని చెప్పారు. అలారమ్‌లతో పనిలేకుండా, ప్రశాంతంగా నిద్రలేచి తన పెట్ డాగ్ 'ఔరా'తో ఆడుకోవడం సంతోషంగా ఉందన్నారు. జీవితంలో అప్పుడప్పుడు ప్రశాంతంగా సమయాన్ని గడపడం ఎంతో మేలు చేస్తుందని రష్మిక అన్నారు.

హైవేపై ప్రమాదం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్
TG: హైదరాబాద్-బెంగళూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్ గ్రామశివారులో రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన తెలంగాణ RTC బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో షాద్‌నగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లే మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

‘నేతన్న సేవలో’ పథకం ద్వారా రూ.25 వేలు: పవన్ కళ్యాణ్
AP: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారతీయ చేనేత వారసత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. చేనేత వస్త్రాల్లో మన సంస్కృతి, కళానైపుణ్యం స్ఫూర్తి ప్రతిబింబిస్తాయని అన్నారు. తాను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. వీవర్స్ డెవలప్‌మెంట్ వింగ్‌ను ఏర్పాటు చేసి చేనేత రంగం అభివృద్ధి, రక్షణకు కృషి చేస్తామన్నారు. NDA ప్రభుత్వం నేతన్నలకు ఫ్రీ పవర్, ‘నేతన్న సేవలో’ పథకం ద్వారా రూ.25 వేల సాయం వంటివి అమలు చేస్తోందని పవన్ కల్యాణ్ 'ఎక్స్' అన్నారు.

పట్టుదలకు హాట్సాఫ్ : సొనాక్షి, రూఫాలీ గంగూలీ స్పందన!
జార్ఖండ్‌లో JPSC, JSSC CGL పోటీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలపై బాలీవుడ్ నటి సొనాక్షి సిన్హా స్పందించారు. మన దేశంలో విద్యార్థులు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం ఎంతో బాధాకరమని, ఇవి ఎప్పటికి ముగుస్తాయంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. మరోవైపు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థుల పట్టుదలను గౌరవించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని నటి రూఫాలీ గంగూలీ కూడా డిమాండ్ చేశారు.

నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపాలి
TG: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి చెందిన రాజేశ్వరరావును యాక్సిడెంట్ చేసి చంపాలని భార్య భవాని తన ప్రియుడు సైదులుకు మెసేజ్‌లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన భర్తకు అనుమానం రావడంతో ఆమె ఫోన్ పరిశీలించగా షాకింగ్ చాటింగ్ బయటపడింది. ఇంట్లో కాకుండా బయట ప్రమాదంగా చూపించి హత్య చేయాలని ఆమె సూచించినట్లు బాధితుడు రాజేశ్వరరావు ఆరోపించారు. చాటింగ్ ఆధారాలను పోలీసులకు అందించి భార్య, ఆమె ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

HYDRAAలో 150 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ రిలీజ్
TG: HYDRAA పరిధిలోని DRFలో 150 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో DRF అసిస్టెంట్‌కు 100, హెవీ వెహికల్ డ్రైవర్‌కు 50 పోస్టులున్నాయి. 10th క్లాస్ పాసై, 35 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. రైటెన్ టెస్ట్ లేకుండా ఫిజికల్ ఈవెంట్స్‌తో సెలెక్ట్ చేస్తారు. ఆగస్ట్ 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో సెలెక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేస్తారు. కాండిడేట్లు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఐడీ ప్రూఫ్, ఫొటోలతో హాజరుకావాలి. డ్రైవర్ పోస్టులకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మాండేటరీ.

చేనేత కార్మికులే సూపర్‌హీరోలు : ఆదా శర్మ
చేనేత దుస్తులు వేసుకున్నప్పుడు సాధారణ బట్టలు కాకుండా ఒక గొప్ప కథను ధరించినట్లు అనిపిస్తుందని నటి ఆదా శర్మ తెలిపారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆమె, ఒక నేత కార్మికుల కేంద్రాన్ని విజిట్ చేసి అక్కడ స్టాంపింగ్, ప్రింటింగ్ ప్రాసెస్ ను ట్రై చేశారు. చేనేత వస్త్రాల తయారీ వెనుక ఎంతో శ్రమ, నైపుణ్యం దాగి ఉన్నాయని, చేనేత కళాకారులే అసలైన సూపర్‌హీరోలని ఆమె అన్నారు. షూటింగ్ పూర్తయ్యాక హుస్సేన్ సాగర్ ఒడ్డున సమయం గడపడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.

గ్యాస్ కనెక్షన్ అంటూ నమ్మించి.. డబ్బులతో పరార్
TG: యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(M) మండలం కొరటికల్‌లో గ్యాస్ కనెక్షన్ పేరుతో ఓ కేటుగాడు మహిళను మోసం చేసి రూ.4,500 కాజేశాడు. మెడలో ఐడీ కార్డు ధరించి గ్యాస్ సంస్థ ప్రతినిధినంటూ ఇంటింటికీ తిరిగిన వ్యక్తి.. ప్రభుత్వ ప్రత్యేక పథకంలో గ్యాస్ కనెక్షన్ మంజూరైందని రాములమ్మను నమ్మించాడు. రూ.4,500 చెల్లిస్తే అదేరోజు కనెక్షన్ ఇస్తానని చెప్పడంతో ఆమె డబ్బులు ఇచ్చింది. అనంతరం ఫోన్ నంబర్ స్విచ్‌ఆఫ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రైతు బావిలో కదులుతున్న నీరు.. వింతగా చూస్తున్న జనం!
గుజరాత్‌లోని మోర్బీ జిల్లా విర్‌పర్దా గ్రామంలోని ఓ బావిలో నీరు దానికదే కదలడం కలకలం రేపింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నీటిలో కదలికలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల క్రితం కూడా ఇలాగే జరగగా.. గురువారం మధ్యాహ్నానికి కదలికలు ఆగిపోయి, ఆ తర్వాత మళ్లీ కదలికలు వచ్చాయి. దీంతో గ్రామస్థులు బావి వద్దకు చేరుకుని వింతను చూస్తున్నారు. గతంలో భూకంపాలు నమోదైన ప్రాంతం కావడంతో.. దీనికి అదే కారణం అయ్యుండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అసలు కారణం తెలుసుకునేందుకు GWRI ఎక్స్పర్ట్స్‌ను విచారణకు ఆదేశించింది.

'బ్లూ జోన్'
ప్రపంచంలో ఎక్కువ కాలం, ఆరోగ్యంగా జీవించే ప్రజలు ఉండే ప్రాంతాలను 'బ్లూ జోన్లు' అని పిలుస్తారు. జపాన్‌లోని 'ఒకినావా' దీవిలో ఉండే 'ఓగిమి' గ్రామం బ్లూ జోన్లలో ఒకటిగా నిలిచింది. ఇక్కడి ప్రజలు 100 ఏళ్లు దాటినా హెల్దీగా, యాక్టివ్‌గా ఉంటారు. వీరు పొలాల్లో సొంతంగా పండించుకునే తాజా కూరగాయలు, పండ్లు తింటారు. (హరా హాచి బు) 80 శాతం మాత్రమే తినడం, రోజు ఎక్సర్‌సైజ్ చేయడం, మైండ్‌లో ఒత్తిడి లేకుండా పీస్‌ఫుల్‌గా ఉండటం, ప్రతీరోజూ 'ఇకిగై' అంటే ఒక మంచి ఆశయం లేదా లక్ష్యం ఉండడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.